'విడాకుల రాజధాని'లో 50వ వివాహ వార్షికోత్సవం చేసుకున్న జంట..

ఫొటో సోర్స్, Mahmud Yakasai
నైజీరియాలో "విడాకుల రాజధాని"గా పిలిచే కానో నగరంలో నివసించే ఓ జంట ఇటీవలే 50వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంది. ఈ నగరంలో ఇద్దరి మధ్య వివాహ బంధం ఇంత సుదీర్ఘ కాలం నిలవడం ఇదే తొలిసారి. అందుకే ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మహమూద్ కబీర్ యకసయ్, రబియాతు తాహిర్ ఇన్నాళ్లుగా కలిసి ఆనందంగా ఉండటం వెనకున్న రహస్యాలను బీబీసీతో పంచుకున్నారు.
అలాగే కానో నగరంలో చాలా వివాహాలు ఎందుకు విడాకులకు దారితీస్తున్నాయో కూడా చెప్పారు.
యకసయ్ తన భార్య ఉదార స్వభావం గురించి చెప్పారు.
"ఆమె చాలా నిస్వార్థమైన వ్యక్తి. మా వివాహ బంధం ఇంత కాలం ఆనందంగా కొనసాగడంలో ఆమెదే కీలక పాత్ర’’ అని 76 ఏళ్ల యకసయ్ బీబీసీతో చెప్పారు.
60 ఏళ్లు దాటిన తాహిర్ ఇది విని సిగ్గుపడ్డారు.
వీరికి 13 మంది సంతానం. కుటుంబానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ప్రశాంతంగా ఉండే మనస్తత్వం తన భర్తది అని ఆమె ప్రశంసించారు.
ఆయన చాలా సహనశీలి. ఇది కూడా ఇన్నేళ్లు తమ వివాహ బంధం నిలవడానికి కారణమని ఆమె అన్నారు.
ఒకరినొకరు ప్రేమించుకుంటామని, గౌరవించుకుంటామని, తమ సహచర్యాన్ని ఆనందిస్తామని ఈ దంపతులు చెబుతున్నారు.
బీబీసీ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చాలా ఆనందంగా కనిపించారు.

ఇప్పటికి ఐదుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న 39 ఏళ్ల హసన్నా మహముద్ ఈ జంటను చూసి చాలా సంతోష పడ్డారు.
దేవుడు వీరిద్దరినీ కలిసి ఆనందంగా ఉండమని ఆశీర్వదించినట్టు ఆమెకు అనిపిస్తుందని చెప్పారు.
‘‘నా భాగస్వాములతో నేను నాలుగేళ్లకు మించి కలిసి ఉండలేకపోయాను. అందుకే 50వ వివాహ వేడుకలు చేసుకుంటున్న వీరిని చూస్తే సంతృప్తిగా ఉంది’’ అని ఆమె అన్నారు.
“నా మాజీ భర్తలు నన్నుపెళ్లిచేసుకోమని అడిగేటప్పుడు బాగానే ఉండేవారు. కానీ, పెళ్లి తర్వాత మారిపోయేవారు" అని నలుగురు పిల్లల తల్లైన హసన్నా మహముద్ తెలిపారు.
“కానో నగరాన్ని విడాకుల రాజధాని అని అందరూ పిలుస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది. త్వరలో ఇది మారుతుందని అనుకుంటున్నాను" అని చెప్పారు.
1990లో విడాకుల రేటు పెరిగాక కానోకి విడాకుల నగరం అని పేరు పడింది. అప్పటి నుంచి అనివార్యంగా వచ్చిన ఈ పేరుని తొలగించుకోలేకపోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
వాణిజ్య కేంద్రంగా కానో నగరం
నైజీరియాలో అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో కానో ఒకటి. ఇక్కడ ప్రతి నెలా వందల సంఖ్యలో వివాహాలు రద్దవుతున్నాయి.
ఈ నగరంలో 32% శాతం పెళ్లిళ్లు కేవలం మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలోనే ముగిసిపోతున్నాయని 2022లో స్థానిక ప్రభుత్వంతో కలిసి బీబీసీ చేసిన పరిశోధనలో తేలింది.
20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న కొంతమంది ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని కూడా తేలింది.
ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు చట్టబద్దమైన వయసు 18 ఏళ్లు. కానీ, అంతకంటే ముందే ఇక్కడి యువత పెళ్లి చేసుకుంటున్నారు.
“నేను నీకు విడాకులు ఇస్తున్నాను” అని భార్యకు భర్త చెప్పడం లేదా పేపర్ మీద రాసి ఇవ్వడం వంటి సులభమైన పద్ధతే విడాకుల రేటు పెరగడానికి కారణమని కొందరు భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టడం ద్వారా కూడా కొందరు తమ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
అధికంగా ఉన్న విడాకుల సమస్యను పరిష్కరించే హిస్బా కోసం అమీను దౌరావా పనిచేస్తున్నారు.
ఆయన సూచించే పరిష్కారాలలో ఒకటి రెండవ అవకాశాన్ని ఇవ్వడం. వివాహ జీవితానికి అనుగుణంగా వారిని సిద్ధం చేయడం.
వివాహ జీవితం బాగుండాలంటే, ముందుగానే వివాహ బంధం గురించి, తదనంతర పరిస్థితులు, భాగస్వామితో మెసులుకోవాల్సిన తీరు గురించి చెప్పి వారిని మానసికంగా సిద్ధం చేయడం మంచిదని ఆయన సూచించారు.
ఈ ఇస్లామిక్ ఏజెన్సీ సామూహిక వివాహాలను కూడా నిర్వహిస్తుంది. దీనిని "ఔరెన్ జవారావా" అని పిలుస్తారు.
విడాకులు తీసుకున్న వారిని కలపడానికి మధ్యవర్తులుగానూ వ్యవహరిస్తున్నారు.
ఈ సామూహిక వివాహ వేడుకలో వందలాది జంటలు పాల్గొంటాయి.
వారు వ్యాపారం పెట్టుకోవడానికి, గృహోపకరణాలు కొనుక్కోవడానికి కూడా కొంత ఆర్థిక సాయం చేస్తారు.
ఈ కార్యక్రమం 2012లో ప్రారంభమైంది. అయినప్పటికీ విడాకుల శాతం ఇంకా ఎక్కువగానే ఉందని దౌరావా చెప్పారు.
"ఆ సమస్య గురించి మాకు తెలుసు. అందుకే పెళ్లి తర్వాత ప్రతి జంట వివాహ జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. విడాకుల శాతం తగ్గుతుందని ఆశిస్తున్నాం" అని ఆయన అన్నారు.

కానీ, విడాకులు తీసుకోవడం తగ్గలేదని ప్రభుత్వేతర సంస్థ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇనిషియేటివ్ ఫౌండర్ హదిజా అడో అన్నారు.
"ప్రస్తుతం మా కార్యాలయాలలో విడాకుల కోసం రోజుకు 30 కేసులు నమోదవుతున్నాయి" అని ఆమె బీబీసీతో చెప్పారు.
"కుదేలవుతున్న నైజీరియా ఆర్థిక వ్యవస్థ కూడా ప్రస్తుత విడాకులకు కారణం" అని ఆమె అన్నారు.
“ఒక్కోసారి దినసరి సంపాదన లేకుండా భర్త ఖాళీ చేతులతో ఇంటికి రావడం కూడా భార్యభర్తల మధ్య గొడవలకు కారణవుతోంది” అని తెలిపారు.
ముస్లిం సమాజంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు కలవరు. కాబట్టి సరైన భాగస్వామిని ఎన్నుకోవడం కష్టం. అందుకే వివాహాలకు మధ్యవర్తుల సాయం తీసుకోవడం సర్వసాధారణం.
యువతీ యువకులు కలుసుకునే చోటు విశ్వవిద్యాలయం లేదా ఇతర సంస్థలు. వీటికి పెద్దగా వెళ్లరు.
పెళ్లి నిర్ణయించే సమయంలో భాగస్వామి గురించి పూర్తిగా తెలియదు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటారు.
నిజానికి మహమూద్ కబీర్ యకసయ్, రబియాతు తాహిర్‌లు యుక్త వయసులో ఉన్నప్పుడు పొరుగున ఉండే ఒక పెద్దామె ద్వారా వారికి పరిచయం ఏర్పడింది.
వారు మంచి జంట అవుతారని ఆమె భావించింది. కానీ, 12 సంవత్సరాల వరకు వారు పెళ్లి చేసుకోలేదు.
ఎందుకంటే ఒకరినొకరు తెలుసుకోవటానికి తగినంత సమయం తీసుకున్నారు.
వివాహ బంధం ఎక్కువ కాలం నిలవాలంటే తగిన సమయం తీసుకోవడం మంచిదని సంబంధాలు కుదిర్చే ఒక మధ్యవర్తి చెప్పారు.
"వివాహ బంధంలోకి వెళ్లే ముందే ఒకరి గురించి మరొకరు కచ్చితంగా తెలుసుకోవాలి" అని రబియు అడో బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Mahmud Kabir Yakasai
ఆయన పది సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు కుదురుస్తున్నారు. తన తల్లి పెళ్లి సంబంధాలు కుదిర్చే పని చేసినప్పటికీ, 46 ఏళ్ల రబియు అడో మాత్రం మ్యారేజ్ బ్రోకర్‌గా మారాలని అనుకోలేదు.
పెళ్లి సంబంధాలు చూసి పెట్టమని స్నేహితులు ఆయన్ను సంప్రదించినప్పుడు, రబియు అడో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
కొన్ని సంబంధాలు కుదిర్చిన తర్వాత తన కుటుంబ వృత్తి, వ్యాపార నేర్పు తనలో ఉందని ఆయన గ్రహించారు.
ప్రస్తుతం రబియు అడో తన సేవల గురించి ఇతరులకు కూడా తెలియజేస్తున్నారు. ప్రతి రోజూ ఒకరి నుంచి ఐదుగురు దాకా పెళ్లి సంబంధాల కోసం ఆయన్ను సంప్రదిస్తున్నారు.
డబ్బు సంపాదించే స్త్రీలు కావాలని పురుషులు, డబ్బున్న పురుషుడు కావాలని స్త్రీలు ఆయనను తరచుగా అడుగుతుంటారు.
"చాలా మంది సరైన ఆలోచనా విధానం లేకుండా వివాహాలు చేసుకుంటారు. అందుకే కొన్నాళ్లు గడిచాక వారు నిరాశకు గురవుతారు" అని ఆయన చెప్పారు.
ఆయన గత పదేళ్లలో సుమారు 500 వివాహాలు కుదిర్చారు. 90% కంటే ఎక్కువ వివాహాలు సజావుగా సాగుతున్నాయి.
"మై దలిలి(కచ్చితంగా వివాహం జరిపిస్తాడు)" అనే ముద్దుపేరును కలిగి ఉన్న రబియు అడో, విడాకుల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణం వారి జీవితంలో వివాహ బంధం ముఖ్యమైన విషయం అనుకోకపోవడమే అని అన్నారు.
"కానోలో విడాకుల సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉందంటే, విడాకులు తీసుకున్నా, ఇంకొక భాగస్వామి సులువుగా దొరకుతారనే ధీమానే కారణమని అనుకుంటున్నాను" అని ఆయన చెప్పారు.
ముస్లింలు విడాకులు తీసుకునే సౌలభ్యాన్ని ఇస్లామిక్ మత గురువు అబ్దుల్లాహి ఇషాక్ గరంగమావా సమర్థించారు.
"ఇస్లాం దయగలది. వివాహాలు, విడాకులను కఠినతరం చేయలేదు. దానివల్ల వివాహ బంధం సరిగా లేకపోతే ప్రజలు బంధం అనే పంజరంలో ఉండాల్సిన అవసరం లేదు" అని ఆయన బీబీసీకి చెప్పారు.
గతంలో విడాకుల సంఖ్య ఇంత ఉండేది కాదు. మన తల్లిదండ్రులు దశాబ్దాల పాటు కలిసే ఉన్నారు.
ఇటీవలి కాలంలో కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రక్రియను దుర్వినియోగం చేయడం ప్రారంభించారు” అని ఆయన చెప్పారు.
మొత్తంగా చెప్పేది ఏంటంటే “ కొన్ని మతాలలో, పరిస్థితులు ఎలా ఉన్నా మరణం వరకూ కలిసి ఉండాల్సిందే అన్నట్టు కాకుండా, పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు విడాకులు తీసుకోవచ్చని ఇస్లాం చెప్పింది" అని ఆయన అన్నారు.
భాగస్వామితో కష్టాలను పంచుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడమే వివాహ బంధం నిలవడానికి కీలకం అని యకసయ్ చెప్పారు.
“ప్రేమ కూడా ముఖ్యమే. ఎందుకంటే ఒకరినొకరు నిజంగా ప్రేమించినప్పుడే కలకాలం కలిసి ఉండగలుగుతారు’’ అని ఆయన అన్నారు.
యకసయ్ మాటలను బలపరుస్తూనే.. ‘‘పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తులు చాలా సహనం కలిగి ఉండాలి’’ అని చెప్పారు.
ఒకరు కోపం వచ్చినప్పుడు మరొకరు ఆ గొడవను పెద్దది చేయకుండా ప్రశాంతంగా ఉండాలి” అని ఆయన భార్య రబియాతు తాహిర్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














