ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. అమ్మ ఒడి, నాడు-నేడు సహా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడం లేదా?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
గుంటూరు జిల్లాలో ఉన్న ప్రత్తిపాడు మండలం గనికపూడి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను నాడు-నేడు పథకంలో భాగంగా రూ.18 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు. కానీ తీరా చూస్తే మూడేళ్లు తిరిగే సరికి ఈ స్కూల్ లో 25 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు.
ఈ స్కూల్‌లో 2021-22లో 83 మంది విద్యార్థులుండేవారు. నిరుడు పాఠశాలల విలీనం కారణంగా 46 మందిని సమీపంలోని ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌కు తరలించారు.
మరో 12 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్‌కు మారిపోయారు. దాంతో చివరికి ఐదో తరగతిలో 10 మంది, నాలుగో తరగతిలో 8 మంది, మూడో తరగతికి ఇద్దరు, రెండో తరగతిలో నలుగురు, ఒకటో తరగతిలో ఒక విద్యార్థి మాత్రం మిగిలారు.
ఈ స్కూల్ పరిధిలో ఐదు సంవత్సరాలు నిండిన వారు ఆరుగురుంటే వారిలో ఐదుగురు ప్రైవేటు స్కూల్‌కు వెళ్తుండగా, ఒక్కరే ఒకటో తరగతిలో చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఐదో తరగతిలో ఉన్న పిల్లలు వచ్చే ఏడాది హైస్కూల్‌కు వెళితే ఇప్పుడున్నవారిలో మిగిలేది 15 మందే. కొత్తగా ఒకటో తరగతిలో ఎంత మంది వచ్చి చేరుతారన్నది ప్రశ్నార్థకమే.
80 మందికి పైగా పిల్లలున్న బడిని రూ.18 లక్షల ఖర్చుతో ఆధునికీకరిస్తే మూడేళ్ల తర్వాత అక్కడ ఐదో వంతు పిల్లలు కూడా మిగలలేదు.

రాష్ట్రమంతా ఇలాగే ఉందా?
ఇది కేవలం ఒక్క ఎంపీపీ స్కూల్ అనుభవం మాత్రమే కాదు.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక చోట్ల ఇదే పరిస్థితి ఉంది.
అక్కడక్కడా జిల్లాకు ఒకటి రెండు ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వలేక ఆయా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతుంటే.. అనేక స్కూళ్లలో అడ్మిషన్ల కోసం టీచర్లు ఎదురుచూడాల్సి వస్తోంది.
ప్రభుత్వ బడుల్లో చేరికలు ఏటేటా తగ్గిపోతున్నాయి. ఫలితంగా సర్కారు బళ్లన్నీ సుందరీకరించినప్పటికీ విద్యార్థులు లేక వెలవెలబోవాల్సి వస్తోంది.
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు కనిపించకపోవడంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య పడిపోతోంది.
ఏపీ పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం 2021-22 నాటితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరం 2023-24 జూన్ ఆఖరు నాటికి సుమారు 4 లక్షల మంది పైబడి విద్యార్థులు తగ్గిపోయారు.
2021-22 విద్యాసంవత్సరంలో సుమారు 42 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. 2022 సెప్టెంబరు నాటికి ఆ సంఖ్య 41,38,322గా ఉంది. వారిలో ప్రస్తుతం 37,50,293 మంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అంటే రెండేళ్ల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు దూరం కాగా అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది.

కరోనా సమయంలో భిన్నంగా ఎందుకుంది?
ప్రస్తుతం అత్యధికులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్ల వైపు మొగ్గు చూపుతుండగా కరోనావైరస్ మహమ్మారి సమయంలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉండేది.
2020-21 విద్యా సంవత్సరంలో అనేక మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారు. దాంతో ఒకేసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య 43 లక్షలు దాటిపోయింది. అంతకుముందు 2019 తో పోలిస్తే విద్యార్థుల ప్రవేశాలు బాగా పెరగడంతో ప్రభుత్వ బడులు కిటకిటలాడిపోయాయి. కానీ 2021 తర్వాత కరోనావైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టగానే మళ్లీ ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటు స్కూళ్లకు తరలుతున్నట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితులకు తోడుగా అమ్మ ఒడి పథకం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచిందని ఉపాధ్యాయ సంఘం నేత ఆర్. రవికుమార్ అభిప్రాయపడ్డారు.
"అమ్మ ఒడి పథకం పేరుతో ప్రభుత్వం అందించే నిధులు కేవలం ప్రభుత్వ బడుల్లో చదివిన వారికే దక్కుతాయనే సందేహం వచ్చింది. దాంతో చాలా మంది తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో మాన్పించి ప్రభుత్వ బడుల్లో చేర్చేశారు. అదే సమయంలో కరోనా వచ్చింది. ఆర్థికంగానూ సమస్యలు ఏర్పడ్డాయి. ఆ కారణంతో ఒకటి, రెండేళ్లు కొనసాగించారు. తీరా ఇప్పుడు అమ్మ ఒడి డబ్బులు అందరికీ వస్తున్నాయి. ఆ డబ్బులు తీసుకెళ్లి ప్రైవేటు స్కూల్ ఫీజులు కట్టడానికి వాడుకుంటున్నారు. దాంతో ప్రభుత్వ బడులకు వచ్చిన వాళ్లు వెనక్కి వెళుతున్నట్టు ఉంది" అంటూ ఆయన వివరించారు.
విద్యార్థులు తగ్గిపోవడంతో ఆయా ప్రభుత్వ పాఠశాలలు ఖాళీగా ఉంటున్నాయని ఆయన బీబీసీతో అన్నారు.

స్కూళ్ల మూసివేత ప్రభావం ఎలా ఉంది?
ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఐదో తరగతి తర్వాత ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. దానికి ప్రభుత్వ విధానాలు కారణమనే అభిప్రాయం ఉంది.
"పాఠశాలల విలీనంతో దాదాపు 1,600 స్కూళ్లు మూతపడ్డాయి. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పేరుతో 4,200 స్కూళ్లలో రెండే క్లాసులు నడుస్తున్నాయి. రెండేళ్ల తర్వాత బడి మారాలి. 3వ తరగతి నుంచి మరో చోటకు వెళ్లాలి. 3 కిలోమీటర్ల లోపు ఉన్న హైస్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది. దాంతో దగ్గరలో ఉన్న ప్రైవేటు బడికి పంపించడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఒకటో తరగతిలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. ఆ తర్వాత వాళ్లు ప్రభుత్వ బడుల్లో కొనసాగడం కూడా కష్టమవుతోంది. దీంతో ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య ఒక్కసారిగా పడిపోతోంది" అని ఏపీ యూటీఎఫ్ నేత కేవీవీఎస్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
కేవలం బిల్డింగులు కట్టి, బెంచీలు వేస్తే చాలదని, టీచర్ నియామకాలు జరపకుండా ప్రభుత్వ బడుల బలోపేతం సాధ్యం కాదని ఈ పరిణామాలు చాటుతున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు ఊపు
ప్రభుత్వ స్కూళ్ల విలీనం తర్వాత ప్రైవేటు స్కూళ్లు, ముఖ్యంగా బడ్జెట్ స్కూళ్లకు ఊపు వచ్చింది. ఇళ్లకు సమీపంలో ఉన్న స్కూళ్లలో చిన్న పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తుండటంతో చిన్న చిన్న స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల సంఖ్య 4.65 లక్షలుగా ఉంది. అదే సమయంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటో తరగతి చదువుతున్న వారి సంఖ్య 4 లక్షలకు చేరువలోకి వచ్చింది. మొత్తం ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు దాదాపు 34 లక్షలుండగా నిరుడుతో పోలిస్తే 5 లక్షల మంది అక్కడ పెరిగినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
విద్యా రంగానికి ప్రాధాన్యమిచ్చినట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. నాలుగేళ్లలో సుమారుగా రూ. 60 వేల కోట్లు వెచ్చించినట్టు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల 8వ తరగతి విద్యార్థులకు ఏకంగా ట్యాబ్‌లు కూడా ఉచితంగా పంపిణీ చేశారు.
జగనన్న విద్యాకానుక పేరుతో పుస్తకాలు, యూనిఫాం, షూ వంటివి కూడా గతంతో పోలిస్తే సకాలంలో అందుతున్నాయి. మధ్యాహ్న భోజనం పథకం కూడా కొంత మెరుగుపడింది. రాగి జావ వంటివి కూడా విద్యార్థులకు అందిస్తున్నారు. బడులు కొంత బాగుపడ్డాయి.
ఇలాంటి అనేక ప్రయత్నాల తర్వాత కూడా విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరం కావడం గమనించాల్సిన అంశం.
‘బడి బాగుంది కానీ రెండేళ్లకే మారడం కష్టం..’
పాఠశాలల విలీనం తర్వాత ప్రభుత్వం గతంలో ఉన్న విధానం మార్చేసింది. నూతన విద్యావిధానం పేరుతో ప్రీ ప్రైమరీ, 1,2 తరగతులు మాత్రమే ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. ఆ తర్వాత 3 నుంచి ప్లస్ 2 వరకూ ఒకే చోట ఉండేలా మార్పు చేశారు. ఇది కొందరికి సమస్యగా మారింది.
"బడి బాగుంది. మేము చదువుకున్నప్పుడు కన్నా బాగానే చేశారు. కానీ బడిలో పిల్లలెవరూ ఉండడం లేదు. 1,2 తరగతులు ఇక్కడ చదివి, మూడో తరగతిలో హైస్కూలుకు మార్చాలని అంటున్నారు. రెండేళ్ల కోసమే ఈ స్కూల్ ఎందుకని మా బాబుని ప్రైవేటు స్కూల్లో వేసేశాం. కనీసం ఐదారేళ్లు ఒకే చోట చదివితే వాడికి బాగుంటుందనుకుంటున్నాం. అంతేగాకుండా హైస్కూల్ కూడా మా ఇంటికి దూరం. అందుకే ఫీజు ఖర్చయినా అక్కడే చేర్చాం’’ అని గనికపూడికి చెందిన విద్యార్థి తల్లి పి.రమ్య అన్నారు.
‘‘ఇంగ్లిష్ మీడియంలో ప్రభుత్వ స్కూల్లో ఎలా చెబుతారన్నది తెలియడం లేదు. అందుకే అంతా బాగుంటే ఆరో తరగతి తర్వాత హైస్కూల్లో వేస్తాం. అప్పటికి మా వాడు దూరంగా ఉన్న స్కూలయినా వెళ్లగలడు" అని ఆమె చెప్పారు.
బడి దూరమయిపోవడం కూడా తమ చుట్టు పక్కల చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేటు స్కూల్‌కు పంపించడానికి ఓ కారణమని ఆమె బీబీసీకి తెలిపారు.
ప్రభుత్వం పునరాలోచన చేయాలి: బాలసుబ్రహ్మణ్యం
ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు దూరమవుతున్న తీరు మీద ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. పథకాలు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ ఎందుకు ఫలితాలు రావడం లేదన్నది పునరాలోచన చేయాలని సూచించారు. ఇంగ్లిష్ మీడియం అని చెబుతున్నా పిల్లలు ఎందుకు దూరమవుతున్నారనే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.
"కరోనావైరస్‌తో దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు వచ్చారు. యూపీలో అత్యధికంగా చేరారు. కానీ కేరళ, దిల్లీ పాఠశాలల్లో ఆ తర్వాత కూడా స్థిరంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాల విద్య కొత్తవారిని ఆకర్షిస్తోంది. కానీ ఏపీలో భిన్నమైన పరిస్థితులకు అనేక కారణాలున్నాయి. ఎయిడెడ్ విద్యారంగం కోల్పోయాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేదు. ఈ ప్రభుత్వమే నియమించిన బాలకృష్ణ కమిషన్ చెప్పిన లెక్కలతో పోలిస్తే మూడేళ్లలో 27 వేల మంది ఉపాధ్యాయులు తగ్గిపోయారు. సింగిల్ టీచర్ స్కూళ్లు 9 వేలకు పైబడి ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఫ్రీ సీట్ల పేరుతో మరికొంతమందిని మళ్లించారు. ఇలా విద్యా ప్రైవేటీకరణ ప్రక్రియ జరుగుతోంది" అని ఆయన బీబీసీతో అన్నారు.
ఒకనాడు ప్రాథమిక విద్యలో తగ్గినప్పటికీ హైస్కూల్ విద్యలో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు ఎక్కువగా వచ్చే వారని, ప్రస్తుతం అది కూడా తగ్గుతుండటం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
మెరుగైన విద్య కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు నమ్మకం కలిగించే రీతిలో పాఠశాల విద్య ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఎక్కువని ఆయన చెప్పారు.
ఈ పరిణామాల మీద ప్రభుత్వ వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- Annuity plans: నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















