ముత్తురాజా: వేధించారంటూ శ్రీలంకకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఏనుగును వెనక్కి తీసుకున్న థాయ్‌లాండ్, ఏమిటీ వివాదం

ముత్తు రాజా

ఫొటో సోర్స్, EPA

శ్రీలంకకు బహుమతిగా లభించిన ఏనుగును తిరిగి దాని జన్మ స్థలమైన థాయ్‌లాండ్‌కు పంపించారు.

2001లో శ్రీలంకకు థాయ్‌లాండ్ ఏనుగులను బహుమతిగా ఇచ్చింది.

ఈ ఏనుగు విషయంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. దీంతో 29 ఏళ్ల ముత్తు రాజా అనే ఏనుగు ఆదివారం విమానంలో థాయ్‌లాండ్‌కు చేరుకుంది.

శ్రీలంకలోని బౌద్ధ మందిరంలో ఉన్నప్పుడు ముత్తురాజాను హింసించారనే ఆరోపణల నేపథ్యంలో దాన్ని తిరిగి తమకు ఇచ్చేయాలని థాయ్‌లాండ్ డిమాండ్ చేసింది.

అయితే, ఈ విషయంలో థాయ్ కింగ్‌కు అధికారికంగా క్షమాపణలు చెప్పినట్లు శ్రీలంక ప్రధానమంత్రి తెలిపారు.

ముత్తు రాజా బరువు 4,000 కేజీలు. దీన్ని ప్రత్యేకంగా తయారు చేసిన స్టీల్ బోనులో ఉంచి విమానంలో చియాంగ్ మయ్‌కు తీసుకెళ్లారు. దాని వెంట నలుగురు థాయ్ మావట్లు, ఒక శ్రీలంక జూ కీపర్ కూడా వెళ్లారు.

దాని ముందు ఎడమ కాలి గాయానికి హైడ్రోథెరపీ చికిత్సను అందించనున్నారు.

శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల్లో ఏనుగును పవిత్రంగా భావిస్తారు.

ముత్తు రాజా

2001లో థాయ్ రాజ కుటుంబం మూడు ఏనుగులను శ్రీలంకకు బహుమానంగా పంపించింది. ఇందులో ముత్తు రాజా కూడా ఒకటి. ధార్మిక కార్యక్రమాల్లో వినియోగించేందుకు వీటిని శ్రీలంకకు ఇచ్చింది.

ముత్తు రాజాను ఒక గుడి సంరక్షణలో ఉంచారు.

అయితే, ముత్తు రాజాతో చెట్ల దుంగలు మోసే పని చేయించారని జంతు హక్కుల సంఘాలు ఆరోపించాయి. పైగా, దాని కాలికి అయిన గాయాన్ని చాలా కాలం పట్టించుకోకపోవడంతో ఆ గాయం ముదిరిపోయిందని ఆరోపించింది.

తగు చర్యలు తీసుకోవడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలం కావడంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ థాయ్ అధికారులను కోరినట్లు శ్రీలంకలో ఉన్న ర్యాలీ ఫర్ యానిమల్ రైట్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ఆర్‌ఏఆర్‌ఈ) అనే జంతు హక్కుల సంస్థ వ్యవస్థాపకుడు పంచాలీ పనపిటియా చెప్పారు.

ముత్తు రాజా

శ్రీలంక వన్యప్రాణి సంరక్షణ అధికారుల వైఫల్యంతో దేశ ప్రతిష్టకే నష్టం కలిగిందని పంచాలీ అన్నట్లుగా ‘ద ఇండిపెండెంట్’ సంస్థ పేర్కొంది.

ఏనుగు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై విచారణ జరిపించాలంటూ సంబంధిత అధికారులకు ఆర్‌ఏఆర్‌ఈ సంస్థ పిటిషన్ వేసింది.

శ్రీలంక వన్యప్రాణి మంత్రి పవిత్ర వనియారాచి స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ‘‘ముత్తురాజాను తిరిగి ఇచ్చేయాలంటూ థాయ్‌లాండ్ మొండిపట్టు పట్టింది. నిరుడు థాయ్ రాయబారి శ్రీలంక పర్యటనకు వచ్చినప్పుడు ముత్తురాజా అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి థాయ్ ఈ డిమాండ్ చేస్తోంది’’ అని చెప్పారు.

గత ఏడాది నవంబర్‌లో ఆలయం నుంచి ముత్తురాజాను తరలించినప్పుడు అది గాయంతో బాధపడుతున్నట్లు, గుడ్డలతో చుట్టి ఉన్నట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ పేర్కొంది.

దానికున్న గాయాల్లో కొన్ని మావటి వల్లే అయ్యాయని వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు చెప్పారు.

ముత్తురాజాను తాత్కాలికంగా శ్రీలంక నేషనల్ జూలాజికల్ గార్డెన్‌కు తరలించారు. దానికి గాయాల్లో చాలావరకు ఈ మధ్య కాలంలోనే మానిపోయాయి.

శ్రీలంక ప్రధాని దినేశ్ గుణవర్ధన జూన్‌లో పార్లమెంట్‌లో మాట్లాడుతూ ముత్తురాజా విషయంలో థాయ్ రాజు మహా వాజిర లోంగోకోర్న్‌కు క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు.

కార్యకర్తల నిరసనల నేపథ్యంలో ఏనుగులకు విదేశాలకు పంపడాన్ని మూడేళ్ల క్రితమే థాయ్‌లాండ్ నిలిపేసినట్లు జూన్‌లో థాయ్ మంత్రి వరావుత్ సిల్పా ఆర్చా చెప్పారు.

ఇప్పటికే విదేశాలకు పంపించిన తమ ఏనుగుల బాగోగులను పర్యవేక్షిస్తున్నట్లు బ్యాంకాక్ వన్యప్రాణి విభాగం తెలిపింది.

వీడియో క్యాప్షన్, ఏనుగుకు తొలిసారి సిజేరియన్ కాన్పు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)