అమెరికా: ఒడిలో మూడేళ్ల బాబు, భార్యతో మెక్సికో సరిహద్దులో 30 అడుగుల గోడ దూకిన భారతీయుడు.. అక్రమంగా అమెరికా వెళ్లే ప్రయత్నంలో మృతి

బ్రిజ్‌కుమార్ యాదవ్ కుటుంబం

ఫొటో సోర్స్, KARTIK JANI/ BBC

గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కలోల్ సమీపంలోని బోరిసానా ఓ చిన్న గ్రామం.

ఇక్కడి పంచాయితీలలో లేదా టీ తాగేటపుడో, టిఫిన్ చేసేటపుడో ప్రజల మధ్య రాజకీయ చర్చలు సాధారణం.

ఈ ఏరియా ప్రజలు డాలర్లు సంపాదించాలని అమెరికా వెళ్లేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని స్థానికుల అభిప్రాయం.

కానీ, ఇప్పుడు అక్కడ ఎవరూ అమెరికా గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు.

ఎందుకంటే ఈ గ్రామానికి చెందిన వ్యక్తి అమెరికాకు అడ్డదారిలో వెళ్లాలని ప్రయత్నించి చనిపోయారు.

స్థానిక సమాచారం ప్రకారం కలోల్ నివాసి బ్రిజ్‌కుమార్ యాదవ్ మెక్సికో-అమెరికా సరిహద్దులో నిర్మించిన గోడ పైనుంచి దూకి మరణించారు.

'ట్రంప్ వాల్'గా పిలిచే ఈ గోడ 30 అడుగుల ఎత్తు ఉంటుంది.

ఈ గోడ మార్గంలో బ్రిజ్‌కుమార్ తన కుటుంబంతో కలిసి 'అక్రమంగా' అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.

బ్రిజ్‌కుమార్ 'ట్రంప్ వాల్' ఎక్కుతున్నప్పుడు, ఆయన ఒడిలో మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు.

ఈ ప్రమాదంలో ఆయన భార్య, బిడ్డకు కూడా గాయాలైనట్లు సమాచారం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బోరిసానా గ్రామస్తులలో పటేల్, ఠాకూర్ వర్గాలకు చెందినవారు ఎక్కువ.

వీరిలో చాలామందికి అక్కడి కర్మాగారాల్లో ఉపాధి లభిస్తుంది. ఇక్కడ వ్యవసాయం కూడా బాగానే ఉంటుంది.

ఈ గ్రామంలోని జనాభా దాదాపు 3,000. ఇక్కడ నివసించే యువత సంఖ్య చాలా తక్కువ.

ఎందుకంటే ఇక్కడి యువతలో ఎక్కువ మంది పని వెతుక్కుంటూ విదేశాలకు లేదా సమీపంలోని నగరాలకు వలస వెళ్లారు.

క్రైస్తవులు ఈ గ్రామంలో ఎక్కువగా కనిపించరు. అయితే, ప్రతి ఏడాది క్రిస్మస్ సమయంలో ఇక్కడ దీపావళి లాంటి వాతావరణం ఉంటుంది.

ఎందుకంటే విదేశాల్లో ఉన్న చాలా మంది ఈ సమయంలో తమ గ్రామాలకు తిరిగి వస్తారు.

అయితే ఈ ఏడాది మిగతా సంవత్సరాలకు భిన్నంగా ఉంది. 'అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ' మరణించిన 32 ఏళ్ల బ్రిజ్‌కుమార్‌ దీనికి కారణం.

బ్రిజ్‌కుమార్ యాదవ్ తండ్రి ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చి గుజరాత్‌లో స్థిరపడ్డారు.

ఆయన ఇక్కడ టెలిఫోన్ ఆఫీసులో పనిచేసేవారు. ఏడేళ్ల క్రితమే పదవీ విరమణ చేశారు.

బ్రిజ్‌కుమార్ బోరిసానాలో చిన్న వ్యాపారం చేసేవారు.

బ్రిజ్‌కుమార్‌

ఫొటో సోర్స్, KARTIK JANI/ BBC

బ్రిజ్‌కుమార్ గురించి ఆయన స్నేహితుడు జయేంద్ర పటేల్ బీబీసీతో మాట్లాడారు. బ్రిజ్, తాను , మరొక స్నేహితుడు విష్ణు ఠాకూర్ కలిసి వ్యాపారాన్ని నడిపేవారిమని చెప్పారు.

జయేంద్ర పటేల్, విష్ణు ఠాకూర్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారు. బ్రిజ్‌కుమార్ వర్కింగ్ పార్టనర్‌గా పనిచేశారు.

జయేంద్ర మాట్లాడుతూ.. ''నవంబర్ నెలాఖరు నుంచి ఊళ్లో బ్రిజ్‌కుమార్‌ కనిపించలేదు. నాలుగేళ్ల క్రితం గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GIDC)లో ఆయనకు ఉద్యోగం వచ్చింది.

అప్పటి నుంచి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. మేం అప్పుడప్పుడు కలుస్తుంటాం, అతను విదేశాలకు వెళుతున్నాడని మాకు తెలియదు'' అని పేర్కొన్నారు.

బ్రిజ్‌కుమార్‌ను చాలాకాలంగా కలవడం లేదని మరో స్నేహితుడు విష్ణు ఠాకూర్ స్పష్టం చేశారు.

బ్రిజ్‌కుమార్ త్వరగా డబ్బు సంపాదించాలనుకున్నాడని, కానీ అక్రమంగా విదేశాలకు వెళ్లాడని తెలియదని చెప్పారు.

బ్రిజ్‌కుమార్ ఇంట్లో ఏం చెప్పి వెళ్లారు?

ఈ ఘటనపై బ్రిజ్‌కుమార్‌ సోదరుడు వినోద్‌ యాదవ్‌ బీబీసీతో మాట్లాడుతూ.. ‘నెల రోజుల పాటు టూర్‌కు వెళ్తున్నానని’ తన సోదరుడు చెప్పాడన్నారు.

‘‘నవంబర్ 18న తన భార్య పూజ, మూడేళ్ల కుమారుడితో కలిసి నెల రోజులు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు’’ అని వినోద్‌ తెలిపారు.

ఆ తర్వాత బ్రిజ్‌కుమార్ భార్య పూజ తనకు చాలాసార్లు ఫోన్ చేసిందన్నారు.

"బాగానే ఉన్నామని పూజ చెబుతూ ఉంటుంది. కానీ వాళ్లు ఎక్కడున్నారో మాకు తెలియలేదు" అని వినోద్ చెప్పాడు.

అయితే బ్రిజ్‌కుమార్ మరణ వార్త ఎలా తెలిసిందనే దానిపై వినోద్ స్పందిస్తూ.. "ఒక రోజు మా సోదరుడు బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మరణించాడని మాకు కాల్ వచ్చింది.

ఆ తర్వాత అక్కడి నుంచి కాంటాక్ట్ లేదు. ఎలాంటి సమాచారం అందలేదు.

ప్రభుత్వం నా సోదరుడి మృతదేహాన్ని, అతని కుటుంబాన్ని భారతదేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నాం.

ఈ వార్త తెలియగానే నా ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది'' అని అన్నారు వినోద్.

భరత్ జోషి

ఫొటో సోర్స్, KARTIK JANI/ BBC

బ్రిజ్ కుమార్ కేసుపై అధికారులు ఏమంటున్నారు?

ఈ ఘటనపై గాంధీనగర్ అదనపు రెసిడెంట్ కలెక్టర్ భరత్ జోషిని బీబీసీ సంప్రదించింది.

ఆయన మాట్లాడుతూ “ఈ సంఘటనపై అమెరికా నుంచి మాకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు,

అయితే బ్రిజ్‌కుమార్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని, అతని కుటుంబంతో కలోల్‌లో నివసించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఆయన, భార్య, కుమారుడు ఏజెంట్ ద్వారా విదేశాలకు వెళ్లి 'ట్రంప్ వాల్' దాటుతుండగా మరణించారని తెలిసింది.'' అని చెప్పారు.

"బ్రిజ్‌కుమార్ భార్య, కుమారుడు గాయపడ్డారు, చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మేం అమెరికా ఎంబసీని సంప్రదించాం. దర్యాప్తు కొనసాగుతోంది.

మేం అధికారికంగా మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం." అని భరత్ జోషి స్పష్టంచేశారు.

గుజరాత్ పోలీసులు, రాష్ట్ర నేర పరిశోధన బృందం (సిఐడి) ఈ అంశంపై విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది.

గాంధీనగర్ సీఐడీ క్రైమ్ అధికారి బీబీసీతో మాట్లాడుతూ “అమెరికా ఎంబసీ నుంచి అధికారిక సమాచారం అందిన తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందని చెప్పారు.

దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

జగదీష్, వైశాలిబెన్ పటేల్, వారి ఇద్దరు పిల్లలు

ఈ ఏడాది జనవరిలో ఉత్తర గుజరాత్‌లోని దింగుచా గ్రామానికి చెందిన ఓ కుటుంబం కెనడా వెళ్లేందుకు ప్రయత్నించి మృతిచెందారు.

అమెరికా-కెనడా సరిహద్దులో జగదీష్, వైశాలిబెన్ పటేల్, వారి ఇద్దరు పిల్లలు మరణించారు.

ఆ కుటుంబం కాలినడకన కెనడా దాటి అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ రాత్రి ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీల సెల్సియస్‌ ఉండటంతో అధిక చలి కారణంగా మృతిచెందారు.

సీఐడీ క్రైమ్ అధికారి మాట్లాడుతూ.. "స్టేట్ మానిటరింగ్ సెల్ విచారణ ప్రకారం మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

ఈ కేసు మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్ వ్యవస్థను బహిర్గతం చేసింది. మేం లావాదేవీకి సంబంధించిన అనేక వివరాలను సంపాదించాం. ఇతర లింక్‌లను పరిశీలిస్తున్నాం.'' అని చెప్పారు.

ఉత్తర గుజరాత్ నుంచి మెక్సికో, కెనడాలకు మానవ అక్రమ రవాణా కేసులో నిందితులను పట్టుకునేందుకు స్థానిక క్రైమ్ బ్రాంచ్, సీఐడీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.

రాబోయే రోజుల్లో ఆ నిందితులను విచారిస్తాం" అని అన్నారు.

"విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక సమాచారం రాకముందే మేం దర్యాప్తు ప్రారంభించాం. దీంతో స్మగ్లింగ్ కుట్రలో భాగమైన వారిని వెంటనే పట్టుకోవచ్చు." అని స్పష్టంచేశారు.

‘ఆస్తి తనఖా పెట్టైనా అమెరికాకు..’

'అక్రమ' మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లే అనేక కేసులు ఉత్తర గుజరాత్ నుంచి వస్తున్నాయి.

ఇలాంటి ఘటనల వల్ల విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు కూడా చెదిరిపోతున్నాయి.

అయితే పాశ్చాత్య దేశాలకు వెళ్లడానికి లక్షల రూపాయలు వెచ్చిస్తున్న కుటుంబాలు వారు చేసే సాహసాలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

ఈ ఘటనల్లో తరచుగా వారి ఆస్తి, డబ్బు, ప్రాణాలు కూడా పోతున్నాయి. ఉత్తర గుజరాతీయులు ఇలా అక్రమ మార్గంలో తమ జీవితాలను పణంగా పెట్టి అమెరికా వంటి దేశాలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు?

trump wall

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం అహ్మదాబాద్‌లో నివసిస్తున్న ఉత్తర గుజరాత్‌కు చెందిన ఒక ట్రావెల్ ఏజెంట్ బీబీసీతో దీనిపై మాట్లాడారు.

విదేశాలకు వెళ్లి డాలర్లలో డబ్బు సంపాదించాలనే క్రేజ్ ఉత్తర గుజరాత్ ప్రజల్లో చాలా ఉంది.

అంతేకాదు గ్రామంలో నివసించే యువకులతో పోలిస్తే, విదేశాల్లో నివసిస్తున్న వారికే పెళ్లిళ్లు అవుతున్నాయి. ఇది కూడా త్వరగా జరుగుతోంది.

అందుకే ఇక్కడి ప్రజలు తమ వ్యవసాయ భూములు అమ్మి, అప్పు తీసుకుని మరీ అమెరికా వెళ్లాలనుకుంటున్నారు’’ అని తెలిపారు.

అంతర్జాతీయ సరిహద్దు

విదేశాలకు అక్రమంగా తీసుకెళ్లే ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది?

దీనిపై ట్రావెల్ ఏజెంట్ మాట్లాడుతూ.. "ఎవరినైనా అక్రమంగా విదేశాలకు పంపే ప్రధాన ఏజెంట్లు అహ్మదాబాద్, గాంధీనగర్‌లో ఉన్నారు. మేం వారికి సబ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.

విదేశాలకు వెళ్లాలనుకునే వారిని కనుక్కోవడం మా పని. అక్రమంగా’ విదేశాలకు వెళ్లాలనుకునే వారు రూ.60 లక్షల నుంచి రూ. 66 లక్షలు ఖర్చుపెట్టేందుకు సిద్ధపడాలి'' అని అంటున్నారు.

"బ్రిజ్‌కుమార్ వంటి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే వ్యక్తుల నుంచి 30 శాతం డబ్బును ముందుగా తీసుకుంటారు.

ఆ తర్వాత వారిని విదేశాలకు పంపి, అక్కడ ఉద్యోగాలు సంపాదించిన తర్వాత, మిగిలిన డబ్బును హవాలా ద్వారా రికవరీ చేస్తారు" అని సబ్-ఏజెంట్ స్పష్టం చేశారు.

విదేశాలకు వెళ్లిన వారి నుంచి డబ్బు రావడానికి పలు మార్గాలను సబ్ ఏజెంట్లు సూచిస్తారన్నారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం.. అక్రమంగా విదేశాలకు వెళ్లే వారితో సగం డబ్బు చెల్లించుకుని, మిగతా దాని కోసం భూమిని తనఖా పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు.

వారి పాస్‌పోర్ట్ కూడా జప్తు చేస్తారు. ఏజెంట్ల భాషలో దీన్నే 'పాస్‌పోర్ట్ సిండికేట్ బ్యాంక్' అంటారు.

ప్రతి సబ్ ఏజెంట్ ఈ బ్యాంక్‌లో 'చట్టవిరుద్ధమైన విదేశీయుల' పాస్‌పోర్ట్‌లను తప్పనిసరిగా డిపాజిట్ చేయాలి.

ఇలా చేయడం ద్వారా 'అక్రమ వలసదారు' పారిపోకుండా ఉంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)