ఫుకుషిమా రియాక్టర్: అణు వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలిన జపాన్, ఈ నీటి వల్ల చేపలు చచ్చిపోతాయా, మనుషులకు ప్రమాదమెంత?

ఫుకుషిమా రియాక్టర్

ఫొటో సోర్స్, REUTERS

ఫుకుషియా అణుకేంద్రం నుంచి వచ్చే వ్యర్థ జలాలను జపాన్ పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేస్తోంది. దీనికి ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదం తెలిపింది.

న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ (అణు భద్రతా మండలి) కూడా ఆమోదం తెలిపినప్పటికీ ఆ వ్యర్థ జలాల్లో రేడియో ధార్మికత ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటికే, జపాన్ నుంచి చేపల దిగుమతులపై చైనా, సౌత్ కొరియా నిషేధం విధించాయి. హాంకాంగ్ కూడా నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ పరిణామాలను అధిగమించేందుకు జపాన్ కూడా దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టింది.

2011లో వచ్చిన భూకంపం, సునామీ ధాటికి జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలోకి భారీ నీరు చేరింది. ఫలితంగా, అణు విద్యుత్ కేంద్రంలో దెబ్బతిన్న రియాక్టర్లలోని రేడియో ధార్మిక ఇంధనాన్ని చల్లబరిచేందుకు భారీగా సముద్రపు నీటిని ఉపయోగించారు.

ఇప్పుడు ఆ వ్యర్థ జలాలను పసిఫిక్ మహాసముద్రంలోకి జపాన్ విడుదల చేసింది.

ఫుకుషిమా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సోల్‌లోని జపాన్ రాయబార కార్యాలయం ముందు కొరియన్ల నిరసన

జపాన్ వాదనేంటి?

దెబ్బతిన్న ఫుకుషిమా రియాక్టర్‌‌లోని ఇంధనాన్ని చల్లబరిచేందుకు బిలియన్ల (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) లీటర్ల సముద్రపు నీటిని ఉపయోగించారు. ఆ వ్యర్థ జలాలను దాదాపు వెయ్యికి పైగా ట్యాంకులలో సురక్షితంగా భద్రపరిచారు.

గత పదేళ్లలో వివిధ దశల్లో ఆ వ్యర్థ జలాలను శుద్ధి చేశామని, కానీ అదే శాశ్వత పరిష్కారం కాదని జపాన్ అంటోంది. ఆ నీటిని సురక్షితంగా పసిఫిక్ మహా సముద్రంలో కలపొచ్చని, అవి సముద్రపు నీటిలో కలిసిపోతాయని, అందువల్ల ఎలాంటి హాని జరగదని వాదిస్తోంది.

పసిఫిక్‌ సముద్రంలో రేడియేషన్ స్థాయిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, ఆ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేకుండా పారదర్శకతతో వ్యవహరిస్తామని చెబుతోంది.

జపాన్ వాదనలతో చాలా మంది శాస్త్రవేత్తలు ఏకీభవిస్తున్నారు. ఆ దేశ ప్రతిపాదనలకు ఐక్యరాజ్యసమితి, అణు భద్రతా మండలి ఆమోదం తెలిపాయి.

జపాన్ ప్రతిపాదనలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని, పర్యావరణంపై కూడా అతితక్కువ ప్రభావం ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అణు భద్రతా మండలి తెలిపింది.

ఫుకుషిమా రియాక్టర్

ఫొటో సోర్స్, Getty Images

వ్యతిరేకిస్తున్న చైనా

ఫుకుషిమా వ్యర్థ జలాల విడుదల ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ అణు కేంద్రం నుంచి విడుదలయ్యే జలాల్లో ప్రమాదకర రేడియో ధార్మికత ఉన్న ట్రిటియం, కార్బన్ - 14 ఉంటాయని, వాటిని తొలగించడం అంత తేలిక కాదని సముద్ర పర్యావరణ వ్యవస్థ, సముద్ర జీవులపై ప్రభావంపై అధ్యయనం చేస్తున్న కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అవి సముద్రపు నీటిలో సురక్షితంగా కలిసిపోతాయని జపాన్ చేస్తున్న వాదనలను వారు కొట్టిపారేస్తున్నారు. ట్యాంకుల్లో జపాన్ నిల్వ ఉంచిన వ్యర్థాలపై మరిన్ని పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

ఫుకుషిమా వ్యర్థ జలాలను పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయాలన్న జపాన్ నిర్ణయంపై ఆ దేశ ప్రజల నుంచి కూడా ఏకాభిప్రాయం రాలేదు. ఇటీవల నిర్వహించిన సర్వేలో దాదాపు సగం మంది జపాన్ ప్రభుత్వ వాదనలను సమర్థించారు. అయితే, వ్యతిరేకిస్తున్న వారిలో తీరప్రాంత వాసులు, మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు.

2011 ఫుకుషిమా విపత్తు తర్వాత ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జపాన్ ప్రభుత్వ నిర్ణయం కారణంగా చాలా మంది సముద్ర ఆహారం (సీఫుడ్) తీసుకోవడం మానేసే అవకాశం ఉందని, అలా జరిగితే తమ జీవనాధారం పూర్తిగా నాశనమైనట్టేనని వారు ఆందోళన చెందుతున్నారు.

''అణు వ్యర్థ జలాలను పసిఫిక్ మహా సముద్రంలోకి వదలడం కంటే ఇంకా మెరుగైన మార్గాలు ఉండొచ్చు. కానీ, వాటిని సముద్రంలోకి వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రపంచం మొత్తానికీ సమస్యే. ఇది ఆమోదయోగ్యం కాదు'' అని జపాన్‌కి చెందిన ఓ మత్స్యకారుడు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

ఫుకుషిమా రియాక్టర్

ఫొటో సోర్స్, GETTY IMAGES

జపాన్ ఉత్పత్తులపై ఆంక్షలు

2011లో సంభవించిన ఫుకుషిమా అణు విపత్తు తర్వాత, ఆ ప్రాంత పరిధిలోని చేపల దిగుమతులపై యూరోపియన్ యూనియన్, చైనా, దక్షిణ కొరియా నిషేధం విధించాయి. ఇప్పుడు ఫుకుషిమా వ్యర్థ జలాలను విడుదల చేయడాన్ని చైనా ఒక్కటే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

మరోవైపు, దక్షిణ కొరియా విధించిన ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ, ఈ విషయంపై ఆ దేశం స్పష్టంగా ఎలాంటి వ్యతిరేకతనూ వ్యక్తం చేయలేదు. సియోల్‌లోని జపాన్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అరెస్టు చేసింది.

జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న సీఫుడ్‌పై చైనా పూర్తి నిషేధం విధించింది. హాంకాంగ్ కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ దేశం కూడా నిషేధం విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

జపాన్ సీఫుడ్ ఎగుమతుల్లో దాదాపు సగ భాగం ఈ రెండు దేశాలకే ఎగుమతి అవుతుంటాయి. ఈ నిషేధం కారణంగా జపాన్‌‌కి సుమారు 8,500 కోట్ల రూపాయల నష్టం కలగొచ్చని అంచనా.

తామే కొంటామంటోన్న జపాన్ ప్రభుత్వం

2021లో ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పుడే మత్స్యకారుల నుంచి పెద్దఎత్తున నిరసనలు రావడంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా జపాన్ ప్రభుత్వం అన్వేషించింది.

ఫుకుషిమా వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలిన తర్వాత మత్స్యకారులు పట్టిన చేపలను అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదురైతే, ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయనున్నట్లు ‘ది జపాన్ టైమ్స్’ మ్యాగజైన్ ప్రచురించిన కథనంలో పేర్కొంది.

ఫుకుషిమా సహా ఇతర సమీప ప్రాంతాల్లో పట్టిన చేపలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు అధికారులు చెప్పారని ఆ కథనంలో తెలిపింది.

ఫుకుషిమా రియాక్టర్

ఫొటో సోర్స్, Getty Images

చైనా, హాంగ్ ‌కాంగ్‌లో 'సుషీ' ప్రియుల క్యూ

ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌ వ్యర్థ జలాలను పసిఫిక్ మహా సముద్రంలోకి వదులుతున్నట్లు జపాన్ అధికారులు ప్రకటించారు. ప్రత్యేకంగా నిర్మించిన సొరంగ మార్గం ద్వారా వాటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఫుకుషిమా ప్లాంట్‌లో వెయ్యికి పైగా ట్యాంకులలో నిల్వ ఉంచిన రేడియో ధార్మిక వ్యర్థ జలాలను, వచ్చే 30 ఏళ్లలో కొద్దికొద్దిగా పసిఫిక్ మహా సముద్రంలో కలపాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది.

చైనా, హాంకాంగ్‌లో జపాన్ సీఫుడ్ వంటకం 'సుషీ' చాలా ఫేమస్. జపాన్ నిర్ణయం కారణంగా నిషేధం విధిస్తారని ముందే ఊహించిన స్థానికులు జపాన్ రెస్టారెంట్‌లకు క్యూ కడుతున్నారు. ఫలితంగా, కొద్దివారాలుగా జపాన్ రెస్టారెంట్‌‌ల వ్యాపారం పెరిగింది. ‌

''జపనీస్ సీఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను దానికి బానిస అయిపోయాను'' అని హాంగ్ కాంగ్‌లోని ఓ జపనీస్ రెస్టారెంట్ బయట వేచిచూస్తున్న హ్యూ చెప్పారు.

ఫుకుషిమా రియాక్టర్

ఫొటో సోర్స్, REUTERS

అసలు 2011లో ఫుకుషిమాలో ఏం జరిగింది?

2011 మార్చి 11న సంభవించిన భారీ భూకంపం జపాన్ తూర్పు తీరప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపింది. రిక్టర్ స్కేల్‌పై 9.0 మాగ్నిట్యూడ్‌తో వచ్చిన ఈ భారీ భూకంపం కారణంగా భూమి తన అక్షం నుంచి పక్కకు కూడా జరిగింది. అది భారీ సునామీకి కూడా కారణమైంది.

జపాన్‌‌ తీర ప్రాంతంలోని ప్రధాన ద్వీపం హోన్షు మీదుగా వచ్చిన ఈ సునామీ మ్యాప్ నుంచి కొన్ని పట్టణాలనే తుడిచిపెట్టేసింది. దాదాపు 18 వేల మందికి పైగా చనిపోయారు.

ఫుకుషిమా డాయిచి అణువిద్యుత్ కేంద్రం ఫుకుషిమా ప్రాంతంలోని ఒకుమాలో ఉంది. ఇది జపాన్ తూర్పు తీర ప్రాంతంలో, రాజధాని టోక్యో నగరం నుంచి ఈశాన్యంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అణువిద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలు భూకంపం రాబోతున్నట్లు ముందుగానే గుర్తించాయి. వెంటనే ఆటోమేటిక్‌గా రియాక్టర్లను షట్‌డౌన్‌ (పని నిలిపివేయడం) చేశాయి. అక్కడి కోర్ పరికరాల చుట్టూ చల్లబరిచే ద్రావణాలను చల్లేందుకు డీజిల్ జనరేటర్లు కూడా స్టార్ట్ అయ్యాయి.

అయితే, సుమారు 14 మీటర్ల ఎత్తున ( దాదాపు 46 అడుగుల ఎత్తున) వచ్చిన అలలు అణు విద్యుత్ కేంద్రాన్ని తాకాయి. అణువిద్యుత్ కేంద్రానికి రక్షణగా నిర్మించిన గోడను దాటి మరీ కేంద్రంలోకి భారీగా నీళ్లు చేరాయి. భారీగా వచ్చిన నీటితో ఎమర్జెన్సీ జనరేటర్లు కూడా పాడైపోయాయి.

విద్యుత్‌ను త్వరగా పునరుద్ధరించేందుకు కార్మికులు శ్రమించినప్పటికీ అణు ఇంధనాన్ని భద్రపరిచిన కొన్ని కోర్ పరికరాలు అధిక ఉష్ణోగ్రతల కారణంగా (మెల్ట్) వంగిపోయాయి.

రసాయన పేలుళ్ల కారణంగా ప్లాంట్‌లోని చాలా భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలోకి, పసిఫిక్ సముద్రంలోకి లీక్ కావడం ప్రారంభించడంతో స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

అణు కేంద్రం నుంచి రేడియేషన్ వెలువడడంతో ఆ పరిసరాలను అధికారులు నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించారు. సుమారు లక్షా యాభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అది జరిగి ఇప్పటికి దశాబ్దం గడచినా ఇప్పటికీ చాలా మంది స్థానికులు ఆ ప్రాంతానికి తిరిగి రాలేదు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు ట్రిలియన్ల యెన్‌లు(జపాన్ కరెన్సీ) ఖర్చు చేస్తున్నా, అవి పూర్తయ్యేందుకు సుమారు 40 ఏళ్లు పట్టొచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.

చెర్నోబిల్ విపత్తు తర్వాత ఆ స్థాయిలో సంభవించిన రెండో సంఘటన ఫుకుషిమా అణు విపత్తు అని, ప్రమాద తీవ్రతను లెవెల్ 7గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(అంతర్జాతీయ అణుశక్తి సంస్థ) పేర్కొంది.

ఇవి కూడా చదవండి: