‘పెళ్లివేడుకలో వెదజల్లిన నకిలీ డబ్బు తీసుకున్నాడని 14 ఏళ్ల బాలుడిని కాల్చిచంపిన సీఐఎస్ఎఫ్ జవాన్’ అసలేంటీ కేసు?

నేరాలు, దిల్లీ, పెళ్లి, కాల్పులు, నకిలీ డబ్బు, సీఐఎస్ఎఫ్

ఫొటో సోర్స్, BBC/Prabhat Kumar

"రాత్రి 9 గంటల సమయంలో సాహిల్ తలుపు దగ్గర నిలబడి 'అమ్మీ, తలుపు తెరవండి.. నేను ఇక్కడే ఉన్నాను' అని చెబుతున్నట్టు అనిపిస్తుంది. అతనీ లోకంలో లేడని తెలుసు. కానీ మా మనసులు ఇంకా నమ్మడం లేదు. మేమతని కోసం ఎదురుచూస్తున్నాం. అర్ధరాత్రి ఒంటిగంటయినా నిద్రపోలేకపోతున్నాం''.

ఇవి దిల్లీలోని షాహ్దారాలో నివసించే 42 ఏళ్ల నిషా అన్సారీ మాటలు.

కొడుకును కోల్పోయిన బాధను నిషా అనుభవించడం ఇదే మొదటిసారి కాదు. గత ఐదేళ్లల్లో ఆమె ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నేరాలు, దిల్లీ, పెళ్లి, కాల్పులు, నకిలీ డబ్బు, సీఐఎస్ఎఫ్

ఫొటో సోర్స్, BBC/Prabhat Kumar

ఫొటో క్యాప్షన్, సాహిల్ తండ్రి సిరాజుద్దీన్ అన్సారీ

‘నకిలీ డబ్బు కోసం నిండు ప్రాణం’

నిషా అన్సారీ 18 ఏళ్ల కుమారుడు 2020లో తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. ఇప్పుడు నవంబరు 29న సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మదన్ గోపాల్ తివారీ పిస్టల్ నుంచి వచ్చిన బుల్లెట్ వారి 14 ఏళ్ల సాహిల్ ప్రాణాలను తీసింది.

ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారనే ఆరోపణను నిందితుడి కుటుంబం ఖండించింది. కాల్పులు ప్రమాదవశాత్తూ జరిగాయని వారు అంటున్నారు.

తన సోదరుడి వివాహ వేడుక సమయంలో విసిరేసిన డబ్బును సాహిల్ తీసుకుంటున్నందుకు మదన్ గోపాల్ తివారీ అతనిపై కాల్పులు జరిపారనే ఆరోపణలొచ్చాయి.

"పండుగల సమయంలో ప్రజలు డబ్బు ఎందుకు విసిరేస్తారు? జనం ఆ డబ్బు తీసుకుంటారనేకదా. పైగా ఆ డబ్బు నిజమైనది కూడా కాదు. నకిలీ డబ్బు కోసం నా కొడుకుపై కాల్పులు జరిపారు. అలాంటి వ్యక్తికి జీవించే హక్కు లేదు. ప్రభుత్వం అతనికి తుపాకీ ఇచ్చింది ఇందుకా? మీరు కాల్చాల్సి వస్తే సరిహద్దు దగ్గర ఉగ్రవాదులపై కాల్చండి. ఆ అమాయక బాలుడు ఏం తప్పు చేశాడు?" అని నిషా అన్సారీ ఆవేదన వ్యక్తంచేశారు.

సాహిల్ వయసు కేవలం 14ఏళ్లు . అతని తండ్రికి 6 నెలల క్రితం పక్షవాతం వచ్చిన తర్వాత, కుటుంబానికి సాయంగా ఉండేందుకు దగ్గరలోని కిరాణా దుకాణంలో పని చేయడం ప్రారంభించాడు. నవంబరు 29వ తేదీ రాత్రి అతను పని ముగించుకుని ఇంటికి బయలుదేరాడుగానీ తిరిగి ఇంటికి రాలేదు.

నేరాలు, దిల్లీ, పెళ్లి, కాల్పులు, నకిలీ డబ్బు, సీఐఎస్ఎఫ్

ఫొటో సోర్స్, BBC/Prabhat Kumar

ఫొటో క్యాప్షన్, సాహిల్ రోడ్డుపై పడిపోయి ఉండడాన్ని చూసి తల్లి స్పృహతప్పి పడిపోయారు.

‘‘డబ్బు ఏరుకున్నందుకు కాల్చి చంపాడు’’

"నవంబరు 29న రాత్రి 9 గంటల ప్రాంతంలో నా చిన్న కొడుకు సాజిమ్, మరో ఇద్దరు పిల్లలు ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు" అని సాహిల్ తండ్రి సిరాజుద్దీన్ అన్సారీ చెప్పారు.

"'నాన్నా, సాహిల్‌ని కాల్చారు!' అని వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళు తమాషా చేస్తున్నారనుకున్నాను. కానీ వాళ్ళు ఏడుస్తూ.. ‘నిజంగా అతన్ని కాల్చారు' అని చెప్పారు"

"నడవడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల నేను నెమ్మదిగా నడుస్తాను. సాహిల్ తల్లి వెంటనే అక్కడికి పరిగెత్తింది. ఇంటి నుంచి కొద్ది దూరంలోనే ఉన్న కమ్యూనిటీ హాల్ దగ్గర సాహిల్ నేలపై పడిపోయి ఉండటాన్ని ఆమె చూసింది. అతను చనిపోయాడు" అని సిరాజుద్దీన్ చెప్పారు.

''ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా మదన్ గోపాల్ తివారీ జనంపై డబ్బు విసురుతుండడాన్ని సాహిల్ గమనించాడు. వెంటనే తన ముందు రోడ్డుపై పడి ఉన్న డబ్బును తీసుకోవడం ప్రారంభించాడు. మదన్ గోపాల్ తివారీకి ఇది నచ్చలేదు. అతను మొదట సాహిల్‌ను కొట్టాడు. ఆ తర్వాత కాల్చి చంపాడు'' అని కుటుంబసభ్యులు ఆరోపించారు.

నేరాలు, దిల్లీ, పెళ్లి, కాల్పులు, నకిలీ డబ్బు, సీఐఎస్ఎఫ్

ఫొటో సోర్స్, BBC/Prabhat Kumar

ఫొటో క్యాప్షన్, తమకు తక్షణమే న్యాయం చేయాలని బాలుడి తల్లి కోరుతున్నారు.

స్పృహ కోల్పోయిన తల్లి

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో సాహిల్ రోడ్డుపై పడిఉన్నాడు. అతని తల రక్తంతో తడిసిపోయింది.

"వాణ్ణలా చూడగానే నేను స్పృహ తప్పి పడిపోయాను. మా పొరుగున ఉండే వ్యక్తి నన్ను స్పృహలోకి తెచ్చారు. నా కొడుకు అక్కడ అలా పడిపోయిఉన్నాడు. అక్కడ చాలామంది జనం ఉన్నారు కానీ వాణ్ణెవరూ ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. మేమే మా అబ్బాయిని దగ్గరలోని హెడ్గేవార్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ వాడు అప్పటికే చనిపోయాడు" అని నిషా అన్సారీ చెప్పారు.

జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన షాహిల్ కుటుంబం ప్రస్తుతం షాహ్దారాలో 4x4 కంటే తక్కువ సైజు ఉన్న చిన్న గదిలో నివసిస్తోంది.

సాహిల్ తండ్రి సిరాజుద్దీన్ అన్సారీ ఒక కూలీ. ఆరు నెలల క్రితం వచ్చిన ఆరోగ్య సమస్య కారణంగా ఆయన అంతగా పనిచేయలేకపోతున్నారు. దీంతో కుటుంబ పోషణ బాధ్యతను చిన్న వయసులోనే సాహిల్ తీసుకోవాల్సివచ్చింది.

"నా కొడుకు చీమకు కూడా హాని తలపెట్టడు. మా చుట్టూ ఉన్న వారిని అడగండి. అతనికి ఎవరితోనూ గొడవలు లేవు. అంతే కాదు ఎవరినీ పన్నెత్తు మాట కూడా అనేవాడు కాదు''

"సాహిల్ మౌనంగా ఉండేవాడు. చుట్టుపక్కలవాళ్లు అతనికి మాటలురావేమో, మూగవాడేమో అనుకునేవారు. తన తండ్రి మందులకు, ఇంటి ఖర్చులకు డబ్బు ఎలా సంపాదించాలి అనే దానిపై మాత్రమే సాహిల్ దృష్టి పెట్టేవాడు" అని తల్లి నిషా అన్సారీ చెప్పారు.

ఈ కేసులో నిందితుడైన సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మదన్ గోపాల్ తివారీకి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని సాహిల్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

నేరాలు, దిల్లీ, పెళ్లి, కాల్పులు, నకిలీ డబ్బు, సీఐఎస్ఎఫ్

ఫొటో సోర్స్, MHA

ఫొటో క్యాప్షన్, క్రిమినల్ నేరం కింద ఓ సైనికుడు 48గంటలకంటే ఎక్కువ సమయం నిర్బంధంలో ఉంటే ఆయన్ను సస్పెండ్ చేయవచ్చు.

పోలీసులేంచెప్పారు?

మదన్ గోపాల్ తివారీ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. "ఈ సంఘటన తర్వాత నిందితుడు పారిపోయాడు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి సీమాపురి ఏసీపీ, మానసరోవర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ పర్యవేక్షణలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం" అని అన్నారు.

"స్థానిక స్థాయి దర్యాప్తు, వివాహ వేదిక సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన తర్వాత నవంబరు 30న ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలో నిందితుడిని అరెస్టు చేశారు" అని షాహ్దారా డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ గౌతమ్ చెప్పారు.

కాల్పులు జరిపినట్టు విచారణలో నిందితుడు అంగీకరించారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

"వేడుకలో విసిరిన డబ్బును పిల్లలు తీసుకున్నప్పుడు కోపంతో పిల్లలలో ఒకరిని కాల్చాను" అని నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

కాల్పులు జరపడానికి నిందితుడు ఉపయోగించినది లైసెన్స్ ఉన్న 32 బోర్ పిస్టల్.

నేరాలు, దిల్లీ, పెళ్లి, కాల్పులు, నకిలీ డబ్బు, సీఐఎస్ఎఫ్

ఫొటో సోర్స్, BBC/Prabhat Kumar

ఫొటో క్యాప్షన్, కాల్పుల ఆరోపణలను నిందితుడి కుటుంబం ఖండించింది.

'తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు'

నిందితుడి సోదరుడు సోను ఈ ఆరోపణల్ని ఖండించారు.

"నా సోదరుడు కావాలని బుల్లెట్ పేల్చలేదు. ప్రతి ఒక్కరూ ఆయన్ను తిడుతున్నారు. అక్కడ భారీగా జనం ఉన్నారు. పిస్టల్ లోడ్ అయి ఉంది. బుల్లెట్ అనుకోకుండా బాలుడికి తగిలింది" అని సోను బీబీసీతో చెప్పారు.

"ఆయన తాగి ఉన్నాడని కొంతమంది అంటున్నారు. కానీ ఆయన రికార్డును తనిఖీ చేయండి. ఆయనెప్పుడూ మద్యం సేవించలేదు. మేం న్యాయ పోరాటం చేస్తాం" అని చెప్పారు.

మదన్ గోపాల్ తివారీ కుటుంబం ఎటావాలో నివసిస్తోంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన ప్రస్తుతం కాన్పూర్‌లో పనిచేస్తున్నారు. ఈ విషయంపై సీఐఎస్ఎఫ్‌ను సంప్రదించగా అలాంటి విషయాలపై తాము వ్యాఖ్యానించలేమని ప్రజా సంబంధాల విభాగం తెలిపింది.

నేరాలు, దిల్లీ, పెళ్లి, కాల్పులు, నకిలీ డబ్బు, సీఐఎస్ఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని సాహిల్ కుటుంబం డిమాండ్ చేస్తోంది.

సీఐఎస్ఎఫ్ ఏదైనా చర్య తీసుకుందా?

"సెలవులో ఉన్నప్పుడు ఒక జవాన్ అలాంటి ఘటనకు పాల్పడితే మేం అధికారిక ప్రకటన జారీ చేయం" అని సీఐఎస్ఎఫ్ స్పష్టం చేసింది.

అయితే ఒక సైనికుడు క్రిమినల్ నేరం కింద 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే ఆయన్ను సస్పెండ్ చేస్తారని సీఐఎస్ఎఫ్ నియమావళి స్పష్టంగా పేర్కొంది.

ఈ కేసు ప్రస్తుతం కోర్టు, పోలీసుల దర్యాప్తులో ఉంది. బాధితుడి కుటుంబం మాత్రం నిందితుడికి వీలైనంత కఠినంగా శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటున్నామని చెబుతోంది.

"మేం పేదవాళ్ళం. ఏది ఏమైనా మాకు న్యాయం కావాలి. మా కొడుకుకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం" అని సాహిల్ తల్లి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)