తెలంగాణ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా టేక్రియాల్ దగ్గర ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూడ్డానికి బీబీసీ వెళ్లింది.
మేం అక్కడకు వెళ్లేటప్పటికి చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి. అంటే మొత్తం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక జరిగే చిన్న చిన్న ప్యాచ్ వర్కులు కాదు. ఆ ఇళ్ల నిర్మాణం 2020లోనే పూర్తయిపోయింది.
కానీ, వాటిని ఇంకా ఎవరికీ అప్పగించ లేదు. దీంతో అవి పాడుబడి చివరకు బయటి గోడలు కూడా మట్టిలో నుంచి బయటకు కనిపించే పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో గృహ ప్రవేశం కాకుండానే రిపేర్లు ప్రారంభించారు అధికారులు.
కామారెడ్డి నుంచి సంగారెడ్డి వెళ్లాం. ఈ పట్టణం శివార్లలో హనుమాన్ నగర్ అని ఉంది. ఇక్కడ కూడా కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారు. నిర్మాణం జరిగి చాన్నాళ్లైనా ప్రారంభానికి నోచుకోలేదు. చుట్టూ మొక్కలు మొలిచాయి. ఆ మొక్కలనైతే పీకేయవచ్చు.
కానీ ఆ ఇంటి బయట మెట్ల కింద సపోర్టు కోసం ఉండాల్సిన కాంక్రీటు పిల్లర్ కూడా పగిలింది. ఇలా ఒక ఇల్లు కాదు. కాలనీలోని దాదాపు అన్ని ఇళ్లదీ అదే పరిస్థితి. ఒకచోటయితే కాంక్రీటు పిల్లర్ కాకుండా సిమెంటు ఇటుకలను పేర్చి మెట్లకు సపోర్టుగా నిలబెట్టారు.

హైదరాబాద్ శివార్లలలో కొల్లూరు అని ఉంది. అక్కడ ఏకంగా 15 వేల ఇళ్లను ఒకేచోట నిర్మించారు. బయటి నుంచి చూడ్డానికి ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తగ్గదు అది. ఈ మధ్యే దీన్ని కేసీఆర్ ప్రారంభించారు. దానికి కేసీఆర్ నగర్ అని ఆయన పేరే పెట్టారు. ఇక్కడ కూడా ఇంకా గృహప్రవేశాలు జరగలేదు.
మొదటి రెండూ ఉదాహరణలూ తెలంగాణ ప్రభుత్వపు డబుల్ బెడ్ రూమ్ పథకానికి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అయితే, ఇది మాత్రం గుడ్ ఎగ్జాంపుల్ అన్నమాట.
చివరగా మళ్లీ సంగారెడ్డి వెళ్దాం. ఇక్కడ కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామ శివార్లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీ. ఈ పథకం ఎలా ఉంది అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఇక్కడ ఒక 50 ఇండ్లను దాదాపు మూడేళ్ల క్రితమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేశారు. వాళ్లంతా సంతోషంగా ఆ ఇళ్లలోనే ఉంటున్నారు.
కానీ ఆ కాలనీకి ఆనుకుని మరిన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభించి మధ్యలో వదిలేశారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టరు పనులు ఆపేసి నిర్మాణాన్ని మధ్యలో వదిలేసారు. ఒకే కాలనీలో ఒకే స్కీమ్..ఒకవైపు సక్సెస్‌ఫుల్, ఇంకోవైపు ఫెయిల్యూర్.

అడ్డంకులు ఏంటి ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ అందరి నోళ్లల్లో నానుతోంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో అత్యంత ఎక్కువ చర్చకు కారణమైన, తెలంగాణ వచ్చి పదేళ్ళవుతున్నా పూర్తిగా అమలు కాని హామీల్లో ఇది కూడా ఒకటి.
ఈ పథకానికి ప్రధానంగా మూడు సమస్యలు పెద్దగా ఉన్నాయి.
- నిర్మాణాలు సగంలో ఆగిపోవడం
- నిర్మించినవి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇళ్లను పాడుపెట్టడం
- కొత్త ఇళ్లకు కూడా పెచ్చులూడడం, పగుళ్లు రావడం లాంటి నాణ్యతా లోపాలు దేశంలో ఎక్కడా లేదు

తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ పేదలకు ఇవ్వనంత స్థాయిలో పెద్ద పెద్ద ఇళ్లను ఇస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
‘‘గతంలో పేదలకు 260 చదరపు అడుగుల ఇల్లు ఇచ్చేవారనీ. దాని స్థానంలో తెలంగాణ వచ్చాక, డబుల్ బెడ్ రూమ్ పథకం కింద 560 చదరపు అడుగుల ఇల్లు ఇస్తున్నాం’’ అని ప్రభుత్వం చెప్పింది.
అందుకే ఈ పథకానికి డిగ్నిటీ హౌసింగ్ అని పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని అందరూ పిలుచుకున్నప్పటికీ, ఈ పథకం అసలు పేరు ఇదే.
చాలా రాష్ట్రాలు పేదలకు ఇచ్చే ఇళ్లు ఒకే గదితో ఉంటాయి. తెలంగాణ మాత్రం రెండు బెడ్ రూములు, 1 వంటగది, 2 బాత్రూంలు ఉన్న ఇంటిని ఇస్తోంది. అప్పట్లో కేసీఆర్ బహిరంగ సభల్లో ఈ పథకం గురించి చాలా గొప్పగా చెప్పేవారు.

‘‘పేదోడి ఇంటికి చుట్టాలొస్తే బయట పడుకోవాలా?’’ అని ఆవేశంగా ప్రశ్నించిన ఆయన, పేదలకు కూడా ఆత్మగౌరవం ఉండేలా రెండు బెడ్ రూముల ఇళ్లు ఇస్తాం అని ప్రకటించారు. కాకపోతే ఆయన చెప్పినంత ఘనంగా అమలు జరగడం లేదు.
2015 అక్టోబరులో ఈ పథకం ప్రారంభం అయింది. ముందుగా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని ఎర్రవల్లిలో మోడల్ కాలనీ చకచకా పూర్తి చేసి 2016లోనే ప్రారంభించారు.
అంతే.. ఇక ఆ తరువాత మిగిలిన చోట్ల ఆ స్పీడు కాదు కదా అందులో నాలుగో వంతు వేగంతో కూడా పనులు జరగలేదు.
లబ్ధిదారుల ఎంపిక ఈ స్కీముకు పెద్ద సమస్య అయింది. హైదరాబాద్‌లో మొత్తం లక్ష ఇళ్లు అనుకుంటే 7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిని వడబోయాల్సిన ప్రభుత్వం, ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే రాజకీయంగా నష్టం అన్న ఉద్దేశంతో ఎంపిక ప్రక్రియను చాలా ఆలస్యం చేసింది. మొత్తం తెలంగాణ అంతా ఎంపిక ఆలస్యం ఇలానే అయింది. కొన్ని చోట్ల లక్కీ డ్రా తీసినా ఇళ్లు ఇవ్వలేదు.
ఈ ఆలస్యం ఏ స్థాయిలో ఉందంటే, కట్టిన ఇళ్లు కూడా పాడుబడి బీటలు వారేంతగా. లక్కీడ్రాలు, పంపిణీ, ఎంపికల్లో జరిగే ఆలస్యం గురించి ఒక్కో జిల్లాలో, ఒక్కో పట్టణంలో ఒక్కో కథ ఉంది.

‘ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి’
తమకు ఇచ్చిన ఎలాట్మెంట్లు కూడా వెనక్కి తీసుకున్నారంటూ హైదరాబాద్ గాంధీనగర్ బస్తీకి చెందిన పలువురు లబ్ధిదారులు బీబీసీతో చెప్పారు.
‘‘మాకు ఇక్కడ ఎలాట్మెంటు ఇచ్చినట్టు ముందుగా చెప్పారు. ఫ్లాట్ నంబర్ కూడా చెప్పారు. కానీ వెంటనే మాకు కేటాయించలేదు. మీరు నాన్ లోకల్ అని ఇచ్చిన ఫ్లాట్ వెనక్కు తీసుకున్నారు. తహశీల్దారు, ఆర్డీవోలను కలవమన్నారు. ఆర్డీవోగారి అపాయింట్‌మెంటు దొరక లేదు.’’ అని మాల్యాద్రి, గోవర్ధినిలు బీబీసీతో చెప్పారు. ఆ కాలనీ దగ్గర ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు.
ఇక నాణ్యత కూడా అలానే ఉంది. కామారెడ్డినే ఉదాహరణే తీసుకుందాం. ‘‘ప్రభుత్వ భూమి వేరే చోట దొరకలేదే ఏమో? గతంలో ఇక్కడ ఒక బీటీ రోడ్డు ఉండేది. దాన్ని ఆరేడు అడుగులు తవ్వేసి ఆ రోడ్డు ఉన్నచోటే ఈ ఇళ్లు కట్టారు. కాబట్టి ఈ ఇళ్ల దగ్గర సమస్యలు రావడం ఊహించిందే’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానికుడొకరు బీబీసీతో అన్నారు
ఇక పగుళ్లు రావడం, పెచ్చులు ఊడటం, ఊచలు బయట పడటం, బయటి గోడల కిందవైపు మట్టి కొట్టుకుపోయి పునాదులు బయటకు కనపిపించడం, వర్షాకాలంలో నీళ్లు కారడం...ఇలాంటి ఫిర్యాదులు చాలా ఉన్నాయి.
నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు నివసించడం మొదలు పెట్టిన ఏడాదిలోపే సమస్యలు వచ్చిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
ఇక నిధులు లేక మధ్యలో ఆపేసిన నిర్మాణాలు కూడా తెలంగాణలో చాలా పల్లెలు, పట్టణాల శివార్లలో కనిపిస్తాయి. మొండి గోడల కాంక్రీటు ఇళ్ల నిర్మాణాలు చూడగానే ఇది మధ్యలో ఆపేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీ ఇట్టే తెలిసిపోతుంది.

నిధుల పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడొక రాజకీయం కూడా చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఈ డిగ్నిటీ హౌసింగ్ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొంత డబ్బు కలుస్తుంది. అయితే కేంద్రం ఈ పథకానికి తగినంత నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తోంది తెలంగాణ.
‘‘మా ప్రభుత్వం ఇప్పటి వరకు 11 వేల 853 కోట్లు ఖర్చు చేసి 1,92,725 ఇండ్లు నిర్మించాం. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి అవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా పట్టణ ప్రాంతాలలో నిర్మిస్తున్న 1,59,372 ఇండ్లకు, ఇంటికి 1 లక్షా 50 వేల చొప్పున 2,390 కోట్లు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు కేవలం 1,201 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మా ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇది కేవలం 10% మాత్రమే. ఇక హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కోక్క ఇంటిని 8,65,000 వ్యయంతో నిర్మిస్తుండగా పీఎంఏవై ద్వారా 1 లక్షా 50 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ సగం నిధులు మాత్రమే విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కోక్క ఇంటికీ 5 లక్షల 4 వేలు ఖర్చు చేసి నిర్మిస్తుండగా, ఇంటికి 72 వేలు ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పి కేంద్రం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’’ అని తెలంగాణ గృహ నిర్మాణ శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఇక ఇళ్ల పంపిణీలో ఆలస్యం, నాణ్యత లోపల గురించి బీబీసీ ప్రశ్నలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కార్యాలయం స్పందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- Annuity plans: నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















