మరణ శిక్షలో వాడే విషానికి కొరత, రహస్యంగా వెతుకుతున్న అమెరికా

- రచయిత, అన్నా మీసెల్, మెలానీ స్టీవర్ట్ స్మిత్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ప్రాణాంతక ఇంజెక్షన్లలో వాడే డ్రగ్స్ సరఫరా ఆగిపోయినప్పుడు, అమెరికాలో జైళ్లకు గార్డులుగా వ్యవహరిస్తున్న అధికారులు ప్రత్యామ్నాయం కోసం తీవ్రంగా ప్రయత్నించేవారు.
మరణ శిక్షల్లో వాడే ప్రాణాంతక డ్రగ్స్ కోసం సీక్రెట్‌గా వెతుకులాట చేపట్టేవారు.
రాండీ వర్క్‌మాన్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా మరణ శిక్ష అమలు విధులను నిర్వర్తించారు.
ఓక్లహమా రాష్ట్రంలో సీనియర్ కరెక్షన్స్ అధికారిగా ఖైదీలను తరలించడం, మరణ శిక్ష అమలు చేసే వారిని ఎంపిక చేయడం, ప్రాణాంతక ఇంజెక్షన్ డ్రగ్స్ వనరులను సంపాదించడంతో సహా ఉన్న పలు విభాగాల్లో రాండీ వర్క్‌మాన్ పనిచేశారు.
ఈయన 32 మరణ శిక్షల అమలులో స్వయంగా పాల్గొన్నారు. 2010లో రాండీ వర్క్‌మాన్ పని ఊహించని మలుపు తిరిగింది.
మరణ శిక్ష అమలు కోసం వాడే సోడియం థియోపెంటల్ డ్రగ్ ఉత్పత్తిని దాని తయారీ కంపెనీ అయిన హాస్పిరా నిలిపివేసింది.
ఈ డ్రగ్ తయారీలో వాడే ముడి సరుకుల విషయంలో సమస్యలు తలెత్తడంతో వీటి సరఫరాను ఆపివేసింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికాలో మరణ శిక్ష అమలులో ఎక్కువగా వాడే డ్రగ్స్‌లో మూడింట్లో ఇది ఒకటి.
ఈ డ్రగ్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి స్పృహ కోల్పోయి, నాడీ వ్యవస్థ పనిచేయకుండా పోతుంది. అలా మరణ శిక్ష పడిన వ్యక్తులు ప్రాణాలు కోల్పోతారు.
మరణ శిక్షల అమలులో వాడే అతి పాత విషం కూడా ఇదే. 2011లో ఈ డ్రగ్ ఉత్పత్తిని ఇటలీలో చేపట్టాలని హాస్పిరా భావించింది.
కానీ, ఇటలీలో మరణ శిక్ష చట్టవిరుద్ధమైనందున ఈ డ్రగ్ ఉత్పత్తికి ఆ దేశం ఒప్పుకోలేదు.
పైగా మరణ శిక్షలలో దీన్ని వాడబోమని కంపెనీ చెప్పకపోవడంతో తయారీ అనుమతులకు నిరాకరించింది ఇటలీ.
దీంతో, ప్రత్యామ్నాయ వనరుల ద్వారా ఈ డ్రగ్‌ను పొందేందుకు వర్క్‌మాన్ ప్రయత్నించారు. కానీ, ఇదంతా తేలికగా జరగలేదు.
‘‘నిన్ను ప్రపంచమంతా పిచ్చివాడిగా చూస్తుందని నీకనిపించినప్పుడు నీవు ఒంటరిగా ఫీలవుతావు.’’ అని వర్క్‌మాన్ అన్నారు.

ఒకానొక సమయంలో, వర్క్‌మాన్ ఈ డ్రగ్ కోసం భారత్‌లో ఒక ఫార్మా కంపెనీతో కూడా సంప్రదింపులు జరిపారు.
ఎలాంటి ఆటంకం లేకుండా డ్రగ్‌ను సరఫరా చేసేందుకు ఆ ఫార్మా కంపెనీ ఆసక్తి చూపినప్పటికీ, అమెరికాలో వాడేందుకు ఆ కంపెనీకి ఆమోదం లేకపోవడంతో వర్క్‌మాన్ తన ఆలోచనను విరమించుకున్నారు.
అరిజోనా రాష్ట్రంలో కార్సన్ మెక్‌విలియమ్స్ అనే జైళ్ల అధికారి కూడా ఈ ప్రాణాంతకమైన డ్రగ్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
ముందటి షిప్‌మెంట్లకు చెందిన ఏమైనా డ్రగ్స్ మిగిలి ఉన్నాయా అని తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన ప్రతి ఫార్మాస్యూటికల్ కంపెనీకి మెక్‌విలియమ్స్ కాల్ చేసి కనుక్కున్నారు.
‘‘బహుశా నాకు తెలిసిన ప్రతి డ్రగ్ కంపెనీకి నేను కాల్ చేసిన కనుక్కున్నాను. వీరిలో చాలా మంది కనీసం నాతో మాట్లాడలేదు’’ అని చెప్పారు.
ఎవరూ ఏం చేయలేనప్పుడు, భారత్‌లోని సరఫరాదారుని తాను సంప్రదించానని చెప్పారు.
కొన్ని షిప్‌మెంట్లను తొలుత ఆర్డర్ చేసినట్లు కార్సన్ చెప్పారు. ఈ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేయడం చాలా ముఖ్యమని కార్సన్ మెక్‌విలియమ్స్ అన్నారు.
ఎందుకంటే, అరిజోనాలో శిక్ష అమలుకు వారెంటీ జారీ చేసినప్పుడు, ఈ వారెంట్ కాలం చెల్లకముందే 31 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.
లేదంటే, మళ్లీ మొదట్నుంచి ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.
‘‘గడియారం ముళ్లు టక్ టక్ మని కొట్టుకుంటూ తిరుగుతున్నప్పుడు, ఆ పని పూర్తయ్యేంత వరకు మీరు ఒక తుపాకీ కింద ఉన్నట్టే. అందుకే మీరు చాలా చురుకుగా, సృజనాత్మకంగా పని చేయాలి’’ అని చెప్పారు.
కానీ, అమెరికాకి డ్రగ్స్ సరఫరా అందినప్పుడు, ఫెడరల్ అధికారులు వాటిని జప్తు చేశారు. దీంతో మెక్‌విలియమ్స్ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు.
అత్యంత ముఖ్యమైన, రహస్య మిషన్
ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో సోడియం థియోపెంటల్‌ను సరఫరా చేసే ఒక ఫార్మాసిస్ట్‌తో మెక్‌విలియమ్స్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఈ కెమికల్ సరఫరా చట్టబద్ధమైనదే.
కానీ, అది అంత పెద్ద డ్రగ్ కంపెనీ కాదు. వాస్తవంగా చెప్పాలంటే, ఈ కంపెనీ అడ్రస్ నుంచి వ్యాపారాలు చేపట్టే మేధి అలావి, లండన్‌లోని అక్టన్‌లో ఒక డ్రైవింగ్ స్కూల్‌ని కూడా నడుపుతున్నారు.
కార్డ్‌బోర్డు బాక్స్‌లో వైట్ ఫౌడర్ ఉన్న వేలాది సీసాలను పార్శిల్ చేసి, అరిజోనా, ఫ్లోరెన్స్‌లోని కార్సన్ మెక్‌విలియమ్స్ ఆఫీసుకు పంపారు.
ఈ విషయం దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ల అధికారులకు తెలిసింది.
వెంటనే జైళ్ల అధికారుల మధ్యలో ఈమెయిళ్ల సంభాషణ సాగింది.
బ్రిటన్ నుంచి ఈ డ్రగ్స్ ఆర్డర్ పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని వారు కూడా కోరారు.
‘‘ఇది నీకు అత్యంత రహస్య, ముఖ్యమైన మిషన్ కావొచ్చు’’ అని సాన్ క్వెంటిన్ కరెక్షనల్ డిపార్ట్‌మెంట్ స్కాట్, ఆయన అధికారి టోనీకి పంపిన ఈమెయిల్‌లో ఉంది.
చివరకు మెక్‌విలియమ్స్ కార్యాలయంలో దీనిని అందుకున్నారు.
ప్రాణాలు తీసే ఈ డ్రగ్స్ కోసం వారి వెతుకులాటను విజయవంతంగా పూర్తి చేశామని
మెక్‌విలియన్స్ భావించారు.
కానీ, లండన్ నుంచి వచ్చిన చాలా షిప్‌మెంట్లను లైసెన్సింగ్ కారణాల చేత అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జప్తు చేసింది.
కానీ, వీటిలో కొన్ని సీసాలను అప్పటికే అరిజోనా, జార్జియాలో మరణ శిక్షలను అమలుకు ఉపయోగించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
2011లో బ్రిటన్ మరణ శిక్షలో వాడే ఈ డ్రగ్స్‌ను ఎగుమతి చేయడాన్ని చట్టవిరుద్ధం చేసింది.
బ్రిటన్ నుంచి సోడియం థియోపెంటల్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో కొన్నేళ్లుగా ఈ డ్రగ్స్ వెతుకులాట కొనసాగిస్తూనే ఉన్నారు.
కొన్ని రాష్ట్రాలు మరణ శిక్షల్లో వివిధ డ్రగ్స్ కాంబినేషన్లను వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వివాదాస్పదంగా కూడా మారింది.
గత దశాబ్ద కాలంగా ప్రాణాంతక ఇంజెక్షన్ ప్రక్రియలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న ఎమోరి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ జాయిల్ జివోట్, మరణ శిక్షల అమలులో డ్రగ్స్‌ను, ఇతర మెడికల్ టూల్స్‌ను వాడొద్దని అంటున్నారు.
‘‘మరణ శిక్షను దృష్టిలో పెట్టుకుని ఏ ఫార్మా కంపెనీ కూడా మెడిసిన్లను తయారు చేయదు. మనుషుల్ని చంపేందుకు కరెక్షన్స్ డిపార్ట్‌మెంట్ ఈ మెడిసిన్‌ను వాడితే, ఆ ప్రొడక్ట్‌ను దుర్వినియోగం చేసినట్లే’’ అని ఆయన అన్నారు.
‘‘ఇతర చికిత్సా విధానాలకు వాడే ఈ డ్రగ్స్ ఉత్పత్తిని నిలిపివేసే బదులు, ఈ డ్రగ్స్‌ను ఎలా వాడాలో ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది’’ అని జాయిల్ జివోట్ సూచించారు.
మరణ శిక్షలను సమర్థించే మెక్‌విలియమ్స్‌తో పాటు మరికొందరు కొత్త డ్రగ్ కాంబినేషన్లు ఒరిజినల్ ఫార్ములాతో పోలిస్తే భిన్నమైన ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు.
‘‘ఒరిజినల్ డ్రగ్ బాగా పనిచేస్తుందని అందరికీ తెలుసు. దానిలో ఎలాంటి సమస్యలు లేవు. ఇతర డ్రగ్స్‌లో కొన్ని సమర్థవంతమైనవి కావు’’ అని మెక్‌విలియమ్స్ చెప్పారు.
అరిజోనాలో ఈ డ్రగ్స్ సరఫరాలో సమస్యలున్న కారణంగా దోషిగా నిర్ధరణ అయిన హంతకుడు జోసెఫ్ వూద్ మరణ శిక్షను నిలిపివేయాలని న్యాయవాదులు దావా వేశారు.
2014లోనే సుప్రీంకోర్టు ఈయనకు మరణ శిక్ష అమలు చేయాలని చెప్పింది. కానీ, ఈ ప్రొసీజర్‌కు వారికి రెండు గంటల సమయం పట్టింది.
14సార్లు ఆయనకు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చారు. కానీ, వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు.
దీంతో ఈ విధానాలను సమీక్షించేందుకు అరిజోనా మరణ శిక్షల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.
2022లోనే తిరిగి ఈ రాష్ట్రం మరణ శిక్ష అమలును చేపడుతోంది.
2014లో కూడా ఓక్లహమాలో క్లేటన్ లాకెట్‌కు చెందిన మరణ శిక్ష అమలు విఫలమైంది. ఆ తర్వాత గుండెపోటుతో ఆయన మరణించారు.
ఉపయోగంలో లేని కాక్‌టైల్ డ్రగ్‌ను వాడారని కొందరు విమర్శించారు.
ఈ డ్రగ్ వేసేటప్పుడు వాడిన ఐవీ విధానంలో సమస్యలున్నట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు కూడా ఈ మరణ శిక్ష అమలు విఫలమవ్వడాన్ని ఖండించారు.
క్రూరమైన, అసాధారణమైన శిక్షలు చేపట్టకుండా అమెరికా రాజ్యాంగం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ .. కొత్త డ్రగ్స్, డ్రగ్స్ కాంబినేషన్లను వాడుతున్నారని చాలా మంది వాదించారు.
ఎన్ని ఆందోళనలు, విమర్శలు ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు మాత్రం మరణ శిక్ష చట్టబద్ధతను, ప్రాణాంతక డ్రగ్స్ వాడకాన్ని సమర్థిస్తూనే ఉంది.

ఫొటో సోర్స్, RANDI WORKMAN
తగ్గుతున్న మరణ శిక్షలు
మరణ శిక్షలు నేటికీ కొనసాగుతున్నా.. అవి కాలక్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. ఇవి తగ్గుతున్నప్పటికీ మరణ శిక్షల్లో వాడే విధానాల్లో మాత్రం ఆందోళనలు అలాగే ఉన్నాయి.
2023లో అమెరికాలో మరణ శిక్షలు అమలు చేసిన ఐదు రాష్ట్రాల్లో ఓక్లహమా ఒకటి.
ప్రస్తుతం 2,400 మంది ఖైదీలు మరణ శిక్ష జాబితాలో ఉన్నారు.
2023లో 20 మంది ఖైదీలకు మరణ శిక్ష విధించారు. 1999 నాటి లెక్కలతో పోలిస్తే ఈ మరణ శిక్ష పడిన ఖైదీల సంఖ్య తగ్గింది. 1999లో అమెరికాలోని 20 రాష్ట్రాల్లో 98 మందికి మరణ శిక్షలను అమలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా ఫార్మా కంపెనీలు మరణ శిక్షలో డ్రగ్స్ వాడకానికి అనుమతి ఇవ్వడం లేదు.
ప్రాణాంతక ఇంజెక్షన్ డ్రగ్స్ పొందడం కష్టతరమవడానికి ఒక కారణం మరణ శిక్షల సంఖ్య తగ్గడమని న్యూయార్క్ సిటీలోని ఫోర్దామ్ లా స్కూల్‌కు చెందిన లా ప్రొఫెసర్ డెబోరా డెన్నో అన్నారు.
మరణ శిక్షలు ఎల్లప్పుడూ వారితో సంబంధమున్న రహస్య అంశంగా భావించే వారు. కానీ, ఔషధాల కొరత తర్వాత ఇవి మరింత రహస్యంగా మారినట్లు ఆమె అన్నారు.
2013లో జార్జియా తీసుకొచ్చిన లెథాల్ ఇంజెక్షన్ సీక్రెసీ యాక్ట్ మాదిరిగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఏ డ్రగ్స్ వాడుతున్నారో రహస్యంగా ఉంచేందుకు చట్టాలను తీసుకొచ్చాయి.
దీని వల్ల ఆందోళనలు పెరుగుతున్నాయని చెప్పారు.
మరణ శిక్షలను ఆమె వ్యతిరేకించినప్పటికీ, కొన్ని క్లిష్టమైన విధానాలను ప్రస్తుతం వాడుతున్నారని అన్నారు.
డ్రగ్స్ కొరత సమస్యను ప్రచార కర్తలు తమకు అనుకూలంగా మార్చుకున్నారని మరణ శిక్షల అమలుకు మద్దతు ఇస్తోన్న ఉటా యూనివర్సిటీ లా ప్రొఫెసర్ పౌల్ కాస్సెల్ అన్నారు.
మరణ శిక్షలను నిలిపివేసేందుకు ప్రాణాంతక ఇంజెక్షన్ డ్రగ్స్ కొరతను వారు వాడుకుంటున్నారని చెప్పారు.
రాండీ వర్క్‌మాన్, కార్సన్ మెక్‌విలియమ్స్ ఇద్దరూ ప్రస్తుతం పదవీ విరమణ పొందారు.
కరెక్షన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూనే మెక్‌విలియమ్స్ 29 మరణ శిక్షల అమలులో పాల్గొన్నారు.
‘‘నేను పెరిగేటప్పుడు బతకడానికి ఇది చేయాలి అని ఆలోచించలేదు. ఇది నా పనిగా మారిపోయింది’’ అని అన్నారు.
వర్క్‌మాన్ ఇప్పటికీ ఓక్లహమా రాష్ట్రంలోని జైలుకి దగ్గర్లో ఉన్న ఓ నగరంలో నివసిస్తున్నారు.
1,200 మంది ఖైదీలతో అత్యంత భద్రతతో ప్రపంచానికి దూరంగా ఈ జైలు ఉంటుంది. ఈ జైలులోనే వర్క్‌మాన్ పనిచేశారు.
సంతోషంగా ఆయన పదవీ విరమణ తీసుకున్నారు.
ఖైదీల ప్రాణాల తీసే ఔషధాలను కొనేందుకు తీవ్రంగా పనిచేసిన వర్క్‌మాన్.. ఇదొక దారుణమైన సమస్యగా అభివర్ణించారు.
డోప్ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉండేదన్నారు.
‘‘ప్రజలు చనిపోవడం నేను చూడలేను. వారేం చేశారన్న దాన్ని నేను లెక్కల్లోకి తీసుకోను. వారు కూడా మనుషులే కాదు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- వ్యాపం: ఒకరి తరువాత మరొకరు చనిపోయిన ఈ కుంభకోణం ఏంటి?
- ది గ్రేట్ ట్రైన్ రాబరీ: రైల్లో చొరబడి 120 డబ్బు సంచులను దోచుకెళ్లారు.. థ్రిల్లర్ సినిమాను తలదన్నే ఈ దోపిడీ ఎలా జరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














