ప్రియుడు నస్రుల్లాతో నిశ్చితార్థం కోసం పాకిస్తాన్ వెళ్లిన అంజూ.. పెళ్లి కోసం ఇస్లాంలోకి మారబోనన్న భారత మహిళ.. అక్కడ ఏం జరిగింది?

- రచయిత, మొహమ్మద్ జుబేర్ ఖాన్, పాయల్ భుయన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
తన ప్రియుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి చేరుకున్న భారత మహిళ అంజూ.. ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మారబోనని చెప్పారు.
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దీర్ బాలా జిల్లాకు చేరుకున్న అంజూ, పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారాలనే ఒత్తిడి తనపై లేదని బీబీసీతో ప్రత్యేక సంభాషణలో తెలిపారు.
పెళ్లి కోసం మతం మారడం ఇష్టం ఉండదని ఆమె చెప్పారు.
పాకిస్తానీ యువకుడు నస్రుల్లాతో ఫేస్‌బుక్‌లో పరిచయం, స్నేహం, ఆయన కోసం పాకిస్తాన్ చేరుకోవడం, నిశ్చితార్థం, పెళ్లి ప్రణాళికల గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు అంజూ సూటిగా సమాధానాలు చెప్పారు.

ఫొటో సోర్స్, Empics
అంజూ ఇంకా ఏమన్నారంటే...
- నేను 2020 నుంచి నస్రుల్లాతో మాట్లాడుతున్నా. ఫేస్‌బుక్ ద్వారా మాకు పరిచయం ఏర్పడింది. నస్రుల్లాను కలవడానికే నేను పాకిస్తాన్‌కు చేరుకున్నా. ఇక్కడ నాకు చాలా బాగుంది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు.
- ఇక్కడికి వచ్చే ముందు నా భర్తకు చెప్పలేదు. చెబితే ఆయన నన్ను అనుమతించకపోయేవారు. అసలు పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టగలనో, లేదో కూడా నాకు తెలియదు. కానీ, పాకిస్తాన్‌కు చేరుకోగానే నేను ఇక్కడ ఉన్నానని వారికి చెప్పాను. ఇక్కడికి వచ్చాక కూడా పిల్లలతో తరచుగా మాట్లాడుతూనే ఉన్నా.
- ఇక నిశ్చితార్థం, పెళ్లి విషయానికొస్తే.. ఈ విషయం గురించి నా భర్తకు చెప్పలేదు. నేను ఆయనతో ఎక్కువగా మాట్లాడను. నా పిల్లల కోసమే తిరిగి భారత్‌కు వస్తానని ఆయనకు చెప్పాను. నాకు ఒక నెల వీసా లభించింది. నేను మరో నాలుగు రోజుల్లో భారత్‌కు వస్తాను.
- నేను ఇక్కడ అన్నీ చూసి, అంతా ఓకే అనుకున్న తర్వాతే నిశ్చితార్థం గురించి నిర్ణయించుకుంటాను. అంతా సవ్యంగా అనిపిస్తే భారత్‌కు తిరిగి వెళ్లడానికి ఒక రోజు ముందు నేను నిశ్చితార్థం చేసుకుంటాను. నిశ్చితార్థం తర్వాతే భారత్‌కు వస్తాను. మిగతా ప్రక్రియను భారత్ వచ్చాక పూర్తి చేస్తాను.
- నస్రుల్లాతో నా సంబంధం ఇప్పటివరకు చాలా బాగుంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా మంచివారే. ఇక్కడివారు ప్రేమగా మాట్లాడతారు. ఇక్కడ నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. నాకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలున్నారనే సంగతి కూడా వీళ్లకు తెలుసు.

జైపుర్ అని చెప్పి పాకిస్తాన్ వెళ్లింది: అంజూ భర్త అరవింద్
నస్రుల్లాను కలవడానికి పాక్‌లోని దీర్ బాలా జిల్లాకు చేరిన అంజూకు అక్కడి వారు ఘన స్వాగతం పలికారు.
ఆమెను కలిసేందుకు, చూసేందుకు చాలా మంది వస్తున్నారు.
అంజూ భర్త అరవింద్, బీబీసీ ప్రతినిధి మోహర్ సింగ్ మీనాతో మాట్లాడుతూ- ఆమె జైపుర్ వెళ్తానని చెప్పి జులై 21న ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. అప్పటి నుంచి అంజు తనతో వాట్సాప్‌లో మాట్లాడుతోందని ఆయన చెప్పారు.
"జులై 23 సాయంత్రం మా అబ్బాయి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఇంటికి ఎప్పుడు వస్తావని అంజూను అడిగాను. అప్పుడు తాను పాకిస్తాన్‌లో ఉన్న విషయం అంజూ చెప్పింది. త్వరలో తిరిగి వస్తానంది. పాకిస్తాన్ వెళ్లే విషయం గురించి అంజూ ఎవరికీ కనీసం అనుమానం కూడా రానివ్వలేదు. జైపుర్ వెళ్తున్నానంటూ ఆమె అక్కడికి వెళ్లింది. చాలా కాలం క్రితమే అంజూ పాస్‌పోర్ట్ తీసుకుంది. ఈ విషయం మాకు తెలుసు.
నా వయస్సు 40 ఏళ్లు. అంజూ వయస్సు దాదాపు 35 ఏళ్లు ఉంటుంది. మేం ఇద్దరం ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వాళ్లం. కానీ, కొన్నేళ్లుగా రాజస్థాన్‌లోని భివాడీలోనే స్థిరపడ్డాం. 2007లో మా ఇద్దరికి పెళ్లి అయింది. మాకు ఇద్దరు పిల్లలు. పాపకు 15 ఏళ్లు, బాబు వయస్సు ఆరేళ్లు. వారిద్దరూ స్కూల్‌కు వెళ్తారు.
నేను పన్నెండో తరగతి వరకు చదివాను. అంజూ పదో తరగతి పాస్ అయింది. భివాడీలోని ఒక కంపెనీలో అంజూ పనిచేస్తోంది. పక్కనే ఉన్న మరో కంపెనీలో నేను పనిచేస్తుంటా’’ అని అరవింద్ వివరించారు.

ఫొటో సోర్స్, NASRULLAH
నస్రుల్లా ఏమన్నారు?
"అంజూ, నేను మరికొన్ని రోజుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. నిశ్చితార్థం అయిన పది పన్నెండు రోజుల తరువాత ఆమె తిరిగి భారత్‌కు వెళ్లిపోతుంది. పెళ్లి కోసం ఆమె మళ్లీ పాకిస్తాన్ వస్తుంది. ఇది మా ఇద్దరి వ్యక్తిగత జీవితం. ఇందులో ఎవరి జోక్యం మాకు ఇష్టం లేదు. మేం మీడియాకు కూడా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం."
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రం దీర్ బాలా జిల్లాకు చెందిన 29 ఏళ్ల నస్రుల్లా మాటలివి.
కొన్నేళ్ల క్రితం భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంజూ అనే అమ్మాయితో నస్రుల్లాకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా అది ప్రేమగా మారింది.
నస్రుల్లాతో తన అనుబంధాన్ని వివాహ బంధంగా మార్చడం కోసం అంజూ ఇటీవలే పాకిస్తాన్ చేరుకున్నారు.
ప్రస్తుతం దీర్ బాలా జిల్లాలోని నస్రుల్లా ఇంట్లోనే అంజూ ఉంటున్నారు. అంజూ అక్కడే ఉన్నట్లు దీర్ బాలా డీపీఓ మొహమ్మద్ ముస్తాక్ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, SHAHNAWAZ/BBC
వీరి ప్రేమ కథ కూడా పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్, నోయిడా నివాసి సచిన్ మీనాల తరహాలోనే ఉంటుంది. చట్టబద్ధంగా వీసా తీసుకొని అంజూ పాకిస్తాన్‌కు చేరుకున్నారు. ఈ వీసా కోసం అంజూ, నస్రుల్లా రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది.
ఇటీవల పాకిస్తాన్ పౌరురాలు సీమా హైదర్, తన నలుగురు పిల్లలతో కలిసి అక్రమంగా భారత్‌కు చేరుకున్నారు. పబ్జీ మొబైల్ గేమ్ ఆడుతుండగా ఆమెకు సచిన్ మీణాతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత అది ప్రేమగా మారింది.
‘‘నేను ఇప్పుడు ఆయనను ప్రేమిస్తున్నా. ఆయన కోసమే నా దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడకు వచ్చాను’’ అని బీబీసీకీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సీమ చెప్పారు.
పాకిస్తాన్, భారతదేశ పౌరుల మధ్య ఇటువంటి ప్రేమ కథలు కొత్తవేమీ కాదు. అయితే, రెండు దేశాల మధ్య చెదిరిన సంబంధాల కారణంగా, ఇప్పుడు ఈ రెండు దేశాలు పరస్పరం తక్కువగా వీసాలు మంజూరు చేస్తున్నాయి.
అంజూ కు పాకిస్తాన్ వీసా అంత తేలిగ్గా లభించలేదు. దీర్ బాలా అనేది పాకిస్తాన్‌లోని ఒక మారుమూల జిల్లా. ఈ జిల్లా సరిహద్దు ఆఫ్గానిస్తాన్‌కు ఆనుకొని ఉంటుంది.
సాధారణంగా ఈ రెండు దేశాలు పౌరులకు కొన్ని నగరాల్లో మాత్రమే పర్యటించేలా అనుమతిస్తూ వీసాలను మంజూరు చేస్తాయి.
ఈ నేపథ్యంలో అంజూ, నస్రుల్లాల కథ ఎలా మొదలైంది? అంజూ, పాకిస్తాన్ వీసాను ఎలా పొందారు? దీర్ బాలా జిల్లాకు వెళ్లడానికి ఆమెకు అనుమతి ఎలా వచ్చింది? అనే అంశాలను చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
వీసా పొందేందుకు రెండేళ్లు
కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా భారత్‌కు చెందిన అంజూ తో తనకు పరిచయం ఏర్పడిందని బీబీసీకి నస్రుల్లా చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంజూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తారు. తన వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచాలని ఆయన కోరారు.
ఈ సమయంలో మీడియాతో మాట్లాడటం అంజూ కు కూడా ఇష్టం లేదని ఆయన చెప్పారు.
‘‘మొదట మా పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరం కలిసి బతకాలని తర్వాత మేం నిర్ణయించుకున్నాం. నా నిర్ణయాన్ని మా కుటుంబం కూడా ఆమోదించింది. అంజూ మొదట పాకిస్తాన్ వచ్చి మా కుటుంబాన్ని కలుస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌లో నిశ్చితార్థం, పెళ్లి చేసుకోవాలని మేం ఇద్దరం అనుకున్నాం’’ అని నస్రుల్లా వివరించారు.
అయితే, అంజూ పాకిస్తాన్ పర్యటనను సుసాధ్యం చేయడం సులభంగా ఏం జరుగలేదు. సరిహద్దు సమస్యతో పాటు, రెండు దేశాల మధ్య ఉద్రిక్త సంబంధాలు కూడా ఒక అడ్డంకిగా మారినట్లు వారు చెప్పారు.
అంజూ కు చాలా కష్టంగా పాకిస్తాన్ వీసా లభించిందని నస్రుల్లా తెలిపారు.
ఓవైపు అంజూ, దిల్లీలోని పాక్ ఎంబసీ చుట్టూ తిరుగుతుంటే మరోవైపు ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర కార్యాలయాల చుట్టూ నస్రుల్లా చక్కర్లు కొడుతూనే ఉన్నారు.
చివరికి, రెండేళ్ల తర్వాత వారి ప్రయత్నాలు ఫలించాయి. అంజూ కి, పాకిస్తాన్ వీసా లభించి దీర్ బాలా వెళ్లేందుకు అనుమతి దక్కింది.
భారత్ నుంచి పాకిస్తాన్ చేరుకోవడానికి, అక్కడి నుంచి దీర్ బాలా రావడానికి చట్టపరంగా చేయాల్సినవన్నీ చేసినట్లు నస్రుల్లా చెప్పారు.
" వీసా కోసం మేం వేల రూపాయలు ఖర్చు చేశాం. ఇప్పుడు వీసా వచ్చింది కాబట్టి భవిష్యత్‌లో మళ్లీ సమస్యలు రావని ఆశిస్తున్నాం’’ అని నస్రుల్లా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అందరికీ ఇష్టమే’
అంజూ ఆఫీసులో సెలవు తీసుకొని పాకిస్తాన్‌కు వచ్చారని, భారత్‌కు తిరిగి వెళ్లిన తర్వాత కూడా ఆమె తన ఉద్యోగాన్ని కొనసాగిస్తారని నస్రుల్లా చెప్పారు.
"అంజూ ప్రస్తుతం మా ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ ఆమె ప్రశాంతంగా, హాయిగా ఉంటున్నారు. కానీ, మీడియా హడావిడితో ఆమె ఇప్పుడు సంతోషంగా లేరు’’ అని ఆయన వివరించారు.
‘‘మా ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో మీడియా, ప్రజలు గుమిగూడారు. అవసరమైతే నేనే మీడియాను పిలుస్తా. మా సంబంధాన్ని ఏదో ఒక సమస్యగా చూడటం నాకు ఇష్టం లేదు. మా అనుబంధంలో మతం ప్రమేయం లేదు. మతం మారడం, మారకపోవడం అంజూ ఇష్టం. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. ఆమె కూడా నా నిర్ణయాలను గౌరవిస్తారు’’ అని ఆయన తెలిపారు.
తమ బంధంతో అంజూ కుటుంబానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని నస్రుల్లా చెప్పారు.
"అందుకే మా ప్రైవసీని గౌరవించాలని నేను కోరుతున్నా. మా బంధాన్ని ఒక తమాషాగా మార్చొద్దు. దీన్ని మేం అస్సలు ఒప్పుకోం’’ అని ఆయన అన్నారు.
'అంజూ మా అతిథి'
ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో భారత మహిళ ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు కూడా సంతోషిస్తున్నారు.
"అంజూ శుక్రవారం ఉదయం భారీ వర్షం కురుస్తున్నప్పుడు వచ్చారు. ఆమె కోసం ఈ ప్రాంత ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆమెకు శనివారం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని మేం అనుకున్నాం.
కానీ, దురదృష్టవశాత్తు ఒకరు చనిపోయారు. ఇప్పుడు ఈ రిసెప్షన్‌ను తరువాత నిర్వహిస్తాం" అని స్థానిక రాజకీయ, సామాజిక అంశాల్లో చురుగ్గా ఉండే ఫరీదుల్లా బీబీసీకి చెప్పారు.
పఖ్తూన్‌కు అంజు అతిథి మాత్రమే కాదు కోడలు కూడా అని ఆయన అన్నారు.
‘‘ఆమెకు నచ్చినంత కాలం ఇక్కడ ఉండొచ్చు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది, సమస్య ఉండదు. ఆమెకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
ఆమె రాకతో మా ప్రాంతంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. మా ఇళ్లలోని మహిళలు అంజూను కలవడానికి వెళుతున్నారు. ఆమెకు బహుమతులు ఇస్తున్నారు. అనవసర ఆందోళన చెందవద్దని వారు ఆమకు భరోసా ఇస్తున్నారు" అని ఫరీదుల్లా తెలిపారు.
పాకిస్తాన్‌కు చేరుకున్న అంజూ వీసా పత్రాలను తనిఖీ చేయగా, అన్ని సవ్యంగానే ఉన్నట్లు పోలీసులు గుర్తించారని దీర్ బాలా డీపీఓ మొహమ్మద్ ముస్తాక్ చెప్పారు.
అంజుకు ఒక నెల రోజులకుగానూ వీసా లభించిందని, దీర్ బాలాలో ఉండేందుకు కూడా ఆమెకు అనుమతులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
అంజూకి పోలీసులు పూర్తి భద్రత కల్పిస్తారని, దానితో పాటు ఆమె ప్రైవసీకి భంగం కలిగించకుండా చూసుకుంటామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















