ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరి వైపు? వైసీపీ, టీడీపీల్లో ఉత్కంఠ

జగన్, చంద్రబాబు
ఫొటో క్యాప్షన్, సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల శాసనమండలి స్థానాల్లో పరాజయం తర్వాత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో పరీక్ష ఎదురయ్యింది. శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో తాను బరిలోకి దింపిన ఏడుగురు అభ్యర్థులనూ గెలిపించుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తోంది.

ఏడుగురు అభ్యర్థులూ విజయం సాధించి వైసీపీ గట్టెక్కడమనేది ఆరుగురు ఎమ్మెల్యేల తీరు మీద ఆధారపడి ఉంటుంది. టీడీపీ నుంచి వైసీపీ వైపు మళ్లిన నలుగురు, వైపీసీ నాయకత్వం మీద అసంతృప్తితో టీడీపీ వైపు చూస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు ఈ ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉంది.

వైసీపీ, టీడీపీ రెండూ విప్‌లు జారీచేశాయి. ఎమ్మెల్యేలు ఎవరైనా విప్ ధిక్కరించి ముందుకెళితే, ఆ తర్వాత రాజకీయంగా అనేక మలుపులు ఉండొచ్చు.

పంచుమర్తి అనురాధను పోటీలోకి దింపడంతో..

శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల్లో ఏడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే కోటాలోని ఈ సీట్లకు ఏడుగురు అభ్యర్థులను వైసీపీ బరిలో దింపింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ పోటీలోకి దిగడంతో ఆసక్తిగా మారింది. అందులోనూ పట్టభద్రుల సీట్లలో వైసీపీని ఓడించిన ఉత్సాహం టీడీపీలో కనిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఏడుగురు అభ్యర్థులను గెలిపించుకోగలదా, లేక మొన్న పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో మాదిరి టీడీపీ మరోసారి వ్యూహాత్మకంగా ఎత్తులు వేసి ఫలితాన్ని అందుకుంటుందా అన్నది మార్చి 23 గురువారం సాయంత్రం తెలుస్తుంది.

శాసనమండలి

ఫొటో సోర్స్, UGC

బలాబలాల లెక్కలు

ఈ ఎన్నికల్లో గెలవాలంటే అధికార పార్టీకి 154 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. ప్రతి అభ్యర్థికి కనీసంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి.

అసెంబ్లీ లెక్కల ప్రకారం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదనంగా జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ(గన్నవరం), కరణం బలరాం(చీరాల), మద్దాలి గిరి(గుంటూరు వెస్ట్), వాసుపల్లి గణేష్(వైజాగ్ సౌత్) ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైకొట్టారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే మద్దతు వైసీపీకి ఖాయంగా కనిపిస్తోంది. కానీ టీడీపీ తరుపున విప్ జారీ కావడంతో ఆ నలుగురు శాసనసభ్యులు ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది.

నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(నెల్లూరు రూరల్), ఆనం రామనారాయణ రెడ్డి(వెంకటగిరి) ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక ప్రకటలు చేశారు.

'ఆత్మప్రబోధానుసారం' ఓటు వేస్తానని ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి కూడా సస్పెండ్ అయిన ఆయన, ఆనంతో కలిసి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే వైసీపీ బలం 149కి పడిపోతుంది.

అప్పుడు జనసేన ఎమ్మెల్యే ఓటు వేసినా టీడీపీ నుంచి గెలిచిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు అండగా నిలిస్తేనే వైసీపీ గట్టెక్కగలదు. 2020లో రాజ్యసభ ఎన్నికల సమయంలో టీడీపీ విప్‌ను జారీచేసినప్పటికీ, వంశీ తన ఓటు చెల్లని విధంగా వేసి పరోక్షంగా వైసీపీకి మేలు చేశారు. కానీ ఇప్పుడు ఓటును అలా వేస్తే అధికార పార్టీకి ప్రయోజనం ఉండదు. దాంతో ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించేందుకు సిద్ధపడతారా, లేదా అనేది కీలకంగా మారింది.

వంశీ

ఫొటో సోర్స్, FB/Vamsi

ఫొటో క్యాప్షన్, 2020లో రాజ్యసభ ఎన్నికల సమయంలో టీడీపీ విప్‌ను జారీచేసినప్పటికీ, వంశీ తన ఓటు చెల్లని విధంగా వేసి పరోక్షంగా వైసీపీకి మేలు చేశారు. కానీ ఇప్పుడు ఓటును అలా వేస్తే వైసీపీకి ప్రయోజనం ఉండదు.

ఎమ్మెల్యేలను ఏడు బృందాలుగా విడగొట్టిన వైసీపీ

క్రాస్ ఓటింగ్ జరిగినా, ఓటు చెల్లకుండా పోయినా, ఒక్క ఓటు అటూ ఇటూ అయినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలూ అప్రమత్తమయ్యాయి. తమ ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించాయి.

వైసీపీ తన అభ్యర్థులు పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ, మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయేల్, పెన్మత్స సూర్యనారాయణ రాజులను గెలిపించుకునేందుకు కసరత్తులు చేస్తోంది.

పార్టీలో కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలున్న తరుణంలో వారి ఓట్లు చేజారిపోకుండా వైసీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. ఏడు బృందాలుగా ఎమ్మెల్యేలను విడగొట్టి వారితో సమన్వయం చేసుకొనే బాధ్యతను కొందరు నాయకులకు అప్పగించారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో అనుమానమున్న వారిపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

ఫొటో సోర్స్, FB/Kotamreddy

ఫొటో క్యాప్షన్, 'ఆత్మప్రబోధానుసారం' ఓటు వేస్తానని ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.

అసెంబ్లీకి చంద్రబాబు

తమ బలం చాటుకొనేందుకు ఇదో అవకాశమని, ఈ ఎన్నికల్లోనూ గెలిచి వైసీపీని దెబ్బతీయాలని టీడీపీ అనుకొంటోంది. తమ శిబిరంలో ఉన్న 19 మంది ఎమ్మెల్యేల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న అనగాని సత్యప్రసాద్ కూడా అమరావతికి చేరుకోవడంతో తమ ఓట్లన్నీ సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ ఆశిస్తోంది. గతంలో రాజ్యసభ ఎన్నికల సమయంలో కరోనావైరస్ మహమ్మారి కారణంగా అనగాని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తమ అభ్యర్థికి ఓటు వేస్తారని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. తమదే విజయం అని కూడా ఆయన చెబుతున్నారు.

మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం మళ్లీ అసెంబ్లీ ప్రాంగణంలో అడుగు పెడుతున్నారు.

అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్లు లెక్కిస్తారు. దాదాపుగా 6 గంటలప్పుడు ఫలితాలు వెలువడుతాయి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)