దక్షిణాఫ్రికా: మోసం కేసులో మహాత్మా గాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష - Newsreel

ఫొటో సోర్స్, TWITTER/@TIMESLIVE
60 మిలియన్ రాండ్ (దక్షిణాఫ్రికా కరెన్సీ)ల మోసం, ఫోర్జరీ కేసులో మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్‌కు దక్షిణాఫ్రికాలోని ఓ కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. భారతీయ కరెన్సీలో ఆమె చేసిన మోసం విలువ రూ. 3.25 కోట్లు.
పారిశ్రామికవేత్త ఎస్.ఆర్. మహారాజ్‌ను మోసం చేసినట్లు ఆశిష్ లతాపై ఆరోపణలు వచ్చాయి.
భారతదేశం నుండి లినెన్ సరుకు దిగుమతి చేసుకోవటానికి, కస్టమ్స్ సుంకాన్ని క్లియర్ చేయడానికని చెప్పి ఎస్.ఆర్. మహారాజ్ నుంచి ఆమె 62 లక్షల రాండ్లను తీసుకున్నారు. ఈ సరుకు మీద వచ్చిన లాభంలో వాటా కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
వివిధ కంపెనీలతో తాను కుదుర్చుకున్న ఒప్పందాలను చూపడంతో, ఆమెను నమ్మి మహారాజ్ డబ్బు ఇచ్చారు. అయితే, ఆ తర్వాత అవి తప్పుడు పత్రాలని తేలడంతో ఆయన ఆశిష్ లతాపై క్రిమినల్ కేసు పెట్టారు.
లేని సరుకును ఉందని చెప్పడంతోపాటు, నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించినట్లు విచారణలో బైటపడింది. దీంతో డర్బన్ నగరంలోని కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఆశిష్ లతా రామ్‌గోబిన్ సుప్రసిద్ధ మానవ హక్కుల కార్యకర్త ఎలా గాంధీ, దివంగత మేవా రామ్ గోబిన్‌ల కుమార్తె.

ఫొటో సోర్స్, Getty Iamges
బీబీసీ, న్యూయార్క్‌టైమ్స్, అమెజాన్ వంటి ప్రధాన వెబ్‌సైట్లు ఎందుకు కాసేపు స్తంభించిపోయాయి
అమెజాన్, రెడిట్‌లతోపాటు కొన్ని పెద్ద పెద్ద సంస్థల వెబ్‌సైట్లు మంగళవారం కొద్దిసేపు పాటు స్తంభించిపోయాయి.
బ్రిటన్ ప్రభుత్వ వెబ్‌సైట్ (gov.uk)తోపాటు ఫైనాన్షియల్ టైమ్స్, గార్డియన్, న్యూయార్క్ టైమ్స్ సేవలు కూడా కాసేపు నిలిచిపోయాయి.
''ఎర్రర్ 503, సెర్వీస్ అన్‌ఎవైలబుల్''అనే ఎర్రర్ మెసేజ్ ఈ వెబ్‌సైట్లపై కనిపించింది.
క్లౌడ్ సేవల సంస్థ ''ఫాస్ట్లీ''లో సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. చాలా ప్రధాన వెబ్‌సైట్లకు ఫాస్ట్లీనే సేవలు అందిస్తోంది.
లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఫాస్ట్లీ తెలిపింది. మరోవైపు కొన్ని వెబ్‌సైట్ల సేవలు కాసేపటికే ప్రారంభం అయ్యాయి.
వెబ్‌సైట్ల లోడింగ్ సమయం తగ్గించడం, సైబర్ దాడుల నుంచి అడ్డుకోవడం తదితర సేవలను ఫాస్ట్లీ అందిస్తుంది.
గతంలో అమెజాన్ వెబ్ సర్వీస్ సంస్థలోనూ ఇలాంటి సాంకేతిక లోపమే తలెత్తింది.

ఫొటో సోర్స్, PTI
నవనీత్ కౌర్: తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు రూ.2 లక్షల ఫైన్
సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవనీత్ కౌర్ రాణా కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు మంగళవారం రద్దుచేసింది. దీంతో ఆమె ఎంపీ పదవి కూడా కోల్పోయే అవకాశముంది.
మహారాష్ట్రకు చెందిన నవనీత్ కౌర్ తెలుగులో డజనుకుపైగా సినిమాల్లో నటించారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో ఈమె మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
అయితే, ఎన్నికల సమయంలో ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారని శివసేన నాయకుడు, మాజీ ఎంపీ ఆనంద్‌రావ్ అడ్సుల్ హైకోర్టును ఆశ్రయించారు.

ఫొటో సోర్స్, facebook/navneetravirana
''2013లో నవనీత్ కౌర్ ఆ కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఆ పత్రం చెల్లుబాటును కోర్టు రద్దు చేసింది. అంతేకాదు రూ.2 లక్షలు జరిమానా కూడా విధించింది''అని ఆనంద్‌రావ్ తరఫు న్యాయవాది ప్రమోద్ పాటిల్ మీడియాతో చెప్పారు.
''కుల ధ్రువీకరణ పత్రం కోసం నకిలీ పత్రాలను నవనీత్ సమర్పించారని విచారణలో వెల్లడైంది. దీంతో ఆ పత్రాన్ని ఆరు వారాల్లోగా తమకు అప్పగించాలని ఆమెకు కోర్టు సూచించింది''.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బాంబే హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తానని... అయితే, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, అక్కడ తనకు న్యాయం లభిస్తుందన్న నమ్మకం ఉందని నవనీత్ కౌర్ అన్నారు.
''కోర్టు నిర్ణయాన్ని నవనీత్ సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని భావిస్తున్నారు. కానీ పెద్దగా ఉపయోగం ఉండదు.
హైకోర్టు నిర్ణయంతో వెంటనే ఎంపీ సభ్యత్వం రద్దుచేయొచ్చు. ఇక సుప్రీం కోర్టుకు వెళ్లినా పెద్ద ఉపయోగం ఉండదు''అని హైకోర్టు న్యాయవాది ఐజాజ్ నఖ్వి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆగ్రా: రోగుల సంఖ్య తగ్గించడానికి ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా ఆపేశారా.. 22 మంది మరణం వెనుక కుట్ర ఉందా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ఒక ఆస్పత్రి డైరెక్టర్ వీడియో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో రోగులు డిశ్చార్జ్ అయ్యేలా ఐదు నిమిషాలు ఆక్సిజన్ సప్లై ఆపేశామని ఆయన అందులో చెబుతుంటారు.
"ఐదు నిమిషాలు ఆక్సిజన్ సప్లై ఆపేయండి" అని ఆస్పత్రి డైరెక్టర్ చెప్పడాన్ని ఈ వీడియోలో మాక్ డ్రిల్ అని అంటున్నారు.
ఆగ్రాలోని పారస్ ఆస్పత్రిలో ఏప్రిల్ 26-27 రాత్రి ఆక్సిజన్ కొరతతో 22 మంది రోగులు చనిపోయారు. మృతుల బంధువులు ఆస్పత్రి నిర్లక్ష్యంగా వ్యవహించిందని ఆరోపించి అప్పుడు గొడవ చేశారు. కానీ ఆస్పత్రి, పోలీసులు, యంత్రాంగం దానిని తోసిపుచ్చారు.
ఏప్రిల్ 26న పారస్ ఆస్పత్రిలో మొత్తం 97 మంది కరోనా రోగులు ఉన్నారని, వారిలో నలుగురు చనిపోయారని ఆగ్రా కలెక్టర్ పీఎన్ సింగ్ చెప్పారు. వైరల్ అవుతున్న వీడియో ప్రామాణికతను ధ్రువీకరించలేదని, దానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.
దాదాపు నెలన్నర తర్వాత ఆస్పత్రికి సంబంధించిన ఈ వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. ఈ వీడియోలో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అరింజయ్ జైన్ జరిగిన దానిని స్వయంగా చెబుతున్నారు.
అయితే బీబీసీ ఈ వీడియోను ధ్రువీకరించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
వీడియోలో డైరెక్టర్ ఏం చెబుతున్నారు
ఆయన ఆ వీడియోలో "ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. రోగులను తీసుకెళ్లిపోవాలని మేం వారి బంధువులకు చెప్పాం. కానీ, దానికి ఎవరూ ఒప్పుకోవడం లేదు. అందుకే, నేను ఒక మాక్ డ్రిల్ లాంటి ప్రయోగం చేశాను. ఏప్రిల్ 26న ఉదయం 7 గంటలకు మేం ఆక్సిజన్ సరఫరా ఆపేశాం. 22 మంది రోగులు ఊపిరాడక తల్లడిల్లారు. వాళ్ల శరీరం నీలంగా మారింది. దాంతో ఆక్సిజన్ సరఫరా లేకుంటే వాళ్లు బతకరని మాకు అర్థమైంది. తర్వాత, మేం ఐసీయూలోని మిగతా 74 మంది రోగుల బంధువులతో మీ ఆక్సిజన్ సిలిండర్లు మీరే తెచ్చుకోవాలని చెప్పాం" అనడం కనిపిస్తోంది.
వీడియోలో ఆయన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి 22 మంది చనిపోయారని ధ్రువీకరించారు కూడా. ఈ మొత్తం సంభాషణ ఏప్రిల్ 26-27న బయటపడిన ఆక్సిజన్ సంక్షోభం సమయంలో జరిగింది.
ఆగ్రాలోని పారస్ ఆస్పత్రిలో ఏప్రిల్ 26 ఉదయం 7 గంటలకు మాక్ డ్రిల్ జరిగింది. ఆ సమయంలో ఆస్పత్రిలో 96 కోవిడ్ రోగులు అడ్మిట్ అయ్యున్నారు. మాక్ డ్రిల్ తర్వాత వారిలో 74 మందే ప్రాణాలతో మిగిలారు.
ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అరింజయ్ జైన్‌కు సంబంధించి నాలుగు వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో ఆయన తమకు ఆక్సిజన్ సంక్షోభం ఎదురైన రోజు గురించి చెబుతున్నారు.
అయితే స్థానిక మీడియాతో మాట్లాడిన ఆస్పత్రి డైరెక్టర్ అరింజయ్ జైన్ ఆ వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో 66 రోజుల తర్వాత లక్ష కంటే దిగువకు కరోనా కేసులు
భారత్‌లో రోజువారీ నమోదయ్యే కొత్త కరోనా కేసుల సంఖ్య 66 రోజుల తర్వాత లక్ష కంటే తక్కువ నమోదయ్యాయి.
భారత్‌లో గత 24 గంటల్లో 86,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం 66 రోజుల తర్వాత ఇదే తొలిసారి. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ మొత్తం కేసుల సంఖ్య 2,89,96,473కు చేరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గత 24 గంటల్లో దేశంలో 2,123 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,51,309కు చేరింది.
దేశవ్యాప్తంగా కొత్తగా 1,82,282 మంది డిశ్చార్జ్ కావడంతో, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,73,41,462కు పెరిగింది.
ప్రస్తుతం దేశంలో 13,03,702 యాక్టివ్ కేసులు ఉన్నాయి.దేశంలో ఇప్పటివరకూ మొత్తం 23,61,98,726 టీకా డోసులు వేశారు.

ఫొటో సోర్స్, Reuters
ముస్లిం కుటుంబాన్ని వాహనంతో ఢీకొట్టిన యువకుడు.. నలుగురి మృతి
ఉద్దేశపూర్వకంగా, పక్కా ప్లాన్‌తో వాహనంతో ఢీకొట్టిన ఘటనలో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్లు కెనడా పోలీసులు తెలిపారు.
దాడిగా చెబుతున్న ఈ ఘటన ఆంటోరియో ప్రాంతంలోని సిటీ ఆఫ్ లండన్ దగ్గర జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనకు కారకుడిగా భావిస్తున్న కెనడాకు చెందిన 20 ఏళ్ల యువకుడిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
క్యూబెక్ సిటీ మసీదులో 2017లో జరిగిన దాడి తర్వాత కెనడా ముస్లింలపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదే. అప్పట్లో ఆరుగురు చనిపోయారు.
"ముస్లింలు కాబట్టే ఆ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు అనిపిస్తోంది" అని సోమవారం పోలీసు అధికారులు చెప్పారు.
నిందితుడిపై తీవ్రవాద సెక్షన్లు కూడా నమోదు చేయాలనుకుంటున్నామని, దీనిని 'హేట్ క్రైమ్'గా కూడా భావిస్తున్నామని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
చనిపోయింది ఎవరు?
మృతుల్లో 74, 44 ఏళ్ల ఇద్దరు మహిళలు, 46 ఏళ్ల ఒక పురుషుడు, 15 ఏళ్ల బాలిక ఉన్నారు. కుటుంబం కోరిక మేరకు అధికారులు వారి పేర్లు బయటపెట్టలేదు.
నిందితుడిని ఆంటోరియోలోని లండన్‌కు చెందిన నథాలియన్ వెల్ట్‌మన్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో అతడిని అరెస్ట్ చేశారు.
అయితే, ఈ యువకుడికి ఏదైనా హేట్ గ్రూప్‌తో సంబంధం ఉందా, లేదా అనేది ఇంకా తెలీలేదు.
నిందితుడికి, ముస్లిం కుటుంబానికి ఏవైనా పాత గొడవలు ఉన్నాయా అనేది కూడా తేలలేదని పోలీసులు తెలిపారు. యువకుడు బాడీ ఆర్మర్‌లా ఉన్న ఒక వెస్ట్ ధరించి ఉన్నాడని చెప్పారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8.40కి ఒక నల్ల ట్రక్ హైడ్ పార్క్ రోడ్‌లో ఫుట్‌పాత్ మీదకు వెళ్లడం కనిపిస్తోందని, అప్పుడు వాతావరణం బాగుందని, లైటింగ్ కూడా ఉందని అధికారులు చెప్పారు.
కెనడాలోని లండన్ నగరం టొరంటోకు నైరుతిగా 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2016 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ జనాభాలో చాలా వైవిధ్యం ఉంది.
ఇక్కడ ప్రతి ఐదుగురిలో ఒకరు కెనడా బయట నుంచి వచ్చినవారే. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న మైనారిటీలు అరబ్బులు. దక్షిణాసియా వాసుల సంఖ్య రెండో స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- MIS-C: కరోనా వల్ల పిల్లలకు వస్తున్న ఈ కొత్త వ్యాధి ఎంత ప్రమాదకరం
- ‘‘వైట్ ఫంగస్’’: ఔషధాలకు లొంగని ఈ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాపిస్తున్నాయి
- కోవిడ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత డయాబెటిస్ వస్తుందా
- కోవిడ్ సోకితే గర్భిణులు ఏం చేయాలి.. తల్లి నుంచి బిడ్డకు వస్తుందా..
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








