భూమి అక్షం 80 సెంటీమీటర్లు తూర్పు వైపు వంగిపోయింది... ఎందుకిలా జరిగింది, దీని వల్ల ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Science Photo Library
భూగర్భజలాల వెలికితీసి మరో చోటుకు తరలిస్తుండడం వల్ల భూమి అక్షం తూర్పు వైపు 80 సెం.మీ వంగిపోయింది. ఈ మార్పు1993-2010 మధ్య కాలంలో జరిగింది.
భూగర్భ జలాలను వెలికి తీయడం, నీటిని భారీగా సముద్రాల్లోకి తరలించడమే ఇందుకు కారణమని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం తెలిపింది. ఈ పరిణామాల వల్ల సముద్రాల్లాంటి భారీ నీటి నిల్వలు (లార్జ్ వాటర్ బాడీస్) స్థానభ్రంశం చెందుతున్నాయని, ఫలితంగా భూమి అక్షం పక్కకు వంగుతోందని వారు చెబుతున్నారు.
అక్షం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు దాని మధ్యలో ఉత్తరం నుంచి దక్షిణానికి మనం ఊహించుకునే నిలువు రేఖ. దీన్నే ఇంగ్లిషులో యాక్సిస్ అంటారు.
ఇలా మహాజలాశయాల స్థానభ్రంశం వల్ల సముద్ర మట్టం కూడా ప్రభావితమవుతుంది.
‘‘బయటకు తీసిన భూగర్భజలాలు ఆవిరిగా మారి వాతావరణంలో చేరతాయి లేదా నదుల్లో కలుస్తాయి. తర్వాత వానల రూపంలో సముద్రంలో కలుస్తాయి. ఈ విధంగా నీరు భూభాగం నుంచి సముద్రాలకు చేరుతుంది. ఇది నీటి పున: పంపిణీ’’ అని బీబీసీతో దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ కి-వియోన్ సియో చెప్పారు.
భూమి భ్రమణాన్ని మార్చే సామర్థ్యం నీటికి ఉన్నట్లు 2016లోనే కనుగొన్నారు.
ధ్రువ ప్రాంతాల్లో సంభవించే నీటి నష్టం (మంచు కరిగి నీటిగా మారి సముద్రాల్లో కలవడం) అనేది భూమి అక్షం వంపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై 2021 నాటి అధ్యయనం దృష్టి సారించింది.
కానీ, ఇప్పటివరకు భూ భ్రమణ మార్పుల్లో భూగర్భజలాలు పోషించే పాత్ర ఎలా ఉంటుందనే దానిపై నిర్దిష్ట అవగాహన ఎవరికీ రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మానవ కార్యకలాపాల ప్రభావాలు
భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుంది.
భూమి ద్రవ్యరాశి పంపిణీలో వచ్చే మార్పులు అక్షం కదలడానికి కారణం అవుతాయి.
కానీ, 1990ల నాటి నీటి స్థానభ్రంశం, మానవ కార్యకలాపాలను సూచిస్తుంది.
భూగ్రహంపై ద్రవ్యరాశి ఎలా విస్తరిస్తుందనే అంశాన్ని భూమి మీద నీటి పంపిణీ ప్రభావితం చేస్తుంది. (భూగ్రహంపై ద్రవ్యరాశి విస్తరణను నీటి పంపిణీ ప్రభావితం చేస్తుంది.)
ఇది తిరుగుతున్న బొంగరానికి మరికాస్త బరువును జోడించడం లాంటిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అదేవిధంగా, నీరు కదులుతున్నప్పుడు భూమి కూడా కాస్త భిన్నంగా తిరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘వాతావరణ సంబంధిత కారణాలతో పాటు, భూగర్భజలాల పంపిణీ అనేది ‘రొటేషనల్ పోల్ డ్రిఫ్ట్’పై అత్యధిక ప్రభావం చూపుతుందని మా అధ్యయనం తెలుపుతుంది’’ అని కి-వియోన్ చెప్పారు.
మధ్య అక్షాంశాల నుంచి నీటిని పున: పంపిణీ చేయడం ద్రువాల భ్రమణంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఈ అధ్యయన కాలంలో మధ్య అక్షాంశాల నుంచి పశ్చిమ ఉత్తర అమెరికా, వాయువ్య భారత్‌ల మధ్య నీరు పున:పంపిణీ అయింది.
భూగర్భజలాల వెలికితీతను తగ్గించడానికి దేశాలు చేసే ప్రయత్నాలతోనే సిద్ధాంతపరంగా పోలార్ డ్రిఫ్ట్‌ల్లో మార్పులను తీసుకురావొచ్చు. అయితే, ఈ ప్రయత్నాలు దశాబ్దాల పాటు సాగితేనే ఇది జరుగుతుందని కి-వియోన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నీటి పంపింగ్ ప్రభావం
భూభ్రమణ అక్షం, నీటి కదలికలకు సంబంధించి తమ దృష్టిలోకి వచ్చిన మార్పులను శాస్త్రవేత్తలు కొత్త అధ్యయనంలో పేర్కొన్నారు.
నీటి స్థానభ్రంశానికి కారణం మంచు ఫలకాలు, గ్లేషియర్లు కరిగిపోవడమే అని తొలుత సైంటిస్టులు అనుకున్నారు. కానీ, ఆతర్వాత భూగర్భజలాల పున: పంపిణీ మార్పులను నీటి స్థానభ్రంశానికి జోడించారు.
1993-2010 మధ్య కాలంలో మానవులు 2,150 గిగాటన్నులు భూగర్భజలాలను వెలికతీశారని మునుపటి అధ్యయనాలు అంచనా వేశాయి. 2,150 గిగాటన్నుల నీటి పరిమాణం అంటే 6 మి.మీకు పైగా సముద్ర మట్టాల పెరుగుదలకు సమానం.
ఈ కొత్త అధ్యయనం చాలా కీలకమైనదని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలోని పరిశోధక శాస్త్రవేత్త సురేంద్ర అధికారి అన్నారు.
‘‘వారు భూగర్భజాలల వెలికితీత పాత్రను ద్రువాల కదలికతో అనుసంధానించి చూశారు. ఇది చాలా గణనీయమైన పురోగతి’’ అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
‘పోలార్ డ్రిఫ్ట్‌పై నీటి పున:పంపిణీ ప్రభావం’ అనే 2016 నాటి అధ్యయన రచయితలో సురేంద్ర అధికారి ఒకరు.
నీటి పున:పంపిణీ అనేది రుతువులను (సీజన్లు) ప్రభావితం చేయదని సియో స్పష్టం చేశారు.
‘‘భూభ్రమణ అక్షం సాధారణంగా ఒక ఏడాదిలో కొన్ని మీటర్లు మాత్రమే మారుతుంది. అంటే ఒక రెండు దశాబ్దాలలో అక్షం భ్రమణంలో ఒక మీటరు మార్పు వస్తే అది వాతావరణాన్ని ప్రభావితం చేయదు.
ఇక్కడ శాస్త్రవేత్తలు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, భూగర్భజలాల వెలికితీత భూభ్రమణ అక్షాన్ని ప్రభావితం చేస్తుందని ధ్రువీకరించడం.
మేం భూభ్రమణ అక్షాన్ని పరిశీలనా సాక్ష్యంగా ఉపయోగిస్తాం’’ అని సియో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘తండ్రిగా ఆందోళన చెందుతున్నా’’
‘‘సముద్ర మట్టాల పెరుగుదలకు భూగర్భజలాల వెలికితీత మరో కారణమని తెలుసుకొని భూ గ్రహ నివాసిగా, ఒక తండ్రిగా నేను చాలా ఆందోళన చెందుతున్నా. ఆశ్చర్యపోతున్నా కూడా. వాతావరణ మార్పుల కారణంగా కరవులు తీవ్రం కావొచ్చు. కరవు ప్రాంతాల కోసం భూగర్భజలాలను వెలికితీసి, వాటిని రవాణాచేసే పరిస్థితులు పెరగొచ్చు.
నీటి వనరుల కదలికకు, సముద్ర మట్టాల పెరుగుదలకు మధ్య సంబంధం గురించి శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
‘‘ఇది ప్రధాన ఆందోళనే. ఎందుకంటే మనలో చాలామంది తీరప్రాంత నగరాల్లో నివసిస్తుంటారు.
నా తరం బాగానే బతుకుతుంది. కానీ, భవిష్యత్‌లో సముద్ర మట్టాల పెరుగుదల కారణంగా నా పిల్లలు ఇబ్బందుల్లో పడొచ్చు’’ అని సియో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














