భారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విదేశీ విద్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉన్నత చదువుల కోసం వెళ్లిన 21 మంది భారత విద్యార్థులను అమెరికా వెనక్కి తిప్పి పంపించింది.

విమానాశ్రయంలో దిగిన వెంటనే చేసిన ఇమ్మిగ్రేషన్ తని‌‍ఖీలలో 21 మంది విద్యార్థుల వద్ద సరైన పత్రాలు లేవని అక్కడి అధికారులు గుర్తించి, ఆ తర్వాతి విమానంలోనే వారిని వెనక్కి పంపించేశారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమెరికా వెళ్తున్న ఎంతో మంది విద్యార్థులను ఏవో కారణాలతో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపిస్తున్నట్లు చెబుతున్నారు.

తాజా పరిణామంతో, అమెరికా వెళ్తున్న విద్యార్థులను అక్కడి అధికారులు ఎందుకు వెనక్కి పంపుతున్నారు? వీసాలు ఉన్నా చదువుకునేందుకు ఎందుకు అనుమతించడం లేదు? ఒక్కసారి తిరస్కరణకు గురై వెనక్కి వస్తే మళ్లీ వెళ్లడం సాధ్యం కాదా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏం జరిగింది?

సెప్టెంబరులో మొదలయ్యే విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో చేరేందుకు అమెరికా వెళ్లిన 21 మంది విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి తిప్పి పంపించేశారు. వీరు ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు.

సరైన పత్రాలు చూపకపోవడంతోపాటు, మరికొన్ని అంశాలు ఇలాంటి పరిస్థితికి కారణమవుతాయని అమెరికాలోని మిచిగాన్‌‌కు చెందిన యూనివర్సిటీ హబ్ కన్సల్టెన్సీ సీఈవో డాక్టర్ అనిల్ పల్లా బీబీసీతో చెప్పారు.

‘‘అమెరికా వెళ్లే విద్యార్థులు సోషల్ మీడియాలో చాటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎఫ్-1 వీసా నిబంధనలు పక్కాగా ఉంటాయి. చదువుకునేందుకు వెళ్లినప్పుడు చదువు కోసమే అన్నట్లుగా ఉండాలి. జాబ్ గురించి, వసతి, వేర్వేరు ప్రాంతాలకు వె‌‍ళ్లడం గురించి ముందుగానే అక్కడ తెలిసిన వారితో సోషల్ మీడియా చాటింగులలో వాకబు చేస్తుంటారు. అలాంటప్పుడు అమెరికన్ అధికారులు విద్యార్థులను అనుమానిస్తారు. అంతేకాదు, అలాంటి వారిని అమెరికాలో ప్రవేశించనివ్వకుండా నిషేధం విధిస్తారు’’ అని ఆయన హెచ్చరించారు.

అమెరికన్ అధికారులకు సమాధానాలు ఇచ్చే విషయంలో అక్కడి యాక్సెంట్(భాష ఉచ్చారణ)ను అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా సమాధానాలు తడబాటు లేకుండా ఇవ్వాలని ఆయన చెప్పారు.

ఈ విషయంలో కన్సల్టెన్సీలు విద్యార్థులను ముందుగానే హెచ్చరించకపోవడంతో సమస్యలు వస్తున్నాయి.

విదేశీ విద్య

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థుల ఆశలు అధికారుల తనిఖీలతో ఆవిరి

‘‘కన్సల్టెన్సీలు వ్యాపార ధోరణిలోనే ఆలోచిస్తాయి. అంతే తప్ప విద్యార్థులకు అవసరమైన సూచనలు చేయవు. నిజానికి ఆ విద్యార్థులందరూ అమెరికా వచ్చి జాబ్ చేయరు. కానీ, ఏదో ఆత్రం కొద్దీ అడిగి చిక్కుల్లో పడుతుంటారు’’ అని డాక్టర్ అనిల్ పల్లా చెప్పారు.

ప్రస్తుతం వివిధ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొంది అమెరికా చేరుకుంటున్న విద్యార్థులకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి.

వీసాలు వచ్చాయని, అడ్మిషన్ వచ్చిందనే సంతోషంతో అక్కడికి చేరుకుంటున్నారు. కానీ, ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలతో వారి ఆశలు ఆవిరవుతున్నాయి.

‘‘సహజంగా అమెరికా వచ్చే విద్యార్థులందరినీ తని‌ఖీ చేయరు. ర్యాండమ్‌గా ఎంచుకుని చెక్ చేస్తుంటారు. వారు చదువుకునేందుకే వచ్చారా? మరేదైనా పనులు కూడా చేసేందుకు వచ్చారా? అనే కోణంలో ఆరా తీస్తారు.

ఇతర దేశాల విద్యార్థులు చదువుకునేందుకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని ఇక్కడి అధికారులు భావిస్తున్నారు. దాని వల్ల ఇక్కడి వారికి ఉద్యోగావకాశాలు ఉండటం లేదనుకుంటున్నారు. దీనికి తోడు విద్యార్థి వీసాపై వచ్చినప్పుడు చదువుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది’’ అని అమెరికాలో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన వేమూరి రాకేశ్ ‘బీబీసీ’తో చెప్పారు.

విదేశీ విద్య

ఫొటో సోర్స్, Getty Images

తని‌‍ఖీలలో ఏమేం పరిశీలిస్తారు?

విద్యార్థులను ర్యాండమ్‌గా ఎంచుకుని తనిఖీ చేసే సమయంలో వారి ఆర్థిక పరిస్థితి, యూనివర్సిటీ ఫీజులు, బ్యాంకు అకౌంట్ల వివరాలు తదితర అంశాలను పరిశీలిస్తారని హైదరాబాద్‌కు చెందిన అపెక్స్ కన్సల్టెన్సీ నిర్వాహకులు హెచ్ఎం ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

‘‘విద్యార్థులను ఎక్కువగా ఫైనాన్షియల్ విషయాలపై ప్రశ్నలు అడుగుతుంటారు. వారు సొంతంగా ఫీజులు కట్టగలుగుతారా, లేదా అనేది చూస్తారు. విద్యార్థి, తండ్రికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకుని బ్యాంకు బ్యాలెన్సు ఎంత ఉందో చూస్తారు. అంతకుముందు ఇచ్చిన డాక్యుమెంట్లతో పోల్చి చూసుకుంటారు.

కొందరు కన్సల్టెన్సీల నిర్వాహకులు ఫేక్ డాక్యుమెంట్లు పెడతారు. అప్పుడు ఇబ్బంది అవుతుంది.’’ అని ఆయన చెప్పారు.

వీసాలు ఇవ్వడం ఎందుకు, మళ్లీ అనుమానంతో తని‌‍ఖీ చేసి నిలిపివేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

మూడేళ్ల కిందట పరిస్థితులు చూస్తే, దుబాయి వంటి ప్రాంతాల్లోనే నిలిపివేసిన సంఘటనలు కూడా ఉన్నాయని ప్రసాద్ చెప్పారు.

విదేశీ విద్య

ఫొటో సోర్స్, Getty Images

ఇమ్మిగ్రేషన్ అధికారుల ప్రశ్నలు

అమెరికాలో దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు వేసే ప్రశ్నలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ, విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేవిగా ఉంటున్నాయని కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.

డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయా?

బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది?

క్రెడిట్ కార్డు ఉంటే ఎంత వాడారు?

ఫోన్ చెక్ చేయొచ్చా?

(ఫోన్ ఇచ్చిన తర్వాత అందులోని డేటాను చూస్తారు. వాట్సాప్ చాటింగ్‌లు, సోషల్ మీడియాలో పోస్టులను పరిశీలిస్తారు.)

అనారోగ్యానికి ఏవైనా మందులు వాడుతున్నారా?

అమెరికాలో ఎక్కడ ఉంటున్నారు?

ఎవరైనా బంధువులు లేదా స్నేహితులు తెలుసా?

ఆన్లైన్ క్లాసులకు రిజిస్టర్ చేసుకున్నారా?

మీతోపాటు ఎన్ని డాలర్లు తెచ్చుకున్నారు?

కాన్సులేట్‌కు డాక్యుమెంట్లు ఇచ్చే సమయంలో మీరు చెప్పిన వివరాలు ఏమిటి?

ఇలా వివిధ ప్రశ్నలు అడుగుతున్నారు.

తప్పుడు సమాచారం ఇస్తే భారీ జరిమానా

ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాచారమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ముందుగా విద్యార్థులు చెప్పిన సమాధానాలను నోట్ చేసుకుంటారు.

ఈ సమాధానాలతో సంతృప్తి చెందకపోతే 'డిపోర్ట్' చేస్తున్నారు.‌‍ అలాంటి విద్యార్థులు వెంటనే మరో విమానంలో స్వదేశానికి వచ్చేయాల్సి ఉంటుంది.

తప్పుడు సమాచారం ఇస్తే రెండున్నర లక్షల డాలర్ల ఫైన్ వేస్తామని వారు ఇచ్చే పత్రాల్లో ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు.

విదేశీ విద్య

ఫొటో సోర్స్, Getty Images

డిపోర్ట్ చేస్తే మళ్లీ అమెరికా వెళ్లలేరా?

ఇమ్మిగ్రేషన్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే విద్యార్థులను డిపోర్ట్ చేస్తారు. దీంతో ఆ విద్యార్థి తిరిగి ఐదేళ్ల వరకు చదువుకునేందుకు అమెరికా వెళ్లేందుకు వీలుండదు. వీసా రాకుండా బ్లాక్ లిస్టులో పెడతారు. అయితే, ఈ నిషేధం అమెరికాకే పరిమితం అవుతుంది. ఇది వేరే దేశాలకు వర్తించదు.

‘‘బ్యాన్ అయితే విద్యార్థి కెరీర్‌కు అది బ్లాక్ మార్క్ అవుతుంది. బ్యాన్ అమెరికాకే పరిమితం. వేరే దేశాలకు వెళ్లాలనుకుంటే విద్యార్థులు వెళ్లొచ్చు.

కానీ, అమెరికా బ్యాన్ చేసిందని తెలిస్తే ఆ దేశాల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది’’ అని న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ కవితా రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.

ఈసారి రికార్డు స్థాయిలో వీసాలు

కోవిడ్-19 తర్వాత విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ లోటును భర్తీ చేసేందుకు గత రెండేళ్లుగా విదేశీ యూనివర్సిటీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా ఆయా దేశాలు కూడా ఇతర దేశాల విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాలు ఎక్కువగా వీసాలు జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా భారత విద్యార్థుల కోసం అధిక సంఖ్యలో వీసాలు ఇస్తున్నాయి.

చైనా తర్వాత భారత్ నుంచే అత్యధికంగా ‌అమెరికాకు వెళుతున్నారని కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.

విదేశీ విద్య

ఫొటో సోర్స్, Getty Images

స్టాటిస్టా రీసర్చ్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం 2021-22లో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులలో అత్యధికంగా చైనా, ఇండియా నుంచే ఉన్నారు.

చైనా నుంచి 2,90,086 మంది విద్యార్థులు ఉండగా, ఇండియా నుంచి 1,99,182 మంది అమెరికాలో చదువుకుంటున్నారు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులకు వీసాలు ఇచ్చినట్లు అమెరికా ఎంబసీ ప్రకటించింది.

జూన్ ఏడో తేదీన విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేసింది. నిరుడు ఈ సంఖ్య 1.15 లక్షలుగా ఉంది.

వీసాలు ఎక్కువగా ఇస్తుండటంతో విద్యార్థులు అమెరికా వె‌‍ళ్లేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే, ఆర్థిక వ్యవహారాలు, సోషల్ మీడియా చాటింగ్, వీసా నిబంధనలను అతిక్రమించడం వంటి వి‌‍షయాల్లో చిక్కులు ఎదురై కొందరు వెనక్కి వచ్చేస్తున్నారని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి: