లిబియా వరదలు: రెండు వేలకు పైగా మృతులు, ఎటుచూసినా శవాలే, 10 వేల మంది గల్లంతు

డెర్నా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారీ వర్షాలు, వరదల కారణంగా షహాత్ నగరంలో ధ్వంసమైన రహదారి
    • రచయిత, లూసీ ఫ్లెమింగ్
    • హోదా, బీబీసీ న్యూస్

లిబియాలో వరదల కారణంగా ఒక్క నగరంలోనే వేయి కన్నా ఎక్కువ మంది మరణించినట్లు డెర్నా నగర తూర్పు తీరంలో పర్యటించిన సీనియర్ అధికారి, మంత్రి ఒకరు చెప్పారు.

‘‘శవాలు అంతటా పడి ఉన్నాయి’’ అని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో మంత్రి అన్నారు.

రెండు ఆనకట్టలు, నాలుగు వంతెనలు కూలిపోవడంతో డెర్నా నగరం ఎక్కువ భాగం నీళ్లలోనే మునిగిపోయింది. డెర్నాలో సుమారు లక్ష మంది నివసిస్తారు.

డేనియల్ తుపాను కారణంగా సంభవించిన వరదల్లో 10 వేల మంది వరకు కనిపించకుండా పోయారని రెడ్‌క్రాస్ చెప్పింది.

ఆదివారం వచ్చిన తుపానుతో బెంఘాజి, సౌసా, అల్ మర్జ్ నగరాలు కూడా ప్రభావితం అయ్యాయి.

లిబియా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పావు వంతు డెర్నా నగరం వరదల్లో తుడిచిపెట్టుకుపోయిందని అంచనా

‘‘డెర్నా నగరంలో 1,000 కంటే ఎక్కువ మృతదేహాలను వెలికితీశారు’’ అని తూర్పు ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన కమిటీలో భాగమైన విమానయాన మంత్రి హిచెమ్ చికౌట్ ఫోన్‌లో రాయిటర్స్‌తో చెప్పారు.

‘‘నేనేమీ ఎక్కువ చేసి చెప్పట్లేదు. పావు వంతు నగరం నీటిలో కనుమరుగైంది. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి’’ అని ఆయన అన్నారు.

మరణాలు సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని విలేఖరులతో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ (ఐఎఫ్‌ఆర్‌సీ) అధ్యక్షుడు టామెర్ రమాదన్ చెప్పారు.

ట్యునీషియా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, ‘‘మా బృందాలు ఇంకా అంచనా వేస్తున్నాయి. ఇప్పటికైతే కచ్చితమైన సంఖ్య మాకు తెలియలేదు. వరదల్లో కనిపించకుండా పోయిన వారి సంఖ్య 10 వేలు దాటింది’’ అని అన్నారు.

లిబియా నగరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుపాను తీవ్ర ప్రభావం చూపిన నగరాల్లో డెర్నా ఒకటి

అంతకుముందు ఒక లిబియన్ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఈస్టర్న్ ప్రధానమంత్రి ఒబామా హమాద్, మరణించిన వారి సంఖ్యను రెండు వేలుగా పేర్కొన్నారు.

‘‘డెర్నాలోని పరిసరాలన్నీ అదృశ్యం అయ్యాయి. అక్కడి నివాసితులు కూడా వరద నీటిలో కొట్టుకుపోయారు’’ అని ఆయన చెప్పారు.

తూర్పు ప్రాంతాలతో పాటు పశ్చిమాన ఉన్న మిస్రాటా నగరం కూడా వరద తాకిడికి గురైంది.

లిబియాకు దీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా పనిచేసిన కల్నల్ ముమ్మర్ గడాఫీని పదవీచ్యుతుడిని చేసి చంపినప్పటి నుంచి అక్కడ రాజకీయ గందగగోళం నెలకొంది.

ఇప్పుడు అక్కడ రాజధాని ట్రిపోలీ కేంద్రంగా పాలించే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వంతో పాటు తూర్పు వైపున మరో ప్రభుత్వం కూడా పాలనను పంచుకుంటోంది.

వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిస్రటా నగరంలో నీళ్లలో మునిగిన ఇళ్లు

అధికారులు చురుగ్గా స్పందించకపోవడంతో ఈ ప్రకృతి విపత్తు సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని లిబియా జర్నలిస్ట్ అబ్దుల్‌కదర్ అసద్ అన్నారు.

‘‘లిబియాలో సహాయక బృందాలు లేవు. సుశిక్షితులైన రెస్క్యూయర్లు లేరు. గత 12 ఏళ్లుగా ఇక్కడ ఉన్నది కేవలం యుద్ధం మాత్రమే’’ అని బీబీసీతో ఆయన చెప్పారు.

‘‘లిబియాలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. సహాయక చర్యలు నెమ్మదిగా జరుగడానికి ఇదే కారణం. అక్కడంతా గందరగోళం నెలకొంది. సహాయం కోసం ప్రజలు అర్థిస్తున్నారు. కానీ, వారికి అవసరమైన సహాయం అందటం లేదు’’ అని ఆయన అక్కడి పరిస్థితిని వివరించారు.

లిబియా వరదలు

ఫొటో సోర్స్, Getty Images

ట్రిపోలీ కేంద్రంగా పనిచేసే పాలక యంత్రాంగం 14 టన్నుల వైద్య సామగ్రి, 80 మందికిపైగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కూడిన ఒక విమానాన్ని పంపింది.

ఐక్యరాజ్యసమితి భాగస్వాములు, లిబియా అధికారుల సమన్వయంతో తూర్పు లిబియాకు అవసరమైన సహాయాన్ని వాషింగ్టన్ నుంచి పంపించనున్నట్లు లిబియాలోని అమెరికా ప్రత్యేక రాయబారి రిచర్డ్ నార్టన్ అన్నారు.

లిబియాకు సహాయం చేసినట్లు లేదా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన దేశాల్లో ఈజిప్ట్, జర్మనీ, ఇరాన్, ఇటలీ, ఖతర్, తుర్కియే ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, 3వేలకు చేరువలో మృతుల సంఖ్య.. ప్రభుత్వ తీరుపై ప్రజల ఆగ్రహం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)