బుధిని మంజియాన్‌: ‘నెహ్రూ గిరిజన భార్య’గా పేరున్న ఈమెను గ్రామస్థులు ఎందుకు వెలివేశారు... ఆమె చేసిన తప్పేంటి?

బుధిని మంజియాన్

ఫొటో సోర్స్, THE PRIME MINISTERS MUSEUM AND LIBRARY SOCIETY

ఫొటో క్యాప్షన్, నెహ్రూకు పూలమాల వేశారన్న కారణంగా బహిష్కరణకు గురైనప్పుడు బుధిని వయస్సు 15 ఏళ్లు
    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ న్యూస్, లండన్

జవహర్ లాల్ నెహ్రూకు పూలమాల వేయడం కారణంగా జార్ఖండ్ మహిళ బుధిని మంజియాన్ జీవితాంతం సొంత ఊరికి దూరంగా బతికారు. ఇంటిని, ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నారు.

సంతాల్ తెగకు చెందిన బుధిని గత నెలలో చనిపోయారు. గ్రామస్థులు వెలివేసినప్పుడు ఆమె వయసు పదిహేనేళ్ళు.

భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ మెడలో పూలమాల వేసినందుకు ఆమెను ఊరి నుంచి వెలి వేశారు.

సంతాల్ తెగ ఆచారాల ప్రకారం, దండలు మార్చుకోవడాన్ని పెళ్లిగా భావిస్తారు.

బుధిని అనుభవించిన కష్టాల గురించి చాలా మందికి తెలియదు. ‘నెహ్రూ తొలి గిరిజన భార్యగా’ కొందరు ఆమెను అభివర్ణించేవారు. మరణం తర్వాత మళ్లీ ఇప్పుడు ఆమె గురించి అందరిలో ఆసక్తి పెరిగింది.

గ్రామంలో ఉన్న నెహ్రూ విగ్రహం పక్కన బుధిని స్మారకాన్ని నిర్మించాలని జార్ఖండ్‌లోని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.

బుధిని మంజియాన్ తొలినాళ్ల జీవితం గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. మరణం తర్వాతే వికీపీడియాలో ఆమె గురించి రాశారు.

ఆమె గురించి అప్పుడప్పుడు వార్తాపత్రికలు, వెబ్‌సైట్లలో వార్తలు వచ్చేవి. కానీ, ఆ సమాచారం కూడా అసంపూర్ణంగా ఉంది.

జీవితం తుది దశలో అంధకారంలో బతికిన ఆమె చాలా దీన పరిస్థితుల్లో మరణించినట్లు 2012లో ఒక ప్రముఖ వార్తాపత్రిక తప్పుగా వార్తను రాసింది.

బుధిని జీవితాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించిన కేరళకు చెందిన రచయిత సారా జోసెఫ్‌ ఆమెపై ఒక పుస్తకాన్ని రాశారు.

2019లో మొదటిసారి బుధిని మంజియాన్‌ను కలిసినప్పుడు భాష తెలియకపోవడం వల్ల ఆమెతో మాట్లాడటం చాలా కష్టమైందని, బీబీసీతో సారా జోసెఫ్ చెప్పారు. అయినప్పటికీ, ఆమెను పూర్తిగా అర్థం చేసుకున్నానని సారా అన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుధిని కష్టాల గురించి నెహ్రూకు తెలియదు

జార్ఖండ్‌లోని ఒక చిన్న పట్టణం ధన్‌బాద్‌లో బుధిని మంజియాన్ పెరిగారు. ఈ ప్రాంతం బొగ్గు క్షేత్రాలకు ప్రసిద్ధి. ఇక్కడి జనాభాలో పావు వంతు గిరిజనులే ఉంటారు.

ఆ ప్రాంతంలోని ప్రతిష్టాత్మక దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) ప్రాజెక్టులో పనిచేసే వేలాది మంది కార్మికులలో బుధిని ఒకరు.

డీవీసీ అనేది భారతదేశ తొలి మల్టీపర్పస్ ప్రాజెక్ట్. నవ భారతానికి పునాదిగా నిలిచే ఆనకట్టలు, థర్మల్, జలవిద్యుత్ ప్లాంట్‌ల నెట్‌వర్క్ ఈ ప్రాజెక్ట్. నెహ్రూ ఒకసారి ఈ ప్రాజెక్టును ‘‘స్వేచ్ఛాయుత భారతదేశపు అద్భుత భవనం (నోబుల్ మాన్షన్ ఆఫ్ ఫ్రీ ఇండియా)’’ అని అభివర్ణించారు.

కానీ, ఈ ప్రాజెక్టును నిర్మించడం కూడా అంతే వివాదాస్పదమైంది. ఈ నిర్మాణం కోసం వేలాది మంది స్థానికులు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను వదులుకోవాల్సి వచ్చింది. వీరిలో గిరిజనులే ఎక్కువమంది ఉన్నారు.

బహిష్కరణకు గురికావడానికి ముందు బుధిని నివసించిన కబోనా గ్రామంతో సహా వందలాది గ్రామాలు ఈ ప్రాజెక్టు కారణంగా జాడ లేకుండా పోయాయి.

ప్రాజెక్టులో భాగమైన పంచెట్ ఆనకట్ట ప్రారంభోత్సవానికి వెళ్తున్నట్లు 1959లో నెహ్రూ ప్రకటించారు.

నెహ్రూకు స్వాగతం పలికేందుకు బుధిని మంజియాన్‌తో పాటు ఆమెతో పనిచేసే మరో వ్యక్తిని డీవీసీ ఎంపిక చేసింది.

ఆ తర్వాత అంతా మారిపోయింది.

ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నెహ్రూకు పూలమాల వేయాలని బుధినికి చెప్పారు.

అయితే, నెహ్రూ కూడా సరదాగా మళ్ళీ తన మెడలో పూలమాల వేస్తారని ఆమె ఊహించలేదు.

కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించడానికి డ్యామ్ పవర్ స్టేషన్ స్విచ్‌ను నొక్కాలని కూడా నెహ్రూ 15 ఏళ్ల బుధినిని కోరారు.

ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లోని ప్రముఖ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల్లో పంచెట్ డ్యామ్ ఒకటి

ఆరోజు సాయంత్రం గ్రామానికి తిరిగి వెళ్తున్నప్పుడు తన ఇంటికి వెళ్లడం అదే చివరిసారి అని ఆమెకు తెలియదు.

నెహ్రూకు పూలమాల వేయడం ద్వారా బుధిని ఆయనకు భార్యగా మారిందంటూ ఆ గ్రామపెద్ద వాదించారు. బయటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె సంతాల్ తెగ ఆచారాలను కూడా ఉల్లంఘించిందని, దానికి ప్రాయశ్చిత్తంగా అన్నింటిని వదిలేసి వెళ్లిపోవాలని ఆమెను ఆజ్ఞాపించారు.

సంతాలీలు శాంతియుతంగా ఉంటారన్న పేరుంది. చిన్న కమ్యూనిటీలుగా తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూ వారు జీవిస్తారు.

బయటి వ్యక్తులను పెళ్లి చేసుకోవడాన్ని ఈ తెగ వారు నిషేధిస్తారు. ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి శిక్షగా సామాజిక వెలి వేస్తారు. అయితే, మహిళలను అణిచివేయడానికి ఈ ఆచారం ఒక సాధనంగా వాడేవారని కార్యకర్తలు అంటున్నారు.

ఈ తెగలోని పురుషులు పని కోసం వలస వెళ్తుంటారు. కానీ పిల్లలు, అవివాహిత స్త్రీలు గ్రామాన్ని విడిచిపెట్టడం చాలా అరుదు.

ఒక్కసారి గ్రామం నుంచి వెళ్లిపోతే తిరిగి మళ్లీ అడుగుపెట్టడం కుదరదనే సంగతి బుధినికి తెలుసు. అందుకే గ్రామపెద్దతో తన వాదనలు చెప్పడానికి, జరిగిందేంటో వివరించడానికి ఆమె ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆమెను వెలివేస్తూ సంఘం పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

‘‘ఎవరూ ఆమెకు సాయం చేయలేదు. అయినవారి నుంచే ఆమెకు చంపుతామనే బెదిరింపులు అచ్చాయి’’ అని జోసెఫ్ చెప్పారు.

నిస్సహాయ స్థితిలో ఉన్న 15 ఏళ్ల బుధిని ఏమీ చేయలేక తన సామాన్లు తీసుకొని బయటకు వచ్చేశారు.

సంతాల్ తెగ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారత్‌లో అతిపెద్ద తెగల్లో సంతాల్ ఒకటి

ఆధునిక భారత చరిత్రలో ఆ డ్యామ్ ప్రారంభోత్సవాన్ని ఒక మైలురాయిగా అభివర్ణించారు.

ఆ తర్వాత మంజియాన్ గురించి పెద్దగా వార్తలేవీ రాలేదు. కానీ, ఒక వార్తాపత్రిక ఆమె గురించి కాస్త వివరంగా ప్రచురించింది. భారత్‌లో ఆనకట్టను ప్రారంభించిన తొలి కార్మికురాలిగా ఆ కథనంలో ఆమె గురించి రాసింది.

ఈ సమయంలోనే ఆమెకు ‘నెహ్రూ గిరిజన భార్య’ అనే పేరు వచ్చిందని జోసెఫ్ చెప్పారు.

తన జీవితంలోని కఠిన నెలలు, సామాజిక వెలి, పేదరికాన్ని భరించే ప్రయత్నంలో ఉన్న ఆమెకు, తనకు వస్తున్న ఈ పేరు గురించి ఏమాత్రం తెలియదని జోసెఫ్ అన్నారు.

‘‘ఆమె గురించి అందరూ చదువుతున్నారు. కానీ, ఎవరూ సహాయం చేయలేదు’’ అని జోసెఫ్ చెప్పారు.

1962లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆమెను ఉద్యోగం నుంచి తప్పించడంతో ఆమె పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దినసరి కూలీగా మారాల్సి వచ్చింది. ఆమె తొలిగింపుకు కారణాన్ని డీవీసీ చెప్పలేదు.

ఆమె అనుభవిస్తున్న కష్టాల గురించి ప్రధానమంత్రి నెహ్రూకు అవగాహన లేదు. ప్రగతిశీల, ఆధునిక భావాలున్న నెహ్రూను బధిని జీవితంతో ఎలా ముడిపెట్టారనేది హాస్యాస్పదం.

బుధిని

ఫొటో సోర్స్, SARAH JOSEPH

ఫొటో క్యాప్షన్, బుధిని (ఎడమ) జీవితంపై సారా జోసెఫ్ ఏళ్ల తరబడి పరిశోధన చేశారు

ఏళ్లు గడిచాయి. సుధీర్ దత్తా అనే వ్యక్తిని కలిసినప్పుడు ఆమె జీవితంలో కాస్త వెలుగు రేఖ కనిపించింది.

పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ఒక బొగ్గు గనిలో దత్తా పని చేశారు. వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు.

ఆ దంపతులు పేదరికంలో బతికారని, తన ఉద్యోగాన్ని తిరిగి పొందేందుకు బుధిని చాలాసార్లు ప్రయత్నించారని జోసెఫ్ చెప్పారు.

ఆమె కథపై పరిశోధిస్తున్న ఇద్దరు జర్నలిస్టులు 1985లో నెహ్రూ మనుమడు, అప్పటి ప్రధానీ అయిన రాజీవ్‌ గాంధీని కలిశారని జోసెఫ్ అన్నారు.

ఎట్టకేలకు రెండు దశాబ్దాల తర్వాత డీవీసీలో తన ఉద్యోగాన్ని బుధిని తిరిగి పొందారు. రిటైర్ అయ్యేవరకు అక్కడే పనిచేశారు.

‘‘కానీ, ఇదంతా అనుభవించడానికి ఆమె చేసిన తప్పేంటి? ఈ ప్రశ్నకు సమాధానం లేదు’’ అని జోసెఫ్ అన్నారు.

వ్యక్తిగతంగా బుధిని ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు. బాధాకర గతాన్ని వదిలేసి శాంతియుత జీవితాన్ని ఆమె గడిపారు.

‘‘మా బామ్మ పట్ల తప్పు జరిగింది. కానీ, జీవితం చివరి దశలో ఆమె ఎవరి మీదా ఎలాంటి కోపాలు లేకుండా ప్రశాంతంగా బతికారు’’ అని ఆమె చనిపోయిన తర్వాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ వార్తా సంస్థతో ఆమె మనువడు చెప్పారు.

విగ్రహ ఏర్పాటుతో ఆమె గతాన్ని మార్చలేమని, అయితే ఆమె కథను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడొచ్చని జోసెఫ్ అన్నారు.

పితృస్వామ్య సంప్రదాయాలు, తీవ్రమైన సామాజిక ఒత్తిళ్ల భారంతో తమ కలలకు దూరం అవుతున్న వేలాది మంది ఇతర భారత మహిళలకు ఆమె కథ అద్ధం పడుతుంది.

దేశ నిర్మాణం, ఆధునీకరణ పేరుతో నిర్వాసితులుగా మారిన లక్షలాది మంది ఇతర భారతీయులకు కూడా ఆమె కథ ప్రాతినిధ్యం వహిస్తుందన జోసెఫ్ చెప్పారు.

‘‘అభివృద్ధి బాధితులందరికీ ఆమె ప్రతీక. ఆమె కథను గుర్తు చేసుకోవడం చారిత్రక, రాజకీయ అవసరం’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)