బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్ ఎవరు?

ఫొటో సోర్స్, BJP
- రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్ మంత్రి నితిన్ నబీన్ బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి (నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్)గా నియమితులయ్యారు.
"బీజేపీ పార్లమెంటరీ బోర్డు బిహార్ మంత్రి నితిన్ నబీన్‌ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది" అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేసిన లేఖలో తెలిపారు.
ఈ లేఖ ప్రకారం, నితిన్ నబీన్ నియామకం తక్షణం అమల్లోకి వస్తుంది.
నితిన్ నబీన్ బిహార్ ప్రభుత్వంలో రహదారుల శాఖ మంత్రిగా, ఛత్తీస్‌గఢ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
ఆయన బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం అనంతరం పార్టీలోని సీనియర్ నేతలకు నితిన్ నబీన్ కృతజ్ఞతలు తెలిపారు.
"పార్టీ కార్యకర్తల కష్టం ఇది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని సీనియర్ నాయకత్వం గుర్తిస్తుంది. అందరం కలిసి పనిచేద్దాం" అని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ నితిన్‌ను అభినందిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. నితిన్ నబీన్ కష్టపడి పని చేసే కార్యకర్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అందులో రాశారు.
"ఆయన ఉత్సాహవంతుడైన యువ నాయకుడు. సంస్థాగత అనుభవం ఉంది. బిహార్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలా బాగా పని చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అంకితభావంతో పని చేస్తారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు ఆయనకు హృదయపూర్వక అభినందనలు " అని ప్రధాని మోదీ అందులో రాశారు.
నితిన్ నబీన్ తొలిసారి 2006లో పట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు.
2010 నుంచి 2025 వరకు వరుసగా ఐదుసార్లు బాంకీపూర్ స్థానం నుంచి విజయం సాధించారు.

ఫొటో సోర్స్, ANI
నితిన్ నబీన్ ఎవరు?
నితిన్ నబీన్ 1980లో ఝార్ఖండ్‌లోని రాంచీలో జన్మించారు.
ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దాని ప్రకారం వివరాలు,
ఆయన తండ్రి పేరు నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా. పట్నాలోని టేలర్ రోడ్‌లో నివాసం.
తానొక సామాజిక కార్యకర్తనని, తాను ఏ క్రిమినల్ కేసులోనూ దోషిగా తేలలేదని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు.
నితిన్ నబీన్ 1996లో పట్నాలోని సెయింట్ మైకేల్స్ హైస్కూల్ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.
1998లో దిల్లీలోని సీఎస్‌కేఎం పబ్లిక్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదివారు.
"నితిన్ నబీన్ 2006లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. దానిని ఆయన వారసత్వంగా పొందారని చెప్పొచ్చు. ఆయన తండ్రి నబీన్ కిశోర్ సిన్హా తొలినాళ్లలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి మరణం తర్వాత ఆయన ఆ స్థానం నుంచి గెలుస్తున్నారు" అని సీనియర్ జర్నలిస్ట్ నచికేత నారాయణ్ చెప్పారు.
నితిన్ నబీన్ 2016 నుంచి 2019 వరకు బీజేపీ యువ మోర్చా బిహార్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2021లో తొలిసారి నితీశ్ కమార్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
"నరేంద్రమోదీ గురించి జాతీయ రాజకీయాల్లో పెద్దగా చర్చ లేని సమయంలోనూ ఆయన మోదీకి అనుకూలంగానే ఉన్నారు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @NitinNabin
2010లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు పట్నా వచ్చారు.
ఆ సమయంలో వార్తా పత్రికల్లో ప్రచురించిన ఒక ప్రకటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ ప్రకటనలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్ చేతులు పట్టుకున్నట్లుగా ఉంది. వరదల సమయంలో గుజరాత్ ప్రభుత్వం బిహార్‌కు సాయం చేసినట్లుగా అందులో వివరణ ఉంది.
ఈ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన నితీశ్ కుమార్, తన అనుమతి లేకుండా ఆ యాడ్ ప్రచురించారని అన్నారు.
అంతేకాకుండా, బీజేపీ నాయకుతలతో విందు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
విందు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న ఫోటోలు పత్రికల్లో వచ్చాయి.
"నితిన్‌ను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎందుకు నియమించారనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుంది. అయితే, బీజేపీ అగ్ర నాయకత్వం ఆయనను బలంగా నమ్ముతోందనేది స్పష్టమవుతోంది" అని నచికేత నారాయణ్ అన్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఎందుకు?
జేపీ నడ్డా తర్వాత బీజేపీ చాలాకాలంగా కొత్త జాతీయ అధ్యక్షుడిని నిర్ణయించుకోలేకపోయింది.
ఈ విషయం రాజకీయా వర్గాల్లోనే కాకుండా పార్లమెంట్‌లోనూ చర్చనీయాంశమైంది.
బీజేపీ తన జాతీయ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేకపోయిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పార్లమెంట్‌లో విమర్శించారు.
బీజేపీ కార్యకర్తల పార్టీ అని, కుటుంబ పార్టీ కాదని, అందుకే అధ్యక్షుడి ఎన్నిక ఆలస్యం అయిందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా చెప్పారు.
ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది పార్టీ నాయకత్వం.
"ఇది ఆశ్చర్యకరమైన నిర్ణయం. జేపీ నడ్డాకు దాదాపు మూడేళ్లు పొడిగింపు ఇచ్చారు. కొత్త అధ్యక్షుడి గురించి ప్రశ్నలను నివారించడానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించినట్లు కనిపిస్తోంది. అయితే ఇది ప్రశ్నలను మరింత పెంచుతుంది" అని సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ చెప్పారు.
"ఆరెస్సెస్, బీజేపీ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా? అని ప్రజల్లో ప్రశ్న తలెత్తొచ్చు. బీజేపీ అగ్ర నాయకత్వంలో ఏదైనా ఒక పేరుపై ఏకాభిప్రాయం లేదా? అందుకే ఇప్పుడు పూర్తికాల అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి బదులు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించారా?" అనే ప్రశ్నలు లేవనెత్తారు.
బీజేపీ వంటి పెద్ద పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా ఆయనకు జాతీయ స్థాయిలో ఒక విజన్ ఉండాలని, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో సమావేశాలు నిర్వహించాలని రషీద్ కిద్వాయ్ సూచించారు.
నితిన్ నబీన్ ఈ పదవిలో ఎన్ని రోజులు ఉంటారో నిర్ణయించలేదు.
బీజేపీ అగ్రనాయకత్వం పార్టీ నాయకత్వ బాధ్యతలను సులభంగా ముందుకు తీసుకెళ్లగల వ్యక్తికి అప్పగించడం అనేది తరచుగా కనిపిస్తోంది.
అయితే, వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో తీసుకున్న నిర్ణయం రాజకీయ చర్చకు ముగింపు పలుకుతుందా? లేదా ప్రతిపక్షాలు ఈ అంశంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతాయా? అనేది చూడాల్సి ఉంది.
అధ్యక్షుడవుతారా?
బీజేపీ రాజ్యాంగం, నియమావళిలో కార్యనిర్వాహక అధ్యక్షుడి పాత్ర గురించి ప్రస్తావించలేదు.
ఈ పరిస్థితుల్లో, కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి .
ఆయనను అధ్యక్షుడిని చేసే అవకాశముందా?
"నితిన్ నబీన్ ప్రస్తుతానికి తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన పని తీరు అంచనా వేయడానికి బీజేపీకి కొంత సమయం ఉంది. జనవరిలో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఆయనను అధ్యక్షుడిగా నియమించవచ్చు" అని సీనియర్ జర్నలిస్ట్ బ్రజేష్ శుక్లా బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














