నిమిషా ప్రియ: భారత నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష, బ్లడ్ మనీతో బయటపడగలరా?

- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
- నుంచి, కొచ్చి
జీవితం బాగుపడుతుందనే కోటి ఆశలతో నిమిషా ప్రియ 2008లో కేరళ నుంచి యెమెన్‌కు వెళ్లారు. అప్పటికి ఆమె వయసు కేవలం 19 ఏళ్లే.
యెమెన్ రాజధాని సనాలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. మనం కష్టాలన్నీ తీరిపోయే రోజులు వచ్చాయని నిమిషా ప్రియ తల్లికి చెప్పారు.
కానీ, 15 ఏళ్ల తర్వాత అవే కలలు నిమిషాకు, ఆమె కుటుంబానికి ఒక పీడకలలా మారాయి. స్థానిక వ్యక్తి తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో 34 ఏళ్ల నిమిషా ప్రియకు మరణశిక్ష పడింది.
సనా కేంద్ర కారాగారంలో నిమిషా ప్రియ ప్రస్తుతం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు.
మరణశిక్షపై ఆమె పెట్టుకున్న అభ్యర్థనను యెమెన్ సుప్రీం జ్యూడిషియల్ కౌన్సిల్ నవంబర్ 13న తిరస్కరించింది.
కానీ, షరియా చట్టాన్ని యెమెన్ అనుసరిస్తుండటంతో, మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆమెకు చివరి ఆప్షన్‌గా బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ(ఆర్థిక సాయం) అందించడం ద్వారా మరణశిక్షను తప్పించుకోవచ్చని చెప్పింది.
ప్రస్తుతం ఆమె కుటుంబం, క్యాంపెయినర్లు కోర్టు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుని, బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్షమాభిక్ష ద్వారా మాత్రమే నిమిషా ప్రియా మరణశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది.
‘నా కూతురికి బదులు నాకు ఉరిశిక్ష వేయండి’
కూతురు ఎదుర్కొంటోన్న శిక్ష గురించి చెబుతూ నిమిషా ప్రియ తల్లి 57 ఏళ్ల ప్రేమ కుమారి కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘నేను యెమెన్ వెళ్తాను. వారిని క్షమాభిక్ష కోరుతాను. నా కూతురికి బదులు, నాకు ఉరిశిక్ష వేయమని చెబుతాను. దయచేసి ఆమెను విడిచిపెట్టమని కోరతాను’’ అని ప్రేమ కుమారి చెప్పారు. ప్రేమ కుమారి ప్రస్తుతం కొచ్చిలో నివసిస్తున్నారు.
కానీ, యెమెన్‌కు వెళ్లడం అంత తేలికైన విషయం కాదు. 2017లో యెమెన్‌కు వెళ్లకుండా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరైనా వెళ్లాలనుకుంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
నిమిషా తల్లికి, ఆమె 11 ఏళ్ల కుమార్తె మిషాల్‌కు సనా వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ లాబీ గ్రూప్ సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ దిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. వారితో పాటు ఇద్దరు కౌన్సిల్ సభ్యులకు కూడా అనుమతివ్వాలని కోరింది.
కానీ, గత శుక్రవారం భారత అధికారులు వారి అభ్యర్థనను తిరస్కరించారు. యెమెన్‌లో భారత రాయబార కార్యాలయం లేకపోవడంతో వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడికి వెళ్లేందుకు అనుమతిని నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
యెమెన్‌లో రాజకీయ పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఆ దేశ రాజధాని సనా ప్రస్తుతం అధికార ప్రభుత్వంతో దీర్ఘకాలంగా అంతర్యుద్ధం చేస్తోన్న హౌతీ తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది.
హౌతీలను భారత ప్రభుత్వం గుర్తించకపోవడంతో, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అడెన్‌కు వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 12 నుంచి 14 గంటల పాటు ప్రయాణించి సనాకు చేరుకోవాలి.
సేవ్ నిమిషా కౌన్సిల్ మరోసారి దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె తల్లిని, కూతుర్ని యెమెన్‌కు పంపించేలా అనుమతివ్వాలని మరోసారి కోరింది.
‘‘విదేశీ గడ్డపై నా కూతురు చనిపోవాలని అనుకోవడం లేదు’’ అని ప్రేమ కుమారి చెప్పారు.

‘‘నిమిషాకు జరిగింది దురదృష్టకరం. ఆమె ఆ కష్టాన్ని అనుభవించాల్సింది కాదు’’ అని సేవ్ నిమిషా కౌన్సిల్ సభ్యులు, సామాజిక కార్యకర్త బాబు జాన్ అన్నారు.
ఉజ్వల భవిష్యత్ కోసం నిమిషా చూసేదని, కానీ యెమెన్‌లో అంతర్యుద్ధం రావడంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.
2011లో ఆమె స్వదేశానికి వచ్చి టామీ థామస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జంటగా యెమెన్‌కు వెళ్లారు. ఆయన అక్కడే ఎలక్ట్రిషియన్ అసిస్టెంట్‌గా పనిలో చేరారు. కానీ, జీతం పెద్దగా వచ్చేది కాదు.
2012 డిసెంబర్ తర్వాత, వారికి కూతురు పుట్టినప్పుడు అక్కడ జీవించడం కష్టమైంది. దీంతో 2014లో టామీ థామస్ కూతురితో కలిసి తిరిగి కొచ్చికి వచ్చేశారు. ఇక్కడే ఆటోరిక్షా నడుపుతున్నారు.
అరకొర జీతమొచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సొంతంగా క్లినిక్ పెట్టాలని 2014లో నిమిషా అనుకున్నారు. యెమెన్‌లో క్లినిక్ పెట్టాలంటే భాగస్వామిగా ఒక స్థానికుడు ఉండాలి. ఆ సమయంలో తలాల్ అబ్దో మహదీ క్లినిక్‌లో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చారు.
ఆయన దగ్గర్లో ఒక చేనేత దుకాణం నడిపేవారు. 2015 జనవరిలో తన కూతురి బాప్టిజం కోసం ఇంటికి వచ్చినప్పుడు, ఆమెతో పాటు సెలవులపై మహదీ కూడా కొచ్చికి వచ్చారు.
స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి రూ.50 లక్షలు అప్పు తీసుకున్నారు. నెల తర్వాత నిమిషా క్లినిక్ ప్రారంభించేందుకు యెమెన్‌కు తిరిగి వెళ్లారు. యెమెన్‌కు వెళ్లగానే క్లినిక్ ప్రారంభించేందుకు పేపర్‌వర్క్ ప్రారంభించారు. దీంతో భర్త, కూతుర్ని అక్కడికి తీసుకెళ్లవచ్చు అనుకున్నారు. కానీ, మార్చిలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొనడంతో, వారు అక్కడికి వెళ్లలేకపోయారు.
వచ్చే రెండు నెలల్లో, భారత్ సుమారు 4,600 మంది పౌరులను, వెయ్యి మంది వరకు విదేశీ పౌరులను యెమెన్ నుంచి సురక్షితంగా తరలించింది. నిమిషా, మరికొంతమంది మాత్రం యెమెన్‌ను వీడలేదు.
‘‘క్లినిక్ కోసం మేం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాం. అందుకే, ఆమె దాన్ని విడిచిపెట్టి, రాలేకపోయింది’’ అని ఆమె భర్త థామస్ చెప్పారు.
యెమెన్‌లో నిమిషా ఏర్పాటు చేసిన క్లినిక్‌ను థామస్ తన ఫోన్‌లో చూపించారు. ఏఐ అమన్ మెడికల్ క్లినిక్ అనే పేరు, ఆ క్లినిక్‌లో 14 బెడ్లు, రిసెప్షన్ ఏరియాలో కొత్త నీలం రంగు కుర్చీలు, ల్యాబ్ ఎక్విప్‌మెంట్ పక్కన తెల్లకోటు వేసుకున్న ఒక వ్యక్తి, వెయిటింగ్ రూమ్‌లో కొత్త సోనీ టీవీ, ఫార్మసీలో మహదీ కూర్చుని ఉండటాన్ని ఆ ఫోటోలలో చూడొచ్చు.

క్లినిక్ మంచిగా నడుస్తుండేది. కానీ, మహదీ ప్రవర్తన ఏమీ బాగుండటం లేదని నిమిషా తమకు చెప్పేదన్నారు.
‘‘కొచ్చిలో నిమిషా ఇంటికి వచ్చిన తర్వాత మహదీ ఆమె పెళ్లి ఫోటోలలో ఒకదాన్ని దొంగలించారు. దాన్ని మార్చి నిమిషా ఆయనను పెళ్లి చేసుకున్నదని సృష్టించారు’’ అని దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆమెను శారీరకంగా హింసించేవాడు మహదీ. క్లినిక్‌లో వచ్చే డబ్బులన్నింటిన్నీ అతను తీసేసుకునేవాడని పిటిషన్‌లో చెప్పారు.
వారి మధ్యన సంబంధాలు చెడినప్పుడు, క్లినిక్‌లో వచ్చే డబ్బుల విషయంలో మహదీని నిమిషా ప్రశ్నించడం మొదలు పెట్టారు.
‘‘చాలాసార్లు నిమిషాను మహదీ గన్‌తో బెదిరించే వాడు. ఆమె దేశం విడిచి వెళ్లకుండా పాస్‌పోర్టు కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై చర్యలు తీసుకోవడానికి బదులు, ఆమెనే ఆరు రోజుల పాటు జైలులో ఉంచారు’’ అని పిటిషన్‌లో చెప్పారు.

హత్య, అరెస్ట్
తొలుత ఈ హత్య గురించి 2017లో టీవీ న్యూస్ ఛానళ్ల ద్వారా తెలుసుకున్నట్లు థామస్ చెప్పారు.
‘‘మలయాళీ నర్సు నిమిషా ప్రియ భర్తను హత్య చేసిన కేసులో యెమెన్‌లో అరెస్ట్ అయ్యారు. ఆయన శరీరాన్ని ఆమె ముక్కలు ముక్కలు చేశారు’’ అని హెడ్‌లైన్లలో వచ్చిందని థామస్ తెలిపారు.
సౌదీ అరేబియాతో ఉన్న యెమెన్ సరిహద్దుకు దగ్గర్లో నిమిషా ప్రియ అరెస్ట్ అయ్యారు. ముక్కలు చేసిన మహదీ మృతదేహం నెల పైబడిన తర్వాత నీళ్ల ట్యాంకులో దొరికింది.
‘‘నిమిషా ప్రియ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ వ్యక్తి ఆమెకెలా భర్త అవుతాడు?’’ అని వారి పెళ్లి ఆల్బమ్ చూపిస్తూ థామస్ ప్రశ్నించారు.
అరెస్ట్ తర్వాత కొన్ని రోజులకు నిమిషా ప్రియ తన భర్తకు కాల్ చేశారు. ఇద్దరూ పరిస్థితులను తలుచుకుని రోధించినట్లు థామస్ చెప్పారు.
‘‘నిమిషా ఉద్దేశ్యపూర్వకంగా మహదీని చంపలేదు. ఆమె కూడా బాధితురాలే’’ అని నిమిషా తల్లి తరఫున వాదిస్తోన్న వలసదారుల హక్కుల కార్యకర్త, సుప్రీంకోర్టు న్యాయవాది కేఆర్ సుభాష్ చంద్ర, కౌన్సిల్ దిల్లీ హైకోర్టులో తమ వాదనలను వినిపించారు.
‘‘మహదీ ఆమె పాస్‌పోర్టును లాక్కున్నాడు. ఆయన దగ్గర్నుంచి పాస్‌పోర్టును తిరిగి తీసుకోవాలని చాలా ప్రయత్నించింది. అందుకే, మహదీకి మత్తుమందు ఇచ్చింది. కానీ, అది ఓవర్‌డోస్ అయి, అతను మరణించాడు’’ అని ఆయన తెలిపారు.
గల్ఫ్ దేశాల్లో పనిచేసే నైపుణ్యాలు లేని, తక్కువ నైపుణ్యాలున్న భారత కార్మికులపై దోపిడీ జరుగుతోంది. చాలా దేశాల్లో కఫాలా అంటే కార్మికుల పాస్‌పోర్టు, డాక్యుమెంట్లను కంపెనీలు తమ వద్ద ఉంచుకునే విధానం ఉందని కార్యకర్తలు చెప్పారు. వలస కార్మికులపై వారిని నియమించున్న వారికి నియంత్రణ ఉండేలా ఈ విధానం ఉంది.
ఇది బానిసత్వానికి మరో పేరని, వలస కార్మికులను అన్ని రకాలు వేధించేందుకు ఇది సహకరిస్తుందని అంతర్జాతీయ కార్మిక సంఘం చెబుతోంది.
ఇళ్లలో ఉన్న కటిక పేదరికం నుంచి తప్పించుకునేందుకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో పని చేసేందుకు వెళ్లిన భారతీయ మహిళలు చాలా మంది కఫాలా విధానంలో బాధితులని చంద్రన్ చెప్పారు.

‘‘ఆమెకు మెరుగైన న్యాయం జరగలేదు. ఆమె తరఫున వాదించేందుకు జూనియర్ లాయర్‌ను కోర్టు నియమించింది. ఆ లాయర్‌తో ఆమె అసలు మాట్లాడలేకపోయింది. ఎందుకంటే, ఆమెకు అరబిక్ రాదు. ఆమెకు ఇంటర్‌ప్రిటెర్‌ను నియమించలేదు. ఏ డాక్యుమెంట్లపై సంతకం చేస్తుందో కూడా ఆమెకు తెలియదు’’ అని చంద్రన్ చెప్పారు.
దిల్లీలో ఈ కేసుపై యెమెన్ అథారిటీలు స్పందించలేదు. ‘‘నిమిషాను రక్షించడంలో భారత ప్రభుత్వ సాయం చాలా అవసరం. మహదీ కుటుంబాన్ని క్షమాభిక్ష కోరడమే చివరి ఆప్షన్. వారితో పరిహారం చెల్లింపు విషయంలో చర్చలు జరిపి, క్షమాభిక్షను కోరాల్సి ఉంది’’ అని సేవ్ నిమిషా కౌన్సిల్ వైస్ చైర్, సామాజిక కార్యకర్త, న్యాయవాది దీపా జోసెఫ్ అన్నారు.
కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇప్పటికే నిమిషాను కాపాడేందుకు కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు.
‘‘నిమిషాను కాపాడతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. బాధితుల కుటుంబం బ్లడ్ మనీకి(పరిహారానికి) ఒప్పుకుంటుందని ఆశిస్తున్నాం’’ అని జోసెఫ్ చెప్పారు.
ఆమె తీవ్రమైన నేరం చేసినప్పటికీ, నిమిషా తల్లి, కూతురు కోసం ఆమెను రక్షించాలనుకుంటున్నామని అన్నారు.
కూతుర్ని రక్షించుకునేందుకు యెమెన్‌కు వెళ్లి, మహదీ కుటుంబంతో మాట్లాడతానని ప్రేమ కుమారి ఆశిస్తున్నారు.
యెమెన్ సుప్రీం కౌన్సిల్ ఆమె అప్పీల్‌ను తిరస్కరించడానికి కొన్ని రోజుల ముందు థామస్ ఆమెతో మాట్లాడారు. ఆ సమయంలో నిమిషా తన అప్పీల్‌ను స్వీకరిస్తారని ఆశించారు.
‘‘మీ ధైర్యాన్ని కోల్పోకండి. నాకోసం ప్రార్థించండి’’ అని ఆమె చెప్పారని థామస్ తెలిపారు.
కానీ, కోర్టు నిర్ణయం తర్వాత మాట్లాడిన నిమిషా చాలా ఆందోళన వ్యక్తం చేసినట్లు థామస్ తెలిపారు.
‘‘ఆమెను రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిమిషాకు తెలియజేశాను. ఆమెను ధైర్యంగా ఉంచేందుకు ప్రయత్నించాను. కానీ, ఆమె ఢీలా పడిపోయింది. నేనిప్పుడెలా ఆశతో ఉండగలను?’’ అని థామస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- డీప్ ఫేక్ ఎంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటే...
- 'భగ్వా లవ్ ట్రాప్': ఇది 'లవ్ జిహాద్'కు పోటీనా... హిందూ యువకులు ఈ పేరుతో ముస్లిం యువతులను ట్రాప్ చేశారా?
- బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..
- ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ను ఎగ్జిట్ పోల్స్ ఎలా పట్టిస్తాయి, ఒక్కోసారి ఎందుకు ఫెయిల్ అవుతాయి?
- తెలంగాణ: ఓటమి పాలైన మంత్రులు ఎవరు? ఎంత తేడాతో ఓడిపోయారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















