చంద్రయాన్ 3: చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉన్న రహస్యాలేమిటి? ఇస్రో ఎందుకు అక్కడే ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తోంది

చంద్రుడు

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చంద్రుడిపైకి భారత్ ప్రయోగించిన మూడో గ్రహాంతర మిషన్ చంద్రయాన్ - 3.

జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి బయలుదేరిన చంద్రయాన్ 3... 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే ప్రయత్నంలో ఉంది.

చంద్రయాన్ 1లోని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ సహా, చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను కూడా ఇదే ప్రాంతంలో ల్యాండ్ చేసే లక్ష్యంతో పంపించారు.

ఇప్పుడు చంద్రయాన్ 3 కూడా ఇక్కడే ల్యాండవబోతోంది.

అయితే, చంద్రయాన్ 1లోని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్... చంద్రుడి దక్షిణ ధ్రువంపై క్రాష్ ల్యాండ్ అయింది.

చంద్రయాన్ 2లోని ల్యాండర్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ చివరి నిమిషంలో సంకేతాలు నిలిచిపోయాయి.

కానీ, ఇప్పుడు చంద్రయాన్ 3తో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ను నిలపాలని ఇస్రో ప్రయత్నిస్తోంది.

అయితే, ఆగస్ట్ 11న రష్యా ప్రయోగించిన లూనా 25 కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే లూనా 25 లోని కెమెరాలు తీసిన ఫోటోలను రష్యన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది.

అన్నీ సవ్యంగా సాగితే ఆగస్ట్ 21నే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు సన్నాహాలు చేస్తోంది రష్యా.

అయితే ఈ ప్రయత్నంలో ఎవరు ముందుంటారు అన్నది వేచి చూడాల్సిందే.

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, ISRO

ఎవ్వరూ దిగని ప్రదేశంలో ఎందుకు ఇస్రో ప్రయత్నాలు?

అంతరిక్ష ప్రయోగాలు చేస్తోన్న దేశాలకు గ్రహాంతర ప్రయోగాలు అన్నది కీలకమైన అంశం.

సౌర కుటుంబంలో భూమికి అతి దగ్గరగా ఉన్న ఖగోళం చంద్రుడే. అందుకే చంద్రుడి మీద ప్రయోగాలు చేసేందుకు తొలినాటి నుంచి అమెరికా, రష్యాలు పోటీ పడుతూనే ఉన్నాయి.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, రష్యాల మధ్య స్పేస్ వార్ మొదలైందని చెప్పుకోవచ్చు.

అంతరిక్ష ప్రయోగాల్లో ముందుండేందుకు రెండు దేశాలు పోటాపోటీగా ప్రయోగాలు చేస్తూ వచ్చాయి.

నాటి సోవియెట్ రష్యా 1955లో సోవియెట్ స్పేస్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. అమెరికా కూడా 1958లో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ నాసాకు శ్రీకారం చుట్టింది.

తొలినాళ్లలో శాటిలైట్లను ప్రవేశ పెట్టడంతో మొదలైన ఈ పోటీ... ఆపై చంద్రుడు, అంగారకుడు, ఇతర గ్రహాంతర ప్రయోగాలు, మానవ సహిత అంతరిక్ష యాత్రల వరకూ సాగింది.

ఆ క్రమంలో ఇప్పటి వరకూ రష్యా, అమెరికా, చైనా, జపాన్ ఇలా కొన్ని దేశాలు చంద్రుడి మీద చాలాసార్లు దిగాయి.

1959 సెప్టెంబర్ 14న... తొలిసారిగా ఒక మానవ నిర్మిత ప్రోబ్ చంద్రుడి మీద ల్యాండైంది.

ఆనాటి సోవియెట్ రష్యాకు చెందిన లూనా 2 స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా చంద్రుడి మీద ల్యాండైంది. దీంతో లూనా 2 చంద్రుడి మీద దిగిన తొలి మానవ నిర్మిత వస్తువుగా చరిత్ర సృష్టించింది.

లూనా 2 చంద్రుడి మీద దిగిన తర్వాత చంద్రుడి ఉపరితలం గురించి, అక్కడి రేడియేషన్ గురించి, అయస్కాంత క్షేత్రం గురించి చాలా విలువైన సమాచారం అందించింది.

ఈ చారిత్రక విజయం... ఆ తర్వాత చంద్రుడి మీద పరిశోధనలు కొనసాగించేందుకు ఎంతగానో ఉపయోగపడింది.

చంద్రుడి మీద మరిన్ని ప్రయోగాలతో పాటు, మానవుల్ని పంపేందుకు కూడా ఈ విజయమే బాటలు వేసింది.

నాసా ప్రయోగించిన అపోలో మిషన్లు, మానవ సహిత అంతరిక్ష మిషన్లు, రష్యా ఇప్పటి వరకూ కొనసాగించిన లూనా 24 మిషన్లలో చాలా వరకూ చంద్రుడి ఈక్వేటర్ దగ్గరగానే దిగాయి.

ఇలా చంద్రుడి మీదకు వెళ్లాలనుకునే అన్ని ప్రయోగాల్లోనూ చంద్రుడి ఈక్వేటర్‌కి అటూ ఇటూ ల్యాండయ్యేందుకు మాత్రమే ప్రయత్నాలు చేశాయి. ఎందుకంటే చంద్రుడి ఈక్వేటర్ దగ్గర ల్యాండవ్వడం సులభం.

చంద్రుడి ఈక్వేటర్ దగ్గర టెక్నికల్ సెన్సర్లు, ఇతర పరికరాలు పనిచేసేందుకు అవసరమైన సూర్యరశ్మి నేరుగా తాకుతుంది.

పగటి వేళల్లో ఇక్కడి వెలుతురు కూడా స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఆయా దేశాలు ప్రయోగించిన ప్రోబ్‌లు, వ్యోమగాములు అంతా కూడా చంద్రుడి ఈక్వేటర్‌కి దగ్గరగానే ల్యాండయ్యారు.

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, ISRO

ధ్రువాల దగ్గర ల్యాండింగ్ ఎందుకంత కష్టం?

భూమి అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. దీనివల్ల ధ్రువాల దగ్గర ఆరు నెలలు పగలు, ఆరు నెలలు చీకటి ఉంటుంది.

కానీ చంద్రుడి అక్షం దాదాపుగా సూర్యుడికి లంబకోణంలోనే ఉంటుంది.

నాసా ప్రకారం.. చంద్రుడి అక్షం 88.5 డిగ్రీలు నిటారుగా ఉంటుంది. అంటే కేవలం ఒకటిన్నర డిగ్రీలు మాత్రమే వంపు తిరిగి ఉంటుంది.

అంటే చంద్రుడి ధ్రువ ప్రాంతాలను సూర్య కిరణాలు తాకినపప్పటికీ, అక్కడున్న క్రేటర్ల లోతుల్లోకి సూర్య కిరణాలు చేరుకోలేవు.

ఇలా చంద్రుడి ధ్రువ ప్రాంతంలోని క్రేటర్లు సుమారు రెండు బిలియన్ ఏళ్లుగా సూర్యరశ్మి చేరకుండా అతి శీతల స్థితిలోనే ఉండిపోయాయి.

ఇలా చంద్రుడి మీద సూర్యరశ్మి చేరని ప్రాంతాలను పర్మినెంట్లీ షాడోడ్ రీజియన్స్ అంటారు.

అలాంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కూడా మైనస్ 230 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటాయి.

ఇలాంటి ప్రదేశాల్లో ల్యాండవ్వడం, సాంకేతిక ప్రయోగాలు చేయడం వంటివి చాలా కష్టం.

చంద్రుడి మీద ఉండే క్రేటర్లు చాలా విశాలంగా ఉంటాయి. వాటిలో కొన్ని క్రేటర్లు వందల వందల కిలోమీటర్ల వ్యాసంతో ఉంటాయి.

ఇన్ని ఇబ్బందులు, కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇస్రో మాత్రం దక్షిణ ధ్రువానికి దగ్గర్లో 70వ అక్షాంశం దగ్గర చంద్రయాన్ 3 ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

చంద్రుడి ఈక్వేటర్ దగ్గర లేనిది దక్షిణ ధ్రువం దగ్గర ఏముంది?

చంద్రుడి ఈక్వేటర్ దగ్గర పగటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

రాత్రి వేళల్లో మైనస్ 120 డిగ్రీలుండే ఇక్కడి ఉష్ణోగ్రతలు పగటి వేళల్లో ఇక్కడి ఉష్ణోగ్రత 180 డిగ్రీల వరకూ చేరుకుంటాయి.

కానీ ధృవాల వద్ద బిలియన్ సంవత్సరాల కొద్దీ సూర్యరశ్మి చేరని కొన్ని ప్రాంతాల్లో మైనస్ 230 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలుండే అవకాశముంది.

అంటే ఇక్కడి మట్టిలో నిక్షిప్తమైన విషయాలు... లక్షల ఏళ్లుగా అలాగే ఉండి ఉండిపోయాయన్న మాట.

వాటిని కనిపెట్టేందుకే ఇస్రో నేరుగా దక్షిణ ధృవానికి దగ్గర ల్యాండింగ్‌కి ప్రయత్నిస్తోంది.

ఇక్కడ ల్యాండర్, రోవర్లను దించడం ద్వారా.. అక్కడి మట్టిని పరిశీలించాలని ఇస్రో ప్రయత్నిస్తోంది.

దక్షిణ ధృవం దగ్గర ఉన్న మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులను కనిపెట్టాలని ప్రయత్నిస్తోంది.

ఇలాంటి గడ్డకట్టిన పరిస్థితుల్లో చాలా అంశాలు నిక్షిప్తమై ఉంటాయి. అంటే... సూర్య కుటుంబం పుట్టుక, చంద్రుడు, భూమి పుట్టుకల గురించిన రహస్యాలు, చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, ఏర్పటే సమయంలో ఎలాంటి పరిస్థితులుండేవి వంటి విషయాలు తెలుసుకోవచ్చు.

ఈ సమాచారంతో చంద్రుడి పుట్టుకకు కారణాలు, దాని భౌగోళిక స్వరూపం, లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు.

ఇలాంటి అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద మంచు అణువులు కూడా ఇక్కడ గడ్డకట్టిన నేలల్లో ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా.

చంద్రయాన్ 1లో ఇస్రో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ కూడా దక్షిణ ధృవం దగ్గర్లో క్రాష్ ల్యాండ్ అవ్వడం వల్లనే అందులోనూ మూన్ మైనరాలజీ మ్యాపర్ అనే సెన్సర్ చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నట్లు గుర్తించగలిగింది.

ఇప్పుడు అదే ప్రాంతంలో నేరుగా ల్యాండర్‌ని, రోవర్‌ను పంపి ప్రయోగాలు చేయడం ద్వారా చంద్రుడి గురించి మరిన్ని అంశాలను వెలికి తీసేందుకు అవకాశం దక్కుతుంది. కానీ ఇదే చంద్రుడి ఈక్వేటర్ దగ్గర ఉండే మట్టిలో ఇన్ని రహస్యాలు దాగి ఉండవు.

చంద్రుడిపై కాలనీ(ఊహాచిత్రం)

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, చంద్రుడిపై కాలనీ(ఊహాచిత్రం)

అన్ని ప్రయోగాలు ఈక్వేటర్ దగ్గరే... అందుకే

నాసా వెల్లడించిన వివరాల ప్రకారం.. నాసా అపోలో 11 మిషన్‌లో చంద్రుడి నుంచి చంద్ర శిలలను భూమ్మీదకు తీసుకొచ్చింది.

ఆ చంద్ర శిలలను పరిశీలించిన నాసా వాటిలో నీటి జాడలు లేవని తేల్చింది. వాటిని పరిశీలించిన నాసా శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం పూర్తిగా పొడిబారి ఉందని తేల్చారు.

ఆ తర్వాత కొన్ని దశాబ్దాల వరకూ చంద్రుడి మీద నీటి జాడ కోసం ప్రయత్నాలు కూడా జరగలేదు.

1990ల్లో చంద్రుడి చీకటి భాగంలో గడ్డకట్టిన మంచు రూపంలో నీరు ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపించాయి.

దీంతో నాసా ప్రయోగించిన క్లెమెంటైన్ మిషన్‌లో లూనార్ ప్రాస్పెక్టర్ మిషన్ చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించి, చంద్రుడిపై సూర్యరశ్మి చేరని ప్రాంతాల్లో హైడ్రోజన్ ఉనికిని కనుగొంది.

దాని ఫలితాలు చంద్రుని ధృవాల దగ్గర నీరు ఉండొచ్చన్న అభిప్రాయాలకు బలం చేకూర్చాయి. కానీ కచ్చితంగా నీటి జాడల్ని మాత్రం కనిపెట్టలేదు.

చంద్రయాన్-1 ప్రయోగంలోనే ఆర్బిటర్‌తో పాటుగా, చంద్రుడి మీద క్రాష్ ల్యాండ్ అయ్యేలా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనే మరో పరికరాన్ని కూడా పంపింది.

చంద్రయాన్-1లో ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటే... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది.

చంద్రయాన్-1లో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను 2008 నవంబర్ 18న వంద కిలోమీటర్ల ఎత్తు నుంచి విడుదల చేశారు. 25 నిమిషాల్లో అది చంద్రుడి దక్షిణ ధ్రువం మీద పడేలా చేశారు.

అయితే ఇది ల్యాండర్ మాదిరిగా సేఫ్ ల్యాండ్ అవ్వలేదు కానీ, కంట్రోల్డ్ గానే ఇస్రో చంద్రుడి దక్షిణ ధృవంపై పడేలా చేయగలిగారు.

ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌లో అమర్చిన చంద్రాస్ ఆల్టిట్యూడ్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్ చంద్రుడి ఉపరితలం నుంచి 650 మాస్ స్పెక్ట్రా రీడింగ్స్‌ను సేకరించింది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన ఇస్రో చంద్రుడి మీద నీరు ఉన్నట్లు 2009 సెప్టెంబర్ 25న ప్రకటించింది.

చంద్రుడిపైకి చంద్రయాన్ 3 ప్రయోగం

ఫొటో సోర్స్, GETTY IMAGES

చరిత్ర సృష్టించాలన్న తపన

చరిత్రలో ముందు సాధించిన వారి పేరే గుర్తుంటుంది. చంద్రుడి మీద ముందుగా తన ప్రోబ్ పంపింది రష్యానే అయినా.. చంద్రుడి మీద ముందుగా కాలు పెట్టింది మాత్రం అమెరికానే.

అంతరిక్ష ప్రయోగాల్లో తామే ముందున్నామని నిరూపించుకునేందుకు దేశాలన్నీ ప్రయత్నిస్తాయి. అందుకే ఇస్రో కూడా ముందుగా దక్షిణ ధృవం మీద దిగిన తొలి దేశంగా ముద్ర వేసుకునేందుకే ప్రయ్నత్నిస్తోంది.

భవిష్యత్ ప్రయోగాలకు ఇదెలా ఉపయోగం

చంద్రయాన్ 3 దక్షిణ ధృవంలో గడ్డకట్టిన మట్టిలో నీటి జాడల్ని గుర్తిస్తే..అది భవిష్యత్ ప్రయోగాలకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది.

చంద్రుడి మీద నీటిని గుర్తించగలిగితే... దాని నుంచి ఆక్సిజన్ కూడా తయారు చేసుకోవచ్చు.

అది అక్కడ మానవ నివాసానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.

అంతే కాదు.. చంద్రుడి మీదనే అంతరిక్ష ప్రయోగాలు, ఇతర ప్రయోగాలు చేసేందుకు అవసరమైన ప్రొపెల్లంట్‌గా కూడా ఆక్సిజన్ ఉపయోగించుకోవచ్చు.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. ఇస్రో మొదటి నుంచి చంద్రుడి దక్షిణ ధృవాన్ని అన్వేషించడానికే సిద్ధమవుతోంది.

చంద్రయాన్ 1, చంద్రయాన్ 2లలో అదే ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు చంద్రయాన్ 3తో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)