ఆంధ్రప్రదేశ్: విశాఖను కుదిపేస్తున్న భూవివాదాలు... వందల కోట్ల విలువైన భూముల చుట్టూ రాజకీయ దుమారం

ఈ ఇద్దరి ఎంపీల పరస్పర ఆరోపణలతో వైసీపీ ఎంపీలే విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలు ఆందోళనలు చేయడం ప్రారంభించాయి.
ఫొటో క్యాప్షన్, ఈ ఇద్దరి ఎంపీల పరస్పర ఆరోపణలతో వైసీపీ ఎంపీలే విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలు ఆందోళనలు చేయడం ప్రారంభించాయి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘‘నేను చాలా దేశాలు తిరిగాను. సీఏ చదువుకున్నాను. అయినా కూడా డెవలపర్‌కు 99 శాతం వాటా, యాజమానికి 1 శాతం వాటా ఇచ్చే తరహా ల్యాండ్ అగ్రిమెంట్ నేను ఎప్పుడూ వినలేదు. దసపల్లా భూముల్లో డెవలపర్‌కు 70 శాతం, యాజమానికి 30 శాతం చొప్పున జరిగిన అగ్రిమెంట్‌పై ప్రశ్నించే మీడియా.. కూర్మన్నపాలెంలో జరిగిన 99:1 అగ్రిమెంట్‌ను ఎందుకు ప్రశ్నించదు?’’ అని పరోక్షంగా కూర్మన్నపాలెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.

2022 అక్టోబర్ 12న విజయసాయి రెడ్డి ఈ మాటలను మీడియా సమావేశంలో అన్నారు.

దీనిపై 2022 అక్టోబర్ 13న ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. “ఇతరుల గురించి మాట్లాడేముందు దసపల్లా భూముల విషయంలో మొదట తనకు అంటిన మురికిని కడుక్కోవాలి. విజయసాయి రెడ్డి ప్రస్తావించిన ప్రాజెక్ట్‌కు సంబంధించిన హక్కుదారులతో 2018లోనే పరస్పర అంగీకారంతో ఆ సమస్య పరిష్కరించుకున్నాం” అని ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు.

ఈ ఇద్దరి ఎంపీల పరస్పర ఆరోపణలతో వైసీపీ ఎంపీలే విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలు ఆందోళనలు చేయడం ప్రారంభించాయి. అప్పుడు మొదలైన విశాఖలోని భూదందాల ఆరోపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ హయంలో లులు గ్రూపుకు కేటాయించిన భూములను కూడా విజయసాయిరెడ్డి తన వారికే ఇప్పించుకున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి.

విశాఖలో భూ వివాదాలు, వాటిలో అధికార పార్టీ నేతల పేర్లు తరుచూ వినపడుతూనే ఉంటాయి. అటువంటి వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైన మూడు భూ వివాదాలను చూద్దాం.

దసపల్లా భూములను దసపల్లా రాజు వైరిచర్ల నారాయణ గజపతిరాజు, ఆయన కుమార్తె రాణీ కమలాదేవి పేరున 1938లో వీలునామా రాశారు

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, దసపల్లా భూములను దసపల్లా రాజు వైరిచర్ల నారాయణ గజపతిరాజు, ఆయన కుమార్తె రాణీ కమలాదేవి పేరున 1938లో వీలునామా రాశారు

దసపల్లా భూములపై వివాదామేంటి? ఎందుకు?

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖ భూముల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు వివాదస్పద భూములను సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయి.

దసపల్లా భూములు

దసపల్లా భూములను దసపల్లా రాజు వైరిచర్ల నారాయణ గజపతిరాజు, ఆయన కుమార్తె రాణీ కమలాదేవి పేరున 1938లో వీలునామా రాశారు. ఆ తర్వాత 1948లో ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్‌ అబాలిష్‌మెంట్‌ చట్టం అమల్లోకి రావడంతో రాణి కమలాదేవి కొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. కొంత కాలం తర్వాత రాణి వారసులు ఆ భూములు తమవేనని కోర్టుని ఆశ్రయించారు.

ఆ వివాదం నడుస్తుండగానే....దసపల్లా భూములున్న 1196, 1197, 1027, 1028 సర్వే నెంబర్లను 2001లో నిషేధిత భూముల జాబితా (22ఏ)లో చేర్చారు.

ఇందులోని మొత్తం 60 ఎకరాల భూములుండగా, వీటిలో 40 ఎకరాలను వీఎంఆర్‌డీఏ, నౌకాదళం, జీవీఎంసీ అవసరాలకు తీసుకున్నాయి. మరో 5 ఎకరాలను ప్రభుత్వ కార్యాలయాలకు ఇతర అవసరాలకు కేటాయించగా....ప్రస్తుతం 15 ఎకరాల భూమి వివాదంగా మారింది.

ఈ 15 ఎకరాల భూమి తమకే చెందుతుందని కమలాదేవి వారసులు కోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో వారికి తీర్పు అనుకూలంగా వచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం 2014లో సుప్రీంకోర్టుకి వెళ్లినా రాణి కుటుంబీకులకే అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడుకు చెందిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకే ఆ భూములను 22ఏ నుంచి తొలగించారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడుకు చెందిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకే ఆ భూములను 22ఏ నుంచి తొలగించారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి

రాణి వారసులు ఆ భూములను డెవలప్‌మెంట్ సంస్థలకు ఇస్తూ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. రాణి వారసులు, డెవలపర్స్ కలిసి వాటి చుట్టూ కంచె వేశారు. పనులు మొదలు పెట్టే సమయంలోనే... ఈ అగ్రిమెంట్లు విజయసాయి రెడ్డి కూతురు, అల్లుడు కంపెనీలతో చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఎందుకంటే రాణి వారసులు ఒప్పందం చేసుకున్న సంస్థల్లో అస్యూర్ డెవలపర్స్ ఒకటి. ఇందులోనే విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడు డైరెక్టర్లుగా ఉన్నారనే ఆరోపణలున్నాయి.

ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడుకు చెందిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకే ఆ భూములను 22ఏ నుంచి తొలగించారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇదే సమయంలో విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించారు. ఈ వివాదాల మధ్య దసపల్లా భూముల్లో పనులు మొదలు కాలేదు.

‘‘విజయసాయి రెడ్డి నిర్వహించే ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున దసపల్లా డెవలపర్స్ సంస్థల డైరెక్టర్ ఒకరు సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. దాన్ని చూపించి, దసపల్లా భూములు విజయసాయి రెడ్డి కొట్టేశారంటూ ఆరోపిస్తుంటారు’’ అని దసపల్లా భూముల్లో డెవలప్‌మెంట్‌కు ఒప్పందం కుదుర్చుకున్న ఎస్యూర్ సంస్థ డైరెక్టర్ ఉమేశ్ చెప్పారు.

ఈ విషయంపై విజయసాయిరెడ్డి మీడియాతో మట్లాడుతూ, ”ఆ భూముల విషయంలో ఒప్పందం ఎవరు కుదుర్చుకున్నా న్యాయబద్ధంగా 70:30 పద్ధతిలోనే చేశారు” అని మాత్రమే సమాధానం చెప్పారు.

కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాలకు సంబంధించి 1982 నుంచి దీర్ఘ కాలంగా వివాదం నడుస్తోంది

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాలకు సంబంధించి 1982 నుంచి దీర్ఘ కాలంగా వివాదం నడుస్తోంది

కూర్మన్నపాలెం భూ వివాదం

దసపల్లా భూములపై తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూనే విజయసాయి రెడ్డి.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై 99:1 అగ్రిమెంట్ అంటూ ఆరోపణలు చేశారు.

వైజాగ్‌లోని వైసీపీ నేతల భూదందాలపై అప్పటికే చక్కర్లు కొడుతున్న వార్తలకు సొంత పార్టీ నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింత బలం చేకూరినట్లైయ్యింది.

కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాలకు సంబంధించి 1982 నుంచి దీర్ఘ కాలంగా వివాదం నడుస్తోంది. గొట్టిపల్లి శోభారాణి కుటుంబీకులు, 160 మంది డాక్‌ లేబర్‌ బోర్డు ఉద్యోగులతో 1982 నుంచి వివాదం ఉంది.

వివాదాన్ని పరిష్కరించేలా చూడాలని బిల్డర్‌గా ఉన్న తనని 2012లో డీఎల్‌బీ ఉద్యోగులు ఆశ్రయించారని ఎంపీ తెలిపారు. మొత్తం 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంనలో నిర్మాణాలు చేపట్టి.. అందులో ఆ 160 మంది ఉద్యోగులకూ ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్లాట్‌ చొప్పున ఇస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అందుకు వారు తమ వాటాను ఆయనకు 2012లోనే అగ్రిమెంట్‌ చేశారు.

ఇక మిగిలిన గొట్టిపల్లి శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులిచ్చేలా వారితో 2018 జనవరిలో ఒప్పందం చేసుకున్నామన్నారు. దీనిని 99:1 అగ్రిమెంట్ అంటూ వివాదం చేస్తున్నారని ఎంపీ చెప్పారు.

ఈ నిర్మాణాలకు కావలసిన అనుమతులను 2019 మార్చి 11న జీవీఎంసీ ఆమోదించిందని... అప్పుడు వైసీపీ అధికారంలోకూడా లేదని ఎంవీవీ చెప్పారు.

అయితే 99:1 స్థాయిలో జరిగిన ఈ ఒప్పందం విషయంలో స్థల యాజమానులను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన అధికారంలో బెదిరించడం వలనే జరిగిందని టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించాయి.

అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు స్థల యాజమానులు మాత్రం ముందుకు రాలేదు.

2022 మార్చిలో సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఎస్పీకి సంబంధించిన భూమిని ఎంపీ ఎంవీవీ కబ్జా చేశారంటూ వివాదం రేగింది. ఎస్పీ మధుకు విశాఖ గాయత్రినగర్‌ రోడ్డులో 168 గజాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఎంపీ కబ్జా చేశారంటూ మొదట ఆరోపించిన మధు, ఆ తర్వాత ఎంపీతో రాజీకి వెళ్లారు.

వివాదాన్ని ఎస్పీతో సెటిల్ చేసుకుని, తాను ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసి, ఇకపై విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'రివర్స్ టెండరింగ్' పేరుతో లులుతో ఒప్పందాన్ని రద్దు చేసింది

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'రివర్స్ టెండరింగ్' పేరుతో లులుతో ఒప్పందాన్ని రద్దు చేసింది

లులు గ్రూపు వివాదం

తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ అవుట్‌లెట్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లు యూఏఈకి చెందిన లులు గ్రూపు జూన్ ఆఖరి వారంలో ప్రకటించింది.

ఈ గ్రూప్ విశాఖలోనే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే...దానికి 2018 టీడీపీ హాయంలో స్థలం కూడా కేటాయించారు.

విశాఖలో లులు కన్వెన్షన్ సెంటర్ కోసం పోర్టు బంగ్లా ఎదుట 9.12 ఎకరాల ఏపీఐఐసీ స్థలం కేటాయించారు. అది సరిపోకపోవడంతో సీఎంఆర్ గ్రూపునకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ స్థలం 3.4 ఎకరాలను ఇచ్చేందుకు నిర్ణయించారు.

ఎకరా స్థలం ఇచ్చినందుకు సీఎంఆర్ గ్రూపుకు.. మరోచోట ఎకరంన్నర స్థలం బదలాయించేలా ప్రభుత్వం జీవో-5 జారీ చేసింది. అలా నగరంలోని ఆరు ప్రాంతాల్లో 4.85 ఎకరాలు సీఎంఆర్ గ్రూపునకు కేటాయించారు.

కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'రివర్స్ టెండరింగ్' పేరుతో లులుతో ఒప్పందాన్ని రద్దు చేసింది. కానీ ఆ సంస్థకు ఇచ్చిన భూములకు బదులుగా ప్రభుత్వం సీఎంఆర్‌కు ఇచ్చిన భూముల ఒప్పందాలు రద్దు కాలేదు. ఇదే మరో భూ దందాకు కారణమైందని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ అన్నారు.

గత నెలలో ఇలాంటి భూ వివాదానికి సంబంధించే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ భార్య, కొడుకుతో పాటు ఆయన అడిటర్ కూడా కిడ్నాపైయ్యారు

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, గత నెలలో ఇలాంటి భూ వివాదానికి సంబంధించే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ భార్య, కొడుకుతో పాటు ఆయన అడిటర్ కూడా కిడ్నాపైయ్యారు

విశాఖలో విజయసాయిరెడ్డి ప్రగతి భారత్ ఫౌండేషన్ పేరుతో ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టులో విశాఖలోని వ్యాపార ప్రముఖులు, రియల్టర్లు సభ్యులుగా చేరి భారీ విరాళాలు కూడా అందించేవారు. వారిలో సీఎంఆర్, కంకటాల, లాన్సమ్ కన్స్ స్ట్రక్షన్ ఉన్నాయనేది ఆరోపణ.

ప్రస్తుతం ఈ మూడు కంపెనీలు కలిసి సీఎంఆర్ కర్లాన్ (సీఎంఆర్, కంకటాల, లాన్సమ్) సంస్థగా ఏర్పడి లులు గ్రూపు ఒప్పందంలో భాగంగా ఇచ్చిన భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారు.

లులు గ్రూప్ వెనక్కి వెళ్లిపోవడంతో అప్పటి ఒప్పందంలో జరిగిన భూ కేటాయింపులు రద్దైనట్లే. కానీ, ఇక్కడ అలా జరగడం లేదు. దీని వెనుక కూడా ఎంపీ విజయసాయి రెడ్డే ఉన్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ‘‘కర్లాన్ కన్స్ట్రక్షన్స్ కేరాఫ్ అడ్రస్ ప్రగతి భారత్ ఫౌండేషన్ కార్యాలయాన్నే చూపిస్తుండటమే దీనిలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని అర్థమవుతోంది’’ అని మూర్తి యాదవ్ ఆరోపించారు.

ఇద్దరు ఎంపీల పేర్లు విశాఖ భూ వివాదాల్లో తరుచూ వినిపిస్తుంటాయి. వీటిని ఎంపీలు ఖండిస్తూనే ఉంటున్నారు

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, ఇద్దరు ఎంపీల పేర్లు విశాఖ భూ వివాదాల్లో తరుచూ వినిపిస్తుంటాయి. వీటిని ఎంపీలు ఖండిస్తూనే ఉంటున్నారు

‘భూ వివాదాలు, అధికారుల అండదండలు’

పైన ప్రధానంగా చెప్పుకున్న మూడు భూ వివాదాలతో పాటు ఇలా తెరపైకి వస్తున్న భూ వివాదాలన్నింటిలోనూ వైకాపా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విశాఖలో భూ దందాలు నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

గత నెలలో ఇలాంటి భూ వివాదానికి సంబంధించే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ భార్య, కొడుకుతో పాటు ఆయన అడిటర్ కూడా కిడ్నాపైయ్యారు. ఎంపీ కుటుంబం కిడ్నాప్ కూడా రియల్ ఎస్టేట్ వివాదం కారణంగానే జరిగింది.

ఈ సందర్భంగా కూడా ఎంపీ ఎంవీవీ తాను ఇక విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనని మరో సారి చెప్పారు. నా వ్యాపారానికి, రాజకీయాలకు ముడిపెట్టి వైసీపీకి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేసి భూ వివాదాలను అంటగడుతున్నాయని ఎంపీ ఎంవీవీ అన్నారు.

వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నా కూడా తాజాగా లులు గ్రూపుకి కేటాయించిన భూ వివాదంతో పాటు ఏ భూ వివాదమైన ఎంపీ విజయసాయి రెడ్డి పేరు విశాఖలో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది.

ఇలా ఇద్దరు ఎంపీల పేర్లు విశాఖ భూ వివాదాల్లో తరుచూ వినిపిస్తుంటాయి. వీటిని ఎంపీలు ఖండిస్తూనే ఉంటున్నారు.

“దసపల్లా, కూర్మన్నపాలెం, లులు గ్రూపు ఇవే కాదు.. హయగ్రీవ, భీమిలి రామానాయుడు స్టూడియోలో లేఅవుట్ ఇలా అనేక భూ దందాలు వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అధికారాన్ని ఉపయోగించి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. పెద్ద నాయకుడు పెద్ద పెద్ద భూ స్కాంలు చేస్తుంటే చిన్న నాయకులు గ్రామాల్లో చిన్న చిన్న భూములను లాక్కొంటున్నారు. వైసీపీ అంటే భూ దందాలు అనే పరిస్థితి తీసుకొచ్చారు. వీరికి అధికారులు కూడా సహకరిస్తున్నారు.” అని టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తారు? -వీక్లీ షో విత్ జీఎస్

‘ఈ వివాదాల విలువ వందల కోట్లే’

విశాఖలో భూములకు అమాంతం ఊహించని విలువ పెరిగిపోవడంతో ఇక్కడ ప్రైమ్ ఏరియాలో వంద గజాల స్థలం ఉంటే దాని విలువ తక్కువలో ఒక కోటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది.

తాజాగా లులు గ్రూపు ఒప్పందంలో జరిగిన భూ కేటాయింపుల్లో వివాదాస్పదమవుతున్న భూములు విలువను లెక్కిస్తే... వందల కోట్లు ఉంటుందని విశాఖకు చెందిన రియల్టర్ ఒకరు చెప్పారు.

లులు గ్రూపు కోసం సీఎంఆర్‌కు చెందిన బీచ్ రోడ్డులోని 3.4 ఎకరాల్లో ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌ను ప్రభుత్వానికి అప్పగించారు. దీనికి బదులుగా ప్రభుత్వం ఆరు ప్రాంతాల్లో 4.85 ఎకరాలు సీఎంఆర్ గ్రూపునకు కేటాయించారు. సిరిపురంలోని హెచ్ఎస్‌బీసీ పక్కన 6,582 గజాలు, చినవాల్తేరులో 4,404 గజాలు, కిర్లంపూడి లే-అవుట్లో 1,597 గజాలు, ఎంవీపీ కాలనీ రైతు బజారు వద్ద 7,212 గజాలు, రేసవానిపాలెం 3,146 చదరపు గజాలు, చినవాల్తేరు లాసన్స్ బే కాలనీలో 532 గజాలు..ఇలా మొత్తం 23,473 గజాలు కేటాయించారు.

ఈ ఆరు స్థలాల విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం చూస్తే వందల కోట్లు ఉంటుంది.

వివాదాస్పదమవుతున్న ‘దసపల్లా’ నగరం నడిబొడ్డున్న ఉండగా, కూర్మన్నపాలెంలోని భూములు కూడా చాలా ఖరీదైన ప్రాంతంలో ఉన్నాయి. ఇలా వందల కోట్ల భూ వివాదాల్లో వైసీపీ నాయకుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి.

ఈ వివాదాల మీద స్పందించడానికి అధికారులు నిరాకరించారు. వైసీపీ నేతలు మాత్రం అదంతా జనసేన, టీడీపీల కుట్ర అని విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)