హస్తప్రయోగ ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్నాయి... మహిళలు ఎలా ఫిర్యాదు చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది జూలై 21, 2023. సాయంత్రం ఏడు గంటలైంది.

మణిపూర్‌లో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా బెంగళూరులోని టౌన్ హాల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్నారు అతిరా పురుషోత్తం. ఈ క్రమంలో ఆమె టాక్సీని బుక్ చేయడానికి ప్రయత్నించారు. కానీ, టాక్సీ అందుబాటులో లేకపోవడంతో రాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారామె.

కేరళ నుంచి వచ్చిన అథిరా పురుషోత్తం, ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ యువతకు లైంగిక, రీప్రొడక్టివ్ హెల్త్, వారి హక్కులపై అవగాహన కల్పిస్తారు.

ఆ రోజు జరిగిన ఘటనను అథిరా గుర్తుచేసుకుంటూ.. రాపిడో డ్రైవర్ తాను ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయానని, ఆలస్యంగా వస్తున్నట్లు చెప్పి, తనకు మరో నంబర్ ఇచ్చినట్లు తెలిపారు.

తాను బుక్ చేసుకున్న బైక్ నంబర్ ప్లేట్, తన దగ్గరికి వచ్చిన బైక్ నంబర్ ప్లేట్లు వేర్వేరుగా ఉన్నాయని ఆమె బీబీసీకి చెప్పారు.

మారిన నంబర్ ప్లేట్ గురించి డ్రైవర్‌ని అడగగా, రాపిడో బైక్ సర్వీసింగ్‌కు వెళ్లిందని, అందుకే మరో బైక్ తీసుకొచ్చానని డ్రైవర్ సమాధానం ఇచ్చారు.

బుకింగ్‌కి సంబంధించిన వివరాలన్నీ అథిర పురుషోత్తం ధ్రువీకరించుకొని ఇంటికి వెళ్లడానికి బైక్‌పై కూర్చున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మార్గమధ్యలో ఏం జరిగిందంటే..

ఆమె తన ఇంటికి వెళ్లే మార్గంలో నిర్మాణ స్థలం ఉందని, అక్కడ చాలా తక్కువ మంది ఉంటారని ఆమె చెప్పారు.

''ఈ దారిలో బైక్ స్పీడ్ తగ్గించి కుడి చేత్తో మాత్రమే బైక్ నడుపుతున్నాడు డ్రైవరు. ఈ సమయంలో ఆయన ఎడమ చేయి కదులుతోంది. జాగ్రత్తగా గమనించగా హస్తప్రయోగం చేస్తున్నట్టు గుర్తించాను'' అని అథిర చెప్పారు.

‘‘ఆ దారిలో ఇళ్లు లేవు. దీంతో నాకు భయమేసింది. ఏదైనా అంటే నేను ప్రమాదంలో పడిపోతానని భావించి, మౌనంగా ఉన్నాను. నన్ను ఏదైనా చేస్తాడని భయపడ్డాను. ఆ వ్యక్తికి నా ఇంటి చిరునామా కూడా తెలియకూడదనుకున్నా. అందుకే 200 మీటర్ల దూరంలో డ్రాప్ చేయమని అడిగా. అతను వెళ్లిన తర్వాత, నేను ఇంటి వైపు నడిచాను" అని అథిర తెలిపారు.

ఆ వ్యక్తి తనకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం ప్రారంభించారని, దీంతో అతన్ని బ్లాక్ చేశానని చెప్పారు.

ఈ విషయమై అథిర ర్యాపిడోకు ఫిర్యాదు చేయగా, వెంటనే ర్యాపిడో చర్యలు తీసుకుని డ్రైవర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

అథిరా పురుషోత్తం కూడా అతనిపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 (ఎ), 354 (డీ), 294 సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అలా ఎందుకు చేస్తారు?

ఇలాంటిది ఇదే మొదటి కేసు అయితే కాదు. దిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి హస్తప్రయోగం చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది.

ఈ ఘటనను సిగ్గుచేటుగా అభివర్ణించారు దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్. బాధ్యుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులను కోరారు.

ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. మరోవైపు ఇటీవల కర్నాటకలో ఓ మహిళా ప్రయాణికురాలు డ్రైవర్ తనకు పోర్న్ చూపించి, హస్తప్రయోగం చేశాడని ఫిర్యాదు చేశారు.

దీనిని మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధిగా పరిగణించలేమని సైకియాట్రిస్టులు అంటున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో లేదా మహిళల ముందు చేసే ఈ తరహా చర్యలో ఆ వ్యక్తికి లైంగిక ఆనందమే ప్రధానమని సైకియాట్రిస్ట్ డాక్టర్ పూజా శివం బీబీసీతో చెప్పారు.

అలా చేయడం సమాజంలో ఆమోదయోగ్యం కాదని తనకు అర్థం కావడం లేదని పూజా శివం అన్నారు.

"ఈ ఆలోచన శతాబ్దాలుగా కొనసాగుతోంది, ఇక్కడ అలాంటి పురుషులు వారి జననేంద్రియాలను బలానికి చిహ్నంగా ప్రదర్శిస్తారు. మరోవైపు మహిళలు లేదా పిల్లల బలహీనులని వారికి ప్రైవేట్ భాగాలను చూపిస్తారు. లేదా బహిరంగ ప్రదేశాల్లో పోర్న్ చూస్తుంటారు. వారు కోరుకున్నది చేయకుండా ఆ వ్యక్తిని ఎవరూ ఆపలేరని అనుకుంటారు'' అని సైకియాట్రిస్టు తెలిపారు.

బహిరంగంగా ఈ రకమైన చర్య పురుషత్వం, పితృస్వామ్యం, వికృత లైంగిక మనస్తత్వానికి సంకేతమని పాత్రికేయుడు నసీరుద్దీన్ అన్నారు.

కొందరు పురుషులు తమ అవయవాలతో మగతనాన్ని నిరూపించుకోవాలని కోరుకుంటారని తెలిపారు నసీరుద్దీన్.

అలాంటి వ్యక్తులు వాస్తవికతకు దూరంగా ఉంటారని, ఇలాంటి చర్య వల్ల ఇతరులకు ఎంత ఇబ్బంది కలుగుతుందో వారికి అర్థం కావడం లేదని డాక్టర్ పూజాశివం చెప్పారు.

ఇలాంటి కేసులు ఎక్కువగానే వార్తల్లో వస్తున్నట్లు కనిపిస్తున్నా.. అవి పెరిగిపోయాయనడానికి లేదు.. కానీ, వాటిని రిపోర్టు చేయడం పెరిగింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

ప్రతి స్త్రీ తన ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఏదో ఒక వయస్సులో ఈ రకమైన చెడు అనుభవాన్ని ఎదుర్కొంటారు.

ఇప్పటికీ చాలా మంది స్త్రీలు ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉన్నారు. అయితే, కొందరు దీనికి వ్యతిరేకంగా గళం విప్పారు.

అథిరా పురుషోత్తం కూడా ఒక్క క్షణం బలహీనపడ్డారు. అనంతరం ఆమె రాపిడోకు, సోషల్ మీడియాలో, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భారతీయ చట్టాల ప్రకారం ఒక మహిళకు అలాంటి సంఘటన జరిగితే జీరో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయవచ్చు.

అంటే కేసు ఏ పోలీస్టేషన్‌లోనైనా నమోదు చేయవచ్చు. బాధితులు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

సోషల్ మీడియాలో మీ అభిప్రాయాన్ని చెప్పడం ఫర్వాలేదు, కానీ, చట్ట పరంగా వెళ్లడం సరైనదని మహిళా సమస్యలపై పోరాడుతున్న హైకోర్టు న్యాయవాది సోనాలి కద్వాసర అన్నారు.

"ఈ విషయంలో చర్య తీసుకోవాలనుకుంటే వీలైనంత త్వరగా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ప్రశాంతమైన మనస్సుతో సంఘటన గురించి సమాచారం ఇవ్వండి" అని ఆమె సూచించారు.

అతిరా ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ కాపీ
ఫొటో క్యాప్షన్, అతిరా ఫిర్యాదుపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ

కంపెనీలు చర్యలు తీసుకుంటాయా?

''చాలామంది టాక్సీ బుకింగ్ లేదా హెయిర్ కటింగ్, ఇంటి క్లీనింగ్ కోసం ఏదైనా కంపెనీ నుంచి ఉద్యోగిని పిలుస్తుంటారు. అలాంటి సమయాల్లో ఆ వ్యక్తి అనుచితమైన పనికి పాల్పడితే వెంటనే సదరు కంపెనీకి ఫిర్యాదు చేయాలి'' అని సోనాలి సూచించారు.

ఈ కంపెనీలు కార్యాలయంలో లైంగిక వేధింపులకు సంబంధించి పోష్ చట్టం-2013 ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది.

ఫిర్యాదు చేసిన మహిళ తమ కంపెనీలో పని చేయనప్పటికీ, ఆమెను వేధించిన వ్యక్తి కంపెనీ ఉద్యోగి కావడంతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) కింద చర్యలు తీసుకోవాలి’’ అని సోనాలి కద్వాసర వివరించారు.

అతిర కేసులోనూ నిందితులపై రాపిడో చర్యలు తీసుకుంది.

బెంగళూరులో జరిగిన ఈ కేసులో ఐపీసీ 354 (ఎ), 354 (డి), 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక్కడ 354 సెక్షన్ మహిళపై అసభ్యకరమైన దాడికి పాల్పడటం కింద నమోదు చేశారని, 354 (ఎ) కింద గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సోనాలి కద్వాసర అభిప్రాయపడ్డారు.

మరోవైపు సెక్షన్ 294 బహిరంగ ప్రదేశంలో అసభ్యకర చర్యకు సంబంధించినది. ఇందులో మూడు నెలల శిక్ష, జరిమానా ఉంటుంది.

తనకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని దిల్లీలో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న యోగితా భయానా తెలిపారు.

భయపడకుండా ఫిర్యాదు చేయాలని, లేకపోతే అలాంటి పనులే మరొక అమ్మాయితో చేస్తారని ఆమె సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)