World War II : హిమాలయాల్లో కూలిన 600 అమెరికా యుద్ధ విమానాల శకలాలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ఇండియా కరస్పాండెంట్
రెండో ప్రపంచ యుద్ధం భారతదేశం ముంగిటకు చేరిన సమయం అది. భారత్ నుంచి యుద్ధ సామగ్రి చైనాకు చేరకుండా జపాన్ సైన్యం మియన్మార్ మార్గాన్ని మూసివేసింది.
ఆ సమయంలో అతిక్లిష్టమైన, సవాళ్లతో కూడిన వాయు మార్గాన్ని ఎంచుకుంది అమెరికా. ఈ మిలటరీ ఆపరేషన్‌ను ‘ది హంప్’గా పిలుచుకుంటారు పైలెట్లు.
42 నెలలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ ఆపరేషన్ ఫలితంగాా విజయం మిత్ర రాజ్యాలనే వరించినా, హిమాలయ పర్వత ప్రాంతాల గుండా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ప్రయాణించే క్రమంలో సుమారు 600 అమెరికా విమానాలు కూలిపోయాయి.
2009 నుంచి ఇండో అమెరికా బృందాలు ఈ విమాన శకలాలను గుర్తించేందుకు హిమాలయ పర్వత ప్రాంతాల్లో అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు.
80 ఏళ్ల కిందట అక్కడి నేలలో దాగిన చరిత్ర ఆనవాళ్లను సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్వేషణలో లభించిన శకలాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు.
ఈ అన్వేషణతోపాటు రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు భారతదేశాన్ని కమ్మేసిన సమయంలో చోటు చేసుకున్న పరిస్థితులపై బీబీసీ ఇండియా కరస్పాండెంట్ సౌతిక్ బిస్వాస్ ప్రత్యేక కథనం అందిస్తున్నారు.
ఇంతకీ అసలేం జరిగింది? ఈ హంప్ వాయు మార్గం ఎక్కడుంది?

ఫొటో సోర్స్, Getty Images
మిలటరీ ఆపరేషన్‌లో, ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో సుమారు 600 అమెరికా విమానాలు కూలినట్లు అంచనా. దాదాపు 1500 మంది ఫైలెట్లు, ప్రయాణీకులు మరణించారు. వారిలో అమెరికా, చైనా పైలట్లు, రేడియో ఆపరేటర్లు, సైనికులు ఉన్నారు.
భారత్‌లోని అస్సాం, బెంగాల్‌ల నుంచి చైనాలోని కున్మింగ్, చుంకింగ్ (ప్రస్తుతం చాంగ్‌కింగ్) ప్రాంతాల్లో ఉన్న చైనా దళాలకు సాయం చేసే ప్రధాన, కీలక వాయు మార్గంలో ఆ మిలటరీ ఆపరేషన్ కొనసాగింది.
జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు మిత్రరాజ్యాలైన ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, యూఎస్, సోవియట్ యూనియన్, చైనాల మధ్య మొదలైన యుద్ధం ఈశాన్య భారతదేశానికి చేరుకుంది.
జపాన్ దేశ సరిహద్దుల వరకూ చేరుకోవడమే కాకుండా, చైనాను చేరుకునేందుకు వీలుగా ఉన్న ఉత్తర మియన్మార్‌ను మార్గాన్ని జపాన్ మూసివేసింది. ఆ సమయంలో వాయు మార్గమే కీలకంగా మారింది.
ఏప్రిల్ 1942లో అమెరికా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించి, ఆ వాయు మార్గం ద్వారా 6.5 లక్షల టన్నుల యుద్ధ సామగ్రిని రవాణా చేసింది. చివరికి మిత్రరాజ్యాలు రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించాయి.
పైలట్లు ఈ ప్రమాదకరమైన విమాన మార్గాన్ని ‘ది హంప్’ అని పిలిచేవారు.
తూర్పు హిమాలయాల పర్వతాల గుండా వెళ్లే ఈ మార్గం నేడు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది.

ఫొటో సోర్స్, HUMP MUSEUM
పర్వతారోహకులు, విద్యార్థులు, వైద్యులు, ఫోరెన్సిక్ ఆర్కియాలజిస్టులు, రెస్క్యూ నిపుణులతో కూడిన ఇండో అమెరికన్ బృందాలు దట్టమైన అడవుల మధ్య ప్రయాణం సాగించి, మియన్మార్, చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ దగ్గర 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రదేశాల్లో అన్వేషణ సాగిస్తున్నాయి.
14 ఏళ్లుగా సాగుతున్న ఆ అన్వేషణలో యూఎస్ డిఫెన్స్ పీఓడబ్ల్యూ/ఎంఐఏ అకౌంటింగ్ ఏజెన్సీ (డీపీఏఏ) సభ్యులు కూడా ఉన్నారు. వీరు మిలటరీ ఆపరేషన్లలో కనిపించకుండా పోయిన సైనికుల అచూకీ తెలుసుకునేందుకు పనిచేస్తారు.
ఈ బృందాలు స్థానిక గిరిజనుల సాయంతో సుదీర్ఘంగా సాగిన క్లిష్టమైన అన్వేషణలో క్రాష్ సైట్ (విమానాలు కూలిన ప్రదేశాలు)లను చేరుకుని దాదాపు 20 విమానాల శకలాలు, సైనికుల అవశేషాలను గుర్తించారు.
ఈ ప్రయాణాలు చాలా సవాళ్లతో కూడుకున్నవి. ఒక క్రాష్ సైట్‌ను చేరుకోవడానికి, రెండో రోజుల రోడ్డు ప్రయాణం, ఆరురోజుల ట్రెక్కింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది.
మరో సందర్భంలో అనుకోకుండా మొదలైన మంచు తుపాను వల్ల ఒక మిషన్ కోసం వెళ్లిన బృందం పర్వతాల్లోనే మూడు వారాలపాటు చిక్కుకుపోయారు.
ఈ సాహస యాత్రలో పాల్గొన్న ఫోరెన్సిక్ మానవ శాస్త్రవేత్త విలియమ్ బెల్చర్ మాట్లాడుతూ, “చదునైన మైదానాల నుంచి మొదలుకుని పర్వతాల వరకు ఉన్న ఈ భూభాగమంతా చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. వర్షాకాలం ముగిసే సమయం, శీతాకాలం ప్రారంభమయ్యే మధ్య కాలంలోనే ఈ పనిని చేయాల్సి ఉంటుంది” అని చెప్పారు.
గుర్తించినవి: శిథిలాల్లో ఆక్సీజన్ ట్యాంకులు, మెషిన్ గన్లు, విమాన శకలాలు, పుర్రెలు, ఎముకలు, షూలు, వాచ్‌లతోపాటు చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ శాంపిళ్లను సేకరించారు. ఒక ఎయిర్‌మెన్‌కు చెందిన పేరున్న బ్రేస్‌లెట్, విమాన శకలాలలో దొరికిన మరికొన్ని వస్తువులను స్థానికుల నుంచి సేకరించారు.
కొన్ని క్రాష్ సైట్‌లను స్థానికులు చెత్తను వేసే ప్రాంతాలుగా మార్చుకున్నారు. అల్యూమినియం భాగాలను స్క్రాప్‌గా విక్రయించేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో హిమాలయాల దిగువ ప్రాంతాన ఉన్న పాసిఘాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ది హంప్ మ్యూజియం’లో ఈ సేకరించిన విమాన శకలాలు, ఆపరేషన్‌కు సంబంధించిన ఇతర వస్తువులను ప్రదర్శనకు పెట్టారు.

ఫొటో సోర్స్, WILLIAM BELCHER
నవంబర్ 29వ తేదీన భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ ఈ మ్యూజియాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంలో ఎరిక్ మాట్లాడుతూ, “ఈ మ్యూజియం కేవలం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, యుద్ధంలో పాల్గొన్న సైనిక కుటుంబాలకు మాత్రమే కాదు, భారతదేశానికి, ఈ ప్రపంచానికి అరుదైన బహుమతి” అన్నారు.
మ్యూజియం డైరెక్టర్ ఒకెన్ తాయెంగ్ మాట్లాడుతూ, “జ్ఞాపకాలను గౌరవించుకునే ఈ మిషన్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థానికులకు కూడా ఇది తగిన గుర్తింపు” అన్నారు.
ఈ మిలిటరీ ఆపరేషన్‌లో పాల్గొన్న అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్ మేజర్ జనరల్ విలియం టర్నర్, సీ-46 విమానాన్ని ప్రమాదకరమైన వైమానిక మార్గంలో, ఏటవాలు ప్రాంతాలు, విశాలమైన లోయలు, ఇరుకైన నదీ ప్రవాహాలు, గ్రామాల మీదుగా నడిపిన తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
విమానాలను తరచూ యువ, కొత్తగా శిక్షణ పొందిన పైలట్లే నడిపేవారు. ఆ మార్గంలో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతుంటుందని టర్నర్ రాశారు.
“ప్రతి మైలు దూరానికి, ప్రతి నిమిషానికి వాతావరణం మారిపోతుంటుంది. భారతదేశ భూభాగంలో వాతావారణం ఒకలా, పశ్చిమ చైనాలోకి ప్రవేశించే సమయానికి మరోలా ఉంటుందని చెప్పారు.
భారీ లోడ్‌తో వెళ్లే కార్గో విమానాలు గాలుల కారణంగా ఒకేసారి 5 వేల అడుగుల కిందకు దిగి, మళ్లీ అదే వేగంతో పైకి ఎగిరేవని, ఒక విమానం 25 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు గాలుల కారణంగా ఒక్కసారిగా తిరగబడిందని టర్నర్ రాశారు.
వసంత రుతువులో ఉరుములతో కూడిన గాలివానలు, వడగండ్ల వానలు పడే సమయంలో నావిగేషన్ సాధనాలతో విమానాలను నియంత్రించడం క్లిష్టమైన, ప్రధానమైన సవాలుగా మారేదని ఆయన రాశారు.
దీనిపై స్టోరీ రాసేందుకు లైఫ్ మ్యాగజైన్ జర్నలిస్ట్ థియోడోర్ వైట్ ఈ మార్గంలో ఐదు సార్లు ప్రయాణించారు.
ఆయన రాసిన కథనం ప్రకారం.. ఓసారి చైనా సైనికులను తీసుకెళ్తున్న విమానం మంచు కారణంగా ఇంజిన్ ఫ్రీజ్ కావడంతో విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయాలని పైలట్ నిర్ణయించుకున్నాడు.
ఎవరి వద్దా పారాచ్యూట్‌లు లేకపోవడంతో, కో పైలట్, రేడియో ఆపరేటర్లు సైనికులు విమానం నుంచి సురక్షితంగా బయటపడేందుకు సాయపడ్డారు. విమానం క్రాష్ ల్యాండింగ్ అయినా, అందరూ క్షేమంగా బయటపడ్డారు. అక్కడి స్థానికులు వారిని గుర్తించేవరకు 15 రోజులపాటు ఆ ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. (ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. గాయపడిన వారికి స్థానికులు చికిత్స అందించారు. )

ఫొటో సోర్స్, Getty Images
‘‘పర్వతాల మధ్య ప్రయాణం సవాల్‌తో కూడుకున్నది. పైలట్లు తమకు 50 మైళ్ల దూరంలో ఉన్న పర్వతాలను గుర్తించడం సాధ్యంకాని సందర్భాల్లో చాలా విమానాలు వాటిని ఢీ కొట్టి, పేలిపోయాయి’’ అని టర్నర్ గుర్తుచేసుకున్నారు.
ఒక్క తుపాను వల్ల తొమ్మిది విమానాలు కూలిపోయి, 27 మంది విమాన సిబ్బంది, ప్రయాణీకులు మరణించిన ఘటనను టర్నర్ గుర్తు చేసుకున్నారు.
ఆ దట్టమైన మేఘాలు, అల్లకల్లోలంగా ఉండే మార్గాన్ని అంతకుముందు, ఆ తరువాత కూడా మరెక్కడా చూడలేదని ఆయన రాశారు.
ఈ ఆపరేషన్‌లో కనిపించకుండా పోయిన సైనికులు బతికే ఉన్నారని వారి తల్లిదండ్రులు నమ్ముతున్నారు. వారి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
“హంప్ సైనికులు నిరంతరం పగలూ రాత్రీ తేడా లేకుండా జపాన్ సైనికులకు వ్యతిరేకంగా అడవులు, పర్వతాలు, ఎండా, వానా అన్న తేడా లేకుండా పోరాటం చేశారు. విమానాలే వారి ప్రపంచం. విమానాలతోనే వారు మమేకమయ్యారు.” అని వైట్ గుర్తుచేసుకున్నారు.
ప్రపంచ యుద్ధం భారత ముంగిటకు చేరిన సమయంలో అమలుచేసిన ఈ ఆపరేషన్ డేర్‌డెవిల్ ఫీట్.
“హంప్ ఆపరేషన్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు, పర్వతాలు రెండో ప్రపంచ యుద్ధంలో భాగమయ్యారు” అని తయాంగ్ అన్నారు. కాకపోతే ఇది చాలా తక్కువమందికి తెలిసిన కథ.
ఇవి కూడా చదవండి:
- చైనా వెల్లుల్లి అంటే అమెరికా ఎందుకు భయపడుతోంది?
- ప్రతిపాదించే ‘శాలరీ రేంజ్’ను ఎలా అర్థం చేసుకోవాలి?
- నిమిషా ప్రియ: భారత నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష, బ్లడ్ మనీతో బయటపడగలరా?
- తెలంగాణ విజయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం ఎంత?
- మిగ్జాం: ప్రపంచంలో అత్యంత తీవ్రమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














