ది గ్రేట్ ట్రైన్ రాబరీ: రైల్లో చొరబడి 120 డబ్బు సంచులను దోచుకెళ్లారు.. థ్రిల్లర్ సినిమాను తలదన్నే ఈ దోపిడీ ఎలా జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1963 ఆగస్టు 8వ తేదీ. గ్లాస్గో నుంచి లండన్ సెంట్రల్‌కు రాత్రి సమయంలో ఓ రైలు నడిచింది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఓ ముఠా ఆ రైలుపై దాడి చేసి, దాంట్లో తరలిస్తున్న భారీ మొత్తం నగదును కొల్లగొట్టారు.
60 ఏళ్లు గడిచినా బ్రిటన్ ప్రజల్లో ఈ దొంగతనం జ్ఞాపకం మాత్రం మెదులుతూ ఉంటుంది. ఈ చోరీని 'ది గ్రేట్ ట్రైన్ రాబరీ' అని పిలుస్తారు. దీనిపై చాలా సినిమాలు, డ్రామాలు వచ్చాయి.
ఈ దొంగతనం ఎలా జరిగింది? ఇంతకీ దొంగలు దొరికారా లేదా?
ఈ దోపిడీని పదహారు మంది కలిసి చేశారు. ఆ ముఠా నాయకుడు బ్రూస్ రేనాల్డ్స్. అతనికి ఒక రైల్వే ఉద్యోగి నుంచి డబ్బుల వార్త అందింది. ఆ ఉద్యోగి ఎవరనేది చివరి వరకు తెలియలేదు.
ఈ సమాచారం ఆధారంగా దోపిడీకి పథకం వేశాడు బ్రూస్. దొంగలు రైల్వే సిగ్నల్స్ చాకచక్యంగా మార్చి రైలును బకింగ్‌హామ్‌షైర్ సమీపంలో ఆగేలా చేశారు.
అయితే, ఈ దోపిడీలో వారు తుపాకులు ఉపయోగించలేదు. ఓ ఇనుప రాడ్ తీసుకెళ్లి రైలు డ్రైవర్ తలపై కొట్టారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ పూర్తిగా కోలుకోలేదు.
ఎలా ప్లాన్ చేశారు?
బ్రూస్ రేనాల్డ్స్ ఈ దోపిడీకి సూత్రధారి. ఈ రైలులో ఎంత డబ్బు తరలిస్తున్నారు, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశాలపై పూర్తి అవగాహన ఉన్న ఓ సెక్యూరిటీ అధికారి బ్రూస్ ముఠాకు సమాచారం అందించాడు.
లండన్‌లోని ఒక న్యాయవాది కార్యాలయంలో పనిచేసిన బ్రియాన్ ఫీల్డ్ ద్వారా సెక్యూరిటీ అధికారిని గోర్డాన్ గూడీ, రోనాల్డ్ బస్టర్ ఎడ్వర్డ్స్‌లకు పరిచయం చేశారు. వీరిద్దరూ గ్యాంగ్‌స్టర్లు.
ఈ దోపిడీకి ప్లాన్ చేయడానికి ముఠాకు కొన్ని నెలల సమయం పట్టింది. ఈ ముఠాలో బ్రూస్ రేనాల్డ్స్, గోర్డాన్ గూడీ, బస్టర్ ఎడ్వర్డ్స్, చార్లీ విల్సన్ ముఖ్యులు.
నేరాలకు కొత్త కానప్పటికీ, కదులుతున్న రైలును ఆపి దోచుకున్న అనుభవం వారికి లేదు. అందుకే మరో లండన్ గ్యాంగ్ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ గ్యాంగ్‌లో టామీ విస్బే, బాబ్ వెల్చ్, జిమ్ హస్సీలు ఉన్నారు. వారిని సౌత్ కోస్ట్ రైడర్స్ గ్యాంగ్ అని పిలిచేవారు. రైళ్లను దోచుకోవడంలో వారికి అనుభవం ఉంది.
ఆ తర్వాత మరికొంత మంది వ్యక్తులతో కలిశారు. చివరకు 16 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES/UNIVERSAL HISTORY ARCHIVE
ఈ రైలులో డబ్బులు ఎందుకు ఉన్నాయి?
గ్లాస్గో నుంచి లండన్ వెళ్లే ఈ రైలును 'రోలింగ్ పోస్ట్ ఆఫీస్' అని పిలిచేవారు. దీని ద్వారా ఉత్తరాలు, పార్శిళ్లు, మనీ ఆర్డర్లు, నగదు ఒకచోట నుంచి మరో చోటికి తరలిస్తారు.
ఈ రైలులో దాదాపు 72 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా రైలు నడుస్తుండగానే మార్గమధ్యంలో స్టేషన్ల నుంచి ఉత్తరాల కవర్లు, ఇతర సంచులను తీసుకుంటారు.
రైలు అయితే ఆగేది కాదు. రైలు కోచ్‌ల బయట పెద్దపెద్ద కొక్కేలు ఉండేవి. వాటిపై బస్తాలు వేలాడదీసేవారు. వాటిని సిబ్బంది తీసుకునేవారు. అనంతరం సిబ్బంది రైలులో కూర్చొని కవర్లను ఆర్డర్‌లో పెట్టేవారు. రైలులో మొత్తం కోచ్‌లు పన్నెండు.
ఇంజిన్ పక్కన ఉన్న కంపార్ట్‌మెంట్‌లోనే భారీ మొత్తంలో డబ్బు ఉంది.
సాధారణంగా ఈ రైలు 30 లక్షల పౌండ్లు తీసుకువెళుతుంది. కానీ 1963 ఆగస్టు 7కి ముందు రోజు బ్యాంకుకు సెలవు దినం కావడంతో రూ.26 కోట్లను (26 లక్షల పౌండ్లు) మాత్రమే తరలించారు.

ఫొటో సోర్స్, BBC ONE
రైలు ఎలా ఆపారు?
ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన సిగ్నల్ లైన్‌లోని గ్రీన్ సిగ్నల్‌ను దొంగలు గ్లోవ్‌తో కప్పేశారు, అనంతరం మరొక బ్యాటరీతో పనిచేసే రెడ్‌లైట్ వేశారు.
రైలు డ్రైవర్ జాక్ మిల్లర్ రెడ్ లైట్ చూసి రైలును ఆపాడు. ఆ ప్రదేశంలో రైలు ఆపాల్సి వస్తుందని ఆయన ఊహించలేదు.
దీంతో జాక్ మిల్లర్ సహాయకుడు డేవిడ్ విట్బీ దిగి రైలు పట్టాల పక్కన ఉన్న టెలిఫోన్‌ల నుంచి స్టేషన్‌కి కాల్ చేయడానికి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లేసరికి ఎవరో ఫోన్ లైన్ కట్ చేసి ఉండటం గమనించాడు డేవిడ్.
డేవిడ్ తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంజిన్ క్యాబిన్లోకి ప్రవేశించారు. జాక్ మిల్లర్ వారిని ఆపడానికి ప్రయత్నించడంతో దొంగలలో ఒక వ్యక్తి అతని తలపై రాడ్‌తో కొట్టాడు.
ఇంజిన్, డబ్బు ఉన్న మొదటి కోచ్‌ను రైలు నుంచి వేరు చేసి అక్కడికి 800 మీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాలనేది దొంగల ప్లాన్.
రైలు నడపడానికి రిటైర్డ్ రైలు డ్రైవర్‌ను కూడా తీసుకొచ్చారు దొంగలు. అయితే ఈ కొత్త తరహా రైలును ఆయనకు ఎలా నడపాలో తెలియలేదు.
దీంతో దొంగలు జాక్ మిల్లర్‌ని బెదిరించారు. బ్రిడ్జి వద్దకు రైలును తీసుకెళ్లాలని ఆదేశించారు.
ఇదే సమయంలో మిగిలిన దొంగలు వెనుక కోచ్‌లలోకి ప్రవేశించి ఉద్యోగులను నిర్బంధించారు. వారిని ఒక మూలన పడుకోమన్నారు.
అందులోని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి బంధించారు. అనంతరం డబ్బుల మూటల వద్దకు వెళ్లారు.
మొదటి పెట్టెలో 128 బస్తాలలో డబ్బులు ఉన్నాయి. 120 బస్తాలను ఒక్కొక్కటిగా తీసి, దొంగలంతా వరుస క్రమంలో నిల్చొని వంతెన కింద ఉన్న తమ ట్రక్కుల్లోకి ఎక్కించారు.
దాడి చేసిన 30 నిమిషాల్లో డబ్బు బస్తాలతో పరారయ్యారు దుండగులు. అంతేకాదు ప్రత్యక్ష సాక్షులకు అర్థం కాకుండా ఉండేందుకు రెండు వ్యతిరేక దిశల్లో నకిలీ నంబర్ ప్లేట్లతో మరో రెండు ట్రక్కులను పంపారు.
డబ్బుతో కూడిన బస్తాలను తమ కారులోకి ఎక్కించిన తర్వాత, దొంగలు ఒక చిన్న రహదారిలో వేగంగా వెళ్లిపోయారు. ఈ సమయంలో ఎవరికైనా ఏదైనా సమాచారం అందిందా అనే అనుమానంతో పోలీసుల రేడియోను కూడా వింటూ వెళ్లారు.
దొంగలు తెల్లవారుజామున 4:30 గంటలకు లెదర్‌స్లేడ్ ఫామ్ హౌజ్ చేరుకున్నారు. అక్కడే వారు తల దాచుకోవాలనుకున్నారు. అదే 4:30 గంటలకు చోరీ జరిగిన విషయం పోలీసులకు తెలిసింది.

ఫొటో సోర్స్, PA WIRE
ఎలా తప్పించుకున్నారు?
పట్టాల పక్కనే ఉన్న టెలిఫోన్ వైర్లను దుండగులు కట్ చేయడంతో దొంగతనం గురించి వెంటనే చెప్పడానికి సాధ్యం కాలేదు. కొంతసేపటికి అక్కడికి మరో సరుకు రవాణా రైలు వచ్చింది.
దోపిడీకి గురైన రైలులోని సిబ్బందిలో ఒకరు అందులో ఎక్కి తదుపరి స్టేషన్‌లో దిగారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.
"ఒక దోపిడీ జరిగింది, మీరు నమ్మరని నాకు తెలుసు, రైలునే దోపిడీ చేశారు" అని పోలీసు రేడియోలో వినపడింది.
లెదర్‌స్లేడ్ ఫామ్ ప్రాంతం ఘటనా స్థలానికి 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి చేరుకున్న తర్వాత డబ్బులు పంచుకున్నారు దొంగలు.
ప్రధాన దొంగలకు 16 పెద్ద షేర్లు రాగా, మిగిలిన డబ్బు చిన్న సాయం చేసిన వారికి ఇచ్చారు.
ఇదే సమయంలో 50 కి.మీ పరిధిలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రేడియో ద్వారా తెలుసుకున్నారు దొంగలు. పోలీసు బృందాలు గస్తీ చేపట్టాయి.
మొదట్లో వాళ్లు ఆ ఫాం వద్దే కొన్ని రోజులు ఉండాలనుకున్నారు. కానీ, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టడంతో అక్కడ ఉండటం సురక్షితం కాదని ముఠాకు అర్థమైంది. దీంతో అత్యవసరంగా పారిపోవాల్సిన పరిస్థితి వారిది.
దోపిడీ జరిగిన సాయంత్రం బ్రియాన్ ఫీల్డ్ వారి దగ్గరికొచ్చాడు. ‘‘దాక్కోవడానికి వేరే చోటు వెతుక్కో’’ అని ముఠా నాయకులు అతనికి సూచించారు.
అక్కడి నుంచి తప్పించుకునేందుకు చోరీకి వినియోగించిన వాహనాలను వాడటం మంచిదికాదని వాళ్లకు అర్థమైంది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు అప్పటికే పోలీసులకు వాటి గురించిన సమాచారం ఇచ్చి ఉంటారు.
రాయ్ జేమ్స్ అనే సహచరుడితో కలిసి బ్రియాన్ లండన్ వెళ్లాడు. అక్కడ మరొక కారు తీసుకున్నారు.
ఇంతలో బ్రూస్ రేనాల్డ్స్, జాన్ డాలీ రెండు కార్లతో వచ్చారు. బ్రియాన్ ఫీల్డ్, అతని భార్య ఒక వ్యాన్‌తో వచ్చినప్పుడు కొంత మంది వ్యక్తులు అందులోకి ఎక్కారు.
మరికొంతమంది బ్రియాన్ ఇంట్లో దాక్కోవడానికి వెళ్లారు. అయితే, మరుసటి రోజే వారు ఆ నివాసాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, PA WIRE
విచారణ సాగిందిలా..
రైలులో ఉన్న పోస్టాఫీసు సిబ్బందితో ముఠాలోని ఓ వ్యక్తి.. ‘‘ఇక అరగంట వరకు ఎవరూ ఇక్కడి నుంచి కదలరు’’ అని అన్నట్లు విచారణ సమయంలో పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
దీంతో దొంగల వాహనం అరగంటలో ఓ 50 కిలోమీటర్లు వెళ్లగలదని పోలీసులు భావించి, ఆ ఏరియాల్లో జల్లెడ పట్టడం ప్రారంభించారు.
ఈ విషయం తెలుసుకున్న దొంగల ముఠా ఫామ్‌హౌజ్ నుంచి నుంచి పరారయ్యారు.
రెండు రోజుల తర్వాత బ్రియాన్ ఫీల్డ్‌ని చార్లీ విల్సన్ పిలిచాడు. సాక్ష్యాలు దొరక్కుండా లెదర్‌స్లేడ్ ఫామ్‌హౌజ్‌ను తగులబెట్టారా అని అడిగాడు విల్సన్.
దానికి సమాధానం చెప్పడంలో బ్రియాన్ తడబడ్డాడు. దీంతో ఎడ్వర్డ్స్, రేనాల్డ్స్, డాలీ, జేమ్స్‌లను విల్సన్ పిలిచి వివరించాడు.
వారందరూ బ్రియాన్ ఫీల్డ్ దగ్గరికి వెళ్లారు. తన సహాయకుడైన మార్క్ ప్రణాళిక ప్రకారం ఆ స్థలాన్ని కాల్చివేయలేదని బ్రియాన్ తెలిపాడు.
దీంతో మరుసటి రోజు ఫామ్‌హౌజ్ తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
వారు అక్కడ వేలిముద్రలు, మరికొన్ని ఆధారాలు, ప్రధానంగా డబ్బు తీసుకొచ్చిన మెయిల్ బస్తాల ఆధారాలను కనుగొన్నారు.
దోపిడీ అనంతరం దుండగులు ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు నిర్ధరించారు.
ఫామ్‌హౌస్‌లోని కాగితాలు, రికార్డులను పరిశీలించగా అందులో బ్రియాన్ ఫీల్డ్ పేరు ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు ముందుగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పదహారు మంది కోసం వేట ప్రారంభించారు పోలీసులు.

ఎలా దొరికారు?
బ్రూస్ రేనాల్డ్స్ ముఠా నాయకుడు, దోపిడీకి సూత్రధారి. 'నెపోలియన్' అతని ముద్దుపేరు. దోపిడీ తర్వాత ఐదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడతను.
నకిలీ పాస్‌పోర్ట్‌తో మొదట మెక్సికోకు, తరువాత కెనడాకు వెళ్లాడు. అతనితోపాటు భార్య, కొడుకు కూడా ఉన్నారు.
ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్న తరువాత, ఇంగ్లండ్‌కు వచ్చాడు బ్రూస్, అయితే రాగానే అరెస్టు చేశారు పోలీసులు.
ఈ దోపిడీకి 1968లో అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే, పదేళ్ల తర్వాత బ్రూస్ విడుదలయ్యాడు.
ఆ తర్వాత లండన్‌లోని ఓ చిన్న ఫ్లాట్‌లో ఒంటరిగా ఉండేవాడు. 1980లో మాదక ద్రవ్యాల కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది.
జైలు నుంచి విడుదలైన తర్వాత, హీస్ట్ చిత్రానికి సలహాదారుగా పనిచేశాడు బ్రూస్, తన ఆత్మకథను కూడా రాశాడు.
ఈ దోపిడీ జరిగిన 50 ఏళ్ల తర్వాత అంటే 2013లో నిద్రలోనే చనిపోయాడు బ్రూస్.
ప్లాస్టిక్ సర్జరీతో ముఖం మార్చుకున్న బ్రిగ్స్
రోనాల్డ్ బ్రిగ్స్ కథ అయితే ఒక సినిమా మాదిరే ఉంటుంది.
రైలు దోపిడీ కేసులో 1964లో అరెస్టయ్యాడు బ్రిగ్స్. మరుసటి ఏడాది జైలు నుంచి తప్పించుకున్నాడు.
ప్లాస్టిక్ సర్జరీతో ముఖం మార్చుకుని వివిధ దేశాల్లో తలదాచుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకు తిరిగాడు. ఒక్కసారి కిడ్నాపర్ల బారి నుంచి కూడా బయటపడ్డాడు.
36 ఏళ్లపాటు అరెస్టు కాకుండా తప్పించుకున్నాడు బ్రిగ్స్. చివరకు 2001లో ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులకు లొంగిపోయాడు.
2009లో మంచాన పడి ఉండటంతో కోర్టు దయతో విడుదలయ్యాడు. అయితే, అదే ఏడాది డిసెంబర్‌లో తుది శ్వాస విడిచారు.
రైలు డ్రైవర్ తలపై రాడ్‌తో కొట్టిన వ్యక్తి రోనాల్డ్ ఎడ్వర్డ్. అతని గురించే 1988లో 'బస్టర్' అనే సినిమా కూడా వచ్చింది. దోపిడీ తర్వాత ఎడ్వర్డ్ మెక్సికో పారిపోయాడు, కానీ 1966లో లొంగిపోయాడు.
తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత విడుదలయ్యాడు. ఆ తర్వాత పూల దుకాణం తెరిచాడు. అయితే, 1994లో గ్యారేజీలో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. అప్పటికి ఆయన వయసు 62 ఏళ్లు.
ఇక ఈ ముఠాకు చార్లెస్ విల్సన్ కోశాధికారి. ముఠాలో ఇతన్నే మొదట అరెస్టు చేశారు. పోలీసులకు ఏమీ చెప్పకపోవడంతో 'సైలెంట్ మ్యాన్' అనే పేరు సంపాదించుకున్నాడు విల్సన్.
అతనికి 30 ఏళ్ల శిక్ష పడింది. అయితే శిక్ష పడిన నాలుగు నెలలకు కెనడా పారిపోయాడు విల్సన్. నాలుగేళ్ల తరువాత పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. దీంతో మరో పదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు.
1978లో జైలు నుంచి బయటకు వచ్చాక స్పెయిన్ వెళ్లాడు విల్సన్. 1990లో ఆయన్ను ఎవరో కాల్చి చంపేశారు.
ఇక డబ్బును తీసుకెళ్లిన ట్రక్కు డ్రైవర్ పేరు రాయ్ జేమ్స్. అతడి వేలిముద్రలను పోలీసులు గుర్తించారు.
అతనికి 30 సంవత్సరాల శిక్ష విధించారు. కానీ 12 సంవత్సరాల తర్వాత విడుదలయ్యాడు. అతను కూడా స్పెయిన్ వెళ్లిపోయాడు.
1993లో తన మామ (భార్య తండ్రి)ని చంపి, భార్యను బెదిరించినందుకు మళ్లీ అరెస్టు చేశారు పోలీసులు.
చివరగా, బ్రియాన్ ఫీల్డ్. దొంగలు దాక్కున్న ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసింది అతనే.
అతనికి కూడా 25 ఏళ్ల శిక్ష పడింది. అయితే ఐదేళ్ల తర్వాత విడుదలయ్యాడు. 1979లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించాడు.
ఇంతమందిని పట్టుకున్నా.. దోచుకున్న డబ్బు మాత్రం అస్సలు దొరకలేదు!
ఇవి కూడా చదవండి
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
- డ్రీమ్ 11 యాప్‌లో క్రికెట్ ఆడి ఈ ఎస్సై కోటిన్నర ఎలా గెలుచుకున్నారు? ఆ తర్వాత ఏమైంది?
- ఇజ్రాయెల్‌తో పోరుకు సిద్ధమంటున్న హిజ్బొల్లా సంస్థ చరిత్ర ఏంటి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














