అనిత ఆనంద్: కెనడా కొత్త రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ.. ట్రూడో ఆమెనే ఎందుకు నియమించారు?

ఫొటో సోర్స్, LARS HAGBERG/GETTY IMAGES
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత సంతతికి చెందిన అనిత ఆనంద్‌ను కెనడా రక్షణ మంత్రిగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో నియమించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.
కెనడియన్ సైన్యం లైంగిక దుష్ప్రవర్తన కేసులతో సతమతమవుతున్న క్లిష్ట సమయంలో అనిత ఆనంద్‌కు ఈ కీలక పదవిని కేటాయించారు.
అంతకుముందు భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ రక్షణ మంత్రిగా వ్యవహరించారు. ఆయన స్వయంగా సైనికాధికారి.
కాగా, హర్జీత్ సజ్జన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన చట్టసభ సభ్యులు గత పార్లమెంటు సెషన్‌లో డిమాండ్ చేశారు.
సైన్యం అనుచిత ప్రవర్తన పట్ల ఫిర్యాదులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని, ఇందులో ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందని ఆరోపించారు.
"కెనడియన్ ఆర్మీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోందని మాకు తెలుసు" అని జస్టిన్ ట్రూడో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత జరిగిన విలేఖరుల సమావేశంలో అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హర్జీత్ సజ్జన్‌ను ఎందుకు తొలగించారు?
సైన్యంపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం బలహీనంగా వ్యవహరిస్తోందని, ఒక మహిళను రక్షణ మంత్రిగా నియమించాల్సిన అవసరం ఉందని మహిళా హక్కుల సంఘాలు, సాధారణ పౌరులు కూడా డిమాండ్ చేశారు.
హర్జీత్ సజ్జన్ రక్షణ మంత్రి పదవికి అర్హులు కాదని, ఆయనను తొలగించాలనే డిమాండ్ కూడా ముందుకు వచ్చిందని కెనడాలోని సీనియర్ జర్నలిస్ట్ గుర్‌ప్రీత్ సింగ్ బీబీసీకి చెప్పారు.
"సజ్జన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. లైంగిక దుష్ప్రవర్తన కేసుల్లో 10-12 మంది అధికారుల పేర్లు ఉన్నాయి. కొందరిపై చర్యలు తీసుకున్నారు కూడా. కానీ, ఇలాంటి కేసులు పదే పదే తెరపైకి రావడంతో సజ్జన్‌కు తెలియకుండా ఇవన్నీ జరిగే అవకాశం లేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అనితా ఆనంద్‌ను రక్షణ మంత్రిగా నియమించారు" అని గుర్‌ప్రీత్ సింగ్ చెప్పారు.
ప్రభుత్వ పదవుల్లో అనిత ఆనంద్
అనితా ఆనంద్ 2019లో తొలిసారిగా ఓక్‌విల్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం, పబ్లిక్ సర్వీస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ మంత్రిగా నియమితులయ్యారు.
భారత సంతతికి చెందిన అనిత ఆనంద్ విద్యావంతురాలు, న్యాయవాది. టొరంటో విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
2015లో ఆర్థిక విధానాలపై సలహాదారుల కమిటీలో సభ్యురాలిగా నియమితులయ్యారు.
ఫైనాన్షియల్ మార్కెట్ నియంత్రణ, వాటాదారుల హక్కులు, కార్పొరేట్ గవర్నెన్స్ మొదలైన అంశాలకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటూ ఉంటారు.
కాగా, సైన్యంపై వచ్చిన కేసులు, ఆ రంగంలో మహిళల భద్రత నేపథ్యంలో ఓ మహిళను రక్షణ మంత్రిగా నియమించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావించారు. కానీ, ఆ పదవిని నిర్వహించడంలో అనితా ఆనంద్ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అనితా ఆనంద్‌కు రక్షణ వ్యవహారాల్లో అనుభవం లేదు.
మాజీ రక్షణ మంత్రి హర్జీత్ సజ్జన్ స్వయంగా సైనిక అధికారి. సైన్యంలో ఆయనకు అనేక పతకాలు లభించాయి. ఆయన సేవలకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
తరువాత ఆయన పోలీసు శాఖలో చేరారు. సైన్యంలో ఉన్నప్పుడు బోస్నియా, అఫ్ఘానిస్తాన్‌లో ఆయన పోస్టింగ్ ఉండేది.
ఈ నేపథ్యంలో, విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం ఉన్న కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్‌ను రక్షణ మంత్రి పదవిని ఎన్నుకుని ఉండవచ్చు లేద రక్షణ శాఖలో అనుభవం ఉన్న మహిళను మంత్రిగా నియమించి ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, HARJIT SINGH FB PAGE
సవాళ్లు ఏమిటి?
ప్రభుత్వాన్ని నడపడంలో అనితా ఆనంద్‌కు మంచి అనుభవం ఉందని జస్టిన్ ట్రూడో ప్రెస్ మీట్‌లో చెప్పారు.
అయితే, ఇప్పుడు అనిత ఆనంద్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.
కొత్త విభాగంలో పనిచేసేందుకు సిద్ధం అవుతున్నానని, రాబోయే రోజుల్లో అనేక ప్రశ్నలకు "స్పష్టమైన సమాధానాలు" ఇస్తానని ఆమె విలేఖరులతో అన్నారు.
"నేను ఒక మహిళను. అది ఒక అంశమే. కానీ విభిన్న రంగాలలో నా అనుభవాలను రంగరించి ఈ పదవిని నిర్వహిస్తాను. సైన్యంలో అందరికీ భద్రత కల్పించడం, వారికి కావాల్సిన సహాయం అందించడం, న్యాయం జరుగుతుందనే విశ్వాసం కల్పించడం.. వీటికే తొలుత ప్రాధాన్యం ఇస్తాను" అని ఆమె తెలిపారు.
"సైన్యంలో మహిళల విశ్వాసాన్ని పొందడం, తన ప్రత్యేకతను నిరూపించుకోవడం, ముఖ్యంగా కొందరు అధికారులపై ఆరోపణల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతం అనితా ఆనంద్ ముందున్న ముఖ్యమైన సవాళ్లు" అని జర్నలిస్ట్ గురుప్రీత్ అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో రైతుల ఆందోళనల పట్ల సానుభూతి తెలుపుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో ఒక ప్రకటన విడుదల చేశారు.
తరువాత, కోవిడ్ వ్యాక్సీన్లు పంపించమని భారత్‌ను కోరారు.
ఈ అంశంలో జస్టిన్ ట్రూడోపై పలు విమర్శలు వచ్చాయి. అనితా ఆనంద్ సలహాతోనే ట్రూడో అలా చేశారని అంటారు.
"భారతదేశం నుంచి వ్యాక్సీన్లు వచ్చాయిగానీ అవి పంపిణీ చేసే ముందే ఎక్స్పయిర్ అయిపోయాయి. పూర్తిగా కూడా రాలేదు. అందుకే ఈ అంశంలో విమర్శలు వచ్చాయి. ఓవైపు రైతుల ఆందోళనలపై సానుభూతి చూపుతూ, మరోవైపు భారతదేశం సహాయం కోరుతున్నారని ట్రూడోపై విమర్శలు వచ్చాయి. అయితే అనితా ఆనంద్ కోరిక మేరకే ట్రూడో అలా చేశారని అంటున్నారు. అనితా ఆనంద్‌కు కెనడా ఇండియా ఫౌండేషన్‌తో గట్టి అనుబంధం ఉంది" అని గురుప్రీత్ చెప్పారు.
కెనడా ఇండియా ఫౌండేషన్‌ను భారతీయుల మద్దతుతో నడిచే లాబీ గ్రూప్‌గా పరిగణిస్తారు.
వ్యాక్సీన్ల విషయంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు అనితా ఆనంద్ రక్షణ శాఖను సక్రమంగా నిర్వహించగలారా లేరా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
జస్టిన్ ట్రూడో హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలూ వస్తున్నాయి.
ఏది ఏమైనా, భారత సంతతికి చెందిన మహిళ తొలిసారిగా ఆ దేశ రక్షణ మంత్రిగా ఎంపిక కావడం చారిత్రకమనే చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- రైతుల ఆందోళన: భారత వ్యవహారాలలో కెనడా ఎందుకు జోక్యం చేసుకుంటోంది?
- కెనడా పాఠశాల ప్రాంగణంలో బయటపడిన 215 మంది పిల్లల అవశేషాలు..
- మోసం కేసులో మహాత్మా గాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 కీలకమైన ప్రశ్నలు
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- చైనాపై అమెరికా, బ్రిటన్ కీలక చర్యలు.. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాన్, తైవాన్, కెనడా
- కరోనావైరస్: ఒలింపిక్ క్రీడల నుంచి తప్పుకున్న కెనడా.. ఇది వాయిదాకి సంకేతమా?
- ఏడేళ్ల వయసులో శరణార్థిగా వెళ్లిన బాలిక.. 60 ఏళ్లకు స్వదేశానికి అధ్యక్షురాలయ్యారు
- ‘హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం నచ్చింది’’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వకార్ యూనిస్ క్షమాపణ
- పెగాసస్ వివాదం: ‘జాతీయ భద్రత అని కేంద్రం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలుపు ఇస్లాం విజయం ఎలా అవుతుంది?
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








