ఎంబీబీఎస్ అడ్మిషన్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా ఇచ్చిన జీవోల వల్ల ఏపీ విద్యార్థులే ఎక్కువ నష్టపోతారా?

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యింది. ఆలిండియా కోటా సీట్ల కోసం జులై 20న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. అదే రోజు నుంచి ఏపీలో కూడా రిజిస్ట్రేషన్‌కు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలైంది.

నిరుటి వరకూ ఉన్న విధానానికి భిన్నంగా ఈసారి అన్‌రిజర్వుడు కేటగిరీ సీట్ల విషయంలో రెండు ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దానికి అనుగుణంగా ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు 15 శాతం ఓపెన్ కేటగిరీ సీట్లలో పోటీ పడే అవకాశం పరిమితం చేసేశారు.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 72 ప్రకారం 2014కు పూర్వం ఉన్న మెడికల్ కాలేజీల్లో మాత్రమే ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంటుందని ప్రకటించారు.

దానికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవో తీసుకొచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) పరిధిలో కూడా 2014కు పూర్వమే ఉన్న కాలేజీల్లో మాత్రమే తెలంగాణకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉంటుందని తేల్చేసింది. పాత కాలేజీల్లో కూడా 2014 తర్వాత పెరిగిన సీట్లను ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమేనంటూ జీవోలు తెచ్చింది.

దీంతో ఈ వ్యవహారం మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే పలువురు విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని, ఆర్టికల్ 371డీని జీవో72 ఉల్లంఘిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కేసు విచారణ ఆగస్టు 8కి వాయిదా పడింది.

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మీద వివాదం న్యాయస్థానం పరిధిలో ఉండగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధమైన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్

ఫొటో సోర్స్, Getty Images

నిరుడు ఏపీ నుంచి తెలంగాణలో చేరిన 340 మంది

మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుగా జులై 3న తెలంగాణ ప్రభుత్వం జీవో 72 విడుదల చేసింది. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉన్న ఆర్టికల్ 371డీకి విరుద్ధంగా ఉన్నట్టు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ 18047/2023 దాఖలయ్యింది.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95ను అనుసరించి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో అందరికీ ప్రవేశం కల్పించేందుకు ఉన్న వెసులుబాటును కూడా తొలగించారంటూ పిటిషనర్ అభ్యంతరం వ్యక్తంచేశారు.

విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా అనేక విద్యాసంస్థలు ఉండటంతో విద్యా రంగంలో వ్యత్యాసాలకు తావు లేకుండా పదేళ్ల పాటు అందరికీ అవకాశం కల్పించేలా 15 శాతం అన్‌రిజర్వుడు కేటగిరీ ఏర్పాటు చేశారు. అందులో నాన్‌లోకల్, లోకల్ కూడా పోటీ పడి మెరిట్ ప్రాతిపదికన సీట్లు పొందేలా ఏర్పాట్లు చేశారు. దానిని 2022-23 విద్యాసంవత్సరం అంటే నిరుడు కూడా అమలు చేశారు.

2014 తర్వాత ఏర్పాటైన విద్యా సంస్థల్లో నాన్‌లోకల్ కోటా ఉండదంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జులై 16న జీవో నంబర్లు .103,104,105 విడుదల చేసింది. తెలంగాణలోని కొత్త కాలేజీలలో ఏపీ విద్యార్థులకు ప్రవేశం ఉండదని చెప్పిన చందంగానే ఏపీలోని కొత్త కాలేజీల్లో కూడా తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించబోమని స్పష్టం చేసింది.

నిరుడు కేటాయించిన సీట్ల ప్రకారం ఏపీ నుంచి తెలంగాణలో సుమారుగా వివిధ కోటాల్లో 340 మంది విద్యార్థులు చేరగా, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన విద్యార్థుల సంఖ్య 40లోపుగా ఉంది.

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో పెరిగిన సీట్లు

రాష్ట్ర విభజన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం తొలుత జిల్లాల విభజన చేసింది. జిల్లాకో మెడికల్ కాలేజీ అన్న విధానంలో భాగంగా కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మార్గం సుగమమయ్యింది. దాంతో 2014 నాటికి కేవలం 20 మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంలో ప్రస్తుతం వాటి సంఖ్య 56కి చేరింది. సీట్లు కూడా 3 వేలకు అటూ ఇటూగా ఉన్న దశ నుంచి దాదాపుగా 9 వేలకు చేరాయి.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టిన తర్వాత కొత్త కాలేజీలకు ఇక్కడా అవకాశం వచ్చింది. సుమారు దశాబ్ద కాలం తర్వాత 2023-24 విద్యా సంవత్సరానికి ఏపీలో కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి లభించింది. దాంతో ఏపీలో మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య కూడా విభజన తర్వాత 1500 వరకూ పెరిగి ప్రస్తుతం 6,210కి చేరుకుంది.

ఏపీలో ఏయూ పరిధిలో 9 గవర్నమెంట్ కాలేజీలతో కలిపి మొత్తం 20 మెడికల్ కాలేజీలకు ఈ ఏడాది అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎస్వీయూ పరిధిలో 6 ప్రభుత్వ, 8 ప్రైవేట్ కాలేజీలు కలిపి మొత్తం 14 కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 34 మెడికల్ కాలేజీలున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో సుమారుగా 3 వేల సీట్లు అదనంగా ఉండటంతో ఆ రాష్ట్రంలో పోటీ తక్కువగా ఉంటోంది. ఫలితంగా జనరల్ కోటాలో ఏ కేటగిరీ సీటు(ఫ్రీ సీటు) ఏపీ మెడికల్ కాలేజీల్లో విద్యార్థికి ఈ ఏడాది 540 మార్కుల వరకూ కటాఫ్ ఉంటుందనే అంచనా ఉంది. అదే తెలంగాణలో 450 మార్కుల లోపు వచ్చినా అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఇంత వ్యత్యాసం ఉండడానికి పెరిగిన సీట్ల సంఖ్య ప్రధాన కారణం.

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇతర కోర్సులకు భిన్నంగా...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మెడికల్/బీడీఎస్ కోర్సులతోపాటు వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు ఇచ్చాయి. కౌన్సెలింగ్ కూడా జరుగుతోంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ వంటి కోర్సులకు జరుగుతున్న ప్రవేశాల్లో రెండు రాష్ట్రాల్లో 15 శాతం నాన్‌లోకల్‌కు అవకాశం కల్పించారు. 2014 నాటికి ముందు సంస్థల్లో మాత్రమే అని మెడికల్ కోర్సులకు నిబంధన ఉండగా, ఇతర కోర్సులకు మాత్రం అందుకు భిన్నంగా కొత్త, పాత అనే తేడా లేకుండా అవకాశం కల్పిస్తున్నారు.

ఇంజినీరింగ్ సీట్లు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1.4 లక్షలుంటే తెలంగాణలో 92 వేల వరకూ ఉన్నాయి. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఏపీలో కూడా చేరుతుంంటారు. అక్కడ మాత్రం తాజా నిబంధనలు వర్తింపజేయడానికి రెండు ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదు. కానీ కేవలం మెడికల్ కోర్సులకు మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

"మెడికల్ కాలేజీల్లో ఏ కేటగిరీకి నామమాత్రపు ఫీజు ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీల్లో రూ.40 వేల వరకు ఉంటుంది. ప్రైవేటు కాలేజీల్లో రూ.1 లక్ష వరకూ చెల్లించాలి. అదే బీ కేటగిరీ సీటు అయితే కనీసంగా రూ.13 లక్షల ఫీజు ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటాలో ఉండే సీ కేటగిరీ సీటు రూ.25 లక్షల పైనే చెల్లించాలి. కాబట్టి మెడికల్ సీట్లకు డిమాండ్ ఉంటుంది. దానిని సొమ్ము చేసుకోవడం కోసమే మెడికల్ కాలేజీ సీట్లలో ఈ నిబంధన తెచ్చినట్టు కనిపిస్తోంది. సీట్ల అమ్మకంలో కూడా స్థానికులకే అవకాశం కల్పించినట్టవుతోంది" అని మెడికల్ విద్యార్థి జీ.అభినయ్ అభిప్రాయపడ్డారు.

"పీజీ సీట్లకు తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు తక్కువగా ఉంటుంది. సీట్లు ఎక్కువ. దాంతో తెలంగాణ విద్యార్థులు తక్కువ ఫీజుకు ఏపీకి వచ్చేవారు. తాజా నిబంధనల తర్వాత తెలంగాణ పీజీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది" అని ఆయన అంచనా వేశారు.

ఎంబీబీఎస్ కౌన్సెలింగ్

ఫొటో సోర్స్, Getty Images

‘చట్టం అమలు కావాల్సిందే’

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2014 నుంచి 2024 వరకూ అంటే వచ్చే విద్యా సంవత్సరం వరకూ రెండు రాష్ట్రాలోలనూ నాన్‌లోకల్ కోటా 15 శాతం సీట్లు అన్ని కోర్సులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. కానీ 2022లో కూడా కొత్త మెడికల్ కాలేజీల్లో ప్రవేశార్హత పొందిన ఏపీ విద్యార్థులకు తెలంగాణలో ఈ సారి అవకాశం లేకుండా చేయడం మీద ఏపీకి చెందిన కొందరు హైకోర్టుని ఆశ్రయించడంతో వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లింది.

"ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అసమానతలు తొలగించడం కోసమే సెక్షన్ 5, 95 వంటివి ప్రస్తావించారు. వాటి ప్రకారం పదేళ్ల పాటు అన్ని చోట్లా అవకాశం ఉండాలి. ఆర్టికల్ 371డీ ప్రకారం స్థానికత విషయంలో స్పష్టత ఉంది. ఈ రెండు నిబంధనలను రెండు ప్రభుత్వాలు ఉల్లంఘించాయి. తెలంగాణ ప్రభుత్వ జీవో మీద మేం న్యాయపోరాటం చేస్తున్నాం. ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారని మేం వాదిస్తుంటే ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వానికి వంత పాడడం బాధాకరం. ఏపీ నుంచి తెలంగాణ వెళ్లే వారే తప్ప, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారి సంఖ్య నామమాత్రం అని లెక్కలు చెబుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం విచిత్రంగా ఉంది" అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థి తండ్రి సానికొమ్ము తిరుపతి రెడ్డి అన్నారు.

‘‘తెలంగాణ హైకోర్టు సానుకూలంగా స్పందిస్తుందని, రాజ్యాంగాన్ని అనుసరిస్తుందని ఆశిస్తున్నాం. లేదంంటే సుప్రీంకోర్టుకు వెళతాం’’ అని ఆయన బీబీసీకి తెలిపారు. చట్టం అమలు కావాలని తాము కోరుతున్నామన్నారు.

వీడియో క్యాప్షన్, ‘‘కలెక్టర్ కుర్చీలో కూర్చోగానే... ఆ స్థానం నాదే అనిపించింది’’ - ఒక్క రోజు కలెక్టర్ శ్రావణి

‘ప్రభుత్వ కాలేజీ సీట్లు అమ్మకమా?’

ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ ఆశావాహులకు అత్యంత నిరాశ కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అల వెంకటేశ్వర రావు అంటున్నారు.

ఈ ఏడాది అడ్మిషన్ల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లో కొత్త కాలేజీలలో ఆలిండియా కోటా 15 శాతం పోగా, మిగిలిన సీట్లలో సగం మాత్రమే ఏ కేటగిరీ అంటూ ప్రస్తావించారు. ఉదాహరణకు కొత్తగా ప్రారంభమవుతున్న మచిలీపట్నం మెడికల్ కాలేజీలో 150 సీట్లకు అనుమతి వచ్చింది. అందులో 22 సీట్లను ఆలిండియా కోటా కింద ఎంసీసీ భర్తీ చేస్తుంది. ఆలిండియాలో పోటీ పడే విద్యార్థులను బట్టి అన్ని రాష్ట్రాల వారికీ మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన ఆ సీట్లు దక్కుతాయి.

మిగిలిన 128 సీట్లకు గానూ కేవలం 64 సీట్లు మాత్రమే ఏ కేటగిరీ అంటూ ప్రస్తావించారు. దాంతో మిగిలిన 64 సీట్లు బీ, సీ కేటగిరీలకు కేటాయించి దానికి అనుగుణంగా ఫీజు వసూలు చేయబోతున్నట్టు తేల్చేసింది. కొత్తగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈసారి అనుమతి దక్కగా, 319 సీట్లను బీ, సీ కేటగిరీల్లోకి మార్చి ప్రభుత్వ కాలేజీల్లో కూడా బీ, సీ కేటగిరీలు ప్రవేశపెట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.

"తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం వల్ల 300 సీట్లు వరకు కోల్పోతున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 320 సీట్లను బీ కేటగిరీకి మార్చడం వల్ల మరో నష్టం జరుగుతోంది. కొత్తగా పెరిగిన సీట్ల ప్రయోజనం ఏపీ విద్యార్థులకు దక్కడం లేదు. పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్ల అమ్మకం ప్రక్రియ ప్రారంభించడం విద్యార్థుల ఆశలపై నీళ్లు జల్లడమే. అభ్యంతరకరంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది" అని డాక్టర్ అల వెంకటేశ్వర రావు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని ఆయన కోరారు. గవర్నమెంట్ కాలేజీ సీట్లు మెరిట్ ప్రకారం కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో గవర్నమెంట్ కాలేజ్ సీట్లను బీ, సీ కేటగిరీలోకి మార్చడం పట్ల జూనియర్ డాక్టర్లు అభ్యంతరం తెలిపారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబును కలిసి వారి అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని కోరారు. లేదంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

వీడియో క్యాప్షన్, బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది?

రెవెన్యూ కోసమే ఫీజులు: విడదల రజని

ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బీ, సీ కేటగిరీ సీట్లు ప్రవేశపెట్టడానికి కారణం ఆయా కాలేజీలను సెల్ఫ్ సస్టెయినబుల్ చేయాలన్న లక్ష్యమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పారు.

"రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రపంచ స్థాయి వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చాం. దానిని అందరూ అర్థం చేసుకోవాలి. ఈ ఏడాది ఐదు కాలేజీలు వస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో మొత్తం 17 కాలేజీలు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. అందుకే ఈ ఫీజులు. అందరూ ఇక్కడే చదువుకునే మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. కాలేజీలు బాగుపడతాయి" అని ఆమె మీడియాకు తెలిపారు

ఏపీ మెడికల్ ఆశావహులకు ఇబ్బంది రాకుండా నాన్‌లోకల్ సీట్ల విషయంలో ప్రభుత్వం ఆలోచించి, నిర్ణయాలు తీసుకుందని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)