నంద్యాల: బాలికపై అత్యాచారం కేసులో పోలీస్ కస్టడీలోని ఒకరి మృతి, ఎవరేమన్నారు?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
నంద్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన ఒక వ్యక్తి పోలీసుల కస్టడీలో మరణించడం చర్చనీయమైంది.
ఈ నెల 7న నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే బాలిక ‘మృతదేహాన్ని మాయం చేయడానికి సహకరించారు’’ అనే ఆరోపణలతో ఆ మైనర్ల బంధువులను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అలా అదుపులోకి తీసుకున్న వారిలో యోహాన్ అలియాస్ హుస్సేన్ అనే వ్యక్తి శనివారం పోలీసు కస్టడీలో చనిపోయారు.
పోలీసుల కస్టడీలో ఉన్న హుస్సేన్ చనిపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
పోలీసులు ‘‘హింసించడంతో హుస్సేన్ చనిపోయాడు, ఇది లాకప్ డెత్’’ అని ప్రతిపక్షాలు విమర్శించాయి.
‘నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో పరుగెడుతూ గుండె నొప్పితో చనిపోయాడు’ అని పోలీసులు చెబుతున్నారు.


ఎవరీ హుస్సేన్?
నిందితుల్లో ఒకరైన బాలుడికి హుస్సేన్ మేనమామ అవుతారు. ‘బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ కీలకంగా వ్యవహరించారు’ అని పోలీసులు చెప్తున్నారు.
హుస్సేన్ సొంతూరు ముచ్చుమర్రి. నాలుగేళ్లుగా నందికొట్కూరులో నివసిస్తున్నారు. తల్లితో కలిసి ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
పోలీసుల విచారణలో హుస్సేన్ చనిపోయినట్లు శనివారం మీడియా కథనాలు వచ్చాయి.
హుస్సేన్ గుండెపోటుతో చనిపోయారని అదే రోజు రాత్రి 10 గంటలకు నంద్యాల పోలీసులు పత్రికాప్రకటన విడుదల చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో బాలికపై అత్యాచారం, హత్య కేసు విచారణలో భాగంగా ముద్దాయి హుస్సేన్‌ను నంద్యాల టౌన్ శివారులో మసీదుపురం మెట్ట దగ్గర అదుపులోకి తీసుకున్నారు.
నందికొట్కూరుకి తీసుకుని వెళ్తుండగా తలముడిపి బాట దగ్గర హుస్సేన్ పోలీస్ జీప్‌లో నుంచి దూకి పారిపోతుండగా ఆయన్ను పోలీసులు పట్టుకున్నారు.
ఆయాసంతో ఎద నొప్పిగా ఉందని హుస్సేన్ చెప్పడంతో వెంటనే పోలీసులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం.. ఆయన దారిలోనే చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు’ అని నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ప్రకటించారు.
‘‘ఆయన లాకప్‌లో మరణించారా? లేక ఏ విధంగా చనిపోయారు ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇంకొక ప్రాణం పోకముందే ఈ ఘటనపై సీబీసీఐడీ దర్యాప్తు చేయాలి’’ అని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి డిమాండ్ చేశారు.
మరోవైపు హుస్సేన్ కుటుంబీకులు, బంధువులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలని బీబీసీ ప్రయత్నించింది.
హుస్సేన్ తల్లితో మాట్లాడేందుకు నందికొట్కూరులో హుస్సేన్ ఉంటున్న చోట ప్రయత్నించినప్పటికీ ఆమె అక్కడ లేదు.
హుస్సేన్‌కు సంబంధించినవారు ఎవరూ ముచ్చుమర్రిలో కానీ, నందికొట్కూరులో కానీ అందుబాటులో లేరు.

మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారా?
పోలీసులు హుస్సేన్ మృతదేహాన్ని రహస్యంగా శవాగారానికి తీసుకెళ్లి, ఆయన బంధువులను పిలిపించి రహస్యంగా పంచనామా చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే, హుస్సేన్ గుండెపోటుతోనే చనిపోయారని, నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అదిరాజ్ సింగ్ చెప్పారు.
‘హుస్సేన్ మరణంపై మిడ్తూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. కర్నూలు జిల్లాకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాం. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ శవపంచనామా చేశారు. చనిపోయిన వ్యక్తి, గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు శవ పంచనామా సమయంలో బంధువులు మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. మొత్తం పోస్టుమార్టం ప్రాసెస్‌ను వీడియో తీశారు. చట్ట ప్రకారం అన్ని నియమ నిబంధనలు పాటించి కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాం’’అని ఆయన తెలిపారు.
హుస్సేన్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే చనిపోయి ఉండొచ్చని పౌరహక్కుల సంఘం తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ క్రాంతి చైతన్య అన్నారు.
‘‘ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిజాలు రాబట్టడానికి పోలీసులు అనుమానితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంటారు. హుస్సేన్ కేసులో కూడా ఇదే జరిగి ఉంటుంది. వీడియోలో ఆయన ఒంటిపై ఉన్న గాయాలను బట్టి చూస్తే అతన్ని తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తికి ఒంటిపై గాయాలు ఎలా ఉంటాయి? నిందితులకు కూడా మానవహక్కులు ఉంటాయి. హ్యుమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలి’’ అని ఆయన కోరారు.
ఇప్పటికే బాలిక అదృశ్యం కేసులో నిర్లక్ష్యం వహించారంటూ సీఐ విజయ భాస్కర్, ఎస్సై జయ శేఖర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా హుస్సేన్ మృతితో పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి.
పోలీసుల ఒత్తిడితోనే కుటుంబ సభ్యులు కూడా స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇంతకీ ఏమిటీ కేసు?
బాలిక అదృశ్యమైనట్లుగా పగిడ్యాల పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 7న కేసు నమోదైంది. బాలిక అదృశ్యం, హత్య కేసులో అయిదుగురు నిందితులను అరెస్టు చేశామని ఈ నెల 16న పోలీసులు ప్రకటించారు.
‘‘బాలికకు చాక్లెట్ ఇస్తామని ఆశ చూపి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్, మర్డర్, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లను అరెస్టు చేశాం’’ అని నంద్యాల ఎస్పీ వెల్లడించారు.
బాలిక మృతదేహం కోసం ఇంకా గాలిస్తున్నారు. అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారం, మైనర్ల దగ్గర ఉన్న కాల్ లిస్టు ఆధారంగా పోలీసులు మరికొంత మందిని విచారిస్తున్నట్టు తెలిపారు.
ఏడాది కాలంలో 5 లాకప్ మరణాలు
తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల కస్టడీలో నిందితులు చనిపోయిన కేసులు తరచూ నమోదవుతున్నాయి.
ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోనూ ఇలాంటి కేసులు ఉన్నాయి.
లోక్‌సభలో కేంద్ర హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 2018-2023 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల కస్టడీలో మరణాలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో తెలంగాణలో 6 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 687 కేసులు రిజిస్టర్ అయ్యాయి.
ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన ‘‘క్రైమ్ ఇన్ ఇండియా 2022’’ రిపోర్ట్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కేసులు నమోదు కావడం 20 శాతం పెరిగింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














