ట్విటర్‌‌కు రూ.50 లక్షల జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు, ఈ తీర్పు వాక్‌ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తుందా?

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో ట్విటర్‌కు 2.4 కోట్లకు పైగా యూజర్లు ఉన్నట్లు అంచనా
    • రచయిత, ఉమాంగ్ పొద్దర్
    • హోదా, బీబీసీ న్యూస్

కొన్ని అకౌంట్లను, ట్వీట్లను బ్లాక్ చేయాలనే ఆదేశాలను సవాలు చేస్తూ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్, కేంద్రంపై 2022 జూలైలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కంటెంట్ తొలగింపు ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒక సోషల్ మీడియా కంపెనీ వేసిన తొలి దావా ఇదే.

భారత దేశంలో వాక్‌స్వాతంత్రానికి సంబంధించి ఈ పిటిషన్ చాలా కీలకమైనదంటూ అనేకమంది నిపుణులు అభిప్రాయపడ్డారు.

అయితే, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ట్విటర్ సంస్థ వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు, ట్విటర్ పిటిషన్‌ను తోసి పుచ్చింది. ఏడాది కాలంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు రూ. రూ.50 లక్షల జరిమానాను విధించింది.

ట్విటర్‌కు భారత్‌లో సుమారు 2.4 కోట్ల మంది యూజర్లున్నారు.

కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఈ తీర్పు పట్ల డిజిటల్ హక్కుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘విధానపరమైన భద్రతలను పట్టించుకోని అకౌంట్లను బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు ఈ తీర్పు రాజ్యానికి అపరిమితమైన అధికారాన్ని ఇచ్చింది’’ అని డిజిటల్ హక్కుల సంస్థ ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ అధికార ప్రతినిధి, న్యాయవాది రాధికా రాయ్ అన్నారు.

ప్రధానమంత్రి మోదీతో ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవలే ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

ఈ తీర్పుపై ట్విటర్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై కామెంటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు ఈ సోషల్ మీడియా దిగ్గజం కట్టుబడి ఉంటుందా? లేదా ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తారా? అన్నది చర్చనీయాంశమైంది.

అయితే, ఈ కేసును ట్విటర్‌కు అంతకుముందున్న యాజమాన్యం దాఖలు చేసింది.

ప్రస్తుతం ట్విటర్ ఎలన్ మస్క్‌ చేతిలోకి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కంటెంట్ తొలగింపు ఆదేశాలకు కంపెనీ కట్టుబడి ఉంటోంది.

అమెరికాలో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన ట్విటర్ కొత్త యజమాని ఎలన్‌ మస్క్, స్థానిక ప్రభుత్వ చట్టాలకు కట్టుబడి ఉండటం లేదా మూసేసే ప్రమాదాలను ఎదుర్కోవడం తప్ప కంపెనీకి వేరే మార్గం లేదని అన్నారు.

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ను పెంచుతుందనే ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వాక్ స్వాతంత్రం ఉండాలని వాదించే వారిలో ఆందోళనలను రేకెత్తిస్తోంది.

అన్ని విదేశీ ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లు భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

2014లో ఎనిమిది ట్విటర్ యూఆర్ఎల్స్‌ను మాత్రమే భారత్ బ్లాక్ చేయగా.. 2022లో ఏకంగా 3,417 ట్విటర్ యూఆర్‌ఎల్స్‌ను బ్లాక్ చేసింది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

అసలు కేసేంటి?

చట్టానికి వ్యతిరేకంగా ఉన్న అకౌంట్ల, ట్వీట్ల యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 39 ఆర్డర్లపై ట్విటర్ కేసు దాఖలు చేసింది.

దేశ భద్రతకు, ప్రజల శాంతి భద్రతకు విఘాతం కల్గించే ఆన్‌లైన్ కంటెంట్‌ను నిరోధించేలా కేంద్ర ప్రభుత్వానికి భారత సమాచార, సాంకేతిక చట్టం అనుమతి కల్పిస్తోంది.

అయితే, అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ట్విటర్ తన పిటిషన్‌లో పేర్కొంది.

కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలు హేతుబద్ధంగా లేవని, కంటెంట్‌ను ఎందుకు తొలగించాలో తెలిపే కారణాలను కూడా కేంద్రం రూపొందించలేదని ట్విటర్ తెలిపింది.

ప్రభుత్వం బ్లాక్ చేయాలని చెప్పిన అకౌంట్ల, ట్వీట్ల యూజర్లకు ఈ విషయాన్ని చెప్పలేదని పిటిషన్‌లో పేర్కొంది.

అయితే, తాము జారీ చేసిన ఈ ఆదేశాలు చట్టపరంగానే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.

భారత వ్యతిరేకవాదులు అభ్యంతరకర, వివాదాస్పదమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ వారిపై చర్యలు తీసుకుంటామనే విషయం వారికి తెలియకపోతే, వారు అలానే ట్వీట్లను చేస్తూ దేశానికి మరింత ప్రమాదాన్ని కల్గిస్తారని చెప్పింది.

అయితే, ఈ ఆదేశాల గురించి కేవలం ట్విటర్‌కు మాత్రమే తెలపడం సరైన చర్యేనని ప్రభుత్వం చెప్పింది.

చట్ట ప్రకారం ఈ ఉత్తర్వులు గోప్యంగా ఉండటం అవసరమైనందున ఏ ఖాతాలు, ట్వీట్లను సవాలు చేశారో స్పష్టంగా తెలియలేదు.

అయితే, తీర్పులో చెప్పిన ఒక ఉదాహరణను తీసుకుంటే.. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2021లో రైతులు చేపట్టిన ఆందోళనలకు సంబంధించిన ట్వీట్లను కనీసం ఒక అకౌంట్ అయినా పోస్ట్ చేసిందని వెల్లడించింది.

రైతుల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రైతుల నిరసనలకు చెందిన పలు అకౌంట్లను బ్లాక్ చేసిన ట్విటర్

‘భారత వ్యతిరేక ప్రచారకర్తలు’

కేవలం ట్వీట్లను మాత్రమే కాకుండా, పూర్తిగా అకౌంట్లను సైతం బ్లాక్ చేయమని చెప్పే అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రస్తుతం కోర్టు తెలిపింది.

ఎప్పుడైనా ప్రభుత్వం కంటెంట్‌ను బ్లాక్ చేయమని ఆదేశిస్తే, ఆ యూజర్‌కి తెలియజేయాల్సినవసరం కూడా లేదని చెప్పింది.

చట్టం కింద సమాచారాన్ని నిర్వహించే కంపెనీ లేదా యూజర్‌కి నోటీసు ఇస్తారు. బ్లాకింగ్ ఆదేశాలను అమల్లోకి తేవడాని కంటే ముందే కోర్టులో తమ వాదనలను వినిపించుకునే అవకాశం ఇస్తారు.

ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో, ప్రభుత్వం వెంటనే వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయమని చెప్పొచ్చు. ఆ తర్వాత నోటీసులు జారీ చేస్తారు.

ఎందుకు వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాల్సి వచ్చిందో తెలుపుతూ వివరాలను కూడా తమ ఆదేశాల్లో ప్రభుత్వం చెబుతుంది. అయితే, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో ఇది లేదని ట్విటర్ అంటోంది.

వివాదాస్పద ట్వీట్లను, అకౌంట్లను కోర్టు పరిశీలించింది.

జాతి భద్రతకు, ప్రజల స్వేచ్ఛకు, రక్షణకు, శాంతి భద్రతకు విఘాతం కలిగించే యాంటీ నేషనల్ కంటెంట్‌ వీటిల్లో ఉన్నట్లు గుర్తించింది. ఈ వివరాలను ట్విటర్‌తో కూడా పంచుకుంది.

బ్లాకింగ్ ఆదేశాలను అమలు చేయడాని కంటే ముందే తాము రివ్యూ సమావేశాల్లో ట్విటర్‌తో వివరణాత్మకంగా ఈ కారణాలంటిన్ని పంచుకున్నామనే ప్రభుత్వ వాదనలను కోర్టు అంగీకరించింది.

యూజర్లకు నోటీసు ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రభుత్వ ఇష్టమని తెలిపింది.

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు అపకీర్తిని తీసుకొచ్చే, అస్థిరపరిచే ఉద్దేశంతో ట్వీట్లను చేసే విదేశీ ప్రచారకర్తలు, ఉగ్రవాదులు, సామాజికపరమైన విషయాల్లో జాతీ భద్రతకు ప్రమాదం కలిగించే యూజర్లు అయితే ఎలా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమని చెప్పింది.

అలాంటి భారత వ్యతిరేక శక్తులకు నోటీసులు జారీ చేయడం కూడా అవసరం కాదనే ప్రభుత్వ వాదనను కోర్టు అంగీకరించింది.

ఈ తీర్పు ప్రజల వాక్ స్వాతంత్య్రపు హక్కులను కాపాడుకునే అవకాశాలను తగ్గిస్తుందని నిపుణులంటున్నారు.

బ్లాకింగ్ ఆర్డర్లను అమల్లోకి తీసుకురావడానికి ముందే వారి తరఫున వాదించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని డిజిటల్ హక్కుల పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ గవర్నెన్స్ ప్రొగ్రామ్ మేనేజర్ సచిన్ ధావన్ అన్నారు.

ఆదేశాలు అమలు చేసిన తర్వాత కూడా, వారి కంటెంట్‌ను ఎందుకు బ్లాక్‌లో పెడుతున్నారో వారికి అర్థం కావడం లేదని చెప్పారు.

సంబంధిత పార్టీకి నోటీసు ఇవ్వడం, వాదనలు వినడం వంటి ప్రాథమిక విధి విధానాలను ఇది బలహీనపరుస్తుందని ధావన్ అన్నారు.

దిల్లీలో హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న మరో ముఖ్యమైన కేసు తీర్పు దీనికి విభిన్నంగా రావొచ్చు.

వెబ్‌సైట్‌ వ్యవస్థాపకుడికి నోటీసు ఇవ్వకుండానే ఒక సెటైరికల్ డౌరీ క్యాలిక్యులేటర్ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం బ్లాక్ చేసింది.

గత ఏడాది మే నెలలో ఫౌండర్‌కి ఒక కాపీ అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధాన్ని సమర్థించిన కోర్టు, ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయొచ్చా? లేదా? అన్న దానిపై ప్రస్తుతం విచారణ చేపడుతోంది.

ఫౌండర్‌కి కాపీ అందించాలని కోర్టు ఆదేశాలివ్వడం కాస్త ఆశలు రేకెత్తిస్తోందని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ రాయ్ చెప్పారు.

ప్రస్తుతం దీనిపై తుది తీర్పు రావాల్సి ఉంది.

వీడియో క్యాప్షన్, సముద్రం నుంచి బయటకు తీసిన టైటాన్ సబ్ శకలాల్లో ఏముంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)