చిత్తూరు జిల్లా గనుల్లో ఎంత బంగారం ఉంది? ఎప్పుడు తవ్వబోతున్నారు?

బంగారం గనులు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా, వి. రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

కుప్పం వద్ద ఉన్న చిగురుకుంట-బిసానత్తం గనుల్లో మరో 5 ఏళ్లలో బంగారాన్ని తవ్వడం ప్రారంభిస్తామని నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ) తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ గనుల్లో తవ్వకాలు చేపట్టడం ద్వారా బంగారం ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ ప్రవేశిస్తోంది.

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ ప్రస్తుతం ఇనుము, వజ్రాలు వంటి వాటి తవ్వకాల్లో ఉంది.

బంగారం గనులు

కేజీఎఫ్‌లో నిల్వలు తరిగిపోవడంతో అన్వేషణ

1970లలో అంతర్జాతీయంగా దేశీయంగా బంగారానికి పెరిగిన డిమాండ్‌ దృష్ట్యా కొత్త నిక్షేపాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్వేషణ చేపట్టింది.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌(కేజీఎఫ్‌)లో బంగారం నిల్వలు వేగంగా తరుగుతూ రావడం కూడా ఇందుకు మరొక కారణం. దాంతో బంగారం అన్వేషణకు పంచవర్ష ప్రణాళిక(1980-85)ను ప్రభుత్వం ప్రకటించింది.

అలా చేపట్టిన అన్వేషణలో భాగంగా 1976లో తొలిసారి చిత్తూరులోని చిగురుకుంట వద్ద బంగారం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ప్రాథమిక అంచనాకు వచ్చింది.

చిగురుకుంటకు కోలార్‌కు మధ్య దూరం సుమారు 30 కిలోమీటర్లు.

3 కిలోమీటర్ల మేర పొడవు, ఒక కిలోమీటరు వెడల్పుతో విస్తరించి ఉన్న ఈ గనులను 5 బ్లాకులుగా విభజించారు.

1976-77 మధ్య చిగురుకుంటలో పరిశోధనలు చేసిన జీఎస్‌ఐ 7.56 లక్షల టన్నుల ముడి బంగారం ఉన్నట్లు గుర్తించింది.

జీఎస్‌ఐ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్) 1982లో చిగురుకుంటలో ప్రయోగాత్మకంగా తవ్వకాలు ప్రారంభించింది.

ప్రాథమికంగా జరిపిన తవ్వకాల్లో 10 లక్షల టన్నుల నిల్వలు ఉంటాయని ఎంఈసీఎల్ గుర్తించింది.

ఒన్నపనాయని కొత్తూరు, తలై అగ్రహారం, నారలపల్లి వంటి గ్రామాలు చిగురుకుంట గనుల ప్రభావం పరిధిలోకి వస్తాయి.

1981 జనాభా లెక్కల ప్రకారం నాడు ఆ గ్రామాల్లో 9 వేల మందికి పైగా జనాభా నివసించేవారు.

బంగారం గనులు

బిసానత్తం గనులు

చిత్తూరు జిల్లాలోని పాత బిసానత్తం గనులు కేజీఎఫ్ గనులకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.

1894-98 మధ్య బిసానత్తం గనుల్లో తవ్వకాలు జరిగాయని ఎంఈసీఎల్ నివేదికలు చెబుతున్నాయి. 1894 నుంచి 1902 వరకు మైసూరు రీఫ్స్ గోల్డ్ మైనింగ్ కంపెనీ బంగారం తవ్వకాలు చేపట్టింది.

1894-98 మధ్య పాత బిసానత్తం గనుల్లో 9,618 టన్నుల ఖనిజం నుంచి సుమారు 140 కేజీల బంగారాన్ని వెలికి తీశారు. 1902 తరువాత పాత బిసానత్తం గనులు చేతులు మారుతూ పోయాయి. 1958 తరువాత వాటిల్లో తవ్వకాల గురించిన సమాచారం ఎక్కడా రికార్డు కాలేదు.

1980లలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్(బీజీఎంఎల్), ఎంఈసీఎల్ ఈ గనుల మీద పరిశోధనలతో పాటు ప్రయోగాత్మక తవ్వకాలు చేపట్టాయి. ఆ తరువాత బంగారం వెలికి తీయడం ప్రారంభించాయి.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిగురుకుంట-బిసానత్తం గనుల నిర్వహణ బీజీఎంఎల్ చేతికి వెళ్లింది. 1990లలో మార్కెట్‌లో బంగారం ధర తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల 2001లో బీజీఎంఎల్ కార్యకలాపాలను కేంద్రం నిలిపి వేసింది. దాంతో చిగురుకుంట-బిసానత్తం గనులు మూతపడ్డాయి.

బంగారం గనులు

ఉపాధి, పరిహారం వంటి కారణాలతో బీజీఎంఎల్‌ కార్యకలాపాలను ఆపడాన్ని సవాలు చేస్తూ నాడు కార్మికులు కోర్టుకు వెళ్లారు. గనులను తిరిగి తెరచి బీజీఎంఎల్‌ కార్యకలాపాలను ప్రారంభిస్తామని 2006లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

ఈలోపు బీజీఎంఎల్‌కు ఉన్న చిగురుకుంట-బిసానత్తం గనుల లైసెన్సు గడువు 2008లో ముగిసింది.

బంగారం ధరలు పెరుగుతుండడంతో చిగురుకుంట బంగారం గనులను మళ్లీ ప్రారంభించాలని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ తరువాత జరిగిన బిడ్డింగ్ ప్రక్రియల్లో ఎన్‌ఎండీసీ టెండర్ దక్కించుకుంది.

‘‘నాడు గనులను మూసే సమయానికి మార్కెట్‌లో గ్రాము బంగారం ధర 400 రూపాయలుగా ఉంది. ఆ లెక్కన చూస్తే నాడు బంగారం వెలికితీయడం వల్ల నష్టం వచ్చేది. కానీ నేడు గ్రాము బంగారం మార్కెట్‌లో 5,000 రూపాయలకు పైనే ఉంది. కాబట్టి ఇప్పుడు వెలికి తీయడం ఆర్థికంగా లాభంగా ఉంటుంది’’ అని బీజీఎంఎల్‌లో చీఫ్ ఇంజినీరుగా పని చేసిన కె.ఎం దివాకరన్ గతంలో ది హిందూ పత్రికతో అన్నారు.

బంగారం గనులు

చిగురుకుంట వద్ద శుద్ధి ప్లాంట్

చిగురుకుంంటలో మరో అయిదేళ్లలో మైనింగ్ చేపడతామని ఎన్‌ఎండీసీ బీబీసీకి తెలిపింది.

‘‘2022 అక్టోబరులో లెటర్ ఆఫ్ ఇంటెంట్ మాకు వచ్చింది. ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్నిరకాల అనుమతులు తీసుకొని మూడేళ్లలో ప్రభుత్వంతో ఒప్పందాన్ని పూర్తి చేసుకుంటాం.

చిగురుకుంట-బిసానత్తం అనేది భూగర్భ గనిగా ఉంటుంది. ఇందులో 18.3 లక్షల టన్నుల బంగారం నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఇక్కడ టన్నుకు 5.15 గ్రాముల బంగారం దొరుకుతుంది. ఇక్కడ వెలికితీసిన ముడిబంగారాన్ని చిగురుకుంట వద్ద శుద్ధి చేస్తాం. అక్కడే బంగారం తయారవుతుంది.

తొలుత ప్రస్తుతం ఉన్న సొరంగాలు, దారులను ఉపయోగించుకుని ముడి బంగారాన్ని వెలికి తీస్తాం. ఒప్పందం పూర్తయిన రెండేళ్లలో బంగారాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాం. గనుల్లో ఉన్న నీటిని తొలగించడం, సొరంగాల లోపల వెలుతురు గాలి వచ్చేలా ఏర్పాట్లు చేయడం, యంత్రాలు సమకూర్చుకోవడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

ఈ గనుల నుంచి మొత్తం మీద సుమారు 7 టన్నుల బంగారాన్ని వెలికి తీయగలమని అంచనా వేస్తున్నాం. చిగురుకుంట-బిసానత్తం గనుల్లో తిరిగి తవ్వకాలు చేపట్టడం వల్ల స్థానికులకు ఉపాధి దొరికి, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది’’ అని బీబీసీకి ఎన్‌ఎండీసీ వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, Andhra Gold Mines: ఇక్కడ 18 లక్షల టన్నులకు పైగా ముడి బంగారు నిల్వలు ఉన్నాయని NMDC అంచనా

ప్రస్తుతం ఎన్‌ఎండీసీ రూ.450 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.

చిగురుకుంట గనుల దగ్గర ఉన్న 650 ఎకరాల భూములను ఎన్ఎండీసీకి కేటాయించామని పలమనేరు మైన్స్ ఏడీ వేణుగోపాల్ బీబీసీతో చెప్పారు.

‘‘చిగురుగుంట, బిసానత్తం పరిధిలోని 650 ఎకరాలను గోల్డ్ మైనింగ్ కోసం కేటాయించాం. బీజీఎంఎల్‌కు కేటాయించిన భూముల్లోనే ఎన్ఎండీసీ తవ్వకాలు కొనసాగిస్తుంది. అటవీ, పర్యావరణ అనుమతులు, ఎన్ఓసీ అన్ని సమర్పించిన తర్వాత వారికి లీజు గ్రాంట్ అవుతుంది. దీనికి ఎల్ఓఈ(లెటర్ ఆఫ్ ఇండెంట్) 2022లో జారీ చేశారు’’ అని వేణుగోపాల్ తెలిపారు.

బంగారం గనులు
ఫొటో క్యాప్షన్, చిగురుకుంట గని కోసం భూములు ఇచ్చిన ఓఎన్ కొత్తూరుకు చెందిన మునిస్వామి అదే గనిలో దినసరి కూలీ అయ్యారు.

కుప్పం బంగారు గనుల్లో తవ్వకాలు జరగాలంటే...

కుప్పం బంగారం గనుల్లో మళ్లీ తవ్వకాలు జరగాలంటే ఆ ప్రాంతంలో ఉన్న 8 సొరంగ మార్గాల్లో పనిచేయగలిగిన టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది భారీగా అవసరం అవుతారు. ఆ లెక్కన సుమారు 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. గనుల చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాలున్నాయి.

“ఇప్పటికే కుప్పం నియోజక వర్గం నుంచి పది వేల మంది యువకులు ఉపాధి కోసం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. గనులు ప్రారంభమైతే మాలాంటి వారికి స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. అంతే కాకుండా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కుప్పంకు రాష్ట్రంలో ఒక గుర్తింపు వస్తుంది’’ అని తంగనపల్లికి చెందిన రాజేంద్రప్రసాద్ బీబీసీతో చెప్పారు.

మళ్లీ తవ్వకాలు ప్రారంభమైతే గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరుగుతుందని సంగనపల్లి సర్పంచ్ అమర్‌నాథ్ అన్నారు.

“సంగనపల్లి, ఓఎన్‌ కొత్తూరు పంచాయతీలకు సెస్సుల రూపంలో రాబడి పెరిగే అవకాశం ఉంది. సుమారు 20 సంవత్సరాల తరువాత ఈ గనులకు మోక్షం లభించడం సంతోషం కలిగిస్తోంది” అని ఆయన తెలిపారు.

బంగారం గనులు

పరిహారం కోసం న్యాయపోరాటం

చిగురుగుంట బంగారు గనులను మూతవేసిన సమయానికి కేజీఎఫ్‌తో కలిపి మొత్తం 4,600 మంది ఉద్యోగులు గనుల్లో పనిచేసేవారని గని కార్మికుల సంఘం చెబుతోంది.

ఆ సమయంలో గనుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 1,500 మంది స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారని, గనులు మూసివేత సమయానికి మరో 3,100 మంది వాటిలోనే పనిచేస్తున్నారని భారత్ గోల్డ్ మైన్స్ ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ రామకృష్ణప్ప బీబీసీతో చెప్పారు.

గనులు మూసివేయడంతో ఆ కార్మికులందరూ రోడ్డున పడ్డారని, వారికి ఇవ్వాల్సిన 50 శాతం పరిహారం ఇంకా అందలేదని, దీనిపై కోర్టులో న్యాయపోరాటం కూడా చేస్తున్నామని ఆయన వివరించారు.

బంగారం గనులు
ఫొటో క్యాప్షన్, రాజప్ప, ఓఎన్ కొత్తూరు

‘‘వెయ్యి మంది ఉంటే కంపెనీని కొనసాగిస్తామని చెప్పారు. మీరు ఎవరు వెళ్తారో నిర్ణయించుకోండి అన్నారు. దాంతో 3,100 మంది సంస్థలోనే కొనసాగారు. 2001లో గనులు మూసివేస్తే, 2007లో పరిహారం ఇచ్చారు.

స్పెషల్ టర్మినల్ హెవీ ఇండస్ట్రీస్(ఎస్టీబీపీ) గుజరాత్ ప్యాకేజీ స్కీం అని ఒకటి తీసుకొచ్చారు. దాని కింద చేసిన సర్వీస్‌కు ఏడాదికి 35 రోజుల చొప్పున, మిగతా సర్వీసుకు ఏడాదికి 25 రోజుల చొప్పున వేతనం ఇచ్చారు. అది కూడా 50 శాతమే ఇచ్చారు. అలా పదేళ్ల సర్వీసుకు లక్షా 80 వేల రూపాయలు వచ్చాయి.

ఆ సమయంలో నెలకు రూ.4,300 జీతం వచ్చేది. మిగిలిన 50 శాతాన్ని ప్రాపర్టీ సేల్ చేసి ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు సెటిల్ చేయలేదు. కోర్టుకు వెళ్ళాం. ఈ ఏడాది జులై 12న బెంగళూరు హైకోర్టులో కేసు వాయిదా ఉంది. 50 ఏళ్లు పూర్తి అయిన వాళ్ళకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.

బంగారం గనులు
ఫొటో క్యాప్షన్, మునిస్వామి, ఓఎన్ కొత్తూరు

గనుల్లో 20 ఏళ్లు పనిచేసిన ఓఎన్ కొత్తుకూరుకు చెందిన రాజప్ప తవ్వకాలు మళ్లీ ప్రారంభమైతే తన పిల్లలకైనా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్నారు. తమకు న్యాయంగా అందాల్సిన పరిహారం కూడా దక్కాలని కోరుతున్నారు.

“చిగురుగుంటలో పర్మినెంట్ కాక ముందు అయిదు సంవత్సరాలు చేశాను. పర్మినెంట్ అయినాక 15 సంవత్సరాలు చేశాను. లాస్ట్‌లో నిలిపేసినారు. మాకు నష్ట పరిహారం ఇవ్వకుండా అట్లే పెండింగ్‌లో పెట్టారు. అది తేలుతుందో లేదో అని మేం ఎదురు చూస్తున్నాం. నాకు 63 సంవత్సరాలు వచ్చాయి. గనులు మళ్లీ ప్రారంభమైన తరువాత నాకు పని ఇస్తే చేస్తాను. నాకు వయసు అయిపోయింది అంటే మా పిల్లలకు ఇస్తే వాళ్లు చేస్తారు. అప్పుడు నా జీతం రూ.4,500. మూతపడ్డాక నష్టపరిహారం కింద రెండు లక్షలు ఇచ్చారు. పూర్తిగా పరిహారం చెల్లించాలని 23 ఏళ్ల నుంచి అడుగుతుంటే ఈ రోజు రేపు అని కోర్టులో పెండింగులో పెట్టారు” అని రాజప్ప అన్నారు.

గనుల్లో పనులు కొనసాగిన సమయంలో మూడు షిఫ్టుల్లో తవ్వకాలు జరిగేవని ఆయన తెలిపారు. డ్రిల్ చేయడం, మట్టి తీయడం, ఇతర పనులు చేసేవాడినని ఆయన చెప్పారు.

భూమిలో 400 అడుగుల లోపల పని చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పిన రాజప్ప, మిషన్‌తో లోపల డ్రిల్ చేసి, బ్లాస్ట్ చేసి అక్కడి నుంచి ముడి ఖనిజాన్ని పెట్టెలో పైకి పంపించేవాళ్లమన్నారు.

ఒకసారి భూగర్భంలో ఆక్సిజన్ అందక తాను కళ్లు తిరిగి పడిపోయానని రాజప్ప చెప్పారు.

“లోపల 8 అడుగులు వెడల్పు 8 అడుగుల హైట్ బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్తాం. బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఉడుకు ఉంటాది. వాతావరణం అయితే లోపల బాగుండదు. 400 అడుగుల లోపల, గాలి పోకుండా ఉండే జాగాలో పెద్ద ఇబ్బంది వస్తుంది. అది వదిలిపెట్టి వచ్చేదానికి అయ్యేది లేదు. నేను కూడా ఒకసారి కళ్లు తిరిగి కింద పడిపోయాను. అక్కడి నుంచి ఎత్తుకొని బయటికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆస్పత్రికి పంపించారు. అలాంటి పనులన్నీ 15 సంవత్సరాలు చేశాను” అని ఆయన గుర్తు చేసుకున్నారు.

బంగారం గనులు
ఫొటో క్యాప్షన్, మునుస్వామి

భూములు ఇచ్చి గనుల్లో దినసరి కూలీ అయ్యారు

ఇదే చిగురుకుంట గని కోసం తమ భూములు కూడా ఇచ్చిన ఓఎన్ కొత్తూరుకు చెందిన మునిస్వామి అదే గనిలో దినసరి కూలీగా పనిచేశారు.

మూత పడక ముందు మూడు నెలలపాటు వెయ్యి రూపాయల జీతానికి పనిచేసిన ఆయనకు అనారోగ్యంతో ఒక కాలు కూడా తొలగించారు. గనులు ప్రారంభమై తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆయన ఆశపడుతున్నారు.

“గనుల కోసం మా భూములు కూడా ఇచ్చాం. దానికి నష్టపరిహారం కూడా ఇచ్చారు. కాంట్రాక్ట్ కింద పనిచేశాను. 1981 లో మమ్మల్ని అపాయింట్ చేసుకున్నారు. 2001లో ఆపేశారు. రూ. 36,000 ఇచ్చారు. అప్పుడు డ్యూటీ ఎంత చేసుంటే అలా ఇచ్చారు. రోజుకు పది రూపాయల 50 పైసలు ఇచ్చేవాళ్ళు.

మూయక ముందు మూడు నెలలకు ముందు నాకు నెల జీతం వెయ్యి చేశారు. తర్వాత మూడు నెలలకే మైన్స్ క్లోజ్ అయ్యాయి. దాంతో అరియర్స్ అన్ని కలిపి ఒకేసారి రూ.36 వేలు కట్టిచ్చారు. అక్కడ జనరేటర్ ఆపరేటర్‌గా పని చేశాను. డ్యూటీలు మార్చి మార్చి ఇచ్చేవాళ్ళు. నేను ఇప్పుడు వికలాంగున్ని అయిపోయాను. ఉద్యోగం ఇస్తే మా పిల్లలకు ఇవ్వాలని కోరుకుంటున్నా’’అని మునిస్వామి చెప్పారు.

బంగారం గనులు
ఫొటో క్యాప్షన్, వెంకటేష్, శ్రీనివాసపురం

‘సెటిల్మెంట్ చేయకుండా తవ్వకాలా?’

అన్ని గనుల్లో పనిచేసే కార్మికులు హెల్మెట్లకు భూగర్భంలోని చీకట్లో బాగా కనిపించేలా లైట్లు ఉంటాయి. వాటి బ్యాటరీలు నడుము దగ్గర బెల్టుకు ఉంటాయి.

చిగురుకుంట గనుల్లో పనిచేసే కార్మికులు కూడా అలాంటి లైట్లు ఉపయోగించేవారు. శ్రీనివాసపురానికి చెందిన వెంకటేష్ అప్పట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ కార్మికుల హెల్మెట్ లైట్ల బ్యాటరీలు ఫుల్ చార్జింగ్ ఉండేలా చూసుకునేవారు.

ఈ గనులను మళ్లీ ప్రారంభించే ముందు, వాటినే నమ్ముకుని జీవించి, అవి మూతపడడంతో రోడ్డున పడ్డ తమకు మొదట న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు.

“బ్యాటరీ ఎనిమిది గంటలు గ్యారంటీగా మండుతుంది. నడుములో బ్యాటరీ బెల్ట్ కి వేసుకుంటారు. టోపీ ఉంటుంది టోపీలో లైట్ పెడతాము. ఎటు చూసినా కనిపించే విధంగా పగలు ఎట్లా ఉంటుందో బయట లోపల అట్లా కనిపించే విధంగా పెట్టి పంపిస్తాం. నాకు రూ.4,000 జీతం వచ్చేది. మొదట రూ.7తో దినసరి కూలీగా ప్రారంభించాను.

పోను పోనూ పెంచారు. అట్లే చేస్తా ఉంటే పర్మనెంట్ చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారికి రూ. 5-6 లక్షలు నష్ట పరిహారం ఇచ్చారు. నేను ఇవ్వలేదు. కేసు ఇంకా కోర్టులో ఉంది. మాకు సెటిల్మెంట్ చేయకుండా వాళ్లు ఎలా తవ్వకాలు జరుపుతారు? 20 ఏళ్ల నుంచి కోర్టు కేసులో ఉంది. ఇంకా ఏ తీర్పూ రాలేదు. 12 ఏళ్లు పనిచేసిన నన్ను వాళ్లే ఆపేశారు. మేం నిలవలేదు” అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)