మణిపుర్ హింసపై వస్తున్న వార్తల్లో ఏది నిజం, ఏది అబద్ధం?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, శ్రుతి మేనన్
- హోదా, బీబీసీ వెరిఫై, దిల్లీ
హింసతో రగులుతున్న మణిపుర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారం చాలా వ్యాప్తి చెందింది.
ఇంటర్నెట్ సేవలను నియంత్రించడం ద్వారా దీన్ని అడ్డుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది ఆగలేదు.
మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన వీడియో వైరల్ అయిన తర్వాత ఇక్కడి మెయితీ, కుకీ తెగల మధ్య సంఘర్షణపై అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యాంశాల్లో నిలిచింది. ఈ ఘటనపై భారత్ ఇంటా బయటా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.
హెచ్చరిక: ఈ కథనంలో వివరాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.

లైంగిక హింసపై తప్పుడు ఆరోపణలు
మే నెల మొదట్లో మణిపుర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి మహిళలపై దాడుల అంశం ముఖ్యంగా ఈ తప్పుడు, తప్పుదారి పట్టించే ఆరోపణలకు కేంద్రంగా ఉంది.
సోషల్ మీడియా ద్వారా పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఈ ఘర్షణలు మొదలైన వెంటనే, మే 3వ తేదీనే ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు నిలిపేశారు.
కానీ, అప్పటికే ప్లాస్టిక్ సంచిలో చుట్టిన ఒక మహిళ మృతదేహానికి సంబంధించిన గ్రాఫిక్ ఫొటో వ్యాప్తి చెందింది. మృతురాలు కుకీ పురుషుల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన ఒక మెయితీ మహిళగా చెబుతూ ఆ గ్రాఫిక్ ఫొటోను షేర్ చేశారు.
ఆ ఫొటో సోషల్ మీడియాలోనే కాదు, మే 3న ఘర్షణలు తలెత్తిన చురాచాంద్‌పుర్ జిల్లాలో వాట్సాప్‌లో కూడా షేర్ అవుతుండటాన్ని మేం చూశాం.
ఆ ఫొటోకు సంబంధించి సోషల్ మీడియాలో చెబుతున్నవన్నీ తప్పు. ఎందుకంటే ఆ ఫొటో మణిపుర్‌కు చెందినదే కాదు.
అది ఆయుషి చౌదరీ అనే 21 ఏళ్ల మహిళ ఫొటో. నిరుడు నవంబర్‌లో దిల్లీలో ఆమె హత్య జరిగింది.

ఇలాగే, మే 5వ తేదీన మరో తప్పుడు వార్త కూడా పుట్టుకొచ్చింది.
అదేంటంటే అత్యాచారం, హత్యకు గురైన 37 మంది మెయితీ మహిళలతో పాటు ఒక ఏడేళ్ల మెయితీ చిన్నారి మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం ఇంఫాల్‌లోని షిజా ఆసుపత్రిలో ఉంచారనే వార్త మే 5వ తేదీన సోషల్ మీడియాలో కనిపించింది.
ట్విటర్‌లో కూడా దీనికి సంబంధించి చాలా ట్వీట్లు కనిపించాయి. ఈ ట్వీట్లు అన్నింటిలో పదాలు ఒకేలా ఉన్నాయి. కొత్తగా క్రియేట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ఈ ట్వీట్లన్నీ షేర్ అయ్యాయి.
మణిపుర్ స్థానిక భాషలో రాసిన, ఒకే రకంగా ఉన్న టెక్స్ట్ మెసేజ్‌లను కూడా మేం చూశాం. కింది ఫొటోలో ఈ మెసేజ్‌ను మీరు చూడొచ్చు.
మొబైల్ షట్‌డౌన్ అయినప్పటికీ, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం సాధ్యమేనని మాతో మణిపుర్‌లో పనిచేసే స్థానిక జర్నలిస్టులు చెప్పారు.
37 మహిళల మృతదేహాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు తప్పు అని రుజువు అయింది.
ఎందుకంటే దీని గురించి బీబీసీతో షిజా ఆసుపత్రి వర్గాలు మాట్లాడాయి.
అలాంటిది తమ ఆసుపత్రిలో జరుగలేదని వారు చెప్పారు. పైగా, ప్రైవేట్ వైద్య సంస్థ అయినందున తమకు పోస్ట్ మార్టమ్‌లు చేసే అధికారం లేదని వారు తెలిపారు.

అనేక ఉదాహరణలు
తప్పుదారి పట్టించే, అబద్ధపు వార్తలకు సంబంధించిన చాలా ఉదాహరణలు ఉన్నాయి. రోడ్డు మీద ఒక మహిళపై దాడి చేసి చంపుతున్నట్లుగా రూపొందించిన ఒక గ్రాఫిక్ వీడియో ఇందుకు మంచి ఉదాహరణ. ఈ ఘటన మణిపుర్‌లో జరిగినట్లుగా చెబుతున్నారు.
జూన్ నెల చివర్లో మణిపుర్ అనే హ్యాష్‌టాగ్‌తో ఈ వీడియోను షేర్ చేయడం మొదలుపెట్టారు. వేలాదిమంది ఈ వీడియోను చూశారు. సాయుధుడైన మెయితీ కమ్యూనిటీ పురుషుడు ఒకరు కుకీ మహిళను చంపినట్లుగా కొందరు ఈ వీడియో గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఇవే ఆరోపణలతో ఒక వారం రోజుల క్రితం కూడా ఈ వీడియో మళ్లీ తెరమీదకు వచ్చింది.
మరోసారి ఈ ఆరోపణలు అన్ని తప్పు.
ఎందుకంటే అది మణిపుర్‌కు చెందిన వీడియో కాదు, బాధితురాలు కుకీ మహిళ కూడా కాదు.
మణిపుర్‌కు పొరుగునే ఉన్న మయన్మార్‌లో పోయినేడాది జూన్‌లో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో అది.
భారత్‌కు చెందిన ఒక ఫ్యాక్ట్ చెకింగ్ సైట్ ఈ విషయాన్ని బయటపెట్టింది.
ఈ వీడియో ఎంత విస్తృతంగా షేర్ అవుతుందనే విషయాన్ని కచ్చితంగా మేం చెప్పలేం. కానీ, మణిపుర్‌లో మాత్రం ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.
కానీ, ఈ వీడియోను షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలను మణిపుర్ పోలీసులు హెచ్చరించారు.

అరెస్ట్‌లపై తప్పుడు సమాచారం
కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో వైరల్ అయి తర్వాత జులై 19న మణిపుర్ మరోసారి ముఖ్యాంశాల్లో నిలిచింది.
ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒక ముస్లిం వ్యక్తి అరెస్ట్ జరిగినట్లు పేర్కొంటూ ఆ తర్వాతి రోజే తప్పుడు వార్తలు వ్యాప్తి చెందాయి.
అధికార బీజేపీ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గా కూడా ఈ వార్తను ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మణిపుర్ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారంటూ బగ్గా చేసిన ట్వీట్‌కు 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాదిమంది ఆయన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
కానీ, ఇది కూడా తప్పుదారి పట్టించే ట్వీట్. మహిళలను లైంగిక వేధింపులకు సంబంధించిన వార్త వెలుగుచూసిన రోజే పోలీసులు ఒక ముస్లిం వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే, పూర్తిగా భిన్నమైన వేరే కేసులో అతన్ని అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన ముస్లిం వ్యక్తికి, మణిపుర్‌లో లైంగిక వేధింపులకు సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
వార్తా సంస్థ ఏఎన్‌ఐ కూడా పొరపాటున తప్పుగా వార్తను ట్వీట్ చేసింది. తర్వాత వెంటనే తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకుంది.
కానీ, బీజేపీ నాయకుడు బగ్గా మాత్రం ఇప్పటివరకు ఆ ట్వీట్‌ను సరిదిద్దుకోలేదు. ఆ ట్వీట్ గురించి ఎలాంటి స్పష్టీకరణ ఇవ్వలేదు. ఈ విషయంలో బీబీసీ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- కడప స్టీల్ ప్లాంట్: కేంద్రం లాభం లేదంటోంది.. జగన్ సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం భవిష్యత్తేమిటి
- పాము ఇంట్లో దూరితే ఏం చేయాలి?
- ప్రోడ్రగ్స్: పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఈ డ్రగ్స్ ఏమిటి
- అబ్దుల్ కలాం: చనిపోవడానికి ముందు ఆ చివరి ఐదు గంటల్లో ఏం జరిగింది
- రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా, ఆ డబ్బు మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు ఎలా చేరింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















