చంద్రయాన్-3: ల్యాండర్ నుంచి దిగి చంద్రుడి మీద తొలి అడుగులు వేసిన 'రోవర్ ప్రజ్ఞాన్'

ఫొటో సోర్స్, ISRO
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
చంద్రుడిపై భారత మూన్ రోవర్ తొలి అడుగులు వేసింది.
చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుమోపిన తొలి దేశంగా భారత్ బుధవారం సాయంత్రం చరిత్ర సృష్టించింది.
‘‘చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ బయటకు వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై ఇది తొలి అడుగులు వేసింది’’ అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం వెల్లడించింది.
విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగడంతో అక్కడ సురక్షితంగా కాలు మోపిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ కూడా చేరింది.
విక్రమ్ ల్యాండర్ లోపల 26 కేజీల ప్రజ్ఞాన్ రోవర్‌ను పెట్టి పంపించారు.
ల్యాండింగ్ సమయంలో ఎగసిన దుమ్మూధూళి సర్దుకున్న తర్వాత విక్రమ్ ప్యానెల్స్ తెరచుకున్నాయి. ఇవి ప్రజ్ఞాన్ బయటకు వచ్చేందుకు ర్యాంప్‌ను ఏర్పాటుచేశాయి. వీటి గుండా రోవర్ కిందకు దిగింది.
అక్కడుండే రాళ్లు, బిలాల పరిసరాల్లో రోవర్ తిరుగుతుంది. కీలకమైన డేటాను సేకరించి భూమిపైకి ల్యాండర్, ఆర్బిటర్‌ల ద్వారా ఇది పంపిస్తుంది.

ఫొటో సోర్స్, ISRO
ప్రజ్ఞాన్‌లో రెండు పరికరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి చంద్రుడిపై ఖనిజాలను అన్వేషిస్తుంది. మరొకటి మట్టిలోని రసాయనిక స్వరూపంపై దృష్టిసారిస్తుంది.
ప్రజ్ఞాన్ కేవలం ల్యాండర్‌తో మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. ఆ ల్యాండర్ సమాచారాన్ని చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు పంపిస్తుంది. 2019లో పంపిన ఆ ఆర్బిటర్ ఇప్పటికీ కక్ష్యలోనే తిరుగుతోంది.
సెకనుకు ఒక సెం.మీ. వేగంతో రోవర్ తిరుగుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. రోవర్ వేస్తున్న ప్రతి అడుగుకూ చక్రాలపైనున్న ఇస్రో లోగో, చిహ్నాల ముద్రలు అక్కడి నేలపై పడుతుంటాయి.
చంద్రుడిపై రోజు మొదల కావడంతోనే అక్కడ ల్యాండింగ్ జరిగింది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమిపై 28 రోజులతో సమానం. అంటే ఇక్కడ 14 రోజులపాటు తన బ్యాటరీలను చార్జ్ పెట్టుకునేందుకు ల్యాండర్‌కు అవకాశం ఉంటుంది.
ఒకసారి రాత్రి అయితే, సూర్యరశ్మి లేకపోవడంతో అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. అయితే, మళ్లీ ఇక్కడ రోజు మొదలయ్యేటప్పుడు అవి పనిచేస్తాయో లేదో ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదు.

ఫొటో సోర్స్, ISRO
లాండర్‌లోనూ పరిశోధనల కోసం కొన్ని పరికరాలను ఏర్పాటుచేశారు. చంద్రుడి ఉపరితలంతోపాటు పైపొరల కింద ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.
చంద్రుడిపై ముఖ్యమైన ఖనిజాలు చాలా ఉన్నాయని భావించేటప్పటికీ ప్రస్తుత ప్రయోగంలో అక్కడి ధ్రువంలోని భారీ బిలాలపై నీటి జాడలను గుర్తించడంపైనే దృష్టిపెడుతున్నారు. అక్కడ మంచు రూపంలో నీరు ఉండొచ్చని, ఇది భవిష్యత్ మానవ ఆవాసాలకు ఉపయోగపడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరోవైపు అంగారకుడు, ఇతర సుదూర గ్రహాలపై యాత్రలకు కూడా అవసరమైన ఇంధనం కూడా ఇక్కడ లభించే అవకాశముంది.
బుధవారం సాయంత్రం విక్రమ్ ల్యాండింగ్‌కు సిద్ధమైనప్పుడు అందరిలోనూ ఉత్కంఠ, ఉద్వేగం కనిపించాయి. ల్యాండర్ వేగాన్ని సెకనుకు 1.68 కి.మీ.ల నుంచి నెమ్మదిగా జీరోకు తీసుకొచ్చారు. దీంతో చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అవకాశం ఏర్పడింది.
ఈ చరిత్రాత్మక ఘట్టం అనంతరం దేశ వ్యాప్తంగా వేడుక వాతావరణం నెలకొంది. ‘‘నేడు భారత్ చంద్రుడిపై అడుగుపెట్టాం. వేరే ఏ దేశమూ చేరుకోని ప్రాంతానికి మనం వెళ్లాం’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
రష్యాకు చెందిన లూనా-25 వ్యోమనౌక కుప్పకూలిన కొన్ని రోజుల్లోనే చంద్రయాన్-3 విజయం సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఎగుడుదిగుడ్లు, బండరాళ్లు, భారీ బిలాలతో కూడా పరిసరాలే లూనా విఫలం కావడానికి కారణంగా భావిస్తున్నారు.
భారత్ కూడా 2019లోనూ ఇలానే సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించింది. కానీ, ఆ ప్రయోగం సఫలం కాలేదు. ల్యాండర్‌తోపాటు రోవర్ కూడా అప్పట్లో కుప్పకూలాయి. అయితే, నాటి ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడు చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ తీసిన చిత్రాలు భూమి పైకి పంపేందుకు ఇది సాయం చేస్తోంది.
చంద్రడిపై ప్రస్తుతం దృష్టి సారించిన దేశం భారత్ ఒక్కటే కాదు. చాలా దేశాలు ప్రస్తుతం చంద్రుడిపై ప్రయోగాలతో సిద్ధం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- రూఢకోట: ఈ ఊరి మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు
- చంద్రయాన్ 3: స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్లపై కనిపించే బంగారు రంగు కవరింగ్ ఏమిటి?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















