తెలంగాణ: తిండి పెట్టకుండా తల్లిదండ్రులను చంపేసి కరోనా మరణంగా చూపారన్న ఆరోపణలతో దంపతుల అరెస్ట్

రామచంద్రారెడ్డి, అనసూర్యమ్మ
    • రచయిత, శంకర్.వి
    • హోదా, బీబీసీ కోసం

తల్లిదండ్రులకు భోజనం పెట్టకుండా వారి మరణానికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణలో వారు తమ నేరం అంగీకరించారని పోలీసులు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం తుమ్మగూడెంలో జరిగిన ఈ ఘటన చర్చనీయమైంది.

కరోనాని కారణంగా చూపించి కన్నవారిని చంపడానికి కుట్ర పన్నారంటూ పోలీసుల విచారణలో వెల్లడికావడం కలకలం రేపింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించారు.. ఆ వివరాలు ఇవీ..

నాగేశ్వరరెడ్డి దంపతులను తరలిస్తున్న పోలీసులు
ఫొటో క్యాప్షన్, నాగేశ్వరరెడ్డి దంపతులను తరలిస్తున్న పోలీసులు

తుమ్మగూడెం గ్రామానికి చెందిన రామచంద్రా రెడ్డి, అనసూర్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

రామచంద్రారెడ్డి దంపతులు కష్టపడి ఆస్తులు సమకూర్చుకున్నారు. విలువైన భూములు 40 ఎకరాలు సంపాదించారు.

వయసు మీదపడడంతో ఇద్దరు కొడుకులకు సమానంగా వారి ఆస్తిని పంచారు. అయితే వృద్ధాప్యంలో వారి ఆలనాపాలనా చూడాల్సిన కొడుకులు చెరో రెండు నెలల పాటు వారి బాధ్యత తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు.

ఇటీవల చిన్నకొడుకు చనిపోవడంతో కోడలు ఆ బాధ్యత తీసుకున్నారు.

రామచంద్రారెడ్డి, అనసూర్యమ్మ
ఫొటో క్యాప్షన్, రామచంద్రారెడ్డి, అనసూర్యమ్మ

రామచంద్రారెడ్డికి 90, అనసూర్యమ్మకు 80 ఏళ్లు. వారిని చూడాల్సిన బాధ్యత తమకు వచ్చేసరికి పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి, అతని భార్య లక్ష్మి భారంగా భావించారు.

దాంతో రెండు నెలలకు ఒకసారి తమ వద్దకు వచ్చే తల్లిదండ్రులను ఇంట్లో కాకుండా సమీపంలో ఓ షెడ్ వేసి అందులో ఉంచారు.

అది ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉండడంతో ఎండ వేడికి ఆ వృద్ధులు తీవ్రంగా అవస్థలు పడేవారు. అయినా కొడుకు, కోడలు పట్టించుకోలేదని స్థానికులు పోలీసులకు వివరించారు.

సీఐ ఆంజనేయులు

తిండి లేక చనిపోయినట్లు తేలింది: సీఐ

అంతటితో సరిపెట్టకుండా వారిని ఆకలితో మాడ్చి చంపాలని పథకరచన చేసినట్టు తమ విచారణలో తేలిందని మునగాల సీఐ ఆంజనేయులు 'బీబీసీ'కి తెలిపారు.

''రామచంద్రారెడ్డి దంపతుల మృతికి తామే కారణమని కొడుకూ, కోడలు అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా వాస్తవాలు అంగీకరించారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. నిందితుడు నాగేశ్వర్ రెడ్డి, అతని భార్య లక్ష్మీ ఇద్దరూ వారి పెద్దల పట్ల నిర్లక్ష్యం చూపారు. నిరాదరణ ప్రదర్శించారు.

చివరకు వారికి పోషణ లేకుండా చేసి ప్రాణాలు పోయేందుకు కారకులయ్యారు. తినడానికి తిండి, మంచినీరు కూడా అందించకుండా మాడ్చేశారు.

వారు మరణించిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కరోనాతో చనిపోయారనే కారణం చూపించి పూడ్చేశారు.

మే 27న జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులకు అనుమానం రావడంతో గ్రామ పోలీస్ అధికారి ద్వారా మాకు ఫిర్యాదు చేశారు.

దాంతో మోతే పోలీస్ స్టేషన్ లో 98/2021 గా ఎఫ్ ఐ ఆర్ నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్ 304 క్రింద కేసునమోదు చేసి దర్యాప్తు చేశాం. ఖననం చేసిన శవాలను బయటకు తీసి పంచనామా, పోస్టుమార్టం కూడా నిర్వహించాం. ఆకలితో వారు మరణించినట్టు ఆధారాలు లభించాయి. దాంతో అనుమానితులు నేరం అంగీకరించారు'' అని సీఐ చెప్పారు.

వృద్ధుడు(ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

''ఆస్తులిచ్చినా ఆదరించకపోవడం అన్యాయమే''

రామచంద్రారెడ్డి దంపతులు ఎంతో ఆదర్శవంతంగా జీవించారని తుమ్మగూడెం వాసి పి.రవీంద్ర బీబీసీతో అన్నారు. వారు జీవితాంతం కష్టపడి ఆస్తులు కూడబెట్టి, కొడుకులిద్దరికీ సమానంగా అప్పగించినా ఆదరించకపోవడం అన్యాయమేనని ఆయన పేర్కొన్నారు.

ఊరిలో చాలామందికి వారు చేదోడుగా ఉండేవారు. అలాంటి వారికి ముసలితనంలో తిండి కూడా లేక చనిపోవడం అందరినీ బాధించింది. అందుకే వారి కష్టాలు చూడలేకపోయేవాళ్లం. చాలా సార్లు నాగేశ్వర్ రెడ్డికి చెప్పినా పట్టించుకోలేదు. అనుకోకుండా ఓరోజు చనిపోయారని చెప్పడంతో అందరికీ అనుమానం వచ్చింది. అదే విషయాన్ని పోలీసులకు చెప్పాం. విచారిస్తే విషయం తెలిసింది. కన్నకొడుకు, కోడలు కలిసి ఇలా కన్నవారిని చంపేయడం చూస్తుంటే ఎంత కిరాతకంగా వ్యవహరించారో అర్థమవుతోంది'' అన్నారాయన.

వృద్ధుడు

ఫొటో సోర్స్, Getty Images

‘ఇలాంటి ధోరణి సరికాదు’

వృద్ధాప్యంలో తల్లిదండ్రులు తమకు భారంగా భావించే లక్షణం ఇటీవల కాలంలో పెరుగుతోందని నల్గొండకు చెందిన సైకాలిజిస్ట్ ఎస్.కిషోర్ అభిప్రాయపడ్డారు. ఆయన బీబీసీతో మాట్లాడారు.

90, 80 ఏళ్ల వయసులో ముసలివాళ్లంటే ఎన్ని సమస్యలు ఉంటాయో అందరికీ తెలుసు. వారికి ఆసరాగా నిలవడం కన్నబిడ్డల బాధ్యత. అలాంటిది వారే భారం అనుకోవడం, దూరం పెట్టడం, చివరకు ఇలాంటి ఘటనల్లో చంపడానికి కూడా సిద్ధపడడం చాలా తీవ్రమయిన అంశాలు.

మానసికంగా చాలామంది వృద్ధులు తమకు భారమని భావించడం బాగా పెరిగింది. ఇలాంటి వారికి మానసిక వైద్యులతో చికిత్స చేయించాలి. పిల్లలకు తమ పెద్దవారిని బాధ్యతగా చూడాలనే అంశాన్ని అలవరచాల''ని చెప్పారాయన.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)