ట్విటర్ Vs. థ్రెడ్స్: ఎలాన్ మస్క్ ట్రిక్స్ ఎందుకు పారడం లేదు... మెటా యజమాని జుకర్‌బర్గ్ కొత్త యాప్‌తో పోటీ ఎలా ఉండబోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్ యూజర్లు రోజులో చదివే ట్వీట్లపై ఎలన్ మస్క్ పరిమితులు విధించారు.
అన్‌వెరిఫైడ్ యూజర్లు రోజులో వెయ్యి ట్వీట్లను, వెరిఫైడ్ యూజర్లు రోజుకి 10 వేల ట్వీట్లను చదువుకోవచ్చని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.
శనివారం ఎలాన్ మస్క్ ఈ ప్రకటన చేసిన తర్వాత ఈ సోషల్ నెట్‌వర్క్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోజువారీ తమకు కేటాయించిన ట్వీట్ల పరిమితి మించిపోయినట్లు తెలుపుతూ సోషల్ మీడియా యూజర్లు తమ స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తున్నారు.
యూజర్ యాక్టివిటీపై పరిమితి విధిస్తూ.. మస్క్ అర్థం కాని పనులు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం అడ్వర్‌టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు చిరాకు తెప్పిస్తోంది.
ఏఐ కంపెనీలతో మస్క్ ఆడుతున్న అతిపెద్ద గేమ్‌లో ఇదొక భాగం.
ట్విటర్‌కి అసలు డబ్బులు ఎలా వస్తాయో మనం ఒకసారి చూద్దాం..
మెటా, గూగుల్ సంస్థల మాదిరిగానే ట్విటర్‌కు కూడా పెద్ద మొత్తంలో రెవెన్యూలు వ్యాపార ప్రకటనల ద్వారానే వస్తాయి.
యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లినప్పుడు, వారికి వ్యాపార ప్రకటనలు కూడా కనిపిస్తుంటాయి.
ఎంత ఎక్కువ సేపు వారు ట్విటర్‌పై గడిపితే, అన్ని ఎక్కువ వ్యాపార ప్రకటనలను వారు చూస్తారు.
ఇది చాలా సులభం. ఇదే వ్యాపారం.
అయితే, ఎలాన్ మస్క్ సంప్రదాయబద్ధంగా కూడా వ్యాపార ప్రకటనలను కొట్టిపారేస్తూ వస్తున్నారు. టెస్లా వ్యాపార ప్రకటనలు చేయదని అంటున్నారు.
‘‘ఐ హేట్ అడ్వర్‌టైజింగ్ (వ్యాపార ప్రకటనలను నేను ద్వేషిస్తాను)’ అని 2019లో ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు మొత్తం వ్యాపార ప్రకటనలపైనే ఆధారపడిన కంపెనీని ప్రస్తుతం మస్క్ కొనుగోలు చేశారు.
ముందు నుంచి వ్యాపార ప్రకటనలను ఇష్టపడని ఆయన, ఈ కారణంతో ట్విటర్ కోసం వివిధ రకాల ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఇది కేవలం వ్యాపార నిర్ణయంగానే ఆయన చూడటం లేదు.
మోడరేషన్ విషయానికి వచ్చినప్పుడు సోషల్ మీడియా కంపెనీలపై అడ్వర్‌టైజర్లు అత్యధిక ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారని కూడా మస్క్ భావిస్తున్నారు.
అడ్వర్‌టైజర్లు ప్రస్తుతం తమ నగదును ట్విటర్ నుంచి వెనక్కి తీసుకుంటున్నారు.
జాత్యంహకారానికి లేదా తీవ్రవాద కంటెంట్‌కు పక్కన తమ యాడ్స్‌ను ప్రచురించాలని ప్రకటనదారులు కోరుకోవడం లేదు.
ఈ ప్లాట్‌ఫామ్‌పై వాక్ స్వాతంత్య్రానికి ఏ స్థాయిలో అనుమతిస్తున్నారనే దానిపై కూడా ట్విటర్ ప్రధాన ఆదాయ మార్గం ప్రభావితమవుతుంది.
అయితే, ట్విటర్‌ను తాను టేకోవర్ చేసిన తొలినాళ్లలో తమ ప్లాట్‌ఫామ్‌పై వ్యాపార ప్రకటనలు ఇచ్చేందుకు మొగ్గు చూపని చాలా మంది ప్రకటనదారులు తిరిగి వెనక్కి వచ్చినట్లు ఏప్రిల్‌లో మస్క్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ట్విటర్‌ను లాభాల బాట పట్టించేందుకు మస్క్ వద్ద మరో ప్లాన్ ఉంది.
ట్విటర్ వద్ద పెద్ద మొత్తంలో ఉన్న డేటాను వాడుకుని డబ్బులు సంపాదించాలని ఎలన్ మస్క్ కోరుకుంటున్నారు.
ట్విటర్, రెడిట్ వంటి ప్లాట్‌ఫామ్‌ల వద్ద ప్రజలు సంభాషించుకున్న వందల వేలాది కొద్ది సమాచారం ఉంది.
ఏఐ కంపెనీకి ఇది ఒక అద్భుతమైన వనరు.
లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎంలు) ఈ సంభాషణల నుంచి మరింత నేర్చుకోగలవు. మనుషుల మాదిరి సందర్భానికి తగ్గట్లు ఎలా స్పందించాలో తెలుసుకోగలవు.
కానీ, ట్విటర్, రెడిట్ లాంటి ప్లాట్‌ఫామ్‌లు తమ డేటాను ఈ విధంగా వాడుకునేందుకు చెల్లింపుల వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నాయి.
ప్రస్తుతం ఏఐ కంపెనీలు చేస్తున్న దానిపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏప్రిల్ నెలలో రెడిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ హఫ్‌మ్యాన్ తెలిపారు.
రెడిట్ వద్దనున్న డేటా చాలా విలువైనదన్నారు. కానీ, ఈ విలువైన డేటాను ప్రపంచంలోని కొన్ని పెద్ద కంపెనీలకు ఉచితంగా ఇవ్వాల్సినవసరం లేదన్నారు.
అదే సమయంలో, మైక్రోసాఫ్ట్ మోసం చేసి ట్విటర్ డేటాను తీసుకుంటుందని, దాన్ని డిమానిటైజ్ చేసి(ప్రకటనలను తొలగించి), తమ డేటాను ఇతరులకు అమ్ముకుంటుందని ఎలన్ మస్క్ చెప్పారు.
దీనిపై ఎలన్ మస్క్ ఎంత విసుగెత్తిపోయారో శనివారం ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల స్పష్టమైంది.
‘‘ప్రస్తుతం ప్రతి కంపెనీ ఏఐ చేస్తోంది. స్టార్టప్‌ల నుంచి పెద్ద పెద్ద కార్పొరేషన్ల వరకు పెద్ద మొత్తంలో డేటాను స్క్రాప్ చేస్తున్నాయి.’’ అని మస్క్ చెప్పారు.
ప్రస్తుతం ట్విటర్ వాడకంపై పరిమితి తీసుకురావడంతో, ఎలన్ మస్క్ తమ డేటాను ఎల్ఎల్ఎంల్లోకి వెళ్లకుండా నిరోధించగలుగుతామని ఆశిస్తున్నారు.
ఏఐ కంపెనీలతో చర్చలు జరిపి, వారు వాడుకునే డేటాకు చెల్లింపుల వ్యవస్థ తీసుకురావాలని చూస్తున్నారు.
బ్లూ టిక్ పనిచేయలేదా?
ప్రకటన ఆదాయలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు చూస్తోన్న మస్క్, పలు ఆదాయ మార్గాలను ప్రయత్నిస్తున్నారు. దానిలో ఇదొకటి.
ట్విటర్ వాడుకునేందుకు ప్రజలు చెల్లింపులు చేసేలా బ్లూ టిక్‌ను మస్క్ తీసుకువచ్చారు.
దీనిపై ప్రజల్లో నిరాసక్తత వ్యక్తమైంది.
ట్విటర్ పెయిడ్ బ్లూ టిక్ వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మస్క్ ఎన్నో నెలలుగా ప్రయత్నిస్తున్నారు.
బ్లూటిక్ మెంబర్లకి వెరిఫైడ్ టాగ్ ఇస్తాం, లేని వారికి వెరిఫికేషన్ తీసేస్తామనే పాలసీ కూడా వర్కవుట్ కావడం లేదు.
ప్రజలు ట్విటర్ బ్లూ కోసం చెల్లింపులు చేయడం లేదు.
దీంతో ప్రజలు తమ వాలెట్ల నుంచి డబ్బులు బయటక తీసేలా మరో మార్గాన్ని మస్క్ అన్వేషిస్తున్నారు.
భవిష్యత్‌లో యూజర్లు అపరిమిత ట్వీట్లకు యాక్సెస్ పొందాలంటే నెలవారీ ఫీజులు చెల్లించాల్సిందేనా?
అవును, ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఆలోచన ఇదే. అయితే, యూజర్లకు ట్వీట్లను పరిమితం చేయడం ప్రకటనదారులకు మంచిది కాదని తెలుస్తోంది.
ఈ పరిమితి అటు యూజర్లకు, ఇటు ప్రకటనదారులకు ఇద్దరికీ ఇబ్బందికరంగా మారిందని, ట్విటర్‌లో ఇప్పటికే దీనిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఫారెస్టర్ రీసెర్చ్ డైరెక్టర్ మైక్ ప్రోల్క్స్ చెప్పారు.
ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విటర్ సీఈవోగా లిండా యక్కరినోను నియమించారు. ఆమె అంతకుముందు అడ్వర్‌టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.
ట్విటర్ మరింత మనీని ఎలా సంపాదించవచ్చో పలు ఐడియాలను ఆమె ఇస్తున్నారు. దీనిలో ఫుల్ స్క్రీన్ వీడియో యాడ్‌లతో పాటు యాప్‌ను వాడేలా మరింత మంది సెలబ్రిటీలను ఒప్పిస్తున్నారు.
ప్రస్తుతం ట్వీట్లపై పరిమితం తీసుకురావడంతో ఆమె ఉద్యోగం మరింత క్లిష్టతరంగా మారింది.
ట్విటర్‌పై డబ్బులు వెచ్చించేందుకు ప్రకటనదారులు అంత ఎక్కువ ఆసక్తి చూపరని కొందరంటున్నారు.

ఫొటో సోర్స్, META
ట్విటర్‌కు పోటీగా మెటా కొత్త యాప్
ట్విటర్‌కు పోటీగా ఫేస్‌బుక్ యజమాన్య సంస్థ మెటా సరికొత్త యాప్‌ను లాంచ్ చేయబోతుంది. గురువారం నుంచి దీన్ని లైవ్‌లోకి తీసుకొస్తున్నట్లు మెటా తెలిపింది.
ఈ యాప్‌కి థ్రెడ్స్ (Threads) అని పేరు పెట్టింది. ఆపిల్ యాప్ స్టోర్‌పై ఇది ప్రీఆర్డర్‌కి అందుబాటులో ఉంది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌కి అనుసంధానం చేయనున్నారు.
ఈ యాప్ డ్యాష్‌బోర్డు అచ్చం ట్విటర్‌ను పోలి ఉన్నట్లు స్క్రీన్‌షాట్ల ద్వారా తెలుస్తుంది.
‘‘టెక్ట్స్ బేస్డ్ కన్వర్జేషన్ యాప్’’ అని దీన్ని మెటా అభివర్ణిస్తోంది.
దీంతో ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్‌కి, మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్‌కి మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది.
గత నెలలో ఈ ఇద్దరూ నిజంగా కేజ్ పోటీ సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఎంత సీరియస్‌గా వారు తలపడనున్నారన్నది ముందు ముందు తెలుస్తుంది.
మెటా థ్రెడ్స్ యాప్ పూర్తిగా ఉచితంగా లభించనుంది. ఒక యూజర్ ఎన్ని పోస్ట్‌లను చూడాలనే దానిపై ఎలాంటి ఆంక్షలు లేవు.
‘‘నేడు ఏం జరుగుతుంది అన్న దగ్గర్నుంచి రేపటి ట్రెండ్ ఏంటి అన్న దాని వరకు ప్రతి అంశంపై కమ్యూనిటీలు ముందుకు వచ్చి చర్చించుకునేందుకు థ్రెడ్స్’’ అని యాప్ స్టోర్ వివరాల్లో మెటా తెలిపింది.
మెటా యాప్ మాదిరిగా, థ్రెడ్స్ కూడా మీ లొకేషన్ డేటాను, కొనుగోళ్లను, బ్రౌజింగ్ హిస్టరీని సేకరించనుంది.
ఇటీవల కాలంలో ట్విటర్‌కు పోటీగా దానిలో డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్, మాస్టోడాన్ వంటి పలు యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి.
ఎలన్ మస్క్ ట్వీట్ల వాడకంపై పరిమితి విధించిన తర్వాత తమ ప్లాట్‌ఫామ్‌పై ట్రాఫిక్ రికార్డు స్థాయిలో నమోదవుతుందని బ్లూస్కై తెలిపింది.
ట్విటర్‌కు ఇప్పటి వరకు మెటా తీసుకువచ్చే థ్రెడ్స్‌నే అతిపెద్ద ప్రమాదం కానుంది.
ఇతర కంపెనీల ఆలోచలనలను పొంది, వాటిని మార్కెట్లో విజయవంతం చేసిన చరిత్ర మార్క్ జుకర్ బర్గ్‌కి ఉంది.
టిక్‌టాక్ కాపీగా వచ్చిన మెటా రీల్స్, స్నాప్‌చాట్‌ను పోలి ఉన్న స్టోరీస్ కూడా అలాంటివే.
ట్విటర్‌తో పోటీ పడేందుకు మెటా వద్ద వనరులున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో ఒక భాగంగా థ్రెడ్స్ వస్తుంది. దీంతో లక్షలాది అకౌంట్లతో ఇది అనుసంధానం కానుంది.
ఇవి కూడా చూడండి:
- హిట్లర్ నరమేధం నుంచి తప్పించుకున్న ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? 84 ఏళ్ల తర్వాత వీడిన ఫోటో మిస్టరీ
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
- (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















