అమిటి హనుమంతు, ASP: 'బడిలో చేరాలని వెళ్తే బిచ్చగాడని తరిమేశారు...'

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
“నాదీ రాయలసీమే. తిండి దొరక్కపోతే చిన్నతనంలో అడుక్కోడానికి వెళ్లేవాడిని. అడుక్కున్న తర్వాత ఒక చెట్టు కింద ఆకులో అన్నం పెట్టుకుని తినేవాడిని. అప్పుడు ఆ దారిలో స్కూలుకు వెళ్తున్న పిల్లల్ని చూసి తినడం ఆపి అలాగే చూస్తుండేవాడినని అమ్మ చెప్పింది.”
ఈ మాటలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
‘‘భిక్షాటన చేసి చదువుకున్నాను. మీకు ఆ పరిస్థితి లేదు. బాగా చదువుకుని గొప్పవాళ్లు కావచ్చు’’ అని అనంతపురం జిల్లాలో ఓ ఏఎస్పీ పిల్లలకు చెప్పడం కేవలం ఆ పిల్లలకే కాదు సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి.
పోలీసులు, టీచర్లు, ఎవరి దగ్గర చూసినా ఈ వైరల్ వీడియో గురించి చర్చనే.
ఆ వీడియోలో ఉన్న ఏఎస్పీ పేరు అమిటి హనుమంతు. తన మాటలతో ఇంతమందిలో స్ఫూర్తి నింపిన ఆయన జీవితంలో ఎన్నో మలుపులున్నాయి.
వీటి గురించి తెలుసుకోవాలని బీబీసీ ప్రయత్నించింది. అనంతపురంలో ఆయన్ను కలిసింది. తన మాటల్లోనే ఆయన కథేంటో మనం తెలుసుకుందాం.

‘కూలికి పోతేనే కడుపు నిండేది’
‘‘మాది అన్నమయ్య జిల్లా కలికిరి మండలం, తెళ్లగుట్టపల్లి. మా నాన్నగారి పేరు అమిటి రామయ్య, అమ్మ కృష్ణమ్మ. మేం ముగ్గురు మగ పిల్లలం, ఒక ఆడపిల్ల అయితే వారిలో నేను మూడో సంతానం.
ఇంట్లో కూలికి వెళ్తేనే పూట గడిచేది. పనులు లేకపోతే భోజనానికి కష్టమయ్యేది. మా అమ్మ ఊరూరూ వెళ్లి భోజనం తెచ్చేవారు.
పండగలప్పుడు, జాతరలు ఏవైనా జరిగినప్పుడు ఒక పది మందిమి కలిసి మా పక్కనున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గ్రామానికి వెళ్లేవాళ్లం.
అక్కడ వాళ్ల కుటుంబ సభ్యులు అందరూ ఉండేవాళ్లు. మేం పాత్రలు తీసుకుని వెళ్లి ఇంటి ముందు వరుసగా కూర్చుంటే, వాళ్లు అందరికీ భోజనం పెట్టేవాళ్ళు .
అమ్మ ఆ పక్క గ్రామానికి వెళ్తూ నన్ను తోడు తీసుకుని వెళ్లేవారు. ఎక్కువగా నేనే అమ్మతో తోడుగా వెళ్లేవాడిని.
అమ్మ ఇంటికి భోజనం తెస్తే అందరం కలిసి తినేవాళ్లం.
ఒక గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తూ, ఒక చెట్టు కింద కూర్చొని అమ్మ, నేను ఇద్దరం తింటున్నాం. అప్పుడు పిల్లలు స్కూలుకు వెళ్తుంటే నేను వాళ్ళని చూస్తున్నానంట.
అప్పుడు నాలో చదువు మీదున్న ఆసక్తిని అమ్మ గమనించారు.’’

‘స్కూలుకు వెళ్తే తరిమేసారు’
తల్లితో కలిసి అన్నం కోసం వెళ్లే హనుమంతు ఆ ప్రాంతంలో ఉన్న వారికందరికీ తెలుసు. దీంతో ఆయనను మెదట స్కూల్లో చేర్చుకోలేదు.
‘‘అమ్మతోపాటు వెళ్లి ఇళ్ళ ముందర నిలబడి నేను అన్నం అడిగే వాడిని. నేను స్కూలుకు వెళ్లేసరికి అన్నం కోసమే వచ్చానేమో అనుకుని 'ఇక్కడ అన్నం లేదు పో' అని పంపించేశారు.
వాళ్లు నేను అన్నం కోసమే వచ్చానేమో అనుకున్నారు. నువ్వు రేపు మళ్లీ వెళ్దువులే అని అమ్మ అన్నారు. అమ్మ పక్కన వేరే వాళ్ళ దగ్గర ఒక పలక తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి నన్ను స్కూలుకు పంపించారు.’’

‘జీవితం మొదలైంది అప్పుడే’
‘‘టీచర్ నా పలక చూసి, నువ్వు స్కూల్లో చేరడానికి వచ్చావా అని తీసుకెళ్లి తరగతిలో కూర్చోబెట్టారు.
టీచర్ చేరదీసినా తోటి పిల్లలు మాత్రం నన్ను దగ్గరకు రానీయలేదు.
మొదట్లో నా మాసిన బట్టలు చూసి మన ఇళ్ల దగ్గర అడుక్కునే వాడు మన పక్కన కూర్చున్నాడనే ఫీలింగ్ పిల్లల్లో ఉండేది.
కొన్నాళ్లపాటు నన్ను పక్కన కూర్చోబెట్టుకోలేదు. టీచర్ లేనప్పుడు వెనక్కి వెళ్లి దూరంగా వెళ్లి కూర్చో అంటూ బెదిరించేవాళ్లు.
దీన్ని టీచర్ గమనించి పిల్లల్ని గట్టిగా మందలించారు.
కొన్ని సందర్బాలలో మేం రోడ్లపై వెళ్తుంటే మా బట్టలు సరిగ్గా లేక కుక్కలు వెంటపడితే కర్ర పట్టుకుని తిరిగిన రోజులున్నాయి.
అప్పట్లో మా టీచర్ మంచి బట్టలు వేసుకొని రా అంటూ తానే కొన్ని బట్టలు ఇప్పించారు.
అమ్మ వేరే చోట బట్టలు తీసుకొచ్చి ఇవ్వడంతో నా జీవితం మొదలైంది.’’ అని ఆనాటి రోజుల్ని గుర్తుకు చేసుకున్నారు ఏఎస్పీ హనుమంతు.
‘ఒక చేత్తో కట్టెలు మరో చేత్తో పుస్తకాలు’
‘‘కొంచెం వయసు పెరిగాక భిక్షాటన అవమానంగా అనిపించింది.
పని చేయడం నేర్చుకోండి అంటూ మా నాన్న పనులు చేయడం నేర్పించారు.
మేం చిన్న పిల్లలం కాబట్టి మాకు కూలి పనులు ఇవ్వరు. పెద్దవాళ్లు అయితేనే కూలి ఇస్తారు.
ఆకు కొట్టడం, వరి కోయడం, బురదలో ఆకు తొక్కించడం లాంటి పనులు చేసేవాడిని.
మా నాన్న ఏదైనా పని ఒప్పందం చేసుకుని వస్తే ఆ పని పూర్తి చేసేవాళ్లం. అందరి పనికీ కలిపి నాన్న కూలి తెచ్చేవాడు.
సగం రోజు మా అన్న స్కూలుకెళ్తే, నేను కూలికి వెళ్ళేవాడిని. అలాగే నేను స్కూలుకెళ్తే, మా అన్న కూలికి వెళ్లేవాడు.
కూలి పనులు కొంచెం కష్టంగా అనిపించడంతో కట్టెలు అమ్మడం ప్రారంభించాను. ఆ డబ్బులు తీసుకొచ్చి అమ్మకు ఇచ్చేవాడిని.
తెల్లవారుజామున 3 గంటలకు లేచి అడవికి వెళ్లి కట్టెలు తీసుకొచ్చి, ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుని మరో చేత్తో తలపైన కట్టెలు పెట్టుకుని అమ్ముతుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు.
కొంతమంది నా చేతిలో పుస్తకాలు చూసి సాయం చేద్దామని పది రూపాయలు ఇచ్చేవాళ్లు. అలా నెలకు ఆ రోజుల్లో మూడు వందలు సంపాదించేవాడిని.’’
‘అన్నం కోసం కర్మకాండలు’
హనుమంతు అన్న, తమ్ముడు హాస్టల్లో చదువుతుంటే ఆయన కట్టెలమ్మి, ఇతర పనులు చేస్తూ అమ్మకు సాయంగా నిలిచేవారు.
‘‘నేను కూడా హాస్టల్లో ఉంటే కుటుంబం అవసరాలు తీరేదెలా? అందుకే కట్టెలు అమ్మడం కొనసాగించాను.
పెళ్లిళ్లు, కర్మకాండలకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లి పని చేసేవాడిని. ఎందుకంటే చివర్లో ఎక్కువ భోజనం పెట్టేవాళ్లు. మా ఇంట్లోవాళ్లు ఆ భోజనం కోసం ఎదురు చూసేవాళ్లు. నాకు అలవాటు కాబట్టి వెళ్లే వాడిని.
మా అన్న, తమ్ముడికి అలవాటు లేదు కాబట్టి వెళ్లలేకపోయేవాళ్లు. కొన్ని సార్లు సమాధులు తవ్వడానికి కూడా వెళ్లేవాడిని.
కొన్నిసార్లు పనులు ఉంటే స్కూలుకు వెళ్లేవాడిని కాదు. తర్వాత రోజు ఏ పాఠం జరిగిందో తెలుసుకుని దాన్ని పూర్తి చేసేవాడిని.
నేను ఎందుకు స్కూలుకు రాలేకపోతున్నానో తెలియక టీచర్లు నన్ను రెండు మూడు సార్లు కొట్టారు.
తర్వాత నేను కట్టెలు అమ్ముతున్నానని తెలిసి చలించిపోయారు.
సాయంత్రం స్కూలుకు వెళ్ళి రాగానే మా అక్క పూలు కోసి ఉంచేది. వాటిని మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ల చిన్నమ్మకు ఇచ్చిరావాలి.
ఆమెకు ఇంచుమించు నా వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళ బట్టలు నాకు చాలా బాగా సరిపోతాయి.
పూలు ఇచ్చాక వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా బట్టలు అడిగేవాడిని.
అలా సీజన్ వచ్చినప్పుడల్లా బట్టల కోసం ఆమె దగ్గరికి వెళ్లి తెచ్చుకునే వాడిని. అయినా అప్పట్లో పూలకు పావలా ఇచ్చేవారు.
ప్రతి ఏటా పుస్తకాలు కోసం మా సీనియర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ళ ఇళ్ల దగ్గర పని చేసేవాడిని.
ఆ తర్వాత వాళ్ల పాత పుస్తకాలు కావాలని అడిగి తీసుకునే వాడిని.
ఇలా ఎన్నో కష్టాలకోర్చి మదనపల్లి బీటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను.
చదువు పూర్తి అయిన తరువాత ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు కూడా అన్నే కష్టాలు పడ్డాను.’’ అని హనుమంతు తెలిపారు.
‘ఫుట్ పాత్ మీద ప్లేట్లు కడిగాను’
ఉద్యోగ సెలక్షన్ కోసం హైదరాబాద్‌కు వెళ్లి బస్టాండులో బెంచ్‌పైన పడుకొని సెలక్షన్స్‌కు వెళ్లానని చెప్పారు.
అన్నం కోసం ఉదయం ఫుట్ పాత్‌పైన ఉండే బండ్ల దగ్గర ప్లేట్లు కడగడం లాంటివి చేసేవాడిని తెలిపారు.
కాచిగూడ రైల్వే స్టేషన్ ముందు రన్నింగ్ చేస్తూ బస్టాండులో పడుకోవడానికి ఇబ్బంది కలిగితే తర్వాత భవన కార్మికుల దగ్గర పనికి వెళ్లుతూ అక్కడే పడుకున్నానని గుర్తుచేసుకున్నారు.

‘మెదటిసారి ఆనందం అప్పుడే’
అన్నం లేదు పొమ్మని తిట్టి పంపిన వారే మా ఇంటికి వచ్చి మన్నించమని అడగడం సంతోషాన్నిచ్చిందంటారు హనుమంతు.
‘‘నేను సబ్ ఇన్‌స్పెక్టర్ అయ్యాక మా చుట్టుపక్కల గ్రామాల వాళ్లందరూ నన్ను చూడడానికి వచ్చారు.
మాకు పనులు ఇచ్చేవాళ్లు, మమ్మల్ని వారి ఇంట్లోకి రానిచ్చేవాళ్లు కాదు. నేను సబ్ ఇన్‌స్పెక్టర్ అయ్యాక వాళ్లు మా ఇంటికి రావడం చూసి మా అమ్మ సంతోషించారు.
అంతకు ముందు తిట్టిన వాళ్లంతా మనసులో ఏమీ పెట్టుకోవద్దమ్మా అనేవారు.
ఇలా తల్లిదండ్రులు గౌరవాన్ని పెంచాలి అనే వాళ్లు.
మా అమ్మను ఎస్ఐ తల్లి గారు అనే వాళ్లు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ తల్లి గారు అంటున్నారు.’’ అని తన ఆనంద క్షణాలను బీబీసీతో పంచుకున్నారు.
‘చిప్పలో తాగిన నీళ్లే కసిని పెంచాయి’
ఒక్క ఘటన నాకు అవమానంగా అనిపించింది. అదే నాకు ఉద్యోగం రావడానికి కారణం అయ్యిందంటూ అప్పటి కుల వివక్షను గుర్తు చేసుకున్నారు హనుమంతు.
అప్పట్లో గ్రామాల్లో అంటరానితనం పాటించేవారు. దళితులకు గ్లాసుల్లో కాకుండా కొబ్బరి చిప్పలో నీళ్లు ఇచ్చేవారు.
‘‘నేను చెనగ పెరికే పనికి వెళ్లాను. పని మధ్యలో దాహం వేసి, మాతో పని చేయిస్తున్న ఆమెను నీళ్లు అడిగాను.
ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంది కానీ నాకు నీళ్లు ఇవ్వటం లేదు. ఏమయ్యింది అమ్మా అంటే చిప్ప కోసం వెతుకుతున్నాను అంది.
మీ ఇంట్లో గ్లాసులు లేవా అమ్మా అని అడిగితే గ్లాసులో మీకు నీళ్లీయకూడదు కదా అంది.
ఆ కొబ్బరి చిప్పలో నీళ్లు పోస్తుంటే అవి తాగుతూ మేం ఇంత కష్టం చేస్తాం, అయినా మనల్ని ఇలా చూస్తున్నారే అని బాధేసింది.
అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. ఎలాగైనా మంచి పొజిషన్‌కు వచ్చి వీళ్లకు సమాధానం చెప్పాలని ఆరోజే అనిపించింది.
ఆ సంఘటన నా పట్టుదలను పెంచింది. నాకు ఇప్పుడు వారిపై కోపం లేదు. నాకు ఉద్యోగం వచ్చాక మనసులో ఆమెకు ఎన్నోసార్లు థాంక్స్ చెప్పుకున్నాను.’’ అని తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం ఏఎస్పీ హనుమంతు స్వగ్రామం పక్క పక్కనే. పోలీసు అయిన తర్వాత కూడా ఆ సంబంధాలు కొనసాగాయి.
కిరణ్ కుమార్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హనుమంతు తిరుపతి ఏఆర్ డిఎస్పీగా పనిచేస్తున్నారు.
దీంతో కొన్ని సందర్భాలలో సిఎం కాన్వాయ్ భద్రతాధికారిగా హనుమంతు వ్యవహరించారు.
‘‘ఒకప్పుడు వాళ్ళ ఇంటికి వాచ్‌మాన్ ఇప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా వచ్చాడని ఊరంతా పెద్ద టాక్ అయింది.
ఒకప్పుడు వాళ్ల ఇంటిముందర కుర్చోని తిన్నాను. ఆఫీసర్ అయ్యాక ఇంట్లో తిన్నాను.
అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. నేను సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యి ఎస్కార్ట్ ఆఫీసర్‌గా వెళ్లిన తర్వాత అక్కడ బయట ఉన్న వాళ్లంతా నాకు తెలిసిన వాళ్లే కాబట్టి రేయ్ హనుమంతు నన్ను లోపల తీసుకెళ్ళు అంటే చాలా తమాషా అనిపించింది.’’ అని ఆయన ఆనంద సమయాన్ని గుర్తు చేసుకున్నారు.
1966లో పుట్టిన ఆయన 1991లో హైదరాబాద్‌లో ఆర్మూర్డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై ఇంటెలిజెన్సీ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసారు.
‘‘1992లో వివాహమైంది. నాకు నలుగురు పిల్లలు. దాదాపు 31 ఏళ్ల కెరీర్. ఆర్ఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత గ్రేహౌండ్స్ హైదరాబాద్‌కు వెళ్లాను. తర్వాత టీటీడీ విజిలెన్స్‌కు వచ్చాను. తర్వాత ప్రమోషన్ తీసుకొని తిరుపతికి ఏఆర్, డిఎస్పీగా పనిచేశాను. మళ్లీ టీటీడీ విజిలెన్స్‌లో డీఎస్పీగా పనిచేసి తర్వాత విజయనగరం, కర్నూలులో పనిచేశాను.
2020లో కర్నూలు అడిషినల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. తర్వాత అనంతపురం ట్రాన్స్‌ఫర్ అయ్యాను.’’ అని హనుమంతు చెప్పారు.

సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు మనకు ఎంత ఇచ్చారనేదే చూస్తున్నారని, వాళ్లకు మనం తిరిగి ఏం ఇవ్వాలనేది ఎవరూ చూడటం లేదని ఆయన అంటారు.
‘‘నేను కష్టపడి కుటుంబానికి డబ్బులు ఇస్తూ చదువుకున్నాను. నా కథ తెలిస్తే కొంతమంది అయినా మారుతారు. ఇలా కొంతమంది తల్లుల కన్నీళ్లు తుడిచిన వాడిని అవుతానని ఇది చెబుతున్నా. అంబేద్కర్ 'పే బ్యాక్ సొసైటీ' గురించి చెప్పారు. నువ్వు ఎదిగిన తర్వాత మిగిలిన వారిని ఎదిగేలా చేయాలి అని చెప్పారు. నేను ఇప్పటికీ దాన్నే అనుసరిస్తున్నా’’ అని తెలిపారు.
మేధావుల మౌనం ఈ ప్రపంచానికి చాలా నష్టం చేస్తుంది. ‘‘ఇప్పటికీ నేను బెగ్గింగ్ చేస్తూనే ఉన్నా. ఒకప్పుడు నాకోసం, ఇప్పుడు పేద ప్రజల కోసం. మేధావులు ముందుకు రావాలని అడుక్కుంటున్నా. సమాజం బాగుపడటానికి అడుక్కుంటున్నాను.’’ అని హనుమంతు బీబీసీతో చెప్పారు.
ఆయన సొంత గ్రామమైన తెళ్లగుట్టపల్లిలో తల్లి కృష్ణమ్మ ఉంటారు. ఆమెతో మాట్లాడడానికి బీబీసీ ప్రయత్నించింది.
ఆవిడ వయసు దాదాపు 90 సంవత్సరాలు. ఆమె సరిగా మాట్లాడే పరిస్థితిలో లేదు. తండ్రి కొన్నేళ్ళ కిందట మరణించారు. ఆయనకున్న ఇద్దరు అన్నదమ్ములు కూడా ప్రభుత్వ ఉద్యోగులే.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















