NEET వంటి ఆలిండియా పోటీ పరీక్షల్లో తెలుగువారిదేనా హవా... 'టాప్ ర్యాంకులన్నీ మావే' అంటూ విద్యా సంస్థలు చేసే ప్రచారంలో నిజమెంత?

తెలుగు విద్యార్థుల ర్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆలిండియా స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలు ఫలితాలు ఏమొచ్చినా తెలుగు మీడియా మారుమ్రోగిపోతుంది. ఒక్కో సంస్థ వందల కొద్దీ ర్యాంకులు తమవేనని చెప్పుకుంటుంది. టాప్ ర్యాంకులతో పాటుగా అన్నిటా తమదే హవా అని చెప్పుకుంటూ ఉంటారు.

అదంతా నిజమేనా? తెలుగువాళ్లే అన్నింటా ముందుంటున్నారా? నీట్, జేఈఈ ఇలా ఏ పరీక్షల్లో అయినా తెలుగు వారి ముందు మిగిలిన రాష్ట్రాలకు చెందిన వాళ్లు పోటీ పడలేకపోతున్నారా?

ఈ అంశాలపై బీబీసీ పరిశీలన చేసింది. వివిధ పరీక్షల్లో ముందు నిలుస్తున్న వారి డేటా సేకరించింది. గడిచిన మూడేళ్లలో ఆయా పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలు తీసుకుంది. అందులో ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూశాయి. వివిధ కార్పోరేట్ సంస్థలు చేసే ప్రచారానికి, వాస్తవానికి మధ్య వైరుధ్యం బయటపడింది.

తెలుగు విద్యార్థుల ర్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచారం చూస్తే...

ఎంబీబీఎస్ సహా వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2023 ఫలితాలు జూన్ 14న విడుదలయ్యాయి.

తాజాగా ఏపీకి చెందిన వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలోని కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీలు ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల క్వాలిఫైడ్ లిస్టు ప్రకటించాయి.

తెలంగాణలో గురువారం నోటిఫికేషన్ విడుదలైంది.

కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ద్వారా నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ అందించిన జాబితాను రెండు రాష్ట్రాల యూనివర్సిటీలు వెల్లడించాయి.

నిజానికి ర్యాంకులు విడుదల చేసిన సమయంలో ఒక్కో విద్యాసంస్థ తమకే ఎక్కువ ర్యాంకులు వచ్చినట్టు ప్రచారం చేసుకుంది.

జూన్ 15 నాటి పత్రికలో వచ్చిన వివరాల ప్రకారం, ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఒక్క శ్రీ చైతన్య విద్యార్థులే 16 మంది ఉన్నారు. ఇక, ఆ సంస్థ విద్యార్థుల్లో 110 మందికి వెయ్యి లోపు ర్యాంకులు వచ్చాయని చెప్పుకున్నారు.

శ్రీ చైతన్య మాత్రమే కాకుండా నారాయణ, భవిష్య, గోశాలైట్స్ , తిరుమల వంటి అనేక కార్పోరేట్ సంస్థలు ఇదే రీతిలో భారీ ప్రకటనలు ఇచ్చాయి.

తెలుగు విద్యార్థుల ర్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

అసలు లెక్కల్లో ఏముంది?

అధికారికంగా వెల్లడయిన లిస్టుకు, ఈ విద్యాసంస్థలు చెబుతున్నదానికి పొంతన కుదరడం లేదు.

ఆలిండియా 100 లోపు ర్యాంకులు చూస్తే ఏపీకి చెందిన విద్యార్థులు 11 మంది మాత్రమే ఉన్నారు. అంటే 11 శాతం ఏపీ విద్యార్థులున్నట్టు లెక్క.

అందులో నెంబర్ వన్ ర్యాంకర్ బోరా వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నారు. ఆయన 720 మార్కులకు 720 తెచ్చుకుని తమిళనాడుకు చెందిన మరో విద్యార్థితో సమానంగా నిలిచారు.

ఆ తర్వాత 25, 38, 40, 45, 51, 57, 61, 73, 75, 83 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నిలిచారు.

తెలంగాణా విషయానికి వస్తే ఆలిండియా టాప్ 100లో ఐదుగురున్నారు. వీరిలో ఆలిండియా 15వ ర్యాంక్ సాధించిన కేజీ రఘురామ్ రెడ్డి కూడా ఉన్నారు.

ఆ తర్వాత 49, 52, 65, 68 ర్యాంకులు తెలంగాణా విద్యార్థులకు దక్కాయి.

అంటే తెలంగాణా విద్యార్థులు ఐదుగురు, ఏపీకి చెందిన పదకొండు మందితో కలిపి ఆలిండియా టాప్ 100లో 16 మంది మాత్రమే తెలుగు విద్యార్థులున్నారు.

కానీ శ్రీ చైతన్య ప్రకటనలో, ఆ సంస్థ విద్యార్థులే 16 మంది ఉన్నట్టు పేర్కొన్నారు.

మిగిలిన సంస్థల లెక్కలు తీస్తే దాదాపు సగం మంది తెలుగు వారే ఉన్నారనేటంత రీతిలో ప్రచారం సాగింది. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది.

తెలుగు విద్యార్థుల ర్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

ఏటా అంతేనా?

కేవలం టాప్ 100లో మాత్రమే తెలుగువారి సంఖ్య కొంత ఎక్కువగా కనిపిస్తోంది. కానీ అది క్రమంగా తగ్గుతోందని లెక్కలు చెబుతున్నాయి.

టాప్ 1000 వరకూ కాస్త ఆశావహంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత తెలుగువారి ప్రభావం తగ్గిపోతోంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడే నీట్ పరీక్షల్లో టాప్ 1000 లోపు తెలుగు విద్యార్థులు కనిపించినప్పటికీ, ఆ తర్వాత వారు వెనుకబడుతున్నట్టు అధికారిక డేటా చెబుతోంది.

మూడేళ్ల వివరాలు అందుకు ఆధారంగా ఉన్నాయి. వందలోపు ర్యాంకుల్లో 16 శాతం వరకూ ఉన్న వారి సంఖ్య ఈ కింది పట్టికలో ఉంది.

మొత్తం కలిపి చూసినప్పుడు వంద లోపు ర్యాంకుల్లో 16 శాతం ఉంటే వెయ్యి లోపు ర్యాంకులకు వచ్చేసరికి అది 13 శాతానికి మించడం లేదు.

టాప్ 1000లో 13 శాతం అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నట్టు భావించాలి.

తెలుగు విద్యార్థుల ర్యాంకులు

ఫొటో సోర్స్, NEET UG-2023

ఆ తర్వాత సంగతి ఏంటి?

వెయ్యి ర్యాంకుల తర్వాత తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. తదుపరి ర్యాంకులు పెరిగే కొద్దీ తెలుగు వారి సంఖ్య తగ్గిపోతోంది.

అంటే మొదటి ర్యాంకుల్లో ముందంజలో నిలిచినప్పటికీ రానురాను అదే రీతిలో ప్రతిభ చాటడం లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి.

2500 లోపు ర్యాంకుల వివరాలు ఈ కింది పట్టికలో ఉన్నాయి.

తెలుగు విద్యార్థుల ర్యాంకులు

ఫొటో సోర్స్, NEET UG-2023

మొత్తం కలిపి చూసినా 2500 లోపు ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు 2022లో 235 మంది ఉన్నారు. అంటే 9.4 శాతం మాత్రమే ఉన్నట్టు.

2023 లెక్క ప్రకారం 247 మంది 9.8 శాతం ఉన్నారు. అంటే వంద లోపు 16 శాతం, వెయ్యి లోపు 13 శాతం ఉంటే 2500 ర్యాంకులకు వచ్చేసరికి అది పది శాతం లోపుకు పడిపోయింది.

మరింత తక్కువగా....

తదుపరి ర్యాంకుల్లో వీరి సంఖ్య ఇంకా తక్కువగా ఉంటోంది.

మెడికల్ సీట్లలో ఆలిండియా కోటా 15 శాతం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యాలయాల్లో ప్రవేశాలకు అర్హత ఉంటుంది.

అందులో జనరల్ కోటాలో దాదాపుగా 5వేల ర్యాంకు వారు కూడా పోటీపడుతుంటారు. ఆ ర్యాంకులు పరిశీలించినా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎలా వెనుకబడుతున్నారన్నది అర్థమవుతుంది.

5వేల లోపు ర్యాంకుల పరిస్థితి ఇలా ఉంది.

తెలుగు విద్యార్థుల ర్యాంకులు

ఫొటో సోర్స్, NEET UG-2023

మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 2021లో 371 మంది 5,000లోపు ర్యాంకర్లుగా నిలిచారు. అది సుమారు ఏడున్నర శాతం.

2022 వచ్చేసరికి ఆ సంఖ్య 367గా ఉంది. అంటే 7.3 శాతంగా ఉంది.

2023 జాబితాలో అది 398 మందికి చేరింది. అది దాదాపు 8 శాతం.

అంటే వందలోపు ర్యాంకులతో పోలిస్తే 5వేల లోపు ర్యాంకుల జాబితాలో సగమే తెలుగువారున్నారు.

బిహార్ కన్నా తక్కువే...

5వేల లోపు ర్యాంకులు మాత్రమే కాదు, 10 వేల లోపు ర్యాంకులు, ఆ పైబడి ర్యాంకులు గమనించినా తెలుగు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది.

ఈ ఏడాది జాబితాలో 10వేల లోపు ఆలిండియా ర్యాంకులు సాధించిన లిస్టు చూస్తే ఏపీకి చెందిన వారు 361 మంది, అంటే 3.6 శాతం ఉన్నారు.

తెలంగాణా విద్యార్థులయితే మరింత తక్కువగా 264 మంది, అంటే కేవలం 2.6 శాతం ఉన్నారు.

రెండు రాష్ట్రాలు కలిపినా ఆరు శాతమే ఉన్నారు.

ఇక రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు లభించే అవకాశం మెండుగా ఉన్న 50వేల లోపు ర్యాంకులు పరిగణలోకి తీసుకుంటే, ఏపీ విద్యార్థులు 1785 మంది ఉండగా తెలంగాణా విద్యార్థులు 860 మంది ఉన్నారు. అంటే కేవలం 1.7 శాతం మాత్రమే.

"జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఏటా తెలుగు విద్యార్థులు బాగా వెనుకబడి ఉంటున్నారు. ఆ సంఖ్య తమిళనాడు, కర్ణాటక, బిహార్ కన్నా కూడా తక్కువే. తమిళనాడు విద్యార్థులు టాప్ 10వేల లోపు 7 శాతం ఉన్నారు. ఏపీ విద్యార్థులు అందులో సగమే. కార్పోరేట్ కాలేజీలు కేవలం కొన్ని సెక్షన్లకే నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని నమూనా గా చూపించి మిగిలిన విద్యార్ధులను గాలికి వదిలేయడం వలన నీట్‌లో ఉత్తీర్ణత జాతీయ సగటు కన్నా చాలా తక్కువగా ఉంది. ఇది కేవలం నీట్‌కి మాత్రమే పరిమితం కాదు, ఇతర పోటీ పరీక్షల్లో కూడా ఉంది" అని గుంటూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ అల వెంకటేశ్వరరావు అన్నారు.

కార్పోరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధులందరికీ ఒకే విధమైన నాణ్యమైన విద్యను అదించేలా ప్రభుత్వమే చొరవ చూపడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అది జరిగితే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయ స్థాయిలో కనీసంగా 15 శాతం వరకూ మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

తెలుగు విద్యార్థుల ర్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

'ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది'

కార్పొరేట్ విద్యాసంస్థలతో పాటుగా అన్ని చోట్లా తగినంత బోధనా సిబ్బంది అందుబాటులో లేకపోవడం అతి పెద్ద సమస్యగా ఉందని ఫిజిక్స్ బోధించే అధ్యాపకుడు కేవీ సుబ్బారావు అన్నారు.

గతంలో శ్రీ చైతన్య వంటి సంస్థల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం శ్రీ వైష్ణవి అకాడమీ పేరుతో విజయవాడలో సొంతంగా ఓ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నారు.

"ఒకప్పుడు కాలేజీలో ఎన్ని సెక్షన్లు ఉన్నా బోధించే వారి నాణ్యతలో పెద్ద వైరుధ్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందుకు భిన్నం. కాస్త మెరుగ్గా పాఠాలు చెప్పగలిగే వారితో టాపర్స్ సెక్షన్లకు చెప్పిస్తున్నారు. మిగిలిన సెక్షన్లకు బోధించేందుకు తగిన సిబ్బంది దొరకడం లేదు. దాంతో అనుభవం లేని, తగునంత అవగాహన, బోధనా నైపుణ్యం లేని సిబ్బందితో పెద్ద పెద్ద సంస్థలు కూడా నెట్టుకొస్తున్నాయి. దాని ప్రభావం ఈ ర్యాంకుల మీద కనిపిస్తోంది. ఫ్యాకల్టీ ఉన్న క్లాసుల్లో విద్యార్థులు ముందంజవేస్తున్నారు. మిగిలిన వారు వెనుకబడిపోతున్నారు" అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

భారీ జీతాలు ఆఫర్ చేసినా, బోధనా సిబ్బంది తగ్గిపోతుండడం పెద్ద సమస్యగా మారుతోందని, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన బీబీసీతో అన్నారు.

టాపర్లుగా నిలిచేవారిలో తెలుగువారు కనిపిస్తున్నా, మొత్తం సీట్లు సాధిస్తున్న వారి జాబితాలో తెలుగు విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో విద్యాసంస్థలు, తల్లిదండ్రులతో పాటుగా విద్యాశాఖ కూడా ఈ అంశం మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులకు తగిన తర్ఫీదునిచ్చే రీతిలో మార్పులకు ప్రయత్నించాల్సి ఉందనే అభిప్రాయం విద్యావేత్తల నుంచి వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)