భారత్-పాకిస్తాన్ విభజన: ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను విమానాలు ఎలా కాపాడాయంటే...

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ న్యూస్
దేశ విభజన సమయంలో చోటుచేసుకున్న రక్త పాతాన్ని 1974లో రచయిత భీష్మ్ సాహ్నీ తన నవల ‘తమస్’ (అంధకారం)లో కళ్లకు కట్టినట్లుగా రాసుకొచ్చారు. ఓ కల్లోలిత గ్రామంపై మూడుసార్లు విమానం చక్కర్లు కొట్టడంతో అక్కడి వాతావరణం ఎలా మారిందో దీనిలో ఆయన వివరించారు.
‘‘ప్రజలు బయటకు వచ్చారు. పోరాటం ఆగిపోయినట్లుగా అనిపించింది. మృతదేహాలకు ప్రజలు అంత్యక్రియలు నిర్వహిస్తూ కనిపించారు. తమకు ఏ స్థాయిలో నష్టం వాటిల్లిందో అంచనా వేసేందుకు మళ్లీ ప్రజలు వారి ఇళ్లకు చేరుకోవడం కూడా మొదలైంది’’ అని ఆ పుస్తకంలో రాశారు.
ఈ ఉప ఖండాన్ని భారత్, పాకిస్తాన్‌ల పేరుతో రెండు స్వతంత్ర దేశాలుగా విభజించినప్పుడు చోటుచేసుకున్న పరిస్థితులను సాహ్నీ కల్పిత కథలా రాసుకొచ్చారు. అయితే, ఆనాడు చోటుచేసుకున్న మతపరమైన హింస వల్ల దాదాపు 1.2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మరో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
అది కాల్పనిక రచనలా సాగినప్పటికీ, కల్లోలిత గ్రామాలను విమానాలు చుట్టుముట్టినప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులను ఆ పుస్తకం ప్రతిబింబించిందని చరిత్రకారుడు ఆషిక్ అహ్మద్ ఇక్బాల్ చెప్పారు.
‘‘కొన్నిసార్లు విమానాలు కనిపించడంతో దాడిచేసే మూకలు భయపడేవి. మరికొన్నిసార్లు ఈ విమానాలే మూకలను చెదరగొట్టేవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధమయ్యేందుకు ప్రజలకు విమానాలు కాస్త సమయం ఇచ్చేవి’’ అని తన పుస్తకం ‘ద ఏరోప్లేన్ అండ్ ద మేకింగ్ ఆఫ్ మోడెర్న్ ఇండియా’లో ఇక్బాల్ వివరించారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన 1.2 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ మంది రైళ్లు, ఇతర వాహనాలు, ఎద్దుల బండ్లు, కాలినడకన గమ్య స్థానాలకు చేరుకున్నారు. దాదాపు 50,000 మంది అంటే.. నిరాశ్రయుల్లో ఒక శాతం కంటే తక్కువ మందిని విమానాల్లో తరలించారని ఇక్బాల్ చెప్పారు. మొత్తంగా నిరాశ్రయుల రాకపోకలు 1947లో సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య మూడు నెలల పాటు కొనసాగాయి.

ఫొటో సోర్స్, Getty Images
అప్పట్లో బ్రిటిష్ ఇండియా వైమానిక దళమైన ‘రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఐఏఎఫ్) పరిస్థితులు సద్దుమణిగేలా చేయడంతోపాటు నిరాశ్రయులను తరలించడంలో కీలక పాత్ర పోషించిందని ఇక్బాల్ చెప్పారు.
రోజూ ఉదయం నిరాశ్రయులు ప్రయాణించే రైళ్ల పట్టాలపై ఈ విమానాలు నిఘా పెట్టేవి. వాటిపై అల్లరి మూకలు దాడి చేయకుండా ఇవి కాపు కాసేవి. ఎక్కడైనా పట్టాలను ధ్వంసం చేశారేమోనని కూడా ఇవి పరిశీలించేవి. మరోవైపు సాయుధ మూకలపైనా విమానాలు నిఘా పెట్టేవి. ఈ సమాచారాన్ని వైర్‌లెస్ రేడియోల ద్వారా అధికారులకు చేరవేసేవి.
‘‘1947 సెప్టెంబరులో పంజాబ్‌పై తిరిగిన ఓ విమానం పరిస్థితులకు అద్దంపట్టే ఓ చిత్రాన్ని తీసింది. దీనిలో దాదాపు 40 కి.మీ. పొడవున దాదాపు 30,000 మంది నిరాశ్రయులు సరిహద్దులు దాటుతూ కనిపించారు’’ అని ఇక్బాల్ చెప్పారు. ‘‘అలసిపోయిన నిరాశ్రయులపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్న మూకలను ఈ విమానాలే గుర్తించాయి. సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ కాసేందుకు భద్రతా బలగాలకు ఇవే మార్గనిర్దేశం చేశాయి. కొన్ని కల్లోలిత గ్రామాల నుంచి దట్టమైన పొగలు రావడాన్ని కూడా ఈ విమానాలు గమనించాయి. కాస్త తక్కువ ఎత్తులో ఎగిరినప్పుడు పంజాబ్‌లోని నదుల్లో మృతదేహాలు తేలుతూ కనిపించేవి’’ అని ఆయన వివరించారు.
విమానాల పాత్ర ఇక్కడితో ముగిసిపోలేదు. నిరాశ్రయుల శిబిరాల్లో కలరా మహమ్మారి చెలరేగకుండా 15 లక్షల డోసుల వ్యాక్సీన్లనూ దిల్లీ నుంచి కరాచీకి ఆర్ఐఏఎఫ్ విమానాలు తరలించాయి. మరోవైపు ఆహారం పొట్లాలు, చక్కెర, నూనె ప్యాకెట్లను కూడా నిరాశ్రయుల కోసం ఇవి గ్రామాలపై జారవిడిచేవి. మరోవైపు హింసకు పాల్పడితే అసలు సహించేదిలేదని హెచ్చరించే కరపత్రాలను కూడా ఇవి గ్రామాలపై కురిపించేవి. పాకిస్తాన్‌లో ముల్తాన్, బన్నూ, పెషావర్ లాంటి మారుమూల ప్రాంతాల నుంచి ముస్లిమేతరులను తరలించడంలో ఈ విమానాలు ప్రధాన పాత్ర పోషించేవి.
2021 ఆగస్టులో కాబూల్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న పరిస్థితులను తలపించే దృశ్యాలు 1947లోనే దిల్లీ, పంజాబ్ వైమానిక క్షేత్రాల్లో నెలకొన్నాయి.

ఫొటో సోర్స్, MICHAEL OCHS ARCHIVES
‘‘వైమానిక క్షేత్రాలకు సమీపంలోని శిబిరాల నుంచి నిరాశ్రయులు విమానాలు ఎక్కేందుకు పెద్దయెత్తున తరలి వచ్చేవారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొందరు డబ్బులు, బంగారాలను లంచాలుగా ఇచ్చేవారు’’ అని ఇక్బాల్ వివరించారు.
అయితే, టిక్కెట్ల ధర చాలా ఎక్కువగా ఉండేవి. కొంత లగేజీ మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతించేవారు. భారత్‌లోని హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే ఓ మహిళ కేవలం ఖురాన్ మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించిన కథ ఆనాడే చాలా వార్తా సంస్థల్లోనూ వచ్చింది.
మరోవైపు విమానాలు కూడా కిక్కిరిసిపోయేవి. ఎక్కువ మంది నిరాశ్రయులను ఎక్కించుకునేందుకు కొన్ని విమానాల్లో సీట్లు, కార్పెట్లను కూడా తొలగించేవారు. కేవలం 21 మందిని మాత్రమే తరలించే సామర్థ్యమున్న డకోటా డీసీ-3 విమానాలు ఐదు రెట్లు ఎక్కువగా ప్రజలను తరలించేవి.
మూకలను నియంత్రించేందుకు ఒక ప్రైవేటు విమానయాన సంస్థలో పనిచేసే సిబ్బందికి ఓ పైలట్ చేతులకు వేసుకునే ఇనుము పరికరాన్ని కూడా ఇచ్చారు. దీని సాయంతో ఇనుము పిడిగుద్దులు గుద్దొచ్చు. ‘‘డోర్‌ను గట్టిగా వేసే సమయంలో అక్కడ అడ్డుపడే వారిపై సిబ్బంది పిడిగుద్దులు గుద్దేశారు. ఒకసారి తలుపులు మూసేసిన తర్వాత ఇంజిన్లు మొదలుపెట్టేవారు. అప్పుడు నేలపై ఉండేవారు విపరీతంగా వీచే గాలికి చెల్లాచెదురైపోయేవారు’’ అని ఇక్బాల్ తన పుస్తకంలో రాశారు.
అయితే, విపరీతంగా జనాలు ఎక్కేటప్పటికీ భారీ ప్రమాదాలేవీ చోటుచేసుకున్నట్లు వార్తలు రాలేదు. ‘‘భద్రతా సిబ్బంది లేకపోవడంతో చాలాసార్లు విమానాలు రాకముందే భారీయెత్తున శరణార్థులు అక్కడకు చేరుకునేవారు. మరోవైపు పొరుగు దేశానికి చెందిన విమానయాన సిబ్బందికి రెండు దేశాలూ సరిగా సహకరించేవి కాదు’’ అని ఇక్బాల్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
1947లో 11 విమానయాన సంస్థలు మొత్తంగా 115 ప్రయాణికుల విమనాలను నడిపించేవి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అమెరికా దళాలు విక్రయించిన డీసీ-3 డకోటా విమానాలను భారత కంపెనీలు తక్కువ ధరకే కొనుగోలు చేసేవి. అయితే, దేశ విభజన సమయంలో షెడ్యూల్ ప్రకారం విమానాలు నడిచేవి కాదు.
భారీగా పెరిగిన రద్దీని విమానయాన సంస్థలు తట్టుకోలేకపోయేవి. అసాధ్యంగా భావించే ఈ ప్రయాణాల కోసం తమ విమానాలు, సిబ్బందిని ఫణంగా పెట్టేందుకు నిరాకరించేవి. అయితే, అప్పుడే విదేశీ సాయం రావడం మొదలైంది. బ్రిటిష్ ఓవర్‌సీస్ ఎయిర్‌వేస్ కార్పొరేషన్ (బీఓఏసీ)కి చెందిన విమానాలు 15 రోజులపాటు నిరంతరం పనిచేస్తూ కరాచీ నుంచి 6300 మందిని దిల్లీకి చేర్చాయి. అంతేకాదు 45,000 కేజీల ఆహారం, శిబిరాల కోసం గుడారాలు, వ్యాక్సీన్లు కూడా సరఫరా చేశాయి. మరోవైపు దిల్లీలో చిక్కుకున్న ముస్లిం శరణార్థులను పాకిస్తాన్‌కు తరలించాయి.
బ్రిటిష్ ప్రజలను తరలించేందుకు ఏర్పాటుచేసిన రెండు రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాలు కూడా భారత్, పాకిస్తాన్‌ల మధ్య 12,000 మందిని తరలించాయి. ఈ విమానాల్లో తరలించిన వారిలో బ్రిటిష్ సిబ్బంది 2790 మంది మాత్రమే. మిగతావారు రైల్వే, పోస్టు, టెలిగ్రాఫ్ కోసం పనిచేసే ఉద్యోగులని ఇక్బాల్ తెలిపారు.
1947 అక్టోబరులో ఈ ప్రయత్నాలు సరిపోవడంలేదని భారత్ భావించింది. అప్పుడే ‘ఆపరేషన్ ఇండియా’ మొదలుపెట్టారు. దాదాపు ఆరు వారాల పాటు 21 విమానాలను ఎనిమిది బ్రిటిష్ కంపెనీల నుంచి తీసుకొని నడిపించారు. దాదాపు 35,000 మంది ప్రజలను, 6.8 లక్షల కేజీల సామగ్రిని ఇవి తరలించాయి. సాయం కోసం 170 మంది బ్రిటిష్ విమానయాన సంస్థల ఉద్యోగులు కూడా వచ్చారు.
ప్రజల తరలింపుల్లో రద్దీని ఇక్కడి విమానయాన సంస్థలు తట్టుకోలేకపోవడంతో రెండు ప్రభుత్వాలు బ్రిటన్ సాయం కోరాల్సి వచ్చింది. ‘‘స్వాతంత్ర్యం అనంతరం కీలమైన మొదటి నెలల్లో దేశ పునర్నిర్మాణంలో ఈ విమానాలు ప్రధాన పాత్ర పోషించాయి’’ అని ఇక్బాల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మహారాష్ట్ర: ఠాణే ఆస్పత్రిలో ఒకే రాత్రి 17 మంది మృతి... అసలేం జరిగింది?
- మిలా: ‘‘సవతి తండ్రి కంటే ముందు నుంచే ఒక అంకుల్ ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు’’
- హస్తప్రయోగ ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్నాయి... మహిళలు ఎలా ఫిర్యాదు చేయాలి?
- కామసూత్ర గ్రంథంలో లైంగిక భంగిమల గురించే రాశారా... అందులో ఇంకా ఏముంది?
- పాలియామరీ: ఆయనకు ఇద్దరు లైంగిక భాగస్వాములు, ఆమెకూ ఇద్దరు.. ఈ ముగ్గురూ కలిసే ఉంటారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















