BRICS కూటమి ఎలా మొదలైంది? ఇందులో చేరాలని 40 దేశాలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాల నాయకులు జోహన్నెస్‌బర్గ్‌లో ఆగస్టు 22న సమావేశం కాబోతున్నారు. ఈ కూటమిలో ఇతర దేశాలకు సభ్యత్వం కల్పించాలా? అనే అంశంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఈ సమావేశానికి ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా.. ఈ కూటమిలో 40 కంటే ఎక్కువ దేశాలు సభ్యత్వం కోరుతున్నట్లు తాజాగా వెల్లడించింది.
బ్రిక్స్ ఎలా ఏర్పాటైంది?
2001లో ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్‌లో ఎకానమిస్టు జిమ్ ఓ నీల్ తొలిసారిగా బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలకు ‘బ్రిక్’ అనే పదాన్ని ఉపయోగించారు.
ఆనాటికి ఈ నాలుగు దేశాలూ వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్య ఆదాయ దేశాలు. 2050 నాటికి ప్రపంచానికి బ్రిక్ దేశాలు నేతృత్వం వహించగలవని నీల్ అంచనా వేశారు.
2006లో ఈ నాలుగు దేశాలు కలిపి ‘బ్రిక్ గ్రూప్’ ఏర్పాటుచేయాలని నిర్ణయించాయి. దక్షిణాఫ్రికా 2010లో ఈ గ్రూపులో చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిక్స్ ప్రాధాన్యం ఎంత?
బ్రిక్స్ దేశాల మొత్తం జనాభా 324 కోట్లు. వీటి మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 26 ట్రిలియన్ డాలర్లు (రూ. 2,162 లక్షల కోట్లు). అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26 శాతం.
అయితే, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లలో ఓటింగ్ హక్కులు ఈ కూటమికి 15 శాతం మాత్రమే ఉన్నాయని అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ‘అట్లాటింక్ కౌన్సిల్’ అంచనా వేసింది.
బ్రిక్స్ లక్ష్యం ఏమిటి?
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు, గళాన్ని వినిపించేందుకు ఈ కూటిమి ఏర్పాటైంది.
2014లో బ్రిక్స్ దేశాలు 250 బిలియన్ డాలర్లతో (రూ.20.78 లక్షల కోట్లు) న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ)ను ఏర్పాటుచేశాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వడమే దీని లక్ష్యం.
బ్రిక్స్‌లో సభ్యత్వంలేని ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లకు ఎన్‌డీబీలో సభ్యత్వముంది.
బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ ఉందా?
అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా డాలరుకు పోటీగా ఉమ్మడి కరెన్సీని ఏర్పాటుచేయాలని బ్రిక్స్ దేశాల ప్రధాన నాయకులు పిలుపునిచ్చారు.
అయితే, ప్రస్తుతం జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం అజెండాలో ఉమ్మడి కరెన్సీ లేదని బ్రిక్స్‌కు దక్షిణాఫ్రికా దౌత్యవేత్త అనిల్ సూక్లాల్ చెప్పారు.
అయితే, బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ అవసరంలేదని ‘బ్రిక్’ ప్రతిపాదనను తొలిసారి తీసుకొచ్చిన జిమ్ ఓ నీల్ బ్రిటన్ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిక్స్ బలం, బలహీనతలు ఏమిటి?
బ్రిక్స్‌లోని ప్రతి దేశమూ ఆయా ప్రాంతాల్లో ప్రధాన దేశమని ట్రినిటీ కాలేజీ డబ్లిన్‌లో డెవలప్‌మెంట్ జీయోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ పడ్రియాగ్ కార్మొడీ చెప్పారు.
వీటిలో చైనాకు మరింత ఎక్కువ ప్రాధాన్యమున్నట్లు చెప్పుకోవాలని ఆయన అన్నారు. ‘‘బ్రిక్స్ ద్వారా దక్షిణార్థ గోళంలోని దేశాలకు అంతర్జాతీయ వ్యవహారాలు, హక్కుల్లో ప్రాధాన్యం పెరగాలని చైనా కూడా కోరుకుంటోంది’’ అని ఆయన అన్నారు.
అయితే, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ప్రత్యర్ధిగా భారత్‌ను చెప్పుకోవాలి. చైనాతో సుదీర్ఘమైన సరిహద్దుల వెంబడి భారత్‌కు చాలా వివాదాలు ఉన్నాయి. మరోవైపు ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికాతో కలిసి భారత్ పనిచేస్తోంది.
పశ్చిమ దేశాలతో సంబంధాల విషయంలోనూ బ్రిక్స్ దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి.
‘‘బ్రిక్స్‌ను పశ్చిమ దేశాలతో పోరాటానికి ప్రతీకగా రష్యా చూస్తోంది. యుక్రెయిన్‌పై దాడి తర్వాత విధించిన ఆంక్షలను దీని ద్వారా తప్పించుకోవాలని రష్యా చూస్తోంది’’ అని లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ఛాటమ్ హౌస్‌లోని గ్లోబల్ ఎకానమీ, ఫైనాన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ క్రియాన్ బట్లర్ అన్నారు.
రష్యా చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత, ఈ చమురును భారత్, చైనా భారీగా దిగుమతి చేసుకున్నాయి.
మరోవైపు 2023 ఫిబ్రవరిలో చైనా, దక్షిణాఫ్రికాలతో రష్యా సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేపట్టింది.
అయితే, బ్రిక్స్‌లో ఇతర దేశాలు ఈ కూటమిని చైనా వ్యతరేక కూటమిగా భావించడం లేదు.
‘‘దక్షిణాఫ్రికా, బ్రెజిల్, భారత్‌లు ప్రపంచ దేశాలు రెండు కూటములుగా విడిపోవడాన్ని కోరుకోవడం లేదు. పశ్చిమ దేశాలను వ్యతిరేకించడమనేది వారి భద్రత, అభివృద్ధికి చేటు చేస్తుందని ఈ దేశాలు బాగా తెలుసు.’’ అని బట్లర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిక్స్‌లో ఏ దేశాలు చేరాలని కోరుకుంటున్నాయి?
ఈ గ్రూపులో చేరేందుకు 22 దేశాలు అధికారికంగా అభ్యర్థనలు పంపించినట్లు దక్షిణాఫ్రికా దౌత్యవేత్త అనిల్ సూక్లాల్ చెప్పారు. మరో 22 దేశాలు కూడా సభ్యత్వంపై ఆసక్తి చూపించినట్లు ఆయన వివరించారు.
ఇరాన్, అర్జెంటీనా, క్యూబా, కజఖ్‌స్తాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనెజువెలా లాంటి దేశాలు ఆయన చెప్పిన దేశాల జాబితాలో ఉన్నాయి.
‘‘అధికారం ప్రస్తుతం పశ్చిమ దేశాల నుంచి బ్రిక్స్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వైపుగా మారుతోంది. ఈ విషయాన్ని చాలా దేశాలు గుర్తిస్తున్నాయి’’ అని ప్రొఫెసర్ కార్మొడీ అన్నారు.
‘‘కానీ, బ్రిక్స్ అనేది ప్రత్యేకమైన కూటమి. ఇతర దేశాలను చేర్చుకుంటే తమ ప్రాబ్యలం తగ్గిపోతుందని ఈ కూటమిలోని కొన్ని దేశాలు భావించొచ్చు. అయితే, ప్రస్తుతం అర్జెంటీనా లాంటి కొన్ని దేశాలకు మాత్రం సభ్యత్వం ఇవ్వొచ్చు. ఇరాన్ లాంటి సంక్లిష్టమైన దేశాల జోలికి వీరు పోకపోవచ్చు’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిక్స్ సదస్సులో ఏం చర్చిస్తారు?
ఆగస్టు 22-24 మధ్య జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ దేశాల సదస్సు జరగబోతోంది.
కొత్తగా ఏ దేశాలకు సభ్యత్వం ఇవ్వాలనే అంశంపై ఈ సదస్సులో చర్చించే అవకాశముంది.
ఆ తర్వాత, వాతావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు లాంటి అంశాలపైనా చర్చ జరిగే అవకాశముంది.
ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, కరీబియన్ ప్రాంతాలకు చెందిన 60కిపైగా దేశాలకు ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఆహ్వానం పంపించింది.
అయితే, ప్రస్తుత సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై అరెస్టు వారెంటు కూడా జారీ చేసింది.
ఆ కోర్టులో దక్షిణాఫ్రికాకు సభ్యత్వముంది. అంటే తమ భూభాగంలోకి పుతిన్ అడుగుపెడితే, తప్పకుండా ఆయన్ను కోర్టుకు అప్పగించాల్సి ఉంటుంది.
సదస్సుకు వర్చువల్‌గా హాజరు కాబోతున్నట్లు పుతిన్ చెప్పారు. తన బదులుగా రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్తారని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
- భారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















