టెరీ గౌ: ఈ ‘ఐఫోన్’ బిలియనీర్ తైవాన్ అధ్యక్షుడు కాగలరా? చైనాను ఎదుర్కోగలరా?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, రూపర్ట్ వింగ్ ఫీల్డ్ హేయిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టెరీ గౌ, 72 ఏళ్ల ఈ కోటీశ్వరుడు తైవాన్‌లో ఐ ఫోన్ తయారు చేసే ఫాక్స్ కాన్ సంస్థ స్థాపకుడు. తైవాన్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
ఆయన తైవాన్‌లో పాపులర్ వ్యాపారవేత్త, పేదరికం నుంచి కోట్లకు పడగలెత్తారు.
తైవాన్‌లో అధికారిక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడగలిగే ఏకైక అభ్యర్థి ఆయనేనని తైపీలోని పరీశీలకులు చెబుతున్నారు. ఆయనైతే కచ్చితంగా గెలుస్తారనేది వారి అభిప్రాయం. కానీ, ఆయన అలా అనుకోవడం లేదు.
2024 జనవరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తే ప్రతిపక్ష ఓటు మూడు విధాలుగా చీలిపోతుందని టెరి గౌ భావిస్తున్నారు.
అధ్యక్షుడిగా గెలిచిన వ్యక్తి అధికారాలన్నీ చలాయించే వ్యవస్థలో ఇప్పటికే రెండు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి. పోటీలో మూడో వ్యక్తి ఉంటే అధికార పార్టీని ఓడించడం అంత తేలిక్కాకపోవచ్చు.
ఈ మొత్తం వ్యవహారం ‘లా ఆఫ్ హోల్స్’ అనే దానికి చక్కని ఉదాహరణ. దానర్థం మీరు ఒక రంధ్రంలో ఇరుక్కుంటే దానిలో నుంచి బయటకు రావడం కష్టమైనప్పుడు మొదట మీరు చేయాల్సింది తవ్వడం ఆపేయాలి. తైవాన్‌లో ప్రతిపక్షాలు ఎన్నికల్లో తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, EPA
తైవాన్ దాటి కూడా ప్రభావం చూపించగల అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నాని టెరీ గౌ సోమవారం ప్రకటించినప్పుడు అదే జరిగింది. చైనా హెచ్చరికల మధ్య ఈ స్వయంపాలిత ద్వీపం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుంది.
పసిఫిక్ ప్రాంతంలో ఆకర్షణ ఉన్న మరో పారిశ్రామికవేత్త మాదిరిగానే టెరీ గౌ కూడా తైవాన్‌లోని ప్రధాన రైట్ – ఆఫ్- సెంటర్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అలాగే పురాతన జాతీయ క్యూమింగ్‌టాంగ్ పార్టీ లోనూ ప్రయత్నించినా విఫలం అయ్యారు.
క్యూమిన్‌టాంగ్ పార్టీ మరో అభ్యర్థిని ఎంపిక చేసింది. దీనిపై ఆగ్రహించిన టెరీగౌ ఆ పార్టీని వదిలేశారు. అయితే అదొక్కటే ఆయన సమస్య కాదు.
తైవాన్‌లో మరో ప్రతిపక్ష పార్టీ ఉంది. అది తైవాన్ పీపుల్స్ పార్టీ. దీనికి కో వెన్-జే నాయకత్వం వహిస్తున్నారు. ఆయన తైపీ నగర మాజీ మేయర్, ప్రస్తుతం ఎన్నికలలో రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా తైవాన్ యువ ఓటర్లలో ఆయనకు పాపులారిటీ ఎక్కువగా ఉంది.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే టెరీ గౌకు ఓట్లు తెచ్చిపెట్టేది ఆయనకున్న సంపద, వ్యాపార విజయాలు కాదు. చైనాను డీల్ చెయ్యడంలో ఆయనకున్న అనుభవం.
ఫాక్స్‌కాన్ లేదా హాన్ హై ఇండస్ట్రీస్, నిపుణులైన చైనా కార్మికులు తైవానీస్ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని మిళితం చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థగా అవతరించింది. 1980, 90లలో టెరీ గౌ దక్షిణ చైనాలో భారీ మాన్యుఫ్యాక్చరింగ్ క్యాంపస్‌లను నిర్మించారు. అందులో పని చెయ్యడానికి వేల మంది చైనా యువకులను నియమించుకున్నారు.
చైనా కార్మిక శక్తి, తైవానీస్ టెక్నాలజీ అనే మోడల్ విజయం సాధించింది. దీంతో టెరీ గౌ మ్యాక్ కంప్యూటర్లు, ఐ ఫోన్ల తయారీ కాంట్రాక్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా తమకు ఇవ్వాలని యాపిల్ సంస్థపై ఒత్తిడి తెచ్చారు. ఈ కాంట్రాక్టులను దక్కించుకోవడంతో ఫాక్స్ కాన్ తైవాన్‌లోనే అతి పెద్ద సంస్థగా అవతరించింది. అది టెరీని తైవాన్ సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరిగా చేసింది.
తైవాన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని చైనాలో పెట్టుబడులు పెట్టడం, చైనాతో పని చేయడం వంటి తన అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని టెరీ చెబుతున్నారు. తైవాన్ మరో యుక్రెయిన్ మాదిరిగా మారడాన్ని ఆపాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ తైవాన్‌ను చైనాతో యుద్ధం అనే సమస్య నుంచి బయటకు తెస్తానని చెబుతున్నారు.
చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ప్రమాదకరంగా భావిస్తున్న వ్యక్తి ఆయనొక్కరే కాదు. గతేడాది తైవాన్ ద్వీపం చుట్టూ సైనిక విన్యాసాల నిర్వహణను చైనా భారీగా పెంచింది.
చైనా సైన్యం శిక్షణలో బాంగా తైవాన్ బీచ్‌లపై దాడి చేసినట్లుగా కనిపించే ప్రచార వీడియోలను బీజింగ్ నాయకత్వం గతవారం విడుదల చేసింది.

ఫొటో సోర్స్, EPA
చైనా- తైవాన్ ప్రాథమిక అంశాలు
చైనా తైవాన్ సంబంధాల్లో సమస్యలేంటి?
తైవాన్ చైనాలో అంతర్భాగమని బీజింగ్ వాదిస్తోంది. తైవాన్‌ను తక్షణం చైనాలో కలిపేయాలని, అవసరమైతే అందుకు బల ప్రయోగం కూడా చేస్తామని చైనా చెబుతోంది.
తైవాన్ పాలనా విధానమేంటి? తైవాన్‌కు సొంత రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నాయకులు ఉన్నారు. ఈ ద్వీపం సాయుధ దళాలలో 3 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారు.
తైవాన్‌ను గుర్తించిన దేశాలేవి?
కొన్ని దేశాలు మాత్రమే తైవాన్‌ను గుర్తించాయి. తైవాన్ చైనాలో అంతర్భాగమనే అంశాన్ని కూడా కొన్ని దేశాలు గుర్తించాయి. అమెరికాకు తైవాన్‌తో అధికారిక సంబంధాలు లేవు, అయితే ఈ చిన్న దేశం భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు అమెరికా సాయం చెయ్యడానికి వీలుగా ఒక చట్టం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
‘టెరీ గౌ చైనాను నిందించడం లేదు. తమ దేశ అధ్యక్షురాలు త్యాస్ ఇంగ్ వెన్‌ను విమర్శి,స్తున్నారు.
తైవాన్‌లో అధికార డీపీపీ శత్రుత్వమే తైవాన్‌ను చైనాతో యుద్ధం అనే అగాధం అంచుకు తీసుకువెళ్లిందనేది టెరీ గౌ వాదన.. 1992లో బీజింగ్- తైపీ మధ్య చర్చలు జరిపిన మునుపటి స్థితికి తైవాన్‌ను తిరిగి తీసుకొస్తానని ఆయన గట్టిగా చెబుతున్నారు.
రానున్న 50 ఏళ్లపాటు ఈ ప్రాంతానికి శాంతిని ప్రసాదించే ఒక ఒప్పందాన్ని అందిస్తాననని హామీ ఇస్తున్నారు.
అయితే అటువంటి ఒప్పందం సాధ్యమేనా అని అక్కడున్న చాలా మంది సందేహిస్తున్నారు. అయితే టెరీ ముందున్న అతి పెద్ద సవాలు అది కాదు. ఎన్నికల లెక్కలు. టెరీ ప్రతిపాదిస్తున్న అంశాలు ఆ దేశ ఓటర్లు అంతగా పట్టించుకోనివి.
బీజింగ్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలకు తమ ప్రభుత్వమే కారణమని చాలా మంది తైవాన్ ప్రజలు నమ్మడం లేదని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. శాంతి భద్రతల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని బీజింగ్‌కు కట్టబెట్టడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
తైవాన్ ఓటర్లలో ఎక్కువ మంది ఇప్పుడు తమను తాము చైనీస్‌గా కాకుండా తైవానీస్ అనే భావిస్తున్నారు. అవసరమైతే దేశం కోసం యుద్ధంలో పోరాడటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
అధికార పార్టీ డీపీపీకి 40శాతం మంది ఓటర్లు మద్దతిస్తున్నారని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. దీనర్ధం ఆ పార్టీని ఓడించడం సాధ్యమేనని. అయితే అందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకే అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంది.
ఆ ఒక్కరు తానే అని టెరీ గౌ అనుకుంటున్నారు. మూడు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు మూడు పంది పిల్లల లాంటివారని... డీపీపీ అనే చెడ్డ తోడేలును ఓడించాలంటే మూడు పార్టీలు ఏకం కావాలని చెబుతున్నారు.
అయితే అలా జరిగే సూచనలేవీ కనిపించడం లేదు. టెరీ గౌకి ఉన్న సంపద, ప్రజాకర్షణ వల్ల ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయే అవకాశం స్పష్టంగా ఉంది.
దానర్ధం డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి విలియం లై 40 శాతం ఓట్లతోనైనా తైవాన్ తర్వాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














