మొరాకో: రాజరికాన్ని రద్దుచేయాలంటూ ఒకప్పుడు ప్రజలు తిరగబడిన దేశం

మొరాకోలో భూకంపం ధాటికి 1030 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
గత ఏడాది జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి సెమీస్ వరకు వెళ్లిన దేశం మొరాకో.
అప్పుడు టోర్నీలో బలమైన స్పెయిన్, పోర్చుగల్ లాంటి జట్లను ఓడించింది. ఈ విజయాలతో ప్రపంచంలోని ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలనూ దోచుకుంది మొరాకో జట్టు.
ఇప్పుడు అదే దేశంలో ప్రజలు ప్రకృతి విపత్తు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇంతకీ ఈ మొరాకో ఎక్కడుంది? ఆ దేశంలో జనాభా ఎంత? మొరాకో ప్రత్యేకతలు ఏంటి?
పర్వతాలు, సముద్రం
పర్వతశ్రేణులు, సముద్ర తీర ప్రాంతం కలిగింది ఈ మొరాకో.
ఉత్తర ఆఫ్రికాలో ‘మాగ్రెబ్- ది వెస్ట్’ అని పిలుకునే దేశం మొరాకో. ఇది అట్లాంటిక్-మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలను కలుపుకుని, విస్తృతమైన పర్వత శ్రేణులు కలిగిన భూభాగం.
ఈ ప్రాంతం అరబ్, బెర్బర్, యూరోపియన్, ఆఫ్రికన్ సంస్కృతుల సమ్మిళితం. 1912 నుంచి 1956ల మధ్య కాలంలో ఫ్రాన్స్ ఆధీనంలో ఉండేది. అయితే, 1956లో స్వాతంత్య్రం పొందింది.
అప్పటి నుంచి అరబ్, ఆఫ్రికాల ప్రభావం మొరాకో అంతటా విస్తరించింది.
1975లో పశ్చిమ సహారాను మొరాకో దేశంలో కలుపుకోవడంతో వివాదానికి తెరలేచింది. అప్పటి నుంచి పొలిసారియో ఫ్రంట్ మద్దతుతో పశ్చిమ సహారా ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి కలగజేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.

మొరాకో జనాభా ఎంతమంది?
రాజధాని: రబాత్
విస్తీర్ణం: 4,46,300 చదరపు కిలోమీటర్లు
జనాభా: 3 కోట్ల 79 లక్షలు
అధికారిక భాషలు: అరబిక్, అమజి, ప్లస్ బెర్బర్, ఫ్రెంచ్
సగటు జీవిత కాలం: పురుషులు - 72 సంవత్సరాలు, మహిళలు - 76 సంవత్సరాలు

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని, పార్లమెంటుకు అధికారాలున్నా.. రాజే సర్వాధికారి
మొరాకోలో రాజరిక వ్యవస్థ అమలులో ఉండేది.
1999లో రాజుగా నాలుగో మహమ్మద్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దేశంలో రాజకీయ, ఆర్థిక సంస్కరణలు చేపట్టడమే కాక, తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు జరిపించారు.
ఈయన చేపట్టిన సంస్కరణల్లో కీలకమైనది మూడో చట్టం. ఈ చట్టం మహిళలకు మరిన్ని హక్కులు కల్పించింది. ఇది ఖురాన్ సూత్రాలను అనుసరించి రూపొందించామని రాజు ప్రకటించినా, మతసంస్థలు వ్యతిరేకించాయి.
2010లో అరబ్ దేశాల్లో చోటుచేసుకున్న ”అరబ్ స్ప్రింగ్” ఉద్యమాల నేపథ్యంలో కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చారు.
రాజుకు ఉన్న సర్వాధికారాల నుంచి కొన్ని అధికారాలు బదలాయిస్తూ పార్లమెంట్, ప్రధాని వ్యవస్థలను ఏర్పాటు చేసినా, విస్తృత అధికారాలు మాత్రం రాజు వద్దే ఉంచారు.
2021 సెప్టెంబరులో ‘ది లిబరల్ నేషనల్ ర్యాలీ ఆఫ్ ఇండిపెండెన్స్ పార్టీ’ నుంచి బిలీనియర్ అజీజ్ అఖన్నౌచ్ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. అజీజ్ అఖన్నౌచ్‌కు ఆయిల్, గ్యాస్ వ్యాపారాలు ఉన్నాయి.
అంతకుముందు ఇస్లామిక్ పార్టీ అయిన పీడీజే మొరాకోను దశాబ్దంపాటు పాలించింది. అయితే పతనం అవుతోన్న ఆర్థిక వ్యవస్థ పీడీజే ఓటమికి కారణం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
మీడియా అంతా ప్రభుత్వం కనుసన్నల్లోనే..
ఇక్కడి బ్రాడ్‌కాస్ట్ మీడియాపై ప్రభుత్వ అజమాయిషీ ఉంది.
మొరాకోలో మతం, రాచరిక వ్యవస్థ, దేశ సమగ్రతను ప్రశ్నించే అవకాశం లేదని పారిస్ రిపోర్టర్లు అన్నారు.
మొరాకో ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లైన RTM, 2M లను ప్రభుత్వమే నిర్వహిస్తోంది లేదా భాగస్వామ్యం కలిగి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మొరాకో చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు
- 7-8వ శతాబ్దాలు – అరబ్‌ల దండయాత్ర; ఇద్రిస్‌ల ముస్లిం రాజవంశ స్థాపన
- 11-12వ శతాబ్దాలు - మొదటి అల్మోరావిద్, అల్మోహద్ రాజవంశాల పాలనలో పశ్చిమ ప్రాంతాలపై మొరాకో ఆధిపత్యం.
- 1549-1649 - సాదీ రాజవంశం పాలనలో మొరాకోతోపాటు పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు
- 1666 తర్వాత - మొరాకో సుల్తానులుగా అలవి రాజవంశ పాలన
- 1884 - మొరాకో తీర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్న స్పెయిన్.
- 1912 - ఫెజ్ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ ఆధీనంలోకి వెళ్లిన మొరాకో
- 1921-6 - రిఫ్ పర్వతాలలో మొదలైన గిరిజన తిరుగుబాటుని అణిచివేసిన ఫ్రెంచ్, స్పానిష్ దళాలు.
- 1956 - ఫ్రెంచ్ పాలన నుంచి విముక్తి, స్వతంత్ర దేశంగా మొరాకో
- 1961 - కింగ్ మహమ్మద్ మరణం.. అధికారం చేపట్టిన రెండవ కింగ్ హసన్
- 1971 - రాజును తప్పించి, రిపబ్లిక్ స్థాపనకు చేసిన ప్రయత్నం విఫలం
- 1991 - ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పశ్చిమ సహారాలో కాల్పుల విరమణ నిబంధన అమలు.
- 2011 - రాజకీయ సంస్కరణలు రాజరిక అధికారాలను రద్దు చేసి, కొత్త రాజ్యాంగం అమలు చేయాలంటూ రాజధాని రాబాత్ తోపాటు ఇతర నగరాల్లో ప్రజల ర్యాలీ.
- 2020 - ఇజ్రాయెల్-మొరాకో సాధారణీకరణ ఒప్పందంలో భాగంగా పశ్చిమ సహారాపై మొరాకో వాదనలను అమెరికా అధికారికంగా గుర్తిస్తుందంటూ అప్పటి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన.
ఇవి కూడా చదవండి
- భారత్: ‘ఇండియా’ అనే పేరుపై జిన్నా అప్పట్లో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు?
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- హైదరాబాద్: అల్విన్ కాలనీ ధరణి నగర్లో అంత ఎత్తున నురగ ఎలా వచ్చింది... అది ఎంత ప్రమాదకరం?
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














