పబ్‌జీ ప్రేమకథ: సీమా హైదర్ మెడలో మంగళసూత్రం, రాధే-రాధే స్కార్ఫ్.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగుతున్న సచిన్ మీనా ఇల్లు

సీమా గులామ్ హైదర్, సచిన్ మీనా
    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మెడలో ‘రాధే-రాధే’ స్కార్ఫ్, మంగళసూత్రం, చేతికి ఎర్ర గాజులు, నుదిటిపై కుంకుమతో ఉన్న సీమా గులామ్ హైదర్.. తనుంటున్న రెండు గదుల ఇంట్లోనే జర్నలిస్ట్‌లు, కెమెరాలు, మైకుల ముందుకు వచ్చి చాలా ధైర్యంతో వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఆమె పక్కనే తన ప్రేమికుడు సచిన్ మీనా కుర్చీలో కూర్చుని ఉన్నారు.

దేశంలోని అతిపెద్ద న్యూస్ ఛానళ్ల యాంకర్లు, రిపోర్టర్ల నుంచి పదుల సంఖ్యలో యూట్యూబర్ల వరకు సీమా హైదర్‌తో మాట్లాడేందుకు తమ వంతు కోసం వేచిచూస్తున్నారు.

ఆ ఇంట్లో గుమికూడిన జనాల మధ్యలోనే సీమా నలుగురి పిల్లల్ని మనం గుర్తించవచ్చు.

కొందరు ఆ పిల్లల్ని ‘హిందూస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేయాలని చెప్పి, వారిని వీడియో తీస్తున్నారు.

పట్టణంలోని కొందరు మహిళలు, హిందూ సంస్థలు కూడా ఆమెను కలిసేందుకు వస్తున్నాయి.

ఇలా వచ్చిన వారు కొందరు సీమాను ఆశీర్వదిస్తూ ఆమె చేతిలో కొంత మొత్తాన్ని ఉంచుతున్నారు. వారితో ఫోటోలు కూడా తీయించుకుంటున్నారు.

హడావుడిగా ఉన్న సీమా హైదర్ ఇంటి వాతావరణంలో, ‘జై శ్రీ రామ్’ అనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి.

కొంత మంది వ్యక్తులు ఈ ఇంట్లో ఉన్న తులసి మొక్కకు నీళ్లు పోయాలని చెబుతున్నారు.

ఈ హడావుడి అంతా ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, రబుపురాలో ఉన్న సచిన్ మీనా ఇంట్లో నెలకొంది.

సచిన్ మీనా, సీమా హైదర్ బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత, వీరింటికి పెద్దసంఖ్యలో జనాలు వస్తున్నారు.

భారీ వర్షంలోనే బీబీసీ హిందీ టీమ్ కూడా సీమా హైదర్, సచిన్ మీనాతో మాట్లాడేందుకు వారి ఇంటికి వెళ్లింది.

ఇంట్లోకి వెళ్లిన తర్వాత, సచిన్ తండ్రి నేత్రపాల్ మీనా మంచంపై కూర్చుని ఉన్నారు.

ఆయన మమ్మల్ని చూడగానే లేచి నిల్చుని దండం పెట్టారు. ‘‘ఇప్పుడంతా బాగుంది, పిల్లలు సంతోషంగా ఉన్నారు ’’ అని చెప్పారు.

కొన్ని గంటల పాటు వేచిచూసిన తర్వాత, సీమా, సచిన్‌తో మాట్లాడేందుకు మాకు అవకాశం దక్కింది.

వారితో మాట్లాడిన 20 నిమిషాల్లో, వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమ ఎలా చిగురించాయి, భారత్‌లోకి తను ఎలా అక్రమంగా ప్రవేశించారు, గూఢచార్యం ఆరోపణలు, పెళ్లి ఎలా చేసుకున్నారు, హిందువుగా ఎలా మారారు లాంటి అన్ని అంశాలపై మేమడిగిన ప్రశ్నలకు సీమా సమాధానాలు చెప్పారు.

సీమా హైదర్
ఫొటో క్యాప్షన్, సీమా హైదర్

పబ్‌జీతో మొదలైన లవ్ స్టోరీ

పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్, అదే దేశంలోని జాకోబాబాద్ నివాసి అయిన గులాం హైదర్‌ను 2014లో పెళ్లాడారు. వీరికి నలుగురు సంతానం.

ఆ తర్వాత వీరిద్దరూ కరాచీకి వచ్చారు. 2019లో గులామ్ హైదర్ పని కోసం సౌదీ అరేబియా వెళ్లారు.

ఆ సమయంలోనే సీమా హైదర్, సచిన్ మీనాతో మాట్లాడటం ప్రారంభించారు. ఆన్‌లైన్ గేమ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.

‘‘పబ్‌జీ గేమ్‌తో మా లవ్ స్టోరీ ప్రారంభమైంది. సచిన్ అప్పటికే ఈ గేమ్ ఆడేవారు. నేను అప్పుడే కొత్తగా ఆడటం ప్రారంభించాను. పబ్‌జీలో నా పేరు మారియా ఖాన్. గేమ్ ఆడాలని సచిన్ నాకు రిక్వెస్ట్ పంపారు. గేమ్‌లు ఆడుతూనే మేమిద్దరం ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నాం. సచిన్ గేమ్‌ ఆడేందుకు ఆన్‌లైన్‌కు వచ్చినప్పుడు, నాకు మెసేజ్ పంపేవారు. ‘గుడ్ మార్నింగ్’, ‘తుమ్ భీ ఆవో జీ’’ అని మెసేజ్ చేసే వారు’’ అని సీమా వివరించారు.

ఆటలోనే బలపడిన బంధం

‘‘మూడు నుంచి నాలుగు నెలల పాటు ఈ ఆట ఆడిన తర్వాత, మేం మంచి స్నేహితులమయ్యాం. వీడియో కాల్‌లో నేను తనకు పాకిస్తాన్ చూపిస్తే, ఆయన నాకు భారత్ చూపించే వారు.

పాకిస్తాన్ చూసినప్పుడు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. నేను కూడా భారత్ చూసినప్పుడు చాలా సంతోషపడేదాన్ని. వేరే దేశానికి చెందిన ఒక వ్యక్తి నాతో మాట్లాడటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది’’ అని సీమా తెలిపారు.

‘‘భారత్‌లో ఒక అబ్బాయి నాతో మాట్లాడుతుండటం నాకు చాలా సంతోషానిచ్చింది. రాత్రంతా మేం మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. ఆయనతో మాట్లాడటం నాకు అలవాటుగా మారిపోయింది. అలా ఇద్దరం ప్రేమలో పడిపోయాం’’ అని చెప్పారు.

ప్రేమ చిగురించిన తర్వాత ఆమె సచిన్‌ను కలవాలనుకున్నారు. కానీ, ఆమెకు అదంత తేలిక కాదు.

‘‘పాకిస్తాన్‌ అంటే నాకు ద్వేషమని నేను చెప్పడం లేదు. నేను అక్కడ పుట్టి పెరిగాను. నా చిన్నతనమంతా అక్కడే గడిచింది. నా సోదరులు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులు అక్కడివారే. నా తల్లిదండ్రుల సమాధులు అక్కడే ఉన్నాయి ’’ అని సీమా అన్నారు.

‘‘జీవితం ఒక్కసారి దొరుకుతుంది. ఆ తర్వాత చనిపోవాలి. కొన్నేళ్ల తర్వాత వృద్ధాప్యం, ఆ తర్వాత చనిపోవడం. నా తండ్రి నా కళ్ల ముందే చనిపోవడం చూశాను. అందుకే నేను నా ప్రేమను ఎంచుకున్నాను’’ అని ఆమె చెప్పారు.

సీమా సచిన్

ప్రేమ కోసం తొలిసారి విమానం ఎక్కాను

భారత్‌లోని తన ప్రేమికుడిని కలుసుకునేందుకు సీమా హైదర్ నేపాల్ రావాలనుకున్నారు. దీనికి కూడా ఒక ప్రత్యేక కారణముంది.

‘‘మేం దుబాయ్‌లో కూడా కలుసుకోవచ్చు. కానీ, సచిన్‌‌కు పాస్‌పోర్టు లేదు. పాస్‌పోర్టు లేకుండా భారత ప్రజలు నేపాల్ వెళ్లొచ్చని మాకు తెలిసింది. అందుకే మేం నేపాల్‌లో కలుసుకోవాలనుకున్నాం. మేం ఎక్కడ, ఎప్పుడు కలుసుకోవాలో నిర్ణయించుకున్న తర్వాత, నేను నేపాల్ టూరిస్ట్ వీసాను తీసుకున్నాను. షార్జా మీదుగా కఠ్మాండు చేరుకున్నాను’’ అని సీమా తెలిపారు.

‘‘తొలిసారి నేను 2023 మార్చి 10న పాకిస్తాన్‌ నుంచి బయలు దేరాను. ఆ సాయంత్రానికల్లా కఠ్మాండు చేరుకున్నాను. తొలిసారి నేను విమానంలో ప్రయాణించాను. విమానం ఆకాశంలోకి ఎగిరినప్పుడు నాకు పూర్తిగా చెవులు మూసుకుపోయాయి’’ అని సీమా తెలిపారు.

ఎందుకు చెవుల్లో నొప్పి వస్తుందో కూడా తెలుసుకోలేకపోయానని సీమా అన్నారు.

‘‘ఎందుకు చెవుల్లో నొప్పి వస్తుందని నా పక్కన కూర్చున్న వారిని అడిగాను. విమానం గాల్లోకి ఎగిరినప్పుడు ఈ నొప్పి సాధారణంగా వస్తుందని వారు చెప్పారు’’ అని సీమా తెలిపారు.

సీమా హైదర్

ఫొటో సోర్స్, SEEMA

నేపాల్‌లో పెళ్లి, ఇస్లాం నుంచి హిందూ మతంలోకి..

అప్పటికే సచిన్ సీమా కోసం కఠ్మాండు చేరుకుని అక్కడ వేచిచూస్తున్నారు.

న్యూ బస్ పార్క్ ఏరియాలో న్యూ వినాయక్ హోటల్‌లో ఒక గదిని అద్దెకు తీసుకున్నట్లు సచిన్ చెప్పారు. దీని కోసం హోటల్ యజమానికి రోజుకి రూ.500 చెల్లించినట్లు తెలిపారు.

ఆ సమయంలో కఠ్మాండు వీధుల్లో వీరిద్దరు కలిసి తిరిగిన ఎన్నో వీడియోలను సీమా హైదర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

ఈ సమయంలోనే వీరిద్దరూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

‘‘కఠ్మాండులోనే పశుపతి నాథ్ ఆలయంలో మార్చి 13న వీరు పెళ్లి చేసుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్ సాయంతో వీరు పెళ్లి చేసుకోగలిగారు. ఆ తర్వాత నేను హిందువుగా మారిపోయాను. నాపై ఎవరూ ఒత్తిడి తేలేదు’’ అని సీమా చెప్పారు.

సచిన్‌ను పెళ్లి చేసుకున్నప్పటికీ సీమా హైదర్ భారత్‌కు రాలేకపోయారు. ఎందుకంటే ఆమె నలుగురు పిల్లలు కరాచీలో ఉన్నారు. లాహోర్‌లో ఉన్న దర్గాను చూసి వస్తాననే కారణం చెప్పి ఆమె సచిన్‌ను కలుసుకునేందుకు నేపాల్ వచ్చారు.

సీమా హైదర్

ప్రేమ కోసం ఇల్లు కూడా అమ్మేశారు

సీమా సచిన్‌ను కలుసుకున్న తర్వాత తిరిగి పాకిస్తాన్ వచ్చేసినప్పటికీ, ఆమె మనసు అక్కడ లేదు.

అలా రెండు నెలలు గడిచాయి. ఎలాగైనా పాకిస్తాన్ విడిచి తన నలుగురు పిల్లలతో కలిసి శాశ్వతంగా సచిన్‌ దగ్గరికి వచ్చేయాలని సీమా నిర్ణయించుకున్నారు.

‘‘ఆ సమయంలో నా వద్ద అన్ని డబ్బులు లేవు. నా పేరుతో ఉన్న ఇంటిని రూ.12 లక్షలకు అమ్మేశాను. తర్వాత నాకు, నా పిల్లలకు నేపాల్ వీసా తీసుకున్నాను. దాని కోసం నాకు రూ.50 వేలు ఖర్చయింది’’ అని సీమా తెలిపారు.

ఆ సమయంలో సీమా ఎలాగైనా నేపాల్ నుంచి భారత్‌కు రావాలనుకున్నారు. దీని కోసం సీమా మే 10వ తేదీని ఎంచుకున్నారు. ఆ తేదీ తనకు కలిసి వస్తుందని సీమా నమ్మకం. ఎందుకంటే మార్చి 10నే సీమా తొలిసారి నేపాల్‌లో సచిన్‌ను కలుసుకున్నారు.

రెండో సారి రావడం సీమాకు చాలా తేలికైంది. ఎందుకంటే అప్పటికే ఆమెకు విమానాశ్రయంలో ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, కనెక్టింగ్ ఫ్లయిట్స్ ఏమిటి అన్న విషయాలు తెలిశాయి.

వీడియో క్యాప్షన్, సీమాహైదర్: చావనైనా చస్తా.. కానీ, పాకిస్తాన్ మాత్రం వెళ్లను

‘‘మే 10న నేను నా పిల్లల్ని తీసుకుని పాకిస్తాన్‌ నుంచి బయలు దేరాను. మే 11న ఉదయం కఠ్మాండు చేరుకున్నాను. ఆ తర్వాత పోఖరా వెళ్లాను. అక్కడే రాత్రంతా ఉన్నాను. మే 12న ఉదయం ఆరు గంటలకు బస్సులో నా పిల్లలతో కలిసి దిల్లీ బయల్దేరాను. నా భర్తగా సచిన్ పేరు రాశాను. సచిన్ కూడా ఫోన్‌లో బస్సు వారితో మాట్లాడారు. నేను మూడు టికెట్లు తీసుకున్నాను. మే 13 ఉదయం 11 గంటలకు నేను గ్రేటర్ నోయిడా చేరుకున్నాను’’ అని సీమా వివరించారు.

ఇక్కడ సచిన్ సీమా కోసం వేచిచూస్తున్నారు. సీమా చేరుకున్న తర్వాత సచిన్ రబుపురాలో ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు.

పోఖరా నుంచి దిల్లీకి రోజూ బస్సులు తిరుగుతుంటాయి. సుమారు 28 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఇండో-నేపాల్ సరిహద్దు కూడా వస్తుంది. అక్కడే అందరి ప్రయాణికులను తనిఖీ చేస్తారు.

‘‘సచిన్ తన చిరునామాను చాలా కరెక్ట్‌గా రాసిచ్చారు. చాలా సేపు అక్కడ విచారించారు. బ్యాగ్‌లను తనిఖీ చేశారు. వారు నన్ను ఐడీ కార్డు అడిగినప్పుడు, నా కార్డు పోయిందని చెప్పాను. పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని చెప్పాను. మూడు రోజులు వరుస ప్రయాణంతో నా పిల్లలు అస్వస్థత పాలయ్యారు. నా పెద్ద కూతురికి వాంతులు అయ్యాయి. చెకింగ్ చేస్తున్న వారు నా పరిస్థితి చూసి కనికరించారు’’ అని సీమా తెలిపారు.

సీమా హైదర్ భర్త గులామ్ హైదర్
ఫొటో క్యాప్షన్, సీమా హైదర్ భర్త గులామ్ హైదర్

గులామ్ హైదర్‌‌కు నోటి మాటతోనే విడాకులు ఇచ్చిన సీమా

సీమా భర్త గులామ్ హైదర్ తన భార్యను, పిల్లల్ని పాకిస్తాన్‌కు రప్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.

మరోవైపు తాను బలవంతంగా గులామ్ హైదర్‌ను పెళ్లి చేసుకున్నానని, అందుకే విడాకులు ఇచ్చినట్లు సీమా చెబుతున్నారు.

‘‘2013లో నేను మరొకర్ని ప్రేమించాను. ఆ విషయం నా కుటుంబానికి నచ్చకపోవడంతో, నన్ను బలవంతంగా గులామ్ హైదర్‌‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో నాకు పదిహేడు ఏళ్లే’’ అని సీమా చెప్పారు.

పాకిస్తాన్‌లో కూడా 18 ఏళ్ల అమ్మాయి తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని సీమా అన్నారు.

ప్రస్తుతం తనకు 27 ఏళ్లని, తన జీవితమేంటో తాను నిర్ణయించుకోగలనని సీమా అన్నారు.

మహిళ అయినందున తాను పురుషునికి విడాకులు ఇవ్వకూడదనేమీ లేదని చెప్పారు.

‘‘నేను లిఖితపూర్వకంగా విడాకులు తీసుకోలేదు. నోటి మాటతోనే మేం విడాకులు తీసుకున్నాం. విడాకుల విషయంలో పాకిస్తాన్‌లో నోటిమాట ఇప్పటికీ పనిచేస్తుంది. భారత్ నుంచి నోటీసులు పంపేందుకు కూడా నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఇక్కడ ఉండేందుకే నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు.

సీమా ఇంటి నుంచి పారిపోయే సమయంలో ఆమె వద్ద రూ.7 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఉందని ఆమె మావయ్య మీర్ జాన్ జఖ్రానీ బీబీసీ ఉర్దూతో మాట్లాడిన సమయంలో ఆరోపించారు.

‘‘నేను అలా చేయలేదు. వారివద్ద అంత డబ్బు, హోదా లేవు. నా వద్ద మా అమ్మ బంగారమే ఉంది. అది కూడా నేను ఎప్పుడూ నా చెవులకు, చేతులకు పెట్టుకుంటాను. కట్నంగా ఇచ్చిందే తెచ్చుకున్నాను. అమ్మ ప్రేమగా ఇచ్చిన దాన్ని అమ్మలేను, విడిచిపెట్టలేను’’ అని సీమా స్పందించారు.

పోలీసులతో సచిన్, సీమా

పాకిస్తాన్ గూఢచారిని కాను: సీమా

సీమా హైదర్‌ భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత, చాలా మంది ఆమెను పాకిస్తాన్ గూఢచారిగా ఆరోపించారు. ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆమె వద్ద మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న తర్వాత, చాలా మంది మనసులో ఇదే మెదిలింది.

ఈ ఆరోపణలపై స్పందించిన సీమా..‘‘నేను గూఢచారిని కాను. సచిన్‌పై ప్రేమతోనే నేను ఇంటి నుంచి బయటికి వచ్చాను. పాస్‌పోర్టు పొందాను. నన్ను ఇంట్లో నుంచి కూడా బయటికి పంపేవారు కాదు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. పెద్దగా చదువుకోలేదు. అవును, కొన్ని ఇంగ్లీష్‌ పదాలను మాత్రం మాట్లాడగలను. అంత మాత్రాన నాకు ఇంగ్లీష్ తెలుసని కాదు ’’ అని సీమా అన్నారు.

‘‘భారత్‌లో పోలీసులకు నేను ఎలాంటి అబద్ధం చెప్పలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెప్పాను. 2022లో నా సోదరునికి పాకిస్తాన్ ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. వారికి కొంత డబ్బే వస్తుంది. వారికి కేవలం 18 వేల పాకిస్తానీ రూపాయలే ఇస్తారు’’ అని చెప్పారు.

మూడు గుర్తింపు కార్డులు, ఐదు మొబైల్ ఫోన్లపై ప్రశ్నించినప్పుడు.. ‘‘మా వద్ద ఐదు ఫోన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి నాది. మిగిలిన మూడు పిల్లలివి. ఒకటి సచిన్‌ది. నా పిల్లలు ఫోన్‌లో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఇది మాత్రమే కాక, పాకిస్తాన్‌‌కు చెందిన మూడు గుర్తింపు కార్డులున్నాయి. దానిలో ఒకటి నా తండ్రిది, ఒకటి గులామ్ హైదర్‌ది, మరొకటి నాది’’ అని సీమా తెలిపారు.

సచిన్, సీమా

‘పాకిస్తాన్ వెళ్లాలనుకోవడం లేదు’

ప్రస్తుతం సీమా భారత్‌లోనే ఉండాలనుకుంటున్నారు. తాను సచిన్‌తో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

తన అక్కాచెల్లెళ్లను గుర్తుకు చేసుకుని సీమా హైదర్ కన్నీరు పెట్టుకున్నారు.

‘‘అక్కాచెల్లెళ్లను అందరూ ఇష్టపడతారు. వారు గుర్తుకు వస్తుంటారు. నాకు ఒక అక్కా, చెల్లి ఉన్నారు. అక్కకు పెళ్లయింది. నా సోదరుడు చెల్లిని చూసుకుంటారు. నా తండ్రి చనిపోయిన తర్వాత పాకిస్తాన్‌లో నాకెవరూ లేరు. నేను ఇప్పుడు సచిన్‌ను పెళ్లి చేసుకున్నాను. వారు నా పిల్లల్ని చూసుకుంటారు. నాకు గౌరవమిస్తారు. అది చాలు నాకు’’ అని సీమా తెలిపారు.

మళ్లీ స్వదేశం పాకిస్తాన్ వెళ్లే ఉద్దేశం ఉందా అనే ప్రశ్నపై సీమా చాలా కోపంగా స్పందించారు.

‘‘నేను ఇక్కడే చనిపోతాను. ఇక్కడే నా జీవితం ముగిస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో నేను తిరిగి పాకిస్తాన్ వెళ్లను. అక్కడ నాకేమీ లేదు’’ అని సీమా తెలిపారు.

సచిన్ మీనా కూడా అదే చెబుతున్నారు. తాను సీమాను పెళ్లి చేసుకున్నానని, చనిపోయేంత వరకు ఆమెను భారత్ విడిచి వెళ్లనివ్వనని అంటున్నారు.

ఇటీవల అరెస్టు అయిన వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చారు. సచిన్, సీమా కలిసి ఉంటున్నారు.

దేశాలు, మతాలు, సరిహద్దులు దాటుకుని చిగురించిన ఈ ప్రేమ కథ మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి చాలా మందిలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)