మతమా, దేశమా అనే చర్చ ఎందుకు జరుగుతోంది... అసదుద్దీన్, కుమార్ విశ్వాస్ ఏమని ట్వీట్ చేశారు?

కుమార్ విశ్వాస్-అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, KUMARVISHWAS-ASADUDDINOWAISI/FACEBOOK

ఫొటో క్యాప్షన్, కుమార్ విశ్వాస్-అసదుద్దీన్ ఒవైసీ

ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో కీలక స్థానాల్లో ముస్లిం అధికారులు లేరంటూ విడుదలైన రిపోర్టును ఉటంకిస్తూ ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రెండు రోజుల క్రితం బీజేపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు.

‘‘దశాబ్దాల తర్వాత తొలిసారి ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ఉన్నత నాయకత్వంలో ఒక్క ముస్లిం అధికారి కూడా లేరు. ఇది ముస్లింలపై బీజేపీకి ఉన్న అభిప్రాయంపై అనుమానాలను వ్యక్తం చేస్తోంది.

ఐబీ, రా అనేవి మెజార్టీ కమ్యూనిటీలకు చెందిన వారితో నిండి ఉన్నాయి. ముస్లిం వ్యక్తులను మీరు పదే పదే విధేయతను నిరూపించుకోవాలని అడుగుతున్నారు. కానీ, వారిని మీరు పౌరులందరితో సమానంగా చూడటం లేదు’’ అని అసదుద్దీన్ ఒవైసీ, ఈ రిపోర్ట్ స్క్రీన్‌షాట్లను షేర్ చేశారు.

ఈ ట్వీట్‌కి స్పందించిన మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్.. ఇస్లాం, భారత్ దేన్ని మీరు ఎంపిక చేసుకుంటారు? ఖురాన్ షరీఫ్ లేదా రాజ్యాంగాన్ని ఎంపిక చేసుకోవాలంటే, దేన్ని మీరు ఎంపిక చేసుకుంటారు? అంటూ అసదుద్దీన్ ఒవైసీని ప్రశ్నించారు.

కుమార్ విశ్వాస్ చేసిన ఈ కామెంట్‌కి సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి.

ఇరు నేతల మధ్య నెలకొన్న ఈ ట్విటర్ వార్, ‘మతమా, దేశమా’ అనే అంశంపై తీవ్ర చర్చకు దారితీసింది.

ఒక గుర్తింపును నిరూపించుకునేందుకు మరో గుర్తింపును ఎందుకు వదులుకోవాలి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ట్విటర్‌లో ప్రజలేమంటున్నారు?

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

కుమార్ విశ్వాస్ ట్వీట్‌కు అసదుద్దీన్ ఒవైసీ సమాధానమిచ్చారు. కానీ, కుమార్ విశ్వాస్ పేరును వాడలేదు.

‘‘భారతీయ గూఢచారి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో ముస్లిం అధికారులు లేరని నేను చేసిన ట్వీట్‌పై చాలా మంది పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ, మతం, దేశం.. వీటిలో దేన్ని మీరు ఎంపిక చేసుకుంటారని ముస్లింలను అడుగుతున్నారు.

ఎంత మంది అధికారులు దేశ భద్రతను పణంగా పెట్టి డీల్స్ చేసుకుంటూ పట్టుబడుతున్నారో తెలియదు. ఐఎస్ఐ(పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) మహిళల పేర్లతో నకిలీ అకౌంట్లను సృష్టించి, వారిని ట్రాప్ చేస్తుంది. మతాన్ని వదిలేయండి. దేశం కోసం, వాళ్ల కోరికలను తీర్చుకోవడం కోసం.. దేన్ని ఎంపిక చేసుకుంటారని మీరెవరైనా వారిని ప్రశ్నిస్తున్నారా?’’ అని అసదుద్దీన్ ఒవైసీ మరో ట్వీట్ చేశారు.

కొంత మంది కుమార్ విశ్వాస్ చేసిన కామెంట్‌పై పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.

రాజీవ్ ధ్యాని ట్వీట్

ఫొటో సోర్స్, TWITTER SCREESHOT

‘‘ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం అన్ని సమస్యలకు మూలం కుమార్ భాయ్. నేను ఒక మనిషిని, భారతీయుడిని, హిందీ మాట్లాడేవాడిని, హిందువుని. నాకు చాలా గుర్తింపులున్నాయి.

ఏ ఒక్క గుర్తింపు కోసం లేదా ఆ గుర్తింపును నేను అభిమానిస్తున్నానని తెలపడం కోసం మరొక గుర్తింపును నేను వదులుకోవాల్సినవసరం లేదు లేదా ఉంచుకోవాల్సినవసరం లేదు.’’ అని వ్యంగ్య రచయిత, రాజకీయ కార్యకర్త రాజీవ్ ధ్యాని అన్నారు.

కుమార్ విశ్వాస్‌‌కు కూడా చాలా గుర్తింపులుండి ఉంటాయి. రామకథ వ్యాఖ్యాతగా తన గుర్తింపును వెల్లడించడం కోసం ఉపాధ్యాయుడిగా, కవిగా తనకున్న గుర్తింపులను కుమార్ విశ్వాస్ వదులుకుంటారా?, మరి అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు భారతీయునిగా నిరూపించుకునేందుకు ముస్లిం అనే తన గుర్తింపును వదులుకోవాలి? అని రాజీవ్ ధ్యాని ప్రశ్నించారు.

ఇస్లాంను ‘విదేశీ మతం’గా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పదే పదే పిలుస్తోంది.

‘‘కొన్ని మతాలు భారత్‌కు వెలుపలవి. వారితో మనం యుద్ధాలు చేశాం. బయట వ్యక్తులు వెళ్లిపోయారు. కానీ, లోపలున్న వారు ఇంకా బయట వ్యక్తుల ప్రభావంలోనే ఉన్నారు. వారు కూడా మనవారే అని మనం అర్థం చేసుకోవాలి. వారి ఆలోచనల్లో ఏదైనా లోపం ఉంటే, దాన్ని సవరించాల్సిన బాధ్యత మనపైనే ఉంది’’ అని ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ అన్నారు.

సావర్కర్

ఫొటో సోర్స్, Getty Images

సావర్కర్ కూడా పితృభూమి, పుణ్యభూమి అనే దానిపై మాట్లాడేవారు.

"భారత్‌లో పుట్టిన అందరికీ భారత్ పితృభూమి. కానీ ఎవరైతే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కారో, వారికి భారత్ పుణ్య భూమి కాదు. " సావర్కర్ నమ్మేవారు.

అండమాన్ నుంచి తిరిగి వచ్చిన సావర్కర్ 'హిందుత్వ-హూ ఈజ్ హిందూ?' అనే పుస్తకం రాశారు.

‘‘కొన్ని కేసుల్లో మన ముస్లింలు లేదా క్రిస్టియన్లు, బలవంతంగా నాన్-హిందువులుగా మారారు. వారి పితృభూమి ఒకటే. చాలా వరకు సంస్కృతి కూడా ఒకటే. కానీ, వారిని హిందువులుగా పరిగణించలేం.

అంటే, హిందువుల మాదిరిగా వారి పితృభూమి భారత్, కానీ పుణ్యభూమి కాదు. వారి పుణ్యభూమి దూరంలో ఉన్న అరబ్‌లో ఉంది. వారి నమ్మకాలు, వారి మత నేతలు, వారి సిద్ధాంతాలు ఈ భూమికి చెందినవి కాదు.

ఇలాంటి పరిస్థితుల్లో వారి పేర్లు, వారి అనుసరించే విధానాలు విదేశీ సంతతికి చెందినవి. వారి ప్రేమ కూడా విభజించడమైంది’’ అని సావర్కర్ ఈ పుస్తకంలో రాశారు.

‘‘భగత్ సింగ్ నాస్తికుడు, ఆయనకు ఎక్కడా పుణ్యభూమి లేదు. జాతీయవాదాన్ని, మతాన్ని కలుపకూడదు. మతమనేది పూర్తిగా భిన్నమైన అంశం. మతంతో ఒకరి జాతీయవాదం ప్రభావితం చెందకూడదు’’ అని సావర్కర్ రాసిన ఈ పుణ్యభూమి, పితృభూమి వాదనపై చరిత్రకారుడు సయూద్ ఇర్ఫాన్ హబీబ్ బీబీసీకి వివరించారు.

ట్విటర్ స్క్రీన్‌షాట్

ఫొటో సోర్స్, TWITTER SCREENSHOT

మతానికి, దేశానికి మధ్య ఎలాంటి విరోధం లేదని చాలా మంది నమ్మకం.

రెండింట్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం, వదులుకోవడం అనే దాని గురించి మాట్లాడటం ఎలాంటి లాజిక్ లేని విషయమంటున్నారు.

కుమార్ విశ్వాస్ చేసిన ఈ ట్వీట్, సిద్ధాంతపరంగా ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారనే ఆరోపణలకు దగ్గరగా ఉందని చాలా మంది భావిస్తున్నారు.

‘‘ఇస్లాం లేదా భారత్ అనే దాన్ని ఎందుకు ఒకరు ఎంచుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత లేదా గురు గ్రంథ్ సాహిబ్ లేదా బైబిల్ లేదా రాజ్యాంగం అనే దానిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని మీరెందుకు ప్రశ్నించుకోవడం లేదు. కుమార్ విశ్వాస్ మీ మనసు స్థిరంగానే ఉందా? లేదా ముస్లింలపై ద్వేషాన్ని చూపిస్తూ బీజేకీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

కుమార్ విశ్వాస్ ట్వీట్‌కి జర్నలిస్ట్ రోహిణి సింఘ్ కూడా స్పందించారు.

‘‘భారత్, మతం ఏదో ఒక దాన్ని ఎందుకు ఎంపిక చేసుకోవాలి? మోహన్ భగవత్ లేదా జేపీ నడ్డాకు భక్తిని నిరూపించుకునేందుకు ఇదే పరీక్షను మనం పెట్టొచ్చా? దేశం ప్రజల చేత నిర్మితమవుతుంది, భూ ముక్కల ద్వారా కాదు’’ అని అన్నారు.

ట్విటర్ స్క్రీన్‌షాట్

ఫొటో సోర్స్, TWITTER SCREENSHOT

‘‘మిస్టర్ కవి గారు! ఇది అర్థం లేనిది? ఎందుకు అసదుద్దీన్ ఒవైసీ ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి? నేను కూడా మిమ్మల్ని ఈ ప్రశ్న వేయొచ్చు... రాముడు లేదా మాత? గీత లేదా అంబేద్కర్ రాజ్యాంగం? మీ ఇల్లు లేదా రామ్ మందిర్? ఏది కావాలో ఎంచుకోమని అడగవచ్చు. కానీ, మేం మీ స్థాయిలో లేం, ఇలాంటి అశాస్త్రీయమైన ప్రశ్నలను మేం మిమ్మల్ని అడగం’’ అని మరో యూజర్ ట్వీట్ చేశారు.

ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

ఒవైసీ షేర్ చేసిన నివేదికలో ఏముంది?

ఆంగ్ల పత్రిక ఏషియన్ ఏజ్ ప్రచురించిన ఒపినియన్ నివేదికలో, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఉన్నత స్థాయిలో ముస్లిం అధికారులు లేకపోవడాన్ని ప్రస్తావించింది.

చాలా దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఐబీలో కీలకమైన స్థానాల్లో ఏ సీనియర్ ముస్లిం ఐపీఎస్ అధికారి లేరని కూడా పేర్కొంది.

నివేదిక ప్రకారం ఐబీలో సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఏ రజ్వీ తన పదవీ కాలం ముగియడాని కంటే ముందే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలో అడ్వయిజరీగా పోస్ట్ అయ్యారు.

ఇటీవల కాలంలో ఐబీలో ముస్లిం ఐపీఎస్ అధికారుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుందని ఈ నివేదిక చెప్పింది.

అంతకుముందు కాలంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. అసిఫ్ ఇబ్రహ్మిం ఐబీ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అస్సాం కేడర్ ఐపీఎస్ అధికారి రఫీ ఉల్ ఆలం కూడా డిప్యూటేషన్ మీద ఏజెన్సీలో కీలక స్థానాన్ని చేపట్టారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఈ ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) పరీక్షలో 29 మంది ముస్లింలు ఉత్తీర్ణులయ్యారు.

ఫైనాన్సియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, క్రితంసారితో పోలిస్తే మూడు శాతం ఈ సంఖ్య పెరిగింది.

ప్రింట్ నివేదిక ప్రకారం పోలీసు బలగాల్లో ముస్లింల ప్రాతినిధ్యంపై భిన్నమైన చిత్రం కనిపిస్తోంది.

ప్రింట్ రిపోర్ట్ ప్రకారం భారత్‌లోని అన్ని రాష్ట్రాల పోలీసు బలగాల్లో కేవలం మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే ముస్లిం సైనికులున్నారు. టాటా ట్రస్ట్ నివేదికను ఉటంకిస్తూ ఈ రిపోర్ట్‌ను రాశారు.

2013 ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం, భారత పోలీసు బలగాల్లో 1.08 లక్షల మంది ముస్లింలున్నారు. మొత్తం సంఖ్యలో వీరు 6.27 శాతం.

కానీ, 2007లో ఈ సంఖ్య 7.55 శాతంగా ఉండేది. ప్రస్తుతం ముస్లిం పోలీసు అధికారులు ఎంత మంది ఉన్నారన్న విషయంపై ఎలాంటి అధికారిక గణాంకాలు లేవు.

ఎందుకంటే, 2015లోనే ముస్లిం జవాన్ల సంఖ్య ఎంతనేది బహిరంగం చేయడాన్ని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆపివేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)