కెనడాలో భారతీయ విద్యార్థులు ఎలా మోసపోయారు... విదేశాల్లో చదువుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోండి

కెనడా

ఫొటో సోర్స్, PARKASH SINGH

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం మోసపోయిన విద్యార్థులు సీబీఎస్‌ఏ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్నారు
    • రచయిత, గుల్షన్ కుమార్ వాంకర్
    • హోదా, బీబీసీ మరాఠీ

చదువు కోసం విదేశాలకు వెళ్లాలని ఎవరు అనుకోరు? అందరూ తాము చదవాలి అనుకునే కోర్సులను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో పూర్తి చేయాలని భావిస్తారు. అప్పుడే తమకు మంచి వేతనమిచ్చే ఉద్యోగం వస్తుందని భావిస్తారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే, అక్కడే గ్రీన్‌ కార్డు కూడా సంపాదించి స్థిరపడాలని భావిస్తారు.

అయితే, మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్న అడ్మిషన్లు, పత్రాలు విదేశాలకు వెళ్లిన తర్వాత ఫేక్ అని తేలితే?

నిజానికి ఇలాంటి కేసులు ఇటీవల చాలా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో చాలా మంది భారత విద్యార్థులను కొన్ని దేశాలు వెనక్కి పంపిస్తున్నాయి.

కెనడా

తాజా కేసులు ఏమిటి, వీటి నుంచి ఏం తెలుసుకోవాలి?

ప్రస్తుత కేసును అర్థం చేసుకోవాలంటే 2017 వరకూ వెళ్లాలి. పంజాబ్‌లోని రోపార్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాలని భావించారు.

ఒక ఏజెంట్ సాయంతో ఆయన పరీక్షలకు హాజరయ్యారు. అలానే కెనడాలోని ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా సంపాదించారు.

మొదటి సెమిస్టర్ కోసం రూ.3.65 లక్షలు కూడా ఆయన చెల్లించారు. అయితే, కెనడాకు వెళ్లిన తర్వాత, తనకు అడ్మిషన్ లెటర్‌లో కనిపించిన ఆ కాలేజీ ఆయన్ను చేర్పించుకునేందుకు నిరాకరించింది.

అప్పుడే వేరే కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తామని ఆ ఏజెంట్ లవ్‌ప్రీత్‌కు చెప్పారు. ఎలాగోలా వేరొక కాలేజీలో ఆయన సీటు సంపాదించారు.

అయితే, 5-6 ఏళ్ల తర్వాత కెనడాలో శాశ్వత నివాసం (పర్మినెంట్ రెసిడెన్స్ - పీఆర్) కోసం లవ్‌ప్రీత్ దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడే ఆయన ఫేక్ సర్టిఫికేట్స్‌పై వచ్చారని కెనడా బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీబీసీఏ)కు తెలిసింది.

అడ్మిషన్ ప్రక్రియలన్నీ తాను అనుసరించానని, కెనడా వచ్చేందుకు తాను 16 లక్షలు ఖర్చుపెట్టానని లవ్‌ప్రీత్ చెప్పారు. అయితే, ఫేక్ డాక్యుమెంట్ల గురించి మొదట్లో తనకు కూడా తెలియదని అన్నారు. కానీ, ఆయన్ను దేశం నుంచి భారత్‌కు పంపించేందుకు కెనడా అధికారులు చర్యలు మొదలుపెట్టారు.

అయితే, ఈ సమస్య కేవలం లవ్‌ప్రీత్ ఒక్కడిదే కాదని అనంతర విచారణలో బయటపడింది. మొత్తంగా ఇలాంటి 700 మంది విద్యార్థులు ఫేక్ సర్టిఫికేట్లతో మోసపోయారని వెల్లడైంది. ప్రస్తుతం ఈ విద్యార్థులంతా సీబీఎస్‌ఏ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్నారు.

ఈ విద్యార్థులు కెనడాను విడిచిపెట్టే గడువు సమీపిస్తుండటంతో 2023, జూన్ 13న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో స్పందించారు.

‘‘విద్యార్థులు తమ వాదన చెప్పుకునేందుకు ఒక అవకాశం ఇస్తాం. ప్రతి కేసునూ సమీక్షిస్తాం, ఆ తర్వాతే చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన చెప్పారు.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థులు ఎలా మోసపోయారు?

ఈ మోసాల వెనుక సూత్రధారి ఎవరు?

మోసపోయిన విద్యార్థుల్లో చాలా మంది పంజాబ్‌కు చెందినవారే ఉన్నారు. వీరిలో చాలా మంది జలంధర్‌కు చెందిన బృజేశ్ మిశ్రను మొదట ఆశ్రయించారు. ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్‌ పేరుతో ఒక కంపెనీని మిశ్ర నడిపిస్తున్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం, మిశ్ర స్వస్థలం బిహార్. పదేళ్ల క్రితం ఇలానే విద్యార్థులకు ఫేక్ డాక్యుమెంట్లు ఇస్తున్నారనే కేసులో ఆయన అరెస్టు కూడా అయ్యారు.

ఒంటారియోలోని హంబర్ కాలేజీ నుంచి కొన్ని ఫేక్ అడ్మిషన్ లెటర్లను విద్యార్థులకు ఆయన ఇప్పించారు. అయితే, విద్యార్థులు ఆ కాలేజీకి వెళ్లినప్పుడు వారి అడ్మిషన్ రిజెక్ట్ అయినట్లు తెలిసింది. దీంతో అక్కడుండే మరొక కాలేజీలో సీటు ఇప్పిస్తానని విద్యార్థులకు మిశ్ర చెప్పేవారు.

అయితే, విద్యార్థులు ఎవరికీ ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు వారి దగ్గర తీసుకున్న మొత్తంలో రూ.4-5 లక్షలు తిరిగి ఇచ్చేవారు.

వీరిలో కొందరు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అక్కడి ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. దీంతో ఈ కేసులన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

ప్రస్తుతం బృజేశ్ మిశ్ర పరారీలో ఉన్నారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కెనడా

ఫొటో సోర్స్, Getty Images

విదేశాల్లో అడ్మిషన్ ప్రక్రియలు ఎలా ఉంటాయి?

అమెరికా, కెనడా, బ్రిటన్ లేదా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు భారత విద్యార్థులు మొగ్గు చూపుతుంటారు.

అయితే, అక్కడకు వెళ్లాలంటే మొదటగా ఎస్ఏటీ, ఏసీటీ, ఐఈఎల్‌టీఎస్, టోవోఈఎఫ్ఎల్, పీటీఐ, డుయోలింగో లేదా కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ టెస్టు లాంటి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఈ పరీక్షల్లో స్కోరును యూనివర్సిటీలు పరిగణలోకి తీసుకుంటాయి. అయితే, ఇక్కడి నుంచే ఏజెంట్లు తమ పని మొదలుపెడతారు. దీని కోసం దేశంలోని కొన్ని పెద్దపెద్ద సంస్థలు.. విద్యార్థులు, యూనివర్సిటీల మధ్య ఇంటర్మీడియరీలుగా పనిచేస్తున్నాయి. పరీక్షలో స్కోరుతోపాటు తాము చదవాలనుకునే కోర్సులు, బడ్జెట్‌ల ఆధారంగా విద్యార్థులకు ఈ సంస్థలు సాయం చేస్తుంటాయి.

అయితే, యూనివర్సిటీ ఆ విద్యార్థిని ఎంపిక చేసుకొని, ఆఫర్ లెటర్ పంపిస్తే ఏజెంట్ పని ముగుస్తుంది. ఆ తర్వాత వీసా, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల కోసం విద్యార్థులు వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు.

తాజా సమస్య వెనుక చాలా కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై నాగ్‌పుర్‌లోని కేఎస్ఐ ఓవర్‌సీస్ కన్సల్టెంట్స్ సంస్థ ఆపరేషన్స్ మేనేజర్ అక్షయ్ దల్వీ బీబీసీతో మాట్లాడారు.

‘‘కొన్నిసార్లు ఏజెంట్లను విద్యార్థులు గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఫలితంగా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సమస్యలు తెచ్చిపెట్టే ఫోర్జరీ లాంటి తప్పులకూ విద్యార్థులు పాల్పడుతుంటారు’’ అని దల్వీ అన్నారు.

‘‘విద్యార్థులు ఎలాగైనా విదేశాలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్నత విద్యను ఒక మార్గంగా మాత్రమే చూస్తారు. అందుకే తక్కువ ఫీజు వసూలుచేసే కాలేజీలను వారు ఎంచుకుంటారు, లేదా వేరే కాలేజీలో చేరేందుకు ఎలాంటి అభ్యంతరమూలేదని సర్టిఫికేట్ ఇచ్చే కాలేజీలవైపు మొగ్గు చూపుతుంటారు’’ అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, మంచు తుపాన్లు వచ్చే కెనడాలో వడగాడ్పులు..

అయితే, ప్రస్తుత కేసును చూస్తే ఇక్కడ దాదాపు 700 మంది విద్యార్థులు మోసపోయారు. వీరిలా ఇతరులు మోసపోకుండా ఉండటం ఎలా? దీని కోసం దల్వీ కొన్ని సూచనలు ఇచ్చారు.

మొదట మనం హోం వర్క్ చేయాలి. ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నాం? ఏ కోర్సుల్లో చేరాలని భావిస్తున్నాం? దీని కోసం నమ్మదగిన వ్యక్తులు ఎవరు? లాంటి అంశాలపై ఒక అవగాహనకు రావాలి.

‘‘ఇక్కడ మనకు అడ్మిషన్ ఇచ్చేది కాలేజీ మాత్రమేననే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని కోసం ఆ ఏజెంట్ కాస్త సాయం చేయొచ్చు. కానీ, ఆయనే అన్నీ చూసుకుంటారని భావించకూడదు. ఒకవేళ మొత్తం ఫీజును మొదట్లోనే కట్టమని అడిగితే, కాస్త అప్రమత్తంగా ఉండండి. ఒకటికి రెండుసార్లు అన్నీ సరిచూసుకోండి’’ అని ఆయన చెప్పారు.

‘‘ఆ కాలేజీ లేదా యూనివర్సిటీ గురించి ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకోండి. మీకు ఆ యూనివర్సిటీ అడ్మిషన్ ఇస్తే, మరిన్ని వివరాలను సేకరించండి. ఇంటర్నెట్‌లో మీకు చాలా సమాచారం దొరుకుతుంది. ఇతర విద్యార్థుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మాజీ విద్యార్థులతోనూ మాట్లాడేందుకు ప్రయత్నించండి’’ అని ఆయన సూచించారు.

ప్రస్తుతం కెనడాలో ఇరుక్కుపోయిన విద్యార్థుల విషయంలో కెనడా ప్రభుత్వం సాయం చేస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటోంది.

దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ తరచూ కెనడా అధికారులతో మాట్లాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)