పబ్జీ ప్రేమ కథ: ప్రియుడి కోసం పాకిస్తాన్‌ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ గురించి ఇరుగు పొరుగు ఏం చెప్పారు?

సీమా, ఆమె పిల్లల ఫోటోలను మేం చూపించినప్పుడు, ఓ దుకాణం నడిపే వ్యక్తి గుర్తుపట్టారు
ఫొటో క్యాప్షన్, సీమా, ఆమె పిల్లల ఫోటోలను మేం చూపించినప్పుడు, ఓ దుకాణం నడిపే వ్యక్తి గుర్తుపట్టారు
    • రచయిత, షుమైలా ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరాచీ.. ఇది పాకిస్తాన్‌లో అతిపెద్ద నగరం. రెండు కోట్ల మందికిపైగా జీవించే కరాచీలో యువత సంఖ్యా ఎక్కువే ఉంటుంది. మిగతా ప్రపంచంలోలాగే ఇక్కడ కూడా విఫల ప్రేమికులు, సఫల ప్రేమికులు ఉంటారు.

సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్‌లపై గడిపేవారి సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే ఉంటుంది.

అలా ఆన్‌లైన్‌లో పబ్జీ ఆడుతూ ఓ భారతీయుడితో ప్రేమలో పడిన సీమా హైదర్ సరిహద్దులను దాటి తన ప్రేమను వెతుక్కుంటూ భారత్‌కు చేరుకున్నారు.

గత కొన్ని రోజులుగా భారత్‌లోని మీడియాలో సీమా హైదర్ ప్రేమ కథపై చర్చ జరుగుతోంది. అయితే, పాకిస్తాన్ మీడియా దీనిపై మౌనం వహిస్తోంది.

సాధారణంగానే పాకిస్తాన్‌లో ప్రేమ కథలు లేదా ప్రేమ పెళ్లిళ్లకు అంత ప్రాధాన్యం ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ సమాజంలో ఎక్కువ మంది ఇంకా పాతకాలం ఆలోచనలనే నమ్ముతుంటారు.

కరాచీలోని మలీర్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో తన నలుగురు పిల్లలతోపాటు సీమా హైదర్ కనిపించడంలేదని ఒక ఫిర్యాదు నమోదైంది. అయితే, దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

మలీర్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్‌పీకి ఈ విషయంపై మేం చాలా ఫోన్‌కాల్స్ చేశాం, మెసేజ్‌లు పంపించాం. కానీ, మాకు ఎలాంటి స్పందనా రాలేదు.

కరాచీలోని మలీర్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో తన నలుగురు పిల్లలతోపాటు సీమా రింద్ కనిపించడంలేదని ఒక ఫిర్యాదు నమోదైంది
ఫొటో క్యాప్షన్, కరాచీలోని మలీర్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో తన నలుగురు పిల్లలతోపాటు సీమా హైదర్ కనిపించడంలేదని ఒక ఫిర్యాదు నమోదైంది

పాకిస్తాన్‌లో సీమా కుటుంబం ఎక్కడ ఉండేది?

కరాచీలో సీమా హైదర్, ఆమె కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో జీవించేదో తెలుసుకునేందుకు ఆ ప్రాంతాన్ని మేం సందర్శించాం. తన భర్త గులామ్ హైదర్ ఇచ్చిన చిరునామాకు మేం వెళ్లాం.

కరాచీలోని గులిస్తా-ఎ-జైహర్ ప్రాంతానికి మేం చేరుకున్నాం. ఇది బాగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతం. ఇక్కడ భారీ భవనాలు కనిపిస్తున్నాయి. మధ్యమధ్యలో కొన్ని బస్తీలు కూడా ఉన్నాయి. వీటిలోనే ‘ధానీ బక్ష్ గోఠ్’ కూడా ఒకటి.

ఇక్కడి ప్రజలకు సీమా హైదర్ ప్రేమ కథ, ఆమె అరెస్టుల గురించి ఏమీ తెలియదు. సీమా, ఆమె పిల్లల ఫొటోలను మేం చూపించినప్పుడు, ఓ దుకాణం నడిపే వ్యక్తి గుర్తుపట్టారు. ఆ పిల్లలు తన దగ్గరకు సరుకులు కొనడానికి వచ్చేవారని తెలిపారు.

ఇరుకైన సందుల గుండా ప్రయాణించిన తర్వాత మొత్తానికి మేం సీమా ఇంటికి చేరుకున్నాం. ఇక్కడ మూడేళ్లుగా అద్దె ఇంట్లో సీమా జీవించేవారు. మూడో అంతస్తులో ఆమె ఇల్లు ఉంది. ఇంటి యజమాని కింద ఇంట్లో ఉంటున్నారు.

మేం అక్కడికి వెళ్లినప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఇంటి బయట కనిపించారు. వారే మమ్మల్ని లోపలకు రమ్మని ఆహ్వానించారు.

రెండు చిన్న గదులున్న ఈ ఇంటిలో.. ఒక గది మొత్తం పిల్లలే ఉన్నారు. ఇక్కడ వారికి ట్యూషన్ చెబుతున్నారు. మరొక గదిలో మేం కూర్చున్నాం. అక్కడే ఆ ఇంటి యజమాని భార్య కూడా ఉన్నారు.

మేం సీమా గురించి అడిగినప్పుడు, తన ఇంట్లోని ఒక ఫొటోను చూపించారు. ఇది ఓ కుటుంబ వేడుకలో తీసిన ఫోటో. ఆ కార్యక్రమానికి సీమాను కూడా ఆహ్వానించారు.

సీమాను తన సొంత కుమార్తెలా భావించేవాడినని సీమా ఇంటి యజమాని మంజూర్ హుస్సేన్ చెప్పారు
ఫొటో క్యాప్షన్, సీమాను తన సొంత కుమార్తెలా భావించేవాడినని సీమా ఇంటి యజమాని మంజూర్ హుస్సేన్ చెప్పారు

ఇంటి యజమాని ఏం అంటున్నారు?

సీమా పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవారుకాదని ఆ ఇంటి యజమాని చెప్పారు. కానీ, ఆమె పిల్లలు తమ ఇంట్లో ఎక్కువగా ఆడుకునేవారని వివరించారు.

మొదట్లో సీమాతోపాటు ఆమె తండ్రి, సోదరుడు, సోదరి కూడా ఇదే ఇంట్లో జీవించేవారు. అద్దెలో సగం ఆమె తండ్రి ఇవ్వగా, మరో సగం సీమా కట్టేవారు.

అయితే, అద్దె కట్టే విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవ జరిగేదని ఇంటి యజమాని చెప్పారు. ఆ తర్వాత ఆమె సోదరికి పెళ్లి అయ్యింది. సోదరుడు కూడా సైన్యంలో చేరారు. దీంతో తండ్రి, సీమా కలిసి జీవించేవారు. అయితే, నిరుడు ఆయన మరణించారు.

భారత్‌లో సీమా అరెస్టు అయిన వీడియో తనకు చూపించాలని మమ్మల్ని ఆ ఇంటి యజమాని కోరారు. దీంతో ఆమె అరెస్టుతోపాటు ఆమె మాట్లాడుతున్న దృశ్యాలను ఆయనకు చూపించాం. ఆ తర్వాత సీమా ఇలాంటి పని చేస్తుందని తను ఎప్పుడూ అనుకోలేదంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

సీమాను తన సొంత కుమార్తెలా భావించేవాడినని సీమా ఇంటి యజమాని మంజూర్ హుస్సేన్ చెప్పారు. మాతో మాట్లాడేటప్పుడు మధ్యలో కొన్నిసార్లు ఆయన కంటతడి పెట్టుకున్నారు. భావోద్వేగానికి కూడా గురయ్యారు.

సీమా భర్త సౌదీ అరేబియాలో ఉంటారని, గత మూడేళ్లలో ఒక్కసారి కూడా ఆయన ఆమెను చూడటానికి రాలేదని మంజూర్ చెప్పారు.

‘‘ఆమె భర్త నెలకు రూ.60,000 నుంచి రూ.70,000 పంపించేవారు. ఈ డబ్బులతో ఆమె ఇల్లు చూసుకునేవారు. ప్రతి నెలా సరైన సమయానికే అద్దె ఇచ్చేవారు.’’ అని ఆయన తెలిపారు.

సీమా భర్త సౌదీ అరేబియా నుంచి తనకు ఫోన్ చేసి, ఒక నెల రోజులపాటు ఇంటిని చూసుకోవాలని చెప్పారని మంజూర్ అన్నారు
ఫొటో క్యాప్షన్, సీమా భర్త సౌదీ అరేబియా నుంచి తనకు ఫోన్ చేసి, ఒక నెల రోజులపాటు ఇంటిని చూసుకోవాలని చెప్పారని మంజూర్ అన్నారు

హిందూ యువకుడితో పెళ్లిపై ప్రశ్నలు..

‘‘ఒక రోజు ఊరు వెళ్లొస్తానని సీమా చెప్పారు. వెళ్లి వచ్చేవరకు ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని అన్నారు. ఆమె అబ్బూ (నాన్న) అని నన్ను పిలిచేవారు. నేను ఆమెను బేటీ (కుమార్తె) అని పిలిచేవాడిని. ఆమె వెళ్లిన తర్వాత అక్కడి నుంచి మాకు ఎలాంటి ఫోన్ రాలేదు. ఆ తర్వాత ఆమె కోసం తోబుట్టువులు వచ్చారు. తన సొంత ఊరుకు వెళ్లిందని చెప్పాను. అయితే, అక్కడకు రాలేదని వారు నాతో అన్నారు.’’ అని మంజూర్ చెప్పారు.

సీమా భర్త సౌదీ అరేబియా నుంచి తనకు ఫోన్ చేసి, ఒక నెల రోజులపాటు ఇంటిని చూసుకోవాలని చెప్పారని మంజూర్ అన్నారు. ఆ తర్వాత ఇంట్లో వస్తువులను తీసుకెళ్లేందుకు ఒక వ్యక్తిని ఆయన పంపించారని చెప్పారు.

మేం అక్కడకు వెళ్లినప్పుడే సీమా సరిహద్దులు దాటిన వార్త చాలా మందికి తెలిసింది. మేం అక్కడ ఉన్నప్పుడే కొంతమంది మమ్మల్ని చూడటానికి వచ్చారు.

అక్కడి ప్రజలు చాలా విషయాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నేను కెమెరామెన్‌కు కొంచెం దూరంగా నిలబడినప్పుడు 30 ఏళ్ల వయసుండే ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి.. ‘‘సీమా ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజమేనా?’’ అని ప్రశ్నించారు.

అయితే, ఆ ప్రశ్నకు సమాధానం తెలియదన్నట్లుగా నేను తలూపాను. అయితే, ఇక్కడివారు సీమా గురించి, ఆమె జీవన శైలి గురించి చాలా మాట్లాడుకుంటూ కనిపించారు.

సీమా, గులాం ఇద్దరూ బలోచ్‌ వర్గానికి చెందినవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీమా, గులాం ఇద్దరూ బలోచ్‌ వర్గానికి చెందినవారు

బలోచ్ వర్గానికి చెందినవారు..

సీమా హైదర్.. సింధ్‌లోని ఖైర్‌పుర్ జిల్లాకు చెందినవారు. ఆ ప్రాంతం ఖర్జూరం పంటకు ప్రసిద్ధి. పాకిస్తాన్‌లో విలీనమైన చివరి స్వతంత్ర సంస్థానం ఇది.

సీమా భర్త గులాం హైదర్ స్వస్థలం జాకోబాబాద్. బ్రిటిష్ మిలిటరీ కమాండర్ జాన్ జాకబ్ పేరునే ఈ ప్రాంతానికి పెట్టారు.

సీమా, గులాం ఇద్దరూ బలోచ్‌ వర్గానికి చెందినవారు. ఈ వర్గంలో అమ్మాయిలు పెద్దగా ప్రేమ గురించి మాట్లాడరు. అంతేకాదు కుల దురహంకార హత్యల పేరుతో డజన్ల మంది అమ్మాయిలను కూడా ఈ వర్గంలో హత్యలు చేస్తుంటారు.

తన భర్త గులాం హైదర్‌ను ఒక మిస్డ్ కాల్‌ ద్వారా సీమా తొలిసారి కలిశారు. అలా కలిసిన మాటలు పెళ్లి వరకూ వెళ్లాయి.

వీరి పెళ్లి సమయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సీమా ఇంటి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత ఒక కోర్టు ద్వారా గులాం హైదర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత వీరి పెళ్లి పంచాయతీ వరకూ వెళ్లింది. అక్కడ గులాం హైదర్ కుటుంబానికి జరిమానా విధించారు.

సీమా బలవంతం మీద వీరు కరాచీకి మకాం మార్చారు. అక్కడ గులాం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఒక్కోసారి కూలి పనికి కూడా వెళ్లేవారు. సీమా అక్క కూడా అదే ప్రాంతంలో తన అత్తగారి ఇంట్లో ఉండేది.

సీమా హైదర్
ఫొటో క్యాప్షన్, సీమా హైదర్

‘‘మా చెల్లిని వదిలేయండి’’

‘‘మా తల్లిదండ్రులు బతికిలేరు. మా తమ్ముడు సైన్యంలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు మాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.’’అని సీమా అక్క చెప్పారు.

‘‘నేను చెప్పే విషయాలు భారత్‌ వరకూ చేరుతాయా?’’ అని ఆమె మమ్మల్ని అడిగారు.

అవును చేరుతాయని మేం చెప్పడంతో.. ‘‘మా చెల్లి భారత్‌కు వెళ్లి చాలా తప్పు చేసింది. దయచేసి ఆమెను విడిచిపెట్టాలని నేను అధికారులను కోరుతున్నాను.’’ అని ఆమె అభ్యర్థించారు.

గులాం హైదర్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘నా భార్యను భారత్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తి నిర్బంధించారు. పబ్జీ ఆడేటప్పుడు ఆమెతో తను మాట్లాడేవాడు. అతడి మాయ మాటల వల్లే సీమా ఇంటి నుంచి వెళ్లిపోయారు.’’ అని అన్నారు.

‘‘నేను మూడున్నరేళ్లుగా సౌదీలో పనిచేస్తున్నాను. నా పిల్లలను నేను పోషించుకోగలను. అయితే, 2018లో సీమా నాకు విడాకులు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిలో ఎలాంటి నిజమూ లేదు.’’ అని ఆయన చెప్పారు.

‘‘నా పిల్లలు సౌదీకి వచ్చి, నాతో కలిసి బక్రీద్‌ జరుపుకోవాలని భావించారు. దీని కోసం నేను ఏర్పాట్లు కూడా చేశాను.’’ అని ఆయన చెప్పారు.

‘‘దయచేసి నా పిల్లలను నాకు అప్పగించాలని మీడియా ద్వారా నేను అభ్యర్థిస్తున్నాను.’’ అని ఆయన చెప్పారు.

‘‘నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నేను చెప్పేది వినండి. రెండు చేతులు నమస్కరించి రెండు దేశాల ప్రభుత్వాలను కోరుతున్నాను. నేనొక పేదవాడిని. రెండు నెలల నుంచి నా పిల్లలను నేను చూడలేదు.’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, డంపర్ ట్రక్కులను చూస్తేనే భయమేస్తుంది. కానీ వాళ్లు వాటిని సునాయాసంగా నడిపిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)