రాకేశ్ శర్మ అంతరిక్షంలో ఏం చేశారు? అక్కడి నుంచి చూస్తే భారతదేశం ఎలా కనిపించింది?

అంతరిక్షయానం చేసిన రాకేశ్ బృందం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ. ఆయన 1984లో అంతరిక్షయానం చేశారు.

అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత భారతీయులు రాకేశ్‌ను అంతరిక్షంలో దేవుడిని కలిశారా? అని అడిగేవారు. "లేదు, నాకు కనిపించలేదు" అని సమాధానం ఇచ్చేవారు రాకేశ్.

ఆయన అంతరిక్షయానం చేసి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతోంది. ఇప్పుడు ఆయన దగ్గరికొచ్చే అభిమానులు వాస్తవం, కల్పనల మధ్య తేడాను సులభంగా గుర్తిస్తున్నారు.

"ఇప్పుడు నా దగ్గరకు వచ్చే చాలా మంది ఆడవాళ్లు ఈ అంకుల్ చంద్రుడి మీదకి వెళ్లాడని చెప్పి వాళ్ల పిల్లలకు పరిచయం చేస్తున్నారు" అని అంటున్నారు రాకేశ్.

అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత ఒక ఏడాది వరకు రాకేశ్ శర్మ చుట్టూ అభిమానులు గుమిగూడేవారు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమానికి వెళుతుండేవారు. హోటళ్లు, అతిథి గృహాల్లో బస చేసేవారు.

రాకేశ్ శర్మతో అభిమానులు ఫోటోలు దిగేవారు, పలు కార్యక్రమాల్లో ఆయన ఉపన్యాసాలు కూడా ఇచ్చేవారు.

రాకేశ్ శర్మ

ఫొటో సోర్స్, Rakesh Sharma

ఫొటో క్యాప్షన్, రాకేశ్ శర్మ

అభిమానుల తాకిడికి బట్టలు చిరిగిపోయేవి

వయసులో పెద్దవారైన మహిళలు రాకేశ్ శర్మను ఆశీర్వదించేవారు. కొన్ని సందర్భాల్లో అభిమానుల తాకిడికి రాకేశ్ బట్టలు కూడా చినిగిపోయేవి.

ఆటోగ్రాఫ్‌ల కోసం కేకలు వేసేవారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం రాకేశ్‌ను ర్యాలీలకు ఆహ్వానించేవారు.

రాకేశ్ శర్మ పాత రోజులను గుర్తు చేసుకుంటూ- "ఇది పూర్తిగా భిన్నమైన అనుభూతి. అభిమానుల క్రేజ్ చిరాకు వేసేది, విసిగిపోయేవాడిని. నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉండాల్సి వచ్చేది" అని చెప్పారు.

21 ఏళ్ల వయసులో రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో చేరారు. అక్కడ ఆయన సూపర్ సోనిక్ జెట్ ఫైటర్ విమానాలను నడిపేవారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలోనూ సేవలందించారు. అప్పటికి రాకేశ్‌కు 23 ఏళ్లు కూడా లేవు.

25 ఏళ్లకే రాకేశ్ శర్మ ఎయిర్ ఫోర్స్‌లో ఉత్తమ పైలట్.

అయితే రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేసిన 1984లో భారత్‌లో పరిస్థితులు ఏమంత బాగాలేవు.

ఆ ఏడాది సిక్కు వేర్పాటువాదుల ఊచకోత జరిగింది. అంతేకాదు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ గ్యాస్ ప్రమాదం కూడా అదే ఏడాది జరిగింది. ప్రపంచంలోని అత్యంత విషాదకర ఘటనగా ఈ ప్రమాదం నిలిచింది.

అంతరిక్ష యానం చేసిన బృందం

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES VIA GETTY

ఇండియా నుంచి ఎవరెవరు ఎంపికయ్యారు?

ఇందిరా గాంధీ భారత అంతరిక్ష కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. దీని కోసం, ఆమె సోవియట్ యూనియన్ సహాయం కూడా తీసుకున్నారు.

అంతరిక్ష యానం కోసం 50 మంది ఫైటర్ పైలట్లకు నిర్వహించిన పరీక్షలో భారత్ నుంచి రాకేశ్ శర్మ, రవీష్ మల్హోత్రా ఎంపికయ్యారు. దీంతో వారిద్దరినీ రష్యాలో శిక్షణ కోసం పంపారు.

అంతరిక్షంలోకి వెళ్లడానికి ఏడాది ముందు అంటే 1983లో రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రా మాస్కోకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టార్ సిటీకి వెళ్లారు. అది వ్యోమగాముల శిక్షణ కేంద్రం.

"అక్కడ చాలా చల్లగా ఉండేది. మేం మంచులో ఒక భవనం నుంచి మరొక భవనం వరకు నడవాల్సి వచ్చేది" అని రాకేశ్ గుర్తుచేసుకున్నారు.

శిక్షణ కోసం వీలైనంత త్వరగా రష్యన్ భాష నేర్చుకోవడం ఆయన ముందున్న సవాలు. ఎందుకంటే ఆయన శిక్షణ ఎక్కువగా రష్యన్ భాషలో నడుస్తుంది.

రోజూ రాకేశ్ శర్మ ఆరు నుంచి ఏడు గంటలు రష్యన్ భాష నేర్చుకోవడానికే కేటాయించేవారు. దీంతో ఆయన మూడు నెలల్లోనే రష్యన్ నేర్చుకున్నారు.

శిక్షణ సమయంలో పైలట్ల ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఒలింపిక్ పోటీల శిక్షకులు, రాకేశ్ స్టామినా, వేగం, బలాన్ని గమనించి ఆయనకు శిక్షణ ఇచ్చారు.

''అదేం పెద్ద కష్టమైన పనికాదు. శిక్షణ సమయంలోనే నేను ఎంపికయ్యానని, బ్యాకప్‌గా రవీష్ మల్హోత్రా ఉంటారని చెప్పారు ’’ అని తెలిపారు రాకేశ్ శర్మ.

"స్పేస్ ప్రోగ్రామ్స్ లేని దేశానికి చెందిన వ్యక్తి రాకేశ్. వ్యోమగామి అవుతానని ఆయన కలలో కూడా అనుకొని ఉండరు. కానీ విభిన్న భౌగోళిక పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కఠినమైన శిక్షణ పొందాడు. అతను ఒక కొత్త భాష నేర్చుకున్నాడు. ఆయన నిజంగా ఒక హీరో" అని సైన్స్ రచయిత పల్లవ్ బాగ్లా తన పుస్తకంలో రాశారు.

రాకేశ్ శర్మ

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES VIA GETTY

అంతరిక్షయానం బోరింగ్‌గా అనిపించిందా?

1984 ఏప్రిల్ 3న రష్యన్ వ్యోమగాములైన యూరి మలిషెవ్, గెన్నాడీ స్ట్రెకలోవ్‌లతో కలిసి రాకేష్ శర్మ సోవియట్ రాకెట్‌ (సూయజ్ టీ 11)లో అంతరిక్షానికి బయలుదేరారు.

అప్పటి సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్‌లోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ బయలుదేరింది.

ఆ క్షణాన్ని రాకేశ్ గుర్తు చేసుకుంటూ, "మేం వెళ్లేటపుడు బోరింగ్‌‌గా అనిపించింది, ఎందుకంటే మేం దాన్ని చాలాసార్లు ప్రాక్టీస్ చేశాం. మాకు రొటీన్‌ అయిపోయింది" అన్నారు.

భూమి నుంచి అంతరిక్షానికి వెళుతున్నప్పుడు ఆందోళన చెందారా అని అడిగితే.. "చూడండి, అప్పటికి నేను అంతరిక్షంలోకి వెళ్లిన 128వ వ్యక్తిని. 127 మంది సజీవంగా తిరిగి వచ్చారు. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు" అని రాకేష్ సమాధానం ఇచ్చారు.

ఈ అంతరిక్ష యాత్ర భారత్, సోవియట్ యూనియన్‌ల మధ్య స్నేహాన్ని మరింత దృఢపరుస్తుందని మీడియా వార్తలు కూడా రాసింది.

రాకేష్ శర్మ, ఆయన సహ వ్యోమగాములు దాదాపు 8 రోజులు అంతరిక్షంలో గడిపారు.

ఇందిరాగాంధీ

ఫొటో సోర్స్, HARI ADIVAREKAR

'సారే జహా సే అచ్చా'

అంతరిక్షంలో యోగా చేసిన మొదటి వ్యక్తి రాకేశ్ శర్మ. అక్కడి గ్రావిటీ పరిస్థితులను తట్టుకోవడానికి యోగా సాయపడుతుందా అని తెలుసుకోవడానికి ఆయన అలా ప్రయత్నించారు.

''అది చాలా కష్టం. నీ పాదాల కింద ఏం లేనట్లుంటుంది. గాలిలో తేలుతుంటారు. అందుకే మా కోసం ఏదో మార్గం వెతకాల్సి వచ్చింది'' అని అన్నారు రాకేశ్.

అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా ఉందని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, రాకేష్ శర్మను అడిగితే హిందీలో 'సారే జహా సే అచ్చా' (ప్రపంచంలోనే ఉత్తమమైంది) అని అన్నారు.

ఇది మహ్మద్ ఇక్బాల్ రచన. పాఠశాల రోజుల్లో జాతీయ గీతం తర్వాత ఆయన దీన్ని రోజూ పాడుకునేవారు.

"నాకు బాగా గుర్తుంది. భారత్ అంతరిక్షం నుంచి చాలా ఆకర్షణీయంగా కనిపించింది" అని రాకేశ్ గుర్తుచేసుకున్నారు.

భారత్ సొంతగా మానవులతో అంతరిక్షయానం జరపాలంటే చాలా సమయం పడుతుందని న్యూయార్క్ టైమ్స్ అప్పట్లో రాసింది. అంతరిక్షంలో చాలా కాలం గడిపిన భారతీయుడిగా రాకేశ్ శర్మ గుర్తుండిపోతారని తెలిపింది.

రాకేశ్ శర్మ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత జెట్ పైలట్‌గా మళ్లీ తన జీవితాన్ని ప్రారంభించారు.

ఆయన జాగ్వార్, తేజస్‌ విమానాలనూ నడిపారు. ఓడలు, ట్యాంకులు, జలాంతర్గాముల కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన బోస్టన్‌కు చెందిన కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కూడా రాకేశ్ పనిచేశారు.

రాకేశ్ శర్మ
ఫొటో క్యాప్షన్, రాకేశ్ శర్మ

మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నారా?

రాకేశ్ శర్మపై బయోపిక్ తీయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇందులో రాకేశ్ పాత్రను అమీర్ ఖాన్ పోషిస్తారనే చర్చా జరుగుతోంది.

ఇక చివరగా మీరు మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నారా? అని అడిగితే..

రాకేశ్ తన ఇంటి బాల్కనీ నుంచి బయటకు చూస్తూ "మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లడం నాకూ ఇష్టమే. కానీ ఈసారి టూరిస్ట్‌గా వెళ్లాలనుకుంటున్నా. నాకు అక్కడ చాలా పని ఉంది" అని బదులిచ్చారు.

(గమనిక: రాకేశ్ శర్మ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ మొదటిసారిగా 2017 మార్చి 14న ప్రచురితమైంది.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)