పాకిస్తాన్: ఖురాన్‌ను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో క్రైస్తవులపై దాడులు, చర్చిల దహనం

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ఖురాన్‌ను అవమానించారన్న ఆరోపణలతో స్థానిక క్రైస్తవులపై నిరసనకారులు దాడులు చేశారు.
ఫైసలాబాద్‌లోని జరామ్‌వాలా తహసీల్‌లో హింస చెలరేగింది. ఈ క్రమంలో ఆందోళనకారులు ఓ చర్చికి నిప్పంటించారు.
అక్కడి క్రిస్టియన్ కాలనీ, కొన్ని ప్రభుత్వ భవనాలనూ ధ్వంసం చేశారు.
‘ఈసా నగరి’ ప్రాంతంలో కొందరు యువకులు ఖురాన్‌ను అపవిత్రం చేశారని, అవమానించారని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ కావడంతో బుధవారం ఉదయం ఈ నిరసనలు మొదలయ్యాయి.
క్రమంగా అవి హింసాత్మక రూపం దాల్చాయని స్థానిక అధికారులు చెప్పారు.
‘ఈసానగరిలో ఇళ్లకు నిప్పుపెట్టారన్న సమాచారం మాకు ఉదయం 8 గంటల ప్రాంతంలో అందింది’ అని జరామ్‌వాలాకు చెందిన పోలీస్ అధికారి షౌకత్ బీబీసీతో చెప్పారు.
‘ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు కర్రలతో వచ్చారు. జరామ్‌వాలా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంపైనావారు దాడి చేశారు’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER
చర్చ్ ఆఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడు బిషప్ ఆజాద్ మార్షల్ తాజా పరిణామాలపై స్పందించారు. ట్విటర్‌లో ఆయన ‘నా బాధను వ్యక్తంచేయడానికి మాటలు రావడం లేదు. జరామ్‌వాలా తహసీల్‌లో జరిగిన ఘటన గురించి విని బిషప్‌లు, మతాధికారులు, సామాన్యులు అందరూ బాధపడ్డారు. నేను ఈ ట్వీట్ చేస్తున్న సమయానికి ఒక చర్చి మంటల్లో కాలిపోతోంది. బైబిల్‌ను అపవిత్రం చేశారు. క్రైస్తవులను హింసించారు. పవిత్ర ఖురాన్‌ను తగలబెట్టారన్న తప్పుడు ఆరోపణలతో ఇదంతా చేస్తున్నారు. మేం న్యాయం కోసం నిలబడతాం. శాంతిభద్రతలు, న్యాయ పాలన సంస్థలు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అన్నారు.
కాగా ఈసానగరి ప్రాంతంలో నాలుగు చర్చిలను తగలబెట్టారని జరామ్‌వాలా తహసీల్‌కు చెందిన పాస్టర్ ఇమ్రాన్ భట్టి డాన్ వార్తాపత్రికతో చెప్పారు.
సాల్వేషన్ ఆర్మీ చర్చి, యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చి, అలైడ్ ఫౌండేషన్ చర్చి, షారోన్‌వాలా చర్చిలను ధ్వంసం చేసి తగలబెట్టారని ఆయన తెలిపారు.
దైవదూషణ ఆరోపణలతో ఓ క్రైస్తవుడి ఇంటిని కూడా ఆ మూక కూల్చివేసిందని ఇమ్రాన్ భట్టి చెప్పారు.

ఫొటో సోర్స్, @BISHOPAZADM
పోలీస్ స్టేషన్‌పై దాడి
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ మాట్లాడుతూ ‘ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు’ అని చెప్పరు. మరోవైపు నిరసనలు జరుగుతున్న ప్రాంతమంతటా బారికేడ్లు ఏర్పాటుచేశారు.
ఉస్మాన్ అన్వర్ ‘డాన్ న్యూస్’తో మాట్లాడుతూ ‘ఇక్కడ వీధులన్నీ ఇరుకుఇరుగ్గా ఉంటాయి. చిన్న చిన్న చర్చిలు కొన్ని ఉన్నాయి. నిరసనకారులు వాటిలో చాలా చర్చిలు ధ్వంసం చేశారు’ అని చెప్పారు.
ఆందోళనకారులు ఫైసలాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కు కూడా చేరుకుని కిటికీల అద్దాలు పగులగొట్టినట్లు పోలీసులు తెలిపారు.
‘బయట ఏం జరుగుతోందో మాకు తెలియదు. మా ఆఫీసులో తాళాలు వేసుకుని ఉన్నాం. నిరసనకారులు మా కార్యాలయం కిటికీల అద్దాలు పగులగొట్టారు’ అని ఆ ఠాణాలోని పోలీస్ అధికారి ఒకరు ‘బీబీసీ’తో చెప్పారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.

ఎఫ్ఐఆర్‌లో ఏం ఉంది?
ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అవమానించారని, దూషించారన్న ఆరోపణలపై ఇద్దరు క్రైస్తవ యువకులపై జర్దాన్‌వాలా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
ఫిర్యాదుదారులు వెళ్లేటప్పటికి ఖురాన్‌లోని పేజీలపై ఎర్రని పెన్సిల్‌తో ఏవో రాశారని, ఫిర్యాదుదారులు అక్కడికి వెళ్లడంతో నిందితులు పారిపోయారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
కాగా హింసకు పాల్పడవద్దని, శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారులను పోలీసులు కోరారు.
ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, వారు తప్పించుకున్నారని పోలీసులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్, బ్రిటానిక్: మునిగిపోతున్న ఓడల నుంచి మూడు సార్లు ప్రాణాలతో బయటపడిన నర్స్.. ‘క్వీన్ ఆఫ్ ద సింకింగ్ షిప్స్’
- కచ్చతీవు: తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య తగవుకు కారణమైన ఈ దీవి కథ ఏంటి?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'
- రోజులో ఎప్పుడు, ఎంత తినాలి?
- ఖుదీరామ్ బోస్: స్వాతంత్ర్య పోరాటంలో 18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన యోధుడు















