ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’‌లో పట్టేంత నీటి వినియోగం

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్రిస్ వాలెన్స్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్, బీబీసీ

ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక సరాసరి ఓ మోస్తరు స్విమ్మింగ్ పూల్ నింపడానికి సరిపోయే నీటి వినియోగం ఉంటుందని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది.

ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్‌పై ఆధారపడిన లక్షల కంప్యూటర్‌లను శక్తిమంతం చేయడానికి, చల్లబరచడానికి వినియోగించే నీటిని బట్టి ఈ లెక్కలు వేశారు.

క్రెడిట్ కార్డ్ స్వైప్‌ లావాదేవీతో పోలిస్తే బిట్‌కాయిన్ లావాదేవీ వెనక ఉండే నీటి వినియోగం దాదాపు 60 లక్షల రెట్లు ఎక్కువ అని నెదర్లాండ్స్‌లోని వ్రిజే యూనివర్సిటీ ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన అలెక్స్ డి వ్రీస్ లెక్క గట్టారు.

అనేక ప్రాంతాలు మంచినీటి కొరతతో పోరాడుతున్న సమయంలోనే ఈ విషయం బయటికి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే నీటి కొరతను అనుభవిస్తున్నారు. రాబోయే దశాబ్దాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

"ఇది మధ్య ఆసియాలో జరుగుతోంది, అమెరికాలోనూ జరుగుతోంది ముఖ్యంగా కాలిఫోర్నియా చుట్టూ. వాతావరణ మార్పు మరింత అధ్వానంగా ఉన్నందున ఇది మరింత దిగజారుతుంది" అని బీబీసీకి అలెక్స్ చెప్పారు.

మొత్తంగా 2021లో బిట్‌కాయిన్ దాదాపు 1,600 బిలియన్ లీటర్ల నీటిని వినియోగించిందని సెల్ రిపోర్ట్స్ సస్టైనబిలిటీ జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. అంతేకాదు 2023వ సంవత్సరంలో నీటి వినియోగం 2,200 గిగా లీటర్స్ (జీఎల్) కంటే ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది.

బిట్‌కాయిన్

ఫొటో సోర్స్, GEORGE FREY/GETTY IMAGES

విపరీతమైన దాహం

బిట్‌కాయిన్ చాలా నీటిని ఉపయోగించుకోవడానికి ప్రధాన కారణం, అది అపారమైన కంప్యూటర్ శక్తిపై ఆధారపడుతుంది, దీనికి భారీ మొత్తంలో విద్యుత్ అవసరం.

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం, బిట్‌కాయిన్ పోలండ్ దేశం వాడే విద్యుత్ కంటే కొంచెం తక్కువ వినియోగిస్తుంది.

సాధారణంగా ఇంధనాన్ని అందించే గ్యాస్, బొగ్గు ఆధారిత ప్లాంట్‌లను చల్లబరచడానికి నీటిని పెద్దమొత్తంలో ఉపయోగిస్తుంటారు. జలవిద్యుత్ ప్లాంట్ల కోసం ఏర్పాటుచేసిన రిజర్వాయర్ల నుంచి బాష్పీభవనం (ఎవాపొరేషన్) ద్వారా పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతుంది.

బిట్‌కాయిన్ లావాదేవీలపై ఆధారపడిన లక్షల కంప్యూటర్‌లను చల్లబరచడానికి నీరు ఉపయోగిస్తుంటారు. అయితే, బిట్‌కాయిన్ కోసం ఇంత ఎక్కువ నీటిని ఉపయోగించాల్సిన అవసరం లేదని అలెక్స్ అంటున్నారు.

బిట్‌కాయిన్ 'మైనింగ్' వంటి ప్రక్రియపై ఆధారపడుతుందని, ఇక్కడ డిజిటల్ కరెన్సీ కోసం కంప్యూటర్లు (మైనర్లు) ఒకదానితో ఒకటి పోటీపడి లావాదేవీలను ఆడిట్ చేస్తాయంటున్నారు అలెక్స్.

ఈ పద్దతిలో ఒకే లావాదేవీ శక్తిమంతమైన కంప్యూటర్ల ద్వారా మళ్లీ మళ్లీ ఆడిట్ అవుతుంటుంది.

బిట్‌కాయిన్

ఫొటో సోర్స్, Getty Images

'500 పక్కన 18 సున్నాలు'

"ప్రపంచవ్యాప్తంగా లక్షల పరికరాలున్నాయి, 'గెస్ ది నంబర్' అని నేను భావించే ఈ పెద్ద గేమ్‌లో నిరంతరం ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటుంది" అని అలెక్స్ బీబీసీతో చెప్పారు.

"ఈ మెషీన్లన్నీ కలిపి రోజులో ప్రతి సెకనుకు 500 క్వింటిలియన్ అంచనాలను (గెస్సెస్) నాన్‌స్టాప్‌గా జనరేట్ చేస్తున్నాయి, 500 క్వింటిలియన్ అంటే 500 పక్కన 18 సున్నాలు " అని ఆయన తెలిపారు.

ప్రూఫ్ ఆఫ్ వర్క్ అని పిలిచే ఈ పద్దతికి చాలా విద్యుత్, నీరు అవసరం. అయితే ఈథీరియమ్ క్రిప్టో కరెన్సీ 2022 సెప్టెంబర్‌లో "ప్రూఫ్ ఆఫ్ స్టేక్" అనే కొత్త పద్దతి తీసుకొచ్చింది.

ఈ పద్దతి ద్వారా విద్యుత్ వినియోగాన్ని 99 శాతానికి పైగా తగ్గించవచ్చు.

అయితే అది అంత కచ్చితంగా ఉండకపోవచ్చని యూనివర్శిటీ ఆఫ్ బాత్‌కి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ డావెన్‌పోర్ట్ అంటున్నారు.

"బిట్‌కాయిన్ కంటే ఈథీరియమ్ నిర్వహణ ఎక్కువగా కేంద్రీకృతమవడంతోనే ఇది సాధ్యమైంది" అని జేమ్స్ బీబీసీతో చెప్పారు.

ఏది ఏమైనప్పటికీ, బిట్ కాయిన్‌ నీటి వినియోగంపై వెల్లడైన పరిశోధనా ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు అంటున్నారు.

బిట్‌కాయిన్ మైనింగ్ కోసం మంచినీటిని పెద్దయెత్తున ఉపయోగించడం, ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తుందని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లారిసా యారోవయా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)