చంద్రయాన్3: 'రోవర్ ప్రజ్ఞాన్' ఏం చేస్తుంది... అయిదు కీలక ప్రశ్నలు, సమాధానాలు

ఫొటో సోర్స్, ISRO
చంద్రయాన్-3 ఉపగ్రహం విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద అడుగు మోపింది. భారత్‌కు ఇది అతిపెద్ద విజయం.
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగుమోపిన తొలి దేశంగా భారత్ బుధవారం సాయంత్రం చరిత్ర సృష్టించింది.
భారత మూన్ రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై తొలి అడుగులు వేయడం కూడా ప్రారంభించింది.
‘‘చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ బయటకు వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై ఇది తొలి అడుగులు వేసింది’’ అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం వెల్లడించింది.
దీంతో చంద్రయాన్-3 మిషన్‌లోని మూడు లక్ష్యాలను ఇస్రో సాధించింది.
చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయినందుకు అన్ని దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం భారత్‌కు కంగ్రాట్స్ చెప్పారు.
పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ కూడా ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.
భారత్‌కు ఇది అతి పెద్ద విజయమంటూ కొనియాడారు.
‘‘చంద్రయాన్-3 చంద్రుడిపైకి చేరుకోవడం ఇస్రోకు అతిపెద్ద విజయం. ఇస్రో చైర్మన్ సోమనాథ్‌తో పాటు యువ శాస్త్రవేత్తలందరూ సంబరాలు చేసుకోవడం నేను చూశాను. కలలు కనే యువత మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు. గుడ్ లక్’’ అంటూ ఫవాద్ చౌదరీ ట్వీట్ చేశారు.
చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ కావడంతో, శాస్త్రీయ, సాంకేతిక ప్రపంచంలో భారత్ పురోగతిని ఇది ప్రతిబింబిస్తోంది.

ఫొటో సోర్స్, ANI
విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత, ఇప్పుడందరి చూపు 'రోవర్ ప్రజ్ఞాన్'పైనే.
'రోవర్ ప్రజ్ఞాన్' చంద్రుడి ఉపరితలంపై అడుగులు వేయడం కూడా ప్రారంభించింది.
ఇక ఇప్పుడు చంద్రయాన్-3 మిషన్ తదుపరి పనిని 'రోవర్ ప్రజ్ఞాన్' పూర్తి చేస్తుంది.
రోవర్ ఎలా పనిచేస్తుంది? చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏ విషయాలను ఇది కనుగొంటోంది? వంటి విషయాలను తెలుసుకునేందుకు శివ్ నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకాశ్ సిన్హాతో బీబీసీ మాట్లాడింది. అంతరిక్షం, రోబోటిక్స్, ఏఐ వంటి రంగాల్లో ఆకాశ్ సిన్హా అనుభవజ్ఞులు.
1. చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగింది... ఆ తర్వాత ఏంటి?
ఏ అంతరిక్ష పరిశోధనకు అయినా తుది అవుట్‌పుట్ రోవర్ నుంచి లేదా రోబోట్ నుంచి మాత్రమే వస్తుంది.
మిషన్ పూర్తయింది. మనం చంద్రుడిపై దిగాం. ఇక ఇప్పుడు రోవర్ ఏం చేస్తుంది?
ఇక్కడి నుంచే రోవర్ పని ప్రారంభమవుతుంది.
చంద్రుడిపైన ఉన్న మట్టి నమూనాలను సేకరించేందుకు వీలుగా రోవర్ చాలా స్మార్ట్‌గా రూపొందించారు.
చంద్రుడిపై ఇది నావిగేట్ అవుతూ, అది సేకరించిన డేటాను మనకు పంపిస్తుంది.

ఫొటో సోర్స్, ANI
2. చంద్రుడి ఉపరితలంపై రోవర్ ఎలా తిరుగుతుంది?
రోవర్ అనేది ఒక డ్రైవర్‌లెస్ కారు లాంటిది. ఇది చంద్రుడిపై దానికదే తిరుగుతూ ఉంటుంది.
దాని ఎదురుగా ఏదైనా గుంతలున్నాయా? రాళ్లున్నాయా? అని చూసుకుంటూ, వాటిని దాటుకుని వెళ్లగలదో లేదో దానికదే నిర్ణయించుకోవాలి.
దీని కోసం రోవర్‌లో రెండు స్మార్ట్ కెమెరాలను అమర్చారు.
ఈ కెమెరా సాయంతో రోవర్ దాని 3డీ మోడల్‌ను తయారు చేసుకుంటుంది. దాని సాయంతోనే నేవిగేట్ అవుతుంది.

ఫొటో సోర్స్, ISRO
3. ఇక్కడ రోవర్ ఏం గుర్తించగలదు?
ఈ మిషన్‌లో అతిపెద్ద లక్ష్యం చంద్రుడిపై ఉన్న నీటిని పరిశీలించడం. దీంతో పాటు, చంద్రుడిపై అరుదైన వాటిని కూడా ఈ రోవర్ సేకరించే అవకాశం ఉంది.
యురేనియం, బంగారం లేదా మరే ఇతర అరుదైన ఖనిజమైనా ఇక్కడ దొరకవచ్చు.
హీలియం-3 ఇక్కడ ఉండే అవకాశం ఉంది. దీంతో అణు ఇంధనాన్ని తయారు చేయొచ్చు.
రోవర్‌లో ఉన్న ప్రత్యేక సెన్సార్లన్నీ ఈ పనులు చేయనున్నాయి.
4. రోవర్ ఎలా కాంటాక్ట్‌ను ఏర్పాటు చేసుకుంటుంది?
కనెక్టివిటీ కోసం ఇస్రో ఈ సారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్‌లలో పదికి పైగా యాంటెన్నాలను అమర్చింది.
ప్రొపల్షన్ మాడ్యూల్ ఐడీఎస్‌ఎన్(ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్)తో కమ్యూనికేట్ అవుతుంది.
ల్యాండర్ మాడ్యూల్ ఐడీఎస్ఎన్‌తో, రోవర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. చంద్రయాన్-2 ఆర్బిటార్‌తో కూడా ఇది అనుసంధానమవుతుంది.
రోవర్ కేవలం ల్యాండర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది.

ఫొటో సోర్స్, ISRO
5. రోవర్‌తో పాటు భారత త్రివర్ణ జెండాను పంపించారా?
2008లోనే చంద్రుడి దక్షిణ ధ్రువానికి భారత్ తన త్రివర్ణ పతాకం లోగోతో వెళ్లింది.
ఇస్రో చంద్రుడి ఉపరితలం మీదకు పంపిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ దాదాపు దక్షిణ ధ్రువం వరకు వెళ్లింది.
దానిలో అమర్చిన మూన్ మైనరాలజీ మ్యాపర్ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి, చంద్రుడి మీద నీటి జాడలను గుర్తించినట్లుగా ఇస్రో ప్రకటించింది.
అయితే, ఈ సారి రోవర్‌లో త్రివర్ణ పతకాన్ని ఉంచలేదు. కానీ, మూడు రంగుల జెండా గుర్తును దాని మీద ముద్రించారు. ఈసారి ఇస్రో ఇంకా ప్రత్యేక ఏర్పాట్లతో, రోవర్‌ను చంద్రుడిపైకి పంపింది.
రోవర్ చక్రాలకు స్టాంప్స్‌ను ఉంచింది. ఒకవైపు జాతీయ చిహ్నం, మరోవైపు ఇస్రో లోగో ఉన్నాయి.
రోవర్ ఎక్కడికి వెళ్లే అక్కడే, ప్రతి అడుగుకూ చక్రాలపైనున్న ఇస్రో లోగో, చిహ్నాల ముద్రలు అక్కడి నేలపై పడుతూ ఉంటాయి.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ముద్రలు ఎప్పటికీ అలానే ఉంటాయి. ఎందుకంటే చంద్రుడిపై గాలి ఉండదు కనుక.
ఇలా చరిత్ర సృష్టించిన భారత్ ముద్రలు ఎప్పటికీ చంద్రుడిపై చిరస్థాయిగా నిలవనున్నాయి.
ఇవి కూడా చదవండి:
- చంద్రయాన్-3 ల్యాండింగ్‌లో ఆ 15 నిమిషాలే ఎందుకు కీలకం... ‘ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని ఇస్రో మాజీ చైర్మన్ ఎందుకన్నారు?
- చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది?
- చంద్రయాన్-3 Vs. లూనా-25 : ‘మినీ స్పేస్ రేస్’ అనడం కరెక్టేనా... ఇస్రో ఏమంటోంది?
- చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉన్న రహస్యాలేమిటి? ఇస్రో ఎందుకు అక్కడే ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తోంది
- ఇస్రోకు శ్రీహరికోట కంటే కులశేఖర పట్నంతోనే ఎక్కువ ఉపయోగమా, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















