ఏలూరులో దళిత యువతిపై అత్యాచారం, దాడి: అసలేం జరిగింది? ఆలస్యంగా స్పందించారన్న ఆరోపణలపై పోలీసులు ఏమంటున్నారు?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కేంద్రంలో ఓ దళిత యువతిపై రౌడీషీటర్ అత్యాచారం చేసి.. ఆపై ఆమెను చిత్రహింసలు పెట్టిన ఘటన కలకలం రేపింది.
ఈ కేసులో నిందితులను ఏలూరు పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు.
అయితే, ఘటన జరిగిన వెంటనే ఈ నెల 2వ తేదీ రాత్రి బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆ ఆరోపణలను ఉన్నతాధికారులు తోసిపుచ్చుతున్నారు.
అసలేం జరిగిందనే వివరాలను ఏలూరు టూటౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బీబీసీకి వెల్లడించారు.
''విజయవాడ దగ్గరలోని నిడమానూరు ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతి(23)కి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయమైన ఏలూరు నగరానికి చెందిన మరో యువతితో ఇటీవల సాన్నిహిత్యం పెరిగింది. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతికి వెళ్లారు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నిడమానురు యువతి నవంబరు 28వ తేదీన ఏలూరుకి చెందిన యువతి ఇంటికి వచ్చారు'' అని సీఐ అశోక్ కుమార్ వివరించారు.


ఫొటో సోర్స్, Getty Images
అర్ధరాత్రి ఇంట్లో నుంచి లాక్కొచ్చి అత్యాచారం
''డిసెంబరు 2వ తేదీ రాత్రి ఆ ఇద్దరూ ఇంట్లో నిద్రిస్తుండగా, పులిగడ్డ జగదీశ్ బాబు, లావేటి భవానీ కుమార్ అనే ఇద్దరు యువకులు అర్ధరాత్రి బాగా మద్యం సేవించి ఆ ఇంటికి వచ్చి తలుపులు బలంగా బాదారు.
ఏలూరుకి చెందిన యువతి తల్లి ఆ రోజు ద్వారకాతిరుమల వెళ్లడంతో ఇద్దరు యువతులే ఇంట్లో ఉన్నారు.
నిందితులు తలుపులు కొట్టడంతో ఇద్దరూ భయపడి తెరవలేదు. యువకులు ఇంటి కిటికీపై రాళ్లు విసిరి గట్టిగా కేకలు వేశారు.
దాంతో వారు తలుపులు తీయగా లోపలికి ప్రవేశించిన జగదీశ్.. నిడమానూరు యువతిని బలవంతంగా బయటకు లాగారు. అడ్డుకునే యత్నం చేసిన ఏలూరు యువతిని భవానీకుమార్ బలంగా అడ్డుకున్నారు.
నిడమానూరు యువతిని జగదీశ్.. చోడిదెబ్బ సచివాలయం సమీపంలోని కమిటీ హాల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు'' అని సీఐ తెలిపారు.
2వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని సీఐ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తెల్లవారుజామున మళ్లీ ఇంటికొచ్చి దాడి
‘‘ఆ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలితో పాటు ఏలూరుకు చెందిన యువతి కూడా భయపడి ఆ ఇంట్లోనే ఉండిపోయారు.
అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితులు ఇద్దరూ మరోసారి ఆ ఇంటివద్దకు వచ్చారు. దీంతో బాధితురాలు ఆగ్రహంతో వారిపై కేకలు వేశారు.
ఇద్దరు యువకులూ అత్యాచార బాధితురాలిని బెల్ట్, కరత్రో విచక్షణారహితంగా కొట్టారు'' అని సీఐ వివరించారు.
ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితులు బెదిరించారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
అయితే రెండోసారి నిందితులు వచ్చి దాడిచేయడంతో తీవ్రంగా భయపడిపోయిన బాధితురాలు సమీపంలోని ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు.
''మేం పూర్తిగా విచారించి బాధితురాలిని వెంటనే చికిత్స, వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాం. ఆ తర్వాత నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నాం. ఆ ఇద్దరితో పాటు ఘటనాస్థలంలో ఉన్న మరొక యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని ముగ్గురిపై కేసులు పెట్టాం'' అని సీఐ అశోక్‌కుమార్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నిందితులది నేరచరిత్రే’
''ఈ కేసులో ఏ–1గా ఉన్న జగదీశ్‌పై ఇప్పటికే రౌడీషీట్ ఉంది. ఆయనపై దొంగతనం, కొట్లాట కేసులు గతంలో పదికి పైగా ఉన్నాయి. ఈనెల 2వ తేదీన ఓ దొంగతనం కేసులో విచారణకు తాడేపల్లి గూడెం కోర్టుకు వచ్చిన జగదీశ్ ఏలూరులోని తన మిత్రుడైన భవానీకుమార్ వద్దకు వచ్చారు. కొన్నాళ్లుగా జగదీశ్ మంగళగిరిలో నివసిస్తూ ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నడుపుతున్నారు. ఇక ఈ కేసులో ఏలూరుకు చెందిన ఏ–2 భవానీ కుమార్‌పై ఇప్పటికే సస్పెక్ట్ షీట్ ఉంది దాన్ని ఇప్పుడు రౌడీషీట్ గా మార్చబోతున్నాం'' అని సీఐ వివరించారు.
వీరిద్దరితో పాటు ఆరోజు ఘటనా స్థలంలోనే ఉన్న స్థానిక యువకుడు ధనుష్‌ను కూడా మూడో నిందితుడిగా చేర్చామని సీఐ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసులు సరిగ్గానే స్పందించారంటూ వీడియో
ఈ కేసులో పోలీసుల స్పందన బాగానే ఉందంటూ అత్యాచార బాధితురాలు మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటికొచ్చింది.
''నిందితుడు నాపై అత్యాచారం చేయడంతో పాటు నన్ను తీవ్రంగా వేధించడం వల్లనే పోలీసులను ఆశ్రయించాను. పోలీసులు బాగానే స్పందించారు'' అని ఆ వీడియోలో ఆమె చెప్పారు
దీనిపై డీఎస్పీ శ్రావణ్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘ఆ వీడియోతో మాకు సంబంధం లేదు. ఆమెతో ఎవరో మీడియా వాళ్లు మాట్లాడుతూ చేసిన వీడియో'' అని డీఎస్పీ చెప్పారు.

'పక్కా విచారణకు కాస్త సమయం తీసుకున్నాం అంతే'
ఈ కేసులో పోలీసుల తప్పేమీ లేదని వెంటనే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని, పక్కా విచారణకు కాస్త సమయం తీసుకున్నామే తప్ప ఎక్కడా జాప్యం చేయలేదని డీఎస్పీ శ్రవణ్ కుమార్ చెప్పారు.
గతంలో ఆ యువతితో వారికి పరిచయం ఉందని నిందితులు చెబుతున్నారని డీఎస్పీ బీబీసీతో చెప్పారు.
కాగా, అత్యాచార బాధితురాలితో పాటు ఏలూరుకి చెందిన యువతితో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














