రంగబలి రివ్యూ: కొత్త పాయింట్, అనూహ్యమైన సంఘర్షణ.. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే?

రంగబలి

ఫొటో సోర్స్, SLV movies

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

హీరో నాగ‌శౌర్యకు ఒక ర‌క‌మైన ఇమేజ్ ఉంది. ప‌క్కింటి కుర్రాడి పాత్రలకు, ప్రేమ క‌థ‌ల‌కు స‌రిగ్గా స‌రిపోతాడు.

కాక‌పోతే, మాస్ ఇమేజ్ కోసం ప‌రిత‌పించే లక్షణం పుష్కలంగా ఉంది. త‌న‌కు అచ్చొచ్చిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫార్ములాకి, త‌న‌కు అంద‌ని ద్రాక్షలా ఊరిస్తున్న మాస్ ఇమేజ్‌ని క‌ల‌గ‌లిపి ఓ సినిమా చేశాడు. అదే రంగ‌బ‌లి.

ఈ సినిమా ప్రమోష‌న్లు కూడా కాస్త ఇంట్రెస్టింగ్‌గా, ఇంకాస్త కాంట్రవ‌ర్సీ విష‌యాలు మిక్స్ చేసి సాగాయి.

మరి సినిమా ప్రచారంలో చూపించిన వ్యూహాలు, తెలివితేట‌లు సినిమాలోనూ క‌నిపించాయా?

శౌర్య కోరుకొన్న ఇమేజ్‌ను రంగబలి ఇచ్చిందా? అస‌లింత‌కీ రంగ‌బ‌లి క‌థేమిటి?

నాగశౌర్య

ఫొటో సోర్స్, SLV movies

నాగ శౌర్య షో

రాజ‌వ‌రం అనే ఊర్లోని రంగ‌బ‌లి అనే సెంట‌ర్ చుట్టూ న‌డిచే క‌థ ఇది. అక్కడ ఉండే అల్లరి కుర్రాడి పేరు శౌర్య (నాగశౌర్య).

స్నేహితులు స‌ర‌దాగా `షో` అని పిలుస్తుంటారు. సొంతూరంటే అతనికి చాలా ఇష్టం. సొంతూర్లోనే బ‌లం ఉంద‌ని నమ్మే షో ఊరు దాటి వెళ్లడానికి ఇష్టపడడు. ఎమ్మెల్యే పరశురాం (షైన్ టామ్ చాకో) కి చేదోడు వాదోడుగా ఉంటాడు.

నాన్న (గోప‌రాజు ర‌మ‌ణ‌)కు చిన్న మెడిక‌ల్ షాప్ ఉంటుంది. ఆ షాప్ చూసుకోవాలంటే మెడిక‌ల్ నాలెడ్జ్ అవ‌స‌రం. అందుకోసం ట్రైనింగ్ తీసుకోవ‌డానికి విశాఖప‌ట్నం వెళ్తాడు షో. అక్కడ స‌హ‌జ (యుక్తి త‌రేజ‌)ని చూసి ప్రేమ‌లో ప‌డిపోతాడు. స‌హ‌జ కూడా శౌర్యను ఇష్టపడుతుంది.

స‌హ‌జ తండ్రి (ముర‌ళీ శర్మ) మాత్రం ఈ పెళ్లికి అడ్డు చెబుతాడు. దానికి కార‌ణం... రాజ‌వ‌రంలోని రంగ‌బ‌లి సెంట‌ర్‌.

ఇంత‌కీ ఆ సెంట‌ర్‌కీ హీరోయిన్ తండ్రికీ ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? త‌న ప్రేమ‌ని గెలిపించుకోవ‌డానికి షో.. ఎలాంటి ఛాలెంజ్ చేశాడు. షో జీవితంలో రంగ‌బ‌లి సెంట‌ర్ తీసుకొచ్చిన పెను మార్పులేంటి? అనేది మిగిలిన క‌థ‌.

నాగ శౌర్య

ఫొటో సోర్స్, SLV Cinemas

పేరులో ఏముంది?

రంగ‌బ‌లిలో హీరోకి ఓ విచిత్రమైన సంఘర్షణ ఎదుర‌వుతుంది. ఇలాంటిది ఇంతకుముందు సినిమాల్లో చూసి ఉండరు. ఆ హీరో ఏం చేశాడ‌న్న విచిత్రమైన కాన్‌ఫ్లిక్ట్‌లో నుంచి ఈ క‌థ పుట్టింది. ఇలాంటి పాయింట్‌తో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఆ ర‌కంగా చూస్తే దర్శకుడు కొత్త పాయింట్ ప‌ట్టుకున్నట్టే లెక్క.

హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ తొలి స‌గం చాలా స‌ర‌దాగా, ఎలాంటి కంప్లైంటూ లేకుండా న‌డిపేశాడు దర్శకుడు. హీరోకి త‌న ఊరంటే ఎందుకిష్టం, త‌న ఊరు కోసం ఏం చేస్తాడు? అనే విష‌యాల్ని ప‌రిచ‌య స‌న్నివేశాల్లోనే చెప్పుకొంటూ క‌థ‌లోకి వెళ్లిపోయాడు. ముఖ్యంగా స‌త్య క్యారెక్టర్ ఈ సినిమాకి అతి పెద్ద రిలీఫ్‌.

ఆ క్యారెక్టర్ రాసుకోవ‌డంలోనే కావ‌ల్సినంత ఫ‌న్ ఉంది. అందుకే స‌త్య ఎప్పుడు క‌నిపించినా థియేట‌ర్ ఘొల్లు మంటుంది. ఓ ద‌శ‌లో హీరో క్యారెక్టర్‌ని సైడ్ చేసేసి స‌త్య వ‌న్ మ్యాన్ షో న‌డిపించేస్తుంటాడు.

అయినా స‌రే, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. నిజానికి తొలి స‌గంలో దర్శకుడు చెప్పడానికి క‌థేం లేదు.

ఆ లోటు తెలియ‌కుండా స‌త్య క్యారెక్టర్‌ని ట్రంప్ కార్డులా వాడేశాడు. ఇంటర్వెల్ కార్డు ద‌గ్గర అస‌లైన సంఘ‌ర్షణ మొద‌ల‌వుతుంది. సెకండాఫ్‌కి మంచి టేకాఫ్ పాయింటూ దొరికేస్తుంది.

నాగ శౌర్య

ఫొటో సోర్స్, SLV movies

ఏం చేయాల‌బ్బా

రాష్ట్రాల పేర్లు, ఊర్ల పేర్లూ మార్చడం కంటే వీధి పేరు మార్చడమే పెద్ద త‌ల‌నొప్పి. ఆ విష‌యం ఎంత క్లిష్టమైనదో ఈ సినిమాలో చూపించారు. నిజానికి దర్శకుడు చాలా మంచి పాయింటే ప‌ట్టాడు. ఇంత చ‌రిత్ర ఉన్న పేరుని హీరో ఎలా మారుస్తాడ‌బ్బా? అనే ఆస‌క్తి క‌లిగించాడు. కానీ ఆ ఎలా అనేదానికి దర్శకుడి దగ్గర కూడా స‌మాధానం లేకుండా పోయింది.

ఫ‌స్టాఫ్‌లోని జోష్ సెకండాఫ్‌లో లేకుండా పోయింది. `ఇది బాగా పేలుతుంది` అని దర్శకుడు ఆస‌క్తిగా, ఇష్టంగా రాసుకొన్న స్పెష‌ల్ ఐటెమ్స్ అన్నీ ఫ‌స్టాఫ్‌లోనే పేర్చుకొంటూ వెళ్లిపోయాడు. కానీ అస‌లు క‌థ‌లోకి ఎంట‌ర్ అయిన‌ప్పుడు మాత్రం పూర్తిగా క్లూ లెస్ గా మారిపోయాడు.

రంగారెడ్డి (శ‌ర‌త్ కుమార్‌) క్యారెక్టర్‌ను తీసుకొచ్చి కాస్త హ‌డావుడి చేశాడు. ఆ పాత్ర అవ్వగానే సినిమా గ్రాఫ్ మ‌ళ్లీ ప‌డిపోతుంది.

హీరో, విల‌న్ మ‌ధ్య నువ్వా, నేనా? అనే డ్రామా పండించాల్సిన చోట‌ విల‌న్‌ని తీసుకెళ్లి ఆసుప‌త్రి బెడ్ మీద ప‌డుకోబెట్టేశాడు. మీడియాని తీసుకొచ్చి మ‌ళ్లీ చింద‌ర‌వంద‌ర కామెడీ సృష్టించాడు.

ప‌తాక స‌న్నివేశాలు ఎంత బ‌ల‌హీనంగా ఉన్నాయంటే దర్శకుడికి ఈ క‌థ‌ని ఎలా ముగించాలో అర్థం కాలేదా? అనే జాలి, అనుమానం ప్రేక్షకులకు క‌లిగేలా చేశాయి.

ఓ మంచి పాయింట్‌ని ఎత్తుకోవ‌డ‌మే కాదు, దాన్ని ముగించ‌డం కూడా ద‌ర్శకుడికి తెలిసి ఉండాలి. ఈ విష‌యంలో క‌న్‌ఫ్యూజ్ అయితే తాను చెప్పదలుచుకున్న విష‌యానికి అన్యాయం చేసిన‌ట్టే అవుతుంది. ఈ సినిమాలో అదే జ‌రిగింది.

నాగశౌర్య

ఫొటో సోర్స్, SLV Cinemas

చురుక్కుమ‌న్న శౌర్య

శౌర్య మంచి న‌టుడు. త‌న కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఈసినిమాలో అది ఇంకాస్త బాగుంది. చాలా ఫ్రీగా మూవ్ అయ్యాడు. చ‌లాకీగా క‌నిపించాడు. మాస్ డైలాగులు చెప్పాడు. త‌న బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా క‌నిపించింది.

యుక్తి త‌రేజ చూడ్డానికి బాగుంది. అయితే త‌న క్యారెక్టర్‌లో డెప్త్ లేదు. విల‌న్ గా టామ్ చాకో ఉన్నాడంటే ఉన్నాడంతే. గోప‌రాజు ర‌వి ఓ మధ్యతరగతి నాన్నగా ఇమిడిపోయారు. మెడిక‌ల్ షాప్ లో జ‌రిగిన అవ‌మానం త‌ట్టుకోలేక బాధ‌ని వ్యక్తం చేస్తున్న సంద‌ర్భంలో ఆయ‌న న‌ట‌న మ‌రింత బాగుంది.

ఈ సినిమాని కాపాడి ఆడిటోరియాన్ని అలెర్ట్ చేసే బాధ్యతను స‌త్య మోశాడు.

ఇక‌... గీత ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్ విల‌న్ గ్యాంగ్‌లో క‌నిపిస్తాడు. త‌న న‌ట‌న గుర్తు పెట్టుకొనే రేంజ్‌లో లేదు. కాక‌పోతే న‌టుడిగా క‌నిపించాల‌న్న త‌న స‌ర‌దా మాత్రం ఈసినిమా తీర్చేసింది.

వీడియో క్యాప్షన్, రంగబలి సినిమా రివ్యూ: పాయింట్ కొత్తగా ఉంది కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా?

ప‌వ‌న్ సీహెచ్ అందించిన పాట‌ల్లో ఒక్కటి కూడా గుర్తు పెట్టుకునేలా లేదు. నేప‌థ్య సంగీతంలో మాత్రం కొన్ని ఎలివేష‌న్ బీజియ‌మ్స్ వినిపించాయి.

ద‌ర్శకుడు రాసుకున్న సంభాష‌ణ‌లు, ముఖ్యంగా కామెడీ సీన్స్‌లో బాగా వ‌ర్కవుట్ అయ్యాయి. కెమెరా ప‌నిత‌నం డీసెంట్‌గా ఉంది. నిర్మాణ విలువ‌ల విష‌యంలోనూ పేరు పెట్టలేం. సినిమాని చాలా క్వాలిటీతో తీశారు.

ఓ మ‌నిషి పాతికేళ్లు మంచి చేసి, ఓ నింద‌ని మోస్తే.. జ‌నం ఆ నిందే ప‌ట్టుకొని మోస్తారు. చేసిన మంచి మ‌ర‌చి పోతారు అని దర్శకుడు ఈ క‌థ‌లో చెప్పాల‌నుకొన్నాడు.

సినిమా కూడా అంతే. ఫ‌స్టాఫ్‌లో ఎంత న‌వ్వించినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, చెప్పాల‌నుకొన్న పాయింట్‌లో త‌డ‌బాటు ఎదురైతే, థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వస్తున్నప్పుడు ప్రేక్షకులు అదే గుర్తు పెట్టుకుంటారు. `రంగ‌బ‌లి` బ‌లైపోయింది అక్కడే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)