ఆంధ్రప్రదేశ్: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ‘స్కాం’ ఏంటి... ఈడీ ఎందుకు వచ్చింది?

ఫొటో సోర్స్, Facebook/TDP, APSSDC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలో దిగింది. ఇటీవల ఇదే కేసులో నలుగురిని ఈడీ అరెస్ట్ చేసింది. ఒక కేసులో వివిధ దర్యాప్తు సంస్థలు రంగంలో దిగడం, పలువురిని అరెస్ట్ చేయడం ఆసక్తిరకంగా మారింది.
ఏం జరిగింది?
రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్‌ఎస్‌డీసీను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది నడుస్తుందని తెలిపారు. యువతకు అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశం.
ఇందుకు కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అందులో సీమెన్స్, డిజైన్ టెక్ సిస్టమ్స్ వంటి సంస్థలున్నాయి.
దిల్లీలోని నోయిడా కేంద్రంగా పనిచేసే సీమెన్స్ ఇండస్ట్రీయల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో చేసుకున్న ఎంవోయూ ప్రకారం ఏపీలో ఆరు ప్రాంతాల్లో స్కిల్ ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ యువతకు నైపుణ్యం పెంచే దిశలో శిక్షణ అందిస్తారు.
ఇందుకు అయ్యే ఖర్చులో 10శాతం ప్రభుత్వం పెట్టుకుంటుందని, మిగతా 90శాతం సీమెన్స్ గ్రాంటుగా ఇస్తుందని నాడు ప్రభుత్వం తెలిపింది.
ఆ తరువాత ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజ్, ఆదిత్యా ఇంజినీరింగ్ కాలేజ్ సహా పలు ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలతో ఒప్పందం చేసుకుని ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

మరి కేసు ఎందుకు?
2017 నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి సీమెన్స్ సంస్థ పనిచేస్తోంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం సీమెన్స్ సాంకేతిక సహకారం అందించాల్సి ఉంది. కానీ ఆ సంస్థ అందించలేదనేది ఆరోపణ. రికార్డుల్లో మాత్రం టెక్ సహాయం అందించినట్టు రాశారని సీఐడీ రిపోర్టులో పేర్కొంది.
సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో రూ.3,356 కోట్లకు ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులో టెక్ కంపెనీలు 90 శాతం మేర వాటాను భరించాలన్నది ఒప్పందం. కానీ అది ముందుకు సాగలేదు.
మొత్తం ఆరు క్లస్టర్లని ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్ కు రూ. 560 కోట్ల రూపాయల వెచ్చించాల్సి ఉంది. అందుకు గానూ ఏపీ ప్రభుత్వం తన వాటాగా 10శాతం అంటే సుమారు రూ. 371 కోట్లని చెల్లిస్తుందని నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రకటించారు.
దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వ వాటా చెల్లించారు. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ తొలుత 2021 డిసెంబర్ 10న సీఐడీ కేసు నమోదు చేసింది.
సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా రూ. 3,300 కోట్లకు పెంచారంటూ సీమెన్స్ సంస్థ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ సహా పలువురిపై సీఐడీ ఆరోపణలు చేసింది.
ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 371 కోట్లును చెల్లించినప్పటికీ సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన సాఫ్ట్‌వేర్ విలువ కేవలం రూ.58 కోట్లుగా సీఐడీ పేర్కొంది.
ఈ ఒప్పందంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తరుపున కీలకంగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ సహా 26 మందిపై కేసు నమోదయ్యింది. వీరిలో 10 మంది వరకూ అరెస్ట్ అయ్యారు.
ఈడీ ఎందుకు?
ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో సీబీఐ , ఈడీ కూడా జోక్యం చేసుకున్నాయి. ఇటీవల ఈడీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్‌కు పాల్పడిన నేరంపై సీమెన్స్ మాజీ ఎండీ శేఖర్ బోస్‌తో పాటు డీజీ టెక్ ఎండీ వికాస్ వినాయక్, పీపీఎస్‌పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్ సీవోవో ముకుల్‌చంద్ర అగర్వాల్, ఎస్‌ఎస్‌ఆర్ అసోసియేట్స్ సురేశ్ గోయల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఈడీ పేర్కొంది. విశాఖ స్పెషల్ కోర్టు ఆదేశాలతో నిందితులను రిమాండ్‌కి తరలిచింది.
ఈడీ అధికారులు కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఈ నేరానికి మూలం సింగపూర్‌లో ఉంది. సింగపూర్‌లో రిజిస్టర్ అయిన షెల్ కంపెనీల పేరుతో నిధులు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. డిజైన్ టెక్ కంపెనీకి రూ. 185 కోట్ల సింగిల్ ట్రాన్స్‌ఫర్ జరిగిందని ఈడీ చెబుతోంది.
సింగపూర్ కు చెందిన స్కిల్లర్, ఇన్ వెబ్ సొల్యూషన్స్ వంటి ఆరు షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారన్నది ఆరోపణ. దాంతో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ చెబుతోంది.

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRA PRADESH CM
ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోంది..?
నిరుద్యోగులు, విద్యార్థుల పేరుతో జరిగిన అతి పెద్ద ‘స్కామ్’ ఇదేనంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. మార్చి 20న ఆయన ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవల్మెంట్ కార్పొరేషన్‌లో ‘అవకతవకలకు’ సంబంధించి మాట్లాడారు.
"క్యాబినెట్‌లో చెప్పిన దానికి, జీవోకు భిన్నంగా ఎంవోయూ జరిగింది. ఏపీలో మొదలయ్యి, విదేశాలకు చెందిన షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి, తర్వాత వాటిని తిరిగి హైదరాబాద్ వరకూ తరలించారు. జీఎస్టీ, ఇంటిలిజెన్స్, ఐటీ, ఈడీ సహా అందరూ దర్యాప్తు చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులు ముఠాగా ఏర్పడి రూ.371 కోట్లు దోచుకున్నారు. ఆధారాలు దొరక్కుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
ప్రపంచంలో ఎక్కడైనా ఓ ప్రైవేట్ సంస్థ రూ.3వేల కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఏ విధంగా ఇస్తుందన్న ఆలోచన కూడా లేకుండా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించారు" అంటూ జగన్ ఆరోపించారు.
సీమెన్స్ సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగిని అడ్డంగా పెట్టుకుని ఇంత పెద్ద కుంభకోణం నడిపారని జగన్ అన్నారు. డీపీఆర్ కూడా లేకుండానే టెండర్ కూడా పిలవకుండా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారని జగన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, CHANDRABABU/FB
టీడీపీ ఏమంటోంది..?
సీమెన్స్ సంస్థ తొలుత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఆధారంగా ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నం చేశామని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఒప్పందం ప్రకారం సెంటర్లు ఏర్పాటు చేసి, లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
"సీమెన్స్ సంస్థలో ఆనాటికి అధినేతగా ఉన్న సుమన్ బోస్ తన ప్రయోజనాల కోసం కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చారు. జీఎస్టీ కట్టలేదని ఈడీ దర్యాప్తులో తేలింది. సీమెన్స్ 160 దేశాల్లో ఉన్న జర్మన్ సంస్థ. దానికి చంద్రబాబు మూలం అన్నట్టుగా చెబుతున్న మాటలు ప్రజలను మోసగించడమే.
సీమెన్స్ పేరుతో రూ. 371 కోట్లు పక్కదారి మళ్లించారన్నది అబద్ధం. దాని అనుబంధ సంఘాలను సూపర్ వైజ్ చేయాల్సింది సీమెన్స్ బాధ్యత. ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు" అంటూ ఆయన వివరించారు.
సీమెన్స్లో తప్పు జరిగితే చంద్రబాబు బాధ్యత అనడం విడ్డూరంగా ఉందన్నారు. సీమెన్స్ తమకు సంబంధం లేదని చెప్పినదానిని పట్టుకుని అభియోగాలు చేయడం తగదన్నారు. సుమన్ బోస్, డిజైన్ టెక్ వికాస్ మధ్య జరిగిన నేరానికి తమ బాధ్యత లేదన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్: వీధుల్లోకి లక్షల మంది ఎందుకు వస్తున్నారు... వారి ఆగ్రహానికి కారణం ఏంటి?
- గవర్నర్ పోస్టును రద్దు చేయాలా? వారి పనితీరుపై విమర్శలెందుకు?
- గోరుముద్ద, మన ఊరు-మన బడి పథకాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారు?
- కేరళ క్రైస్తవులు అంత్యక్రియల్లో ఫొటోలు ఎందుకు తీయించుకుంటారు?
- రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు? ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















