థ్రెడ్స్ యాప్ ఎలా పనిచేస్తుంది.. ఇప్పటికే కోటి మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్న ఈ యాప్‌‌లో ఫీచర్స్ ఏమిటి

థ్రెడ్స్
    • రచయిత, క్రిస్ వాలన్స్, జేమ్స్ క్లేటన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ట్విటర్‌కు పోటీగా 'థ్రెడ్స్' యాప్ తీసుకొచ్చినట్టు మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు.

ట్విటర్‌లో కొత్తగా వచ్చిన మార్పులపై అసంతృప్తితో ఉన్న యూజర్లు థ్రెడ్స్ యాప్ వైపు ఆకర్షితులవుతారని నిపుణులు అంచనావేస్తున్నారు.

థ్రెడ్స్ యాప్ యూరోపియన్ యూనియన్‌లో తప్ప ప్రపంచంలో 100కు పైగా దేశాల్లో గురువారం నుంచి అధికారికంగా లైవ్‌లోకి వచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రారంభించిన మొదటి ఏడు గంటల్లో కోటి మందికి పైగా యూజర్లు అకౌంట్లు తెరిచారని జుకర్‌బర్గ్ చెప్పారు.

500 క్యారక్టర్స్ వరకు పోస్ట్ చేయొచ్చు

థ్రెడ్స్ యాప్‌లో 500 అక్షరాల వరకు పోస్ట్ రాయవచ్చు. చాలా ఫీచర్లు ట్విటర్‌లో ఉన్నట్టే ఉన్నాయి.

‘ఈ ప్లాట్‌ఫార్మ్‌ను యూజర్ ఫ్రెండ్లీగా ఉంచడం దాని విజయానికి కీలకం అవుతుంది" అని జుకర్‌బర్గ్ ఒక పోస్ట్‌లో రాశారు.

"థ్రెడ్స్ యాప్ ట్విటర్‌ను మించిపోతుందా?" అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, "దీనికి కొంత సమయం పడుతుంది. పబ్లిక్‌గా మాట్లాడుకోవడానికి ఒక బిలియన్ కంటే ఎక్కువమంది యూజర్లు ఉన్న ఒక యాప్ కావాలి. దాన్ని సాధించే అవకాశం ట్విటర్‌కు వచ్చింది. కానీ, సఫలీకృతం కాలేకపోయింది. మేం ఆ లక్ష్యాన్ని అందుకోగలమని ఆశిస్తున్నాం" అన్నారు జుకర్‌బర్గ్.

థ్రెడ్స్ యాప్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లోనే 20 లక్షలకు పైగా యూజర్లు అకౌంట్లు తెరిచారని, ఏడు గంటల్లో ఈ సంఖ్య ఒక కోటి దాటిందని జుకర్‌బర్గ్ చెప్పారు.

థ్రెడ్స్

ఫొటో సోర్స్, META

థ్రెడ్స్ యాప్ ఎలా పనిచేస్తుంది?

థ్రెడ్స్ యాప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కు పోస్టులు షేర్ చేయవచ్చు. అలాగే అటు నుంచి ఇటు షేర్ చేయవచ్చు.

ఈ యాప్‌లో పోస్టులను 'థ్రెడ్స్' అని వ్యవహరిస్తున్నారు.

థ్రెడ్స్‌లో లింక్స్ పెట్టవచ్చు. ఫొటోలు, అయిదు నిమిషాల వరకు నిడివితో వీడియోలు పోస్ట్ చేయవచ్చు.

అయితే, బుధవారం ఈ యాప్ వాడినవాళ్లు కొందరు ఫొటోలు సరిగా అప్లోడ్ అవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఇవి ఈరోజు లేదా రేపటికి పరిష్కారం కావచ్చు.

ఈ యాప్‌లో మనం ఫాలో అవుతున్న వాళ్ల పోస్టులు మనకు కనిపిస్తాయి. అలాగే, మనకు ఆసక్తి ఉన్న అంశాలపై పోస్టులు కనిపిస్తాయి.

మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ట్యాగ్ చేయడాన్ని కూడా నియత్రించవచ్చు. అంటే ఎవరు ట్యాగ్ చేయవచ్చు, ఎవరు ట్యాగ్ చేయకూడదన్నది మీరే నిర్ణయించుకోవచ్చు.

పోస్టులకు వచ్చిన కామెంట్లలో భాష బాగా లేదనిపిస్తే వాటిని తొలగించవచ్చు.

ఇతర ప్రొఫైల్స్‌ను అన్‌ఫాలో చేయొచ్చు. బ్లాక్ లేదా రిపోర్ట్ చేయొచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేస్తే థ్రెడ్స్‌లో కూడా బ్లాక్ అయిపోతారు.

థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ కావడాన్ని మెటా హైలైట్ చేస్తోంది. కానీ, మీడియా మాత్రం ఇది ట్విటర్‌కు పోటీ అని హోరెత్తిస్తోంది.

థ్రెడ్స్ యాప్ "ట్విటర్ కిల్లర్" అని కూడా కొందరు పెట్టుబడిదారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ట్విటర్‌ను పోలి ఉన్న థ్రెడ్స్ యాప్

ఫొటో సోర్స్, META

ఫొటో క్యాప్షన్, ట్విటర్‌ను పోలి ఉన్న థ్రెడ్స్ యాప్

ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్

ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ యజమాని మెటా ఈ కొత్త యాప్‌ను "ఇనిషియల్ వెర్షన్" అని పిలుస్తోంది. దీనికి మరి కొన్ని ఫీచర్లు త్వరలో జోడించనున్నారు. మాస్టోడాన్ లాంటి ఇతర సోషల్ మీడియా వేదికలపై యూజర్లతో కూడా మాట్లాడే వీలు ఉండేలా ఫీచర్లు తీసుకురానున్నట్టు మెటా తెలిపింది.

"ఇన్‌స్టాగ్రామ్‌ను టెక్స్ట్‌కు విస్తరించడం, అందులోని మెరుగైన అంశాలను జోడించడం.. ఇదే థ్రెడ్స్ యాప్ ఉద్దేశం" అని మెటా చెప్పింది.

థ్రెడ్స్ యాప్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌తో లాగిన్ అవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న పేరే ఇందులోనూ కనిపిస్తుంది. కావాలంటే థ్రెడ్స్ ప్రొఫైల్ ఎడిట్ చేసి మార్పులు చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న యూజర్లను ఫాలో కావచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ కావడం అన్నది థ్రెడ్స్‌కు ఉన్న అదనపు ప్రయోజనం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే కోట్ల యూజర్లు ఉన్నారు. వారిలో చాలామంది థ్రెడ్స్ యాప్‌లో లాగిన్ అయ్యే అవకాశం ఉంది.

అయితే, ఈ యాప్ ఉపయోగించే డాటాపై పోటీదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆరోగ్యం, ఆర్థిక సంబంధమైన సమాచారం, యూజర్ల గుర్తింపు సమాచారం మొదలైన అంశాల్లో డాటా సేకరించి ఉపయోగించే అవకాశం ఉందని యాపిల్ యాప్ స్టోర్ వ్యాఖ్యానించింది.

మెటా "భద్రత కన్నా లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని" కిందటి ఏడాది మెటా విజిల్‌బ్లోవర్ ఫ్రాన్సెస్ హాగెన్ ఆరోపించారు. అలాగే, బ్రిటిష్ పొలిటికల్ కన్సల్టెన్సీ కేంబ్రిడ్జ్ అనలిటికా సహా కొన్ని సంస్థలకు ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డాటాను ఉపయోగించే అవకాశం కల్పించిందని మెటాపై విమర్శలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)