గేదెలు దొంగిలించిన కేసులో 58 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్

గేదెల దొంగతనం

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండు గేదెలు, ఒక దూడను దొంగిలించిన కేసులో కర్ణాటక పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు ఇప్పటిది కాదు, దొంగిలించిన వ్యక్తి ప్రస్తుత వయసు 78 ఏళ్లు.

అది 1965 సంవత్సరం. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన గణపతి విఠల్ వాగూర్‌ అనే వ్యక్తికి అప్పుడు 20 ఏళ్లు. ఆయన రెండు గేదెలను దొంగతనం చేసినట్లు కేసు నమోదైంది.

అప్పట్లోనే ఒకసారి అరెస్టైన వాగూర్ బెయిల్ పై విడుదలై తర్వాత కనిపించకుండా పోయారు. ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి 2006లో మరణించారు.

ఇప్పుడు మళ్లీ 58 ఏళ్లు గడిచిన తర్వాత వాగూర్ మరోసారి అరెస్టయ్యారు.

గత వారం, వాగోర్‌ను తిరిగి అరెస్టు చేసిన తర్వాత ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది.

దొంగతనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఎలా బయటికొచ్చింది?

వాస్తవానికి కేసు ఎప్పుడో కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లింది. కానీ, కొన్ని వారాల కిందట పోలీసులు పెండింగ్ కేసు ఫైళ్లను పరిశీలిస్తుండగా, ఈ దొంగతనం వ్యవహారం మళ్లీ బయటకు వచ్చింది.

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఈ గేదెల దొంగతనం ఘటన జరిగింది. ఈ కేసులో వాగూర్‌ రెండుసార్లు పారిపోయారు. రెండుసార్లు కూడా మహారాష్ట్రలోని వేర్వేరు గ్రామాల్లో పోలీసులకు దొరికారు.

1965లో వాగోర్, కృష్ణ చందర్ అనే ఇద్దరు వ్యక్తులు తాము గేదెలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరచగా షరతులతో కూడిన బెయిల్ వచ్చిందని పోలీసులు చెప్పారు.

కానీ, బెయిల్ పై విడుదలైన తర్వాత ఈ ఇద్దరు కోర్టు సమన్లు, వారెంట్లకు స్పందించడం మానేశారు.

బీదర్ నుండి పోలీసు బృందాలను కర్ణాటకతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గ్రామాలకు పంపినప్పటికీ వీరి ఆచూకీ లభించ లేదు.

వ్యవసాయ కూలీలుగా పనిచేసుకునే ఈ ఇద్దరు ఆ తర్వాత పోలీసులకు దొరకలేదు.

దొంగతనం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పోలీసులు పాత కేసులు పరిశీలిస్తుండగా గేదెల దొంగతనం కేసు తెర మీదకు వచ్చింది.

చిన్న క్లూతో దొరికిన నిందితుడు

బీదర్ జిల్లా పోలీసు చీఫ్ చెన్నబసవన్న బీబీసీతో ఈ కేసు గురించి మాట్లాడారు. గత నెలలో ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చినట్లు వెల్లడించారు.

‘‘ 1965లో వాగూర్ మొదటిసారి పారిపోయినప్పుడు అతన్ని మహారాష్ట్రలోని ఉమర్గా గ్రామంలో పట్టుకున్నారు. ఇప్పుడు అతని ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమో కనుక్కునే ప్రయత్నంలో మా పోలీసులు ఉమర్గా గ్రామస్తులతో మాట్లాడటం ప్రారంభించారు. ఆ సంఘటన గురించి తెలిసిన ఒక వృద్ధురాలిని మా వాళ్లు గుర్తించారు. ఆమెతో మాట్లాడినప్పుడు, అతను సజీవంగా ఉన్నాడని వెల్లడించారు’’ అని చెన్న బసవన్న తెలిపారు.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న తకలాగావ్‌లో వాగూర్ ఉన్నట్లు ఆ వృద్ధురాలు పోలీసులకు చెప్పారు. ఐదు దశాబ్ధాల తర్వాత పోలీసులకు లభించిన అతి పెద్ద క్లూ ఇది.

ఆయన స్థానిక ఆలయంలో ఉంటున్నారని పోలీసులకు తెలిసింది. దీంతో వాళ్లు ఆ గ్రామానికి వెళ్లారు.

తానే వాగూర్‌నని పోలీసులకు చెప్పిన ఆయన, కోర్టు అంటే తనకు విపరీతమైన భయమని, అందుకే అప్పట్లో పారిపోయానని చెప్పారు.

మొత్తం మీద ఆయన్ను తిరిగి కర్ణాటకకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు.

న్యాయ సహాయం అందించే ప్రొ బోనో అనే సంస్థ ఆయన తరఫున వాదించేందుకు లాయర్‌ను సమకూర్చింది. కేసు విచారణ జరుగుతోంది.

వీడియో క్యాప్షన్, జైళ్ళు ఎన్ని రకాలు... ఏ శిక్ష పడితే ఏ జైలుకు పంపిస్తారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)